విమానం టాయిలెట్లలో ప్లాస్టిక్ కవర్లు, గుడ్డముక్కలు ఇరుక్కుని గాల్లో చక్కర్లు, దిల్లీ రాకుండానే వెనక్కు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మతీన్
- హోదా, బీబీసీ న్యూస్,దిల్లీ
కొందరు ప్రయాణికులు విమానం టాయిలెట్లలో ప్లాస్టిక్ కవర్లు, గుడ్డముక్కలు, చెత్తాచెదారం వేసి ఫ్లష్ చేయడంతో టాయిలెట్ల పైపులు మూసుకుపోయాయని, దీంతో తమ సంస్థకు చెందిన ఒక విమానాన్ని అమెరికాకు తిప్పి పంపించినట్లు ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది.
షికాగో నుంచి దిల్లీకి వస్తున్న విమానం, అమెరికాకి తిరిగొచ్చే ముందు కొన్ని గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
విమానం లోపల రికార్డైన వీడియోల్లో, విమానంలో ప్రయాణికులు సిబ్బంది చుట్టూ గుమిగూడడం, సిబ్బంది వారికి సర్దిచెబుతున్న దృశ్యాలు కనిపించాయి.
విమానంలో టాయిలెట్ల వినియోగంపై చాలామంది భారతీయులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ ఘటన మార్చి 5న ఎయిర్ ఇండియా విమానం 126లో జరిగిందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థ తెలిపింది.
విమానం బయలుదేరిన దాదాపు రెండు గంటల తర్వాత, ఫ్లైట్‌లోని కొన్ని టాయిలెట్లు "ఉపయోగించడానికి పనికిరావు'' అని సిబ్బంది రిపోర్ట్ చేశారు.
బిజినెస్, ఎకానమీ తరగతుల్లోని 12 టాయిలెట్లలో 8 వినియోగించేందుకు పనికిరావని ఆ తర్వాత గుర్తించారు. దీంతో "విమానంలోని ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది.''
ఈ విమానం 342 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు.

ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. యూరప్‌లోని చాలా విమానాశ్రయాల్లో రాత్రివేళల్లో ల్యాండింగ్‌పై ఆంక్షలు ఉండడంతో ''ప్రయాణికుల సౌకర్యం, భద్రత ''ను దృష్టిలో ఉంచుకుని పైలట్లు షికాగో తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24ను పరిశీలించినప్పుడు, విమానం వెనక్కి మళ్లే సమయంలో గ్రీన్‌ల్యాండ్ సమీపంలో ఉందని, దాదాపు 10 గంటలపాటు గాల్లోనే ఉన్నట్లు బీబీసీ గుర్తించింది.
విమానం టాయిలెట్లలో ''పాలిథిన్ బ్యాగ్స్, చెత్తాచెదారం, గుడ్డముక్కలు ఫ్లష్ చేశారని, అవి పైపుల్లో ఇరుక్కుపోయినట్లు'' తర్వాత జరిపిన విచారణలో తేలిందని ఎయిర్ ఇండియా తెలిపింది.
టాయిలెట్ల నుంచి తొలగించిన వ్యర్థాల బ్యాగుల చిత్రాలను విడుదల చేసింది. అందులో ఒక ఫోటో, పూర్తిగా గుడ్డముక్కలతో నిండిపోయి ఉన్న పైపును సిబ్బంది చూపిస్తున్నట్లుగా ఉంది.
ప్రయాణికులు, సిబ్బంది షికాగోలో దిగారని, వారికి వసతి కల్పించడంతోపాటు, వేరే విమానాల్లో వారిని పంపించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది .

ఫొటో సోర్స్, Air India
విమానాల టాయిలెట్లలోని మానవ వ్యర్థాలు ప్రత్యేక ట్యాంకులలో స్టోర్ అవుతాయి. వాక్యూమ్ సిస్టమ్ వాటిని ఫ్లష్ చేస్తుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత వ్యర్థాల తొలగింపు పనులు జరుగుతాయి.
ఇలా టాయిలెట్లు మూసుకుపోవడం అసాధారణ విషయం కాకపోయినా, ప్రయాణికుల తప్పిదాల వల్ల అన్ని టాయిలెట్లు మూసుకుపోయి, విమానం అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి రావడం దాదాపు అసాధ్యం అని విమానయాన నిపుణులు మార్క్ మార్టిన్ హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు.
అయితే, గతంలోనూ తమ విమానాల టాయిలెట్లలో లోదుస్తులు, డైపర్లు, దుప్పట్ల వంటి వాటిని గుర్తించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
"ఈ ఘటన నేపథ్యంలో, మరుగుదొడ్లను వాటి ఉద్దేశిత ప్రయోజనాల కోసమే వినియోగించాలని ప్రయాణికులను కోరతాం'' అని ఎయిర్ ఇండియా తెలిపింది.
విమానాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు, నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై చాలామంది సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు.
"ఎయిర్ ఇండియాలో మాత్రమే ఇలాంటివి తరచుగా జరుగుతాయి. ఇది సమర్థనీయం కాదు" అని ఒక యూజర్ రాశారు.
కానీ, మరికొందరు ఈ పరిస్థితికి విమానయాన సంస్థను మాత్రమే తప్పుపట్టలేమని అభిప్రాయపడ్డారు.
"ప్రయాణికులు కనీస ప్రయాణ మర్యాదలను పాటించనప్పుడు, ఎయిర్ ఇండియా, దాని సిబ్బందిని నిందించగలమా?" అని మరో యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














