విమానం ఎందుకు కుదుపులకు లోనవుతుంది, అదుపు చేయడం సాధ్యమేనా?

లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానంలో కుదుపులు రావడంతో ఒక ప్రయాణికుడు చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి.
విమానం ఒక్కసారిగా కిందకు జారడంతో అందులో ఉన్న ప్రయాణికులు, ఇతర వస్తువులు క్యాబిన్ అంతటా చెల్లాచెదరుగా పడ్డాయి. దీంతో విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది.
ఈ వ్యవహారంపై సింగపూర్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు కూడా చెప్పింది. బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందిస్తామని కూడా వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
విమానంలో కుదుపులు ఎందుకు వస్తాయి?
విమానాల్లో తరచు ప్రయాణించే వారికి ఈ కుదుపు (turbulence)ల గురించి అవగాహన ఉంటుంది. విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు కుదుపులు వస్తుంటాయి. అలాగే విమానం ప్రయాణిస్తున్న ఎత్తులో మార్పు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
విమానానికి కుదుపులు ఎక్కువగా గాల్లోకి లేచిన తర్వాతే వస్తాయి. గాలి వేగంలో మార్పుల వల్ల ఒక్కోసారి ఫ్లైట్ నిలువెల్లా ఊగిపోతుందని, దాన్ని నియంత్రించే సమయంలో కుదుపులు వస్తాయని మాజీ ఆర్ఏఎఫ్ అధికారి, బీబీసీ వెదర్ రిపోర్టర్ సైమన్ కింగ్ చెప్పారు.
అయితే, ఈ కుదుపుల్లో ఎక్కువభాగం తేలికపాటివే ఉంటాయి. మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి.
వర్షాలు వచ్చే సమయంలో ఆకాశంలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. వీటి వల్ల గాలిలో అలజడి తీవ్రంగా ఉంటుంది. విమానం ఇలాంటి వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు తీవ్రమైన కుదుపులు వస్తాయి.
ఇందులో మరో రకం ‘క్లియర్ ఎయిర్’ టర్బులెన్స్(కుదుపు). ఆకాశంలో మబ్బులు లేనప్పుడు కూడా విమానం కుదుపులకు గురవుతుంది. ఇది చాలా ఇబ్బందికరం. క్లియర్ ఎయిర్‌ను గుర్తించడం కష్టం కూడా.
“భూమి చుట్టూ పశ్చిమం నుంచి తూర్పు వైపు ఒక ఇరుకైన మార్గంలో వేగంగా వీచే గాలుల్ని జెట్ స్ట్రీమ్ అంటారు. భూమికి 40వేల నుంచి 60వేల అడుగుల ఎత్తులో ఇలాంటి గాలులు వీస్తుంటాయి. ఈ వాతావరణంలోకి ప్రవేశిస్తేగానీ గాలుల గురించి అర్థం కాదు. విమానం ఆ గాలిలోకి ప్రవేశించినప్పుడు కుదుపులు చాలా తీవ్రంగా ఉంటాయి” అని అకడమిక్, కమర్షియల్ పైలట్‌గా పని చేసిన గై గ్రాట్టన్ చెప్పారు. ఆయన క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ కూడా.
ఆకాశంలో సాధారణ వాతావరణంలో వీచే గాలికి, జెట్ స్ట్రీమ్‌లో వీచే గాలికి మధ్య గంటకు వంద మైళ్ల వేగం తేడా ఉంటుందని ఆయన చెప్పారు. జెట్ స్ట్రీమ్‌లో వీచే గాలి వేగంలో తేడాల వల్ల కుదుపులు ఎక్కువగా ఉంటాయి. ఆకాశంలో ఇలాంటివి తరచుగా ఎదురవుతుంటాయి. వీటిని తప్పించుకోవడం కష్టం.
యూరప్ నుంచి నార్త్ అమెరికా వైపు విమానంలో వెళ్లే సమయంలో వీటిని తప్పించుకోవడం కష్టమని గ్రాట్టన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానంలో కుదుపులు ఎంత ప్రమాదకరం?
‘‘గాలి వేగాన్ని తట్టుకుని, కుదుపులకు లోనవకుండా ఉండేలా విమానాలను డిజైన్ చేస్తారు’’ అని గ్రాట్టన్ చెప్పారు.
ఆకాశంలో విమానానికి వచ్చే కుదుపుల వల్ల విమానాలు ధ్వంసం అయిన సందర్భాలేవీ లేవని ఆయన గుర్తు చేశారు.
అయినప్పటికీ, కుదుపుల వల్ల విమానాలకు మంచి ఏమీ జరగదు. అందుకే పైలట్లు జెట్ స్ట్రీమ్ లాంటి వాతావరణానికి దూరంగా ప్రయాణిస్తుంటారు. ఒకవేళ అలాంటి వాతావరణంలోకి వెళితే సీట్‌బెల్ట్‌లు పెట్టుకోవాలని సిగ్నల్ ఇస్తారు. విమాన వేగాన్ని తగ్గిస్తారు.
అయితే కొన్ని సందర్భాల్లో గాలి వేగం దృష్ట్యా విమానానికి నష్టం జరిగే అవకాశం ఉందని, అయితే అది గాలుల తీవ్రతను బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారీగా కుదుపులు వస్తే ప్రయాణికులకు ప్రమాదకరం. ఎందుకంటే విమానం ఒక్కసారిగా నిలువెల్లా ఊగిపోతుంది. సీట్ బెల్టులు పెట్టుకోని వారు క్యాబిన్ లోపల ఏదో ఒక మూలకు విసిరేసినట్లు పడిపోయే అవకాశం ఉంది.
విమానంలో కుదుపులవల్ల మరణాలు, తీవ్రమైన గాయాలు తగిలే సందర్భాలు చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయని, వాటిలో తీవ్రంగా వచ్చే కుదుపుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా తక్కువని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ జాన్ స్ట్రిక్‌లాండ్ చెప్పారు.
2009-2022 మధ్య అమెరికాలో కుదుపుల వల్ల గాయాలైన సంఘటనలు సంవత్సరానికి 12 చొప్పున 163 జరిగాయని అమెరికన్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
కుదుపుల్ని పైలట్లు ఎలా నియంత్రిస్తారు?
ప్రయాణానికి ముందే పైలట్లకు వారు ప్రయాణించే మార్గంలో వాతావరణ వివరాలు అందిస్తారు. ఇందులో వాతావరణ శాఖ ఇచ్చే డేటా కూడా ఉంటుంది.
పైలట్లు ఈ డేటాను పూర్తిగా అవగాహన చేసుకున్నాకే ప్రయాణానికి సిద్ధమవుతారు.
వర్షాకాలంలో మేఘావృతమైన ఆకాశంలో ప్రయాణించడానికి వాతావరణ విభాగం ఇచ్చే డేటా కీలకం. అయితే “క్లియర్ ఎయిర్” వాతావరణం అనూహ్యంగా ఎదురవుతుంది. దీన్ని తప్పించుకోవడం కొంత ఇబ్బందికరం.
ఒక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత దాని కంటే ముందు అదే మార్గంలో ప్రయాణించిన విమానంలో ఏవైనా కుదుపులు ఏర్పడితే ఆ సమాచారం కూడా గ్రౌండ్ స్టాఫ్ ద్వారా పైలట్లకు చేరుకుతుందని గ్రాట్టన్ చెప్పారు.
అలాంటి సమయంలో పైలట్లు వేరే మార్గంలో ప్రయాణించడం లేదా విమానాన్ని నిదానంగా నడపడం ద్వారా కుదుపుల ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తారు.
కుదుపుల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై విమాన సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కుదుపుల సమయంలో సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?
విమానం కుదుపులకు గురైనప్పుడు ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవడం, తమ చుట్టుపక్కల ఇతర వస్తువులు లేకుండా చూసుకోవడం మంచిది.
చాలా సందర్భాల్లో కుదుపులు అనూహ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవాలని పైలట్లు సూచిస్తారు.
కుదుపులు తరచుగా వస్తాయా?
వాతావరణ మార్పుల వల్ల ప్రయాణాల్లో కుదుపులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు.
నార్త్ అట్లాంటిక్ మార్గంలో 1979 నుంచి 2020 వరకు చూస్తే తీవ్రమైన కుదుపుల సంఖ్య 55 శాతం పెరిగిందని బ్రిటన్‌లోని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు.
వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాల వల్ల గాలి వేడెక్కి అధిక ఎత్తులో గాలి వేగం పెరుగుతోంది. వేగంగా వీచే గాలుల వల్ల విమానాల్లో కుదుపులు వస్తున్నాయి.
గతంతో పోలిస్తే ప్రస్తుతం విమాన ప్రయాణాలు, ప్రయాణిస్తున్న విమానాల సంఖ్య భారీగా పెరిగింది. దీని వల్ల రానున్న రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని గై గ్రాట్టన్ అన్నారు.
విమానాల సంఖ్య పెరిగే కొద్దీ, అవి ప్రయాణించే రూట్లలో ట్రాఫిక్ పెరుగుతుంది. ఎయిర్ ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఫ్లైట్లలో కుదుపుల సంఘటనలు, ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయని నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- మిస్ జపాన్: వివాహితుడితో అఫైర్ బయటపడినందుకు ‘కిరీటం’ కోల్పోయిన విజేత
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- దళితుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని కూతుర్ని చెట్టుకు ఉరివేసి చంపిన తండ్రి... తమిళనాడులో ఘాతుకం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














