ఏమిటీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌? ఇవి ఎలా పనిచేస్తాయి?

ఎయిర్ ఇండియ విమాన ప్రమాదం, అహ్మదాబాద్, ఫ్యూయల్ స్విచ్

ఫొటో సోర్స్, Getty Images

అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సంస్థ 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.

విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలోని రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌(ఇంధన నియంత్రణ స్విచ్‌)లు రన్ నుంచి కటాఫ్ స్థితికి వెళ్లాయి. అంటే, ఆన్ నుంచి ఆఫ్ అయ్యాయి.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్‌ ప్రకారం, పైలట్లలో ఒకరు ''మీరెందుకు (ఫ్యూయల్ స్విచ్‌లు) ఆపేశారు'' అని అడగడం, అందుకు మరో పైలట్ ''నేనేమీ చేయలేదు'' అని సమాధానం ఇవ్వడం వినిపించినట్లు నివేదిక తెలిపింది.

రెండు ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్‌లు వెంటవెంటనే, కొద్దిక్షణాల తేడాతో ఆగిపోయినట్లు పేర్కొంది.

''విమానం గరిష్ఠంగా 180 నాట్ల వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే, రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ మోడ్ నుంచి కటాఫ్‌ మోడ్‌లోకి మారాయి. రెండు ఇంజిన్లు కటాఫ్ మోడ్‌లోకి రావడానికి మధ్య సమయం ఒక సెకను'' అని నివేదిక పేర్కొంది.

అసలు ఏమిటీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్, విమానాల్లో ఈ స్విచ్ ఎందుకంత కీలకం? అనే విషయాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్యూయల్ స్విచ్ అంటే ఏమిటి?

రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం.. ఇంజిన్‌కు ఇంధన సరఫరాని నియంత్రించే స్విచ్‌లే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు. వీటిని ఫ్యూయల్ స్విచ్‌లు అని కూడా వ్యవహరిస్తుంటారు.

విమానం నేలపై ఉన్నప్పుడు ఇంజిన్లు స్టార్ట్ చేసేందుకు, ఆఫ్ చేసేందుకు, అలాగే.. గాల్లో ఎగురుతున్న సమయంలో ఏదైనా ఇంజిన్‌ విఫలమైనప్పుడు ఆ ఇంజిన్‌ను ఆఫ్ చేసేందుకు, మరో ఇంజిన్‌ను ఆన్ చేసేందుకు ఈ స్విచ్‌లను ఉపయోగిస్తారు.

విమానయాన రంగ నిపుణుల ప్రకారం.. పైలట్ పొరపాటున ఈ స్విచ్‌లను ఆఫ్ చేయలేరు, ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నిలిపివేయలేరు.

ఇది పొరపాటున ఏదైనా జరిగి ఆఫ్(కటాఫ్) అయిపోయే అవకాశం లేదు. కానీ, పైలట్ దానిని ఆఫ్(కటాఫ్) చేస్తే తక్షణం ప్రభావం పడుతుంది. ఎందుకంటే, ఆ స్విచ్ ఆపేస్తే ఇంజిన్‌కు ఇంధన సరఫరా వెంటనే నిలిచిపోతుంది.

''ఈ ఇంధన నియంత్రణ స్విచ్‌కు వైరింగ్, విద్యుత్ ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ స్విచ్‌ను నియంత్రించేందుకు ఫ్యూయల్ వాల్వ్ ఉంటుంది'' అని అమెరికాకు చెందిన విమానయాన భద్రతా నిపుణులు జాన్ కాక్స్ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.

ఎయిర్ ఇండియ విమాన ప్రమాదం, అహ్మదాబాద్, ఫ్యూయల్ స్విచ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ స్విచ్‌లు ఎక్కడ ఉంటాయి?

అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఉన్నాయి. జీఈ ఇంజిన్లతో అనుసంధానమై ఉన్న ఈ స్విచ్‌లు థ్రస్ట్ లీవర్ కింద ఉంటాయి.

ఈ థ్రస్ట్ లీవర్ కాక్‌పిట్‌లో ఉంటుంది. విమాన గతిశక్తిని నియంత్రించేందుకు పైలట్ దీనిని ఉపయోగిస్తారు.

ఇది స్ప్రింగ్‌లతో ఉంటుంది. ఈ స్విచ్‌ను ఆన్(రన్) లేదా ఆఫ్(కటాఫ్) చేయాలంటే, పైలట్ ముందు దానిని పైకి లాగాల్సి ఉంటుంది.

అలా మాత్రమే స్విచ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

ఎయిర్ ఇండియా విమానంలో ఈ స్విచ్‌లకు ఏమైంది?

ప్రాథమిక నివేదిక ప్రకారం.. ''విమానం టేకాఫ్ సమయంలో, గరిష్ఠంగా 180 నాట్ల వేగాన్ని చేరుకుంది. ఆ వెంటనే ఇంజిన్ 1, ఇంజిన్ 2 స్విచ్‌లు కటాఫ్ స్థితిలోకి మారాయి. ఈ రెండు ఇంజిన్లు కటాఫ్ స్థితికి వెళ్లడానికి మధ్య వ్యవధి ఒక సెకను మాత్రమే.'' అంటే, ఒక ఇంజిన్ ఆఫ్ అయిన సెకను వ్యవధిలోనే రెండో ఇంజిన్ కూడా ఆగిపోయింది.

''ఇంధనం సరఫరా ఆపేశారా? అని ఒక పైలట్ మరో పైలట్‌ను అడగ్గా, నేనేమీ చేయలేదు అని అవతలి వైపు నుంచి సమాధానం ఇచ్చినట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో వినిపించింది.''

''సుమారు 10 సెకన్ల తర్వాత, ఇంజిన్ 1 ఫ్యూయల్ స్విచ్ కటాఫ్ నుంచి రన్ స్థానానికి వచ్చింది. ఆ తర్వాత 4 సెకన్లలో ఇంజిన్ 2 ఫ్యూయల్ స్విచ్ కూడా కటాఫ్ నుంచి రన్‌కు మారింది.''

అంటే, దీనర్థం తిరిగి విమానాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు.

అనంతరం, సుమారు 9 సెకన్ల తర్వాత.. 1:39:05 గంటలకు ఒక పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు మేడే అంటూ సంకేతమిచ్చారు. ఆ తర్వాత ఎలాంటి స్పందనా రాలేదు. ఆ వెంటనే విమానం కూలిపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)