విమానాల్లో పవర్ బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎందుకు?

సింగపూర్ ఎయిర్ లైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పవర్ బ్యాంకులపై పలు దేశాలు, విమానయాన సంస్థలు కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి.
    • రచయిత, గెవిన్ బట్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కొరియాలోని ఎయిర్‌బస్ A321 సీఈవోలో అగ్నిప్రమాదానికి కారణం పవర్ బ్యాంక్ అని స్థానిక అధికారులు తెలిపారు.

2025 జనవరి 28న గుమ్హాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. ఇందులో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు.

పవర్ బ్యాంకు బ్యాటరీ లోపల ఉండే ఇన్సులేషన్ పేలిపోవడంతో విమానంలో ఈ మంటలు చెలరేగినట్లు దర్యాప్తు బృందం విచారణలో వెల్లడైనట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మంటలు చెలరేగిన ప్రాంతంలో ఉన్న ఓవర్‌హెడ్ లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో పవర్ బ్యాంకు ఉందని, దానిపై కాలిన గుర్తులు కనిపించాయని తెలిపింది.

అయితే, బ్యాటరీ పేలడానికి కారణమేమై ఉంటుందో దర్యాప్తు అధికారులు చెప్పలేకపోయారని వెల్లడించింది.

ఇవి కేవలం ఇప్పటి వరకూ అందిన రిపోర్టులు మాత్రమేనని, ఎయిర్‌బస్ ఏ321 సీఈవో ప్రమాదానికి చెందిన తుది రిపోర్టు కాదని రవాణా శాఖ తెలిపింది.

కాగా, వరుస ఘటనలతో పలు దేశాలు, విమానయాన సంస్థలు కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణ కొరియా విమానం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జనవరి 28న, దక్షిణ కొరియాలో ఎయిర్ బుసాన్ ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది.

2016లోనే నిబంధనలు

భద్రతా కారణాల దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు పవర్ బ్యాంకులను లగేజీలో తీసుకెళ్లడంపై కొన్నేళ్లుగా మార్గదర్శకాలను జారీ చేస్తున్నాయి.

పవర్ బ్యాంకులకు లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీలు తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేయగలవు. ఏదైనా లోపం తలెత్తితే షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.

ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆదేశాల ప్రకారం, 2016 నుంచి ప్రయాణికుల విమానాల్లోని కార్గోలలో ఏ రకమైన లిథియం అయాన్ బ్యాటరీలనూ అనుమతించడం లేదు.

దక్షిణ కొరియాలో ఎయిర్‌బస్ విమానంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత, ఎయిర్ బుసాన్ అధికారులు కూడా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

ప్రయాణికులు తమ ఆన్‌బోర్డు లగేజీలో కూడా పవర్ బ్యాంకులు తీసుకెళ్లడానికి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.

పవర్ బ్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పవర్ బ్యాంకులు వాడటం, చార్జింగ్‌ పెట్టడాన్ని నిషేధించనున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

ఏ దేశాలు నిషేధించాయి?

ఏప్రిల్ 1 నుంచి విమానంలో ఉండగా ప్రయాణికులు పవర్ బ్యాంకులు వాడటం, చార్జింగ్‌ పెట్టడాన్ని నిషేధించనున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

''సింగపూర్ విమానాలలోని క్యాబిన్ బ్యాగేజీలో పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లవచ్చు. కానీ, చెక్డ్ బ్యాగేజీలో అనుమతి లేదు. ప్రత్యేక అనుమతి లేకుండా కస్టమర్లు 100Wh వరకు సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లను తీసుకురావచ్చు. అయితే 100Wh నుంచి 160Wh మధ్య ఉన్న వాటికి ఎయిర్‌లైన్ అనుమతి అవసరం'' అని సింగపూర్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

చైనా ఎయిర్‌లైన్స్, థాయి ఎయిర్‌వేస్ వంటి పలు విమానయాన సంస్థలు కూడా ఇలాంటి నిబంధనలను తీసుకొచ్చాయి.

లిథియం బ్యాటరీల కారణంగా ఓడల్లో మంటలు చెలరేగిన సంఘటనలు గతంలో కూడా ఉన్నాయి.

2017 మార్చిలో మెల్‌బోర్న్ నుంచి బీజింగ్‌కు వెళ్తున్న విమానంలో ఒక మహిళ హెడ్‌ఫోన్‌లు పేలిపోవడంతో ఆమె ముఖంపై కాలిన గాయాలు అయ్యాయి. లిథియం అయాన్ బ్యాటరీలో లోపం వల్ల ఈ ఘటన జరిగిందని దర్యాప్తులో తేలింది.

గతంలో సిడ్నీలో ఒక విమానం లగేజ్ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడంతో దాన్ని నిలిపివేశారు. అందులోని లగేజీలో ఉంచిన లిథియం అయాన్ బ్యాటరీకి మంటలు అంటుకున్నట్లు తర్వాత తెలిసింది.

విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తయారీలో లోపం లేదా డ్యామేజీ కారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉంది.

పవర్ బ్యాంక్ బ్యాటరీతో సమస్యేంటి?

యూకే ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్ అసోసియేషన్ 2022 నివేదికలో చెత్త డంప్‌లు, వ్యర్థాల తొలగింపు యూనిట్లలో ప్రతి సంవత్సరం 700కు పైగా మంటలు చెలరేగిన ఘటనలు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ సంఘటనలలో ఎక్కువ భాగం పారేసిన లిథియం బ్యాటరీల వల్ల సంభవిస్తున్నట్లు పేర్కొంది.

తయారీలో లోపం లేదా డ్యామేజీ కారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోవచ్చు. ఈ బ్యాటరీలను పవర్ బ్యాంకులలో మాత్రమే కాకుండా టూత్ బ్రష్‌లు, బొమ్మలు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఉపయోగిస్తారు.

ఇటువంటి బ్యాటరీలలో ఒకదానికొకటి దూరంగా ఉండే రెండు ఎలక్ట్రోడ్‌లు (క్యాథోడ్, యానోడ్) ఉంటాయి. ఈ బ్యాటరీలో లిథియం అయాన్ కణాలూ ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్, డిశ్చార్జ్ సమయంలో లిథియం అయాన్లు ఎలక్ట్రోడ్‌ల మధ్య కదులుతుంటాయి.

కాగా, బ్యాటరీలోని రెండు ఎలక్ట్రోడ్లు ఢీకొన్నట్లయితే అది పేలిపోవచ్చు. దానిలోని రసాయనాలు మంటలకు కారణం కావచ్చు. బ్యాటరీ దెబ్బతినకపోతే దానిని ఉపయోగించడం సురక్షితం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)