ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: ల్యాండింగ్ తరువాతే కటాఫ్ కావాల్సిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు విమానం గాల్లో ఉండగానే ఎందుకు ఆఫ్ అయ్యాయి?

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
260 మంది మృతికి కారణమైన ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిపిన అధికారులు తమ దర్యాప్తులో ఒక భయంకరమైన విషయాన్ని గుర్తించారు.
టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఇంధన నియంత్రణ స్విచ్‌లు రెండూ అనూహ్యంగా ''కటాఫ్'' మోడ్‌లోకి వెళ్లాయి. దీంతో ఇంధన సరఫరా నిలిచిపోయి, గతిశక్తి కోల్పోయిందని ఈ నివేదిక తేల్చింది.
అయితే, కటాఫ్ మోడ్‌లోకి వెళ్లడం అనేది సాధారణంగా ల్యాండింగ్ తర్వాత మాత్రమే జరుగుతుంది.
నివేదిక ప్రకారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొకరిని ''ఎందుకు కటాఫ్ చేశారు'' అని అడిగినట్లు, అందుకు మరో పైలట్ నేను చేయలేదని సమాధానం ఇస్తున్నట్లుగా ఉంది. టేకాఫ్ సమయంలో, కెప్టెన్ పర్యవేక్షిస్తుండగా.. కోపైలట్ విమానం నడుపుతున్నారు.

స్విచ్‌లను వాటి సాధారణ ఇన్-ఫ్లైట్ (ఆన్) స్థానానికి తీసుకురావడంతో, ఆటోమేటిక్‌గా ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా చేశారు.
ప్రమాద సమయంలో, ఒక ఇంజిన్ అప్పుడప్పుడే శక్తిని పొందుతుండగా, మరోటి స్టార్ట్ అయింది కానీ, ఇంకా శక్తిని పుంజుకోలేదు.
దీంతో ఎయిర్ ఇండియా విమానం కేవలం 40 సెకన్ల కంటే తక్కువ సమయమే గాల్లో ఉండి, అహ్మదాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో కూలిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
టేకాఫ్ అయిన తర్వాత ఆ వెంటనే ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు శిథిలాలు, కాక్‌పిట్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఫ్టైట్‌రాడార్ 24 ప్రకారం, ఎయిర్ ఇండియా విమానం తన లొకేషన్ కనిపించకుండా పోవడానికి ముందు 50 సెకన్లలో 625 అడుగుల ఎత్తుకు ఎగిరింది, అప్పుడు వాతావరణం కూడా బాగానే ఉంది.
శనివారం విడుదలైన 15 పేజీల నివేదిక మరిన్ని విషయాలను వెల్లడిస్తోంది.
బోయింగ్, జీఈ, ఎయిర్ ఇండియా, భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థల నిపుణులతో పాటు అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, యూకే నిపుణులతో కలిసి భారత అధికారుల నేతృత్వంలో సాగిన దర్యాప్తు కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

లీవర్-లాక్ విధానంలోని ఇంధన స్విచ్‌లు ప్రమాదవశాత్తూ వాటంతట అవే యాక్టివేట్ కాకుండా రూపొందించినవని, వాటిని ఆపరేట్ చేయడానికి ముందు పైకి లాగాల్సి ఉంటుందని, ఇది 1950ల నాటి సెక్యూరిటీ ఫీచర్ అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
కచ్చితమైన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్విచ్‌లు ప్రమాదవశాత్తూ కుదుపులకు గురైనా వాటంతటే అవే మారిపోకుండా ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు (బ్రాకెట్లు) ఉన్నాయని అంటున్నారు.
''ఒకచేత్తో, ఒకేసారి ఈ రెండు స్విచ్‌లను లాగడం దాదాపు అసాధ్యం. కాబట్టి ప్రమాదవశాత్తూ ఇదంతా జరిగి ఉండడానికి అవకాశాలు లేవు'' అని తన పేరు వెల్లడించకూడదంటూ, కెనడాకు చెందిన విమాన ప్రమాదాల ఇన్వెస్టిగేటర్ బీబీసీతో చెప్పారు.
''ఏ పైలట్ అయినా సరే, అసలెందుకు స్విచ్‌లు ఆఫ్ చేస్తారు?'' అని ఒహయో స్టేట్ యూనివర్సిటీలో ఎయిర్‌లైన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ అండ్ ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ షాన్ ప్రుచ్నికి అన్నారు.
''ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేక గందరగోళంలో జరిగిందా? పైలట్లు అసాధారణ విషయాలేవీ చెప్పనందువల్ల అలా జరగడం అసంభవం అనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో, పైలట్లు తప్పుడు బటన్లు నొక్కవచ్చు లేదా తప్పుడు ఆప్షన్లను ఎంచుకోవచ్చు, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందని చెప్పే ఎలాంటి సూచనలూ లేవు. లేదంటే పొరపాటున ఇంధన స్విచ్‌లు ఆపరేట్ చేసినట్లు కూడా ఎలాంటి సంభాషణ జరగలేదు. సాధారణంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇలాంటి లోపం తలెత్తదు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

అమెరికాకు చెందిన ఎన్‌టీఎస్‌బీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ గోల్జ్ ఈ నివేదికపై స్పందిస్తూ, ''విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే పైలట్ ఇంధన స్విచ్‌లను ఆఫ్ చేయడమనేది కలవరపెట్టే అంశం'' అన్నారు.
''కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఇంకా చాలా సమాచారం ఉండొచ్చు. నువ్వే స్విచ్‌లు ఆఫ్ చేశావా? అనే ఒక్కమాట సరిపోదు'' అని అన్నారు.
''కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు, కాక్‌పిట్‌లో ఉన్న ఎవరో ఆ వాల్వ్‌లను ఆపేశారని సూచిస్తున్నాయి. ఆ పని చేసింది ఎవరు, ఎందుకు? రెండు స్విచ్‌లు ఆఫ్ చేసి, మళ్లీ సెకన్ల వ్యవధిలోనే ఆన్ చేశారు. వాయిస్ రికార్డర్‌తో మరిన్ని వివరాలు తెలియొచ్చు: ఇంజిన్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? విమానం నడుపుతున్న పైలటా? లేక పర్యవేక్షిస్తున్న పైలటా?''
పైలట్ మైకులు, రేడియో కాల్స్, కాక్‌పిట్‌లోని శబ్దాలు, అన్నింటినీ రికార్డ్ చేసే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఈ మిస్టరీలో కీలకంగా మారనుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
''ఇంకా ఏ గొంతు ఎవరిదనేది గుర్తించలేదని చెప్పారు, అది చాలా ముఖ్యం. సాధారణంగా, పైలట్లతో బాగా పరిచయమున్న వారు కొందరు ఉంటారు. వాళ్లు గొంతు గుర్తుపట్టడంలొ సాయపడతారు. ప్రస్తుతానికి, స్విచ్ ఆఫ్ - ఆన్ చేసింది ఎవరో మనకింకా తెలియదు'' అని గోల్జ్ అన్నారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే.. ఎవరి గొంతు అనేది స్పష్టంగా గుర్తించడం, ఎవరు ఏం మాట్లాడారనే వివరాలతో సహా ఫుల్ కాక్‌పిట్ ట్రాన్స్‌స్క్రిప్ట్, విమానం బయలుదేరినప్పటి నుంచి జరిగిన అన్ని రకాల కమ్యూనికేషన్ వివరాలను పూర్తిగా సమీక్షించడం అవసరమని ఇన్వెస్టిగేటర్లు అంటున్నారు.
ఇది ఎన్‌టీఎస్‌బీ సిఫార్సు చేసిన, కాక్‌పిట్ వీడియో రికార్డర్ల అవసరాన్ని కూడా నొక్కిచెబుతోంది. ఓవర్ ది షోల్డర్ వ్యూ ఉంటే, కటాఫ్ స్విచ్‌ను నొక్కిన చేయి ఎవరిదనేది స్పష్టంగా కనిపించేది.

ఫ్లైట్ -171 ప్రయాణానికి ముందు.. పైలట్లు, సిబ్బందికి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో అంతా సాధారణంగానే ఉంది, వారు ఆరోగ్యంగానే ఉన్నారు.
పైలట్లు ముంబయిలో ఉంటున్నప్పటికీ, ఆ ముందు రోజే అహ్మదాబాద్ చేరుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకున్నారు.
నివేదికలో కీలకమైనదిగా వివరించిన అంశంపై కూడా ఇన్వెస్టిగేటర్లు దృష్టి సారిస్తున్నారు.
2018 డిసెంబర్‌లో, యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక 'స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్(ఎస్ఏఐబీ) విడుదల చేసింది. ఇందులో కొన్ని బోయింగ్ 737 విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు లాకింగ్ ఫీచర్ లేకుండా రూపొందాయని పేర్కొంది.
ఈ అంశాన్ని గుర్తించినా, ప్రమాదకర పరిస్థితిగా పరిగణించకపోవడం వల్ల అది ఎయిర్‌వర్తీనెస్ డైరెక్టివ్(ఏడీ)గా మారలేదు. అంటే, చట్టపరంగా ఒక వస్తువులోని అసురక్షిత పరిస్థితులను సరిచేయాలని సూచించే మార్గదర్శకం.)
ఇదే స్విచ్ డిజైన్ బోయింగ్ 787-8 విమానాల్లోనూ ఉంది, ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం VT-ANBతో సహా ఎస్‌ఏఐబీ గుర్తించిన అంశం ఓ సలహాగా మాత్రమే ఉండడం వల్ల, సిఫార్సు చేసిన తనిఖీలు ఎయిరిండియా నిర్వహించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంధన నియంత్రణ స్విచ్‌లలో ఏదైనా సమస్య ఉందా? అనే కోణంలో తాను ఆలోచిస్తున్నట్లు షాన్ చెప్పారు.
''అసలు దాని(నివేదికలో పేర్కొన్న విషయం) అర్థమేంటి? ఒకసారి తిప్పితే, అది ఇంజిన్‌ను ఆఫ్ చేసి.. ఇంధన సరఫరాను కూడా నిలిపేయగలదా? లాకింగ్ ఫీచర్ అచేతనంగా ఉంటే, ఏమవుతుంది? స్విచ్ దానంతట అదే ఆఫ్ అయ్యి ఇంజిన్‌ను ఆపేస్తుందా? అదే నిజమైతే, ఇది చాలా పెద్ద సమస్య. ఒకవేళ అలా కాకుంటే, ఏం జరిగిందో అది కూడా వివరించాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.
అయితే, ఇదే పెద్ద సమస్య అని ఇతరులు భావించడం లేదు.
''దీని గురించి నెనెప్పుడూ వినలేదు, ఎందుకంటే, ఇంధన స్విచ్‌ల గురించి పైలట్లు ఫిర్యాదు చేయడం ఎప్పుడూ వినలేదు. అయితే, ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి.. లోతుగా పరిశీలించదగినదే. కాకపోతే ఇది కేవలం పరధ్యానం కూడా కావొచ్చు'' అని పీటర్ గోల్జ్ అన్నారు.
విమానం ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌లో సమస్య కారణంగా స్విచ్‌లు ట్రిప్ అయ్యాయా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు భారత దర్యాప్తు సంస్థ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) మాజీ ఇన్వెస్టిగేటర్ (దర్యాప్తు అధికారి) కిషోర్ చింతా.
''పైలట్ ప్రమేయం లేకుండా విమానం ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌తో ఇంధన నియంత్రణ స్విచ్‌లు ట్రిప్ అయ్యేలా చేయొచ్చా? ఒకవేళ స్విచ్‌లు ఎలక్ట్రానిక్‌గా ట్రిప్ అయితే మాత్రం.. అది ఆందోళన కలిగించే అంశం'' అని ఆయన బీబీసీతో అన్నారు.
విమానంలోని ర్యామ్ ఎయిర్ టర్బైన్(RAT-ర్యాట్) ఆన్ అయ్యి ఉంది, ఇది ప్రధాన వ్యవస్థల వైఫల్యానికి స్పష్టమైన సంకేతం. అలాగే, ల్యాండింగ్ గేర్ కూడా ''డౌన్ పొజిషన్''లో ఉన్నట్లు గుర్తించారు, అంటే దానిని పూర్తిగా ఉపసంహరించుకోలేదని సూచిస్తోంది.
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అడుగుభాగంలో ఉండే చిన్న ప్రొపెల్లర్ అయిన ర్యాట్, అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ జనరేటర్‌గా పనిచేస్తుంది. రెండు ఇంజిన్లూ ఆగిపోయినప్పుడు, లేదంటే మూడు హైడ్రాలిక్ వ్యవస్థలూ తక్కువ ప్రెజర్ నమోదు చేసినప్పుడు దానంతట అదే ఆన్ అవుతుంది. విమానంలోని వ్యవస్థలు పనిచేసేందుకు అవసరమైన పరిమిత శక్తిని అందిస్తుంది.
''ర్యాట్ ఆన్ కావడం.. రెండు ఇంజిన్లు పనిచేయలేదన్న నిర్థరణకు బలంగా మద్దతునిస్తోంది'' అని ప్రుచ్నికి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ల్యాండింగ్ గేర్ ఉపసంహరించుకోలేదని తాను భావిస్తున్నానని బోయింగ్ 787 నడిపే పైలట్ ఒకరు చెప్పారు.
''బోయింగ్ 787 టేకాఫ్ చేసిన ప్రతిసారీ, ల్యాండింగ్ గేర్ రీట్రాక్ట్(ఉపసంహరణ) ప్రక్రియను నిశితంగా గమనిస్తా. గేర్ హ్యాండిల్ లాగే సమయానికి మేం 200 అడుగుల ఎత్తులో ఉంటాం. ఆ మొత్తం గేర్ ప్రక్రియ సుమారు 400 అడుగులు ఎత్తుకు (సుమారు 8 సెకన్లలో)వెళ్లేప్పటికి పూర్తవుతుంది. అంత పవర్‌ఫుల్ హైడ్రాలిక్ వ్యవస్థ'' అన్నారాయన.
విమానం నడుపుతున్న వ్యక్తికి ఆలోచించుకునేంత సమయం ఉండకపోవచ్చని ఆ పైలట్ విశ్వసిస్తున్నారు.
''రెండు ఇంజిన్లు విఫలమై విమానం కిందకు పడడం మొదలైనప్పుడు, షాక్‌కు గురవడంతోనే సరిపోయి ఉంటుంది. ఒక్క క్షణం నిశ్చేష్టులవుతారు. ఆ క్షణంలో మీ దృష్టి ల్యాండింగ్ గేర్‌పై ఉండదు. మీ మనసు ఒకే విషయంపై ఉంటుంది. ఈ విమానాన్ని నేను ఎక్కడ సురక్షితంగా ల్యాండ్ చేయగలను? అని. కానీ, ఈ కేసులో అదంతా చేయడానికి అంత ఎత్తులో లేదు.''
ఆ పరిస్థితి నుంచి వెంటనే తేరుకోవడానికి సిబ్బంది ప్రయత్నించారని, కానీ అది చాలా వేగంగా జరిగిపోయిందని ఇన్వెస్టిగేటర్లు చెబుతున్నారు.
''ఇంజిన్లు స్విచ్ ఆఫ్ అయ్యి, ఆన్ అయ్యాయి. ఇంజిన్లు థ్రస్ట్ కోల్పోతున్నాయని పైలట్లు గుర్తించారు, బహుశా ముందుగా ఎడమవైపు ఇంజిన్ ఆన్ చేసి, ఆ వెంటనే కుడివైపు ఇంజిన్ ఆన్ చేసి ఉండొచ్చు'' అని ప్రుచ్నికి అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














