హెలికాప్టర్ ప్రమాదం: ఇరాన్ సాయం అడిగితే అమెరికా ఏం చేసింది? ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని తెలియగానే ఇజ్రాయెల్‌లోని సోషల్ మీడియాలో యూజర్లు స్పందించడం మొదలుపెట్టారు.
ఈ హెలికాప్టర్ ప్రమాదం ఆదివారం జరిగింది.
కూలిపోయిన హెలికాప్టర్ భాగాలను సోమవారం ఉదయం వెలికితీశారు.
ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడిన ఆనవాళ్లు లేవని ఇరాన్ మీడియా తర్వాత వెల్లడించింది.
రైసీ మరణాన్ని ఇరాన్ ధ్రువీకరించడంతో, ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిస్పందన వ్యక్తమైంది.
రైసీ హఠాన్మరణంపై ఇప్పటికీ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల వివాదం నెలకొంది.
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనే అని ఇరాన్ ఆరోపించింది. ఏప్రిల్‌లో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
ఈ వివాదం మధ్య రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హఠాన్మరణం చెందడంతో కొందరు ఇజ్రాయెల్‌పై అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, ఇజ్రాయెల్ మాత్రం రైసీ మరణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పింది.
రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ హస్తం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇజ్రాయెల్ అధికారి ఒకరు చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
కానీ దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

ఫొటో సోర్స్, REUTERS
ఇరాన్ సాయం కోరినప్పుడు అమెరికా ఏం చేసింది?
ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదానికి అమెరికా విధించిన ఆంక్షలే కారణమని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జవాద్ జరీఫ్ ఆరోపించారు.
‘‘ఈ విషాద సంఘటనకు అమెరికానే కారణం. ఇరాన్‌తో లావాదేవీలేమీ జరపకూడదని అమెరికా తమ విమానయాన పరిశ్రమలను ఆదేశించింది. ఈ కారణంగానే అధ్యక్షుడు, ఆయన సహచరులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. అమెరికా చేసిన ఈ నేరం ఇరాన్ చరిత్రలో, ఇరాన్ ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోతుంది’’ అని మొహమ్మద్ అన్నారు.
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన అనంతరం ఇరాన్, అమెరికా సహాయం కోరిందని రాయిటర్స్ పేర్కొంది. కానీ అమెరికా మాత్రం సహాయం చేయలేదు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మాట్లాడుతూ, “ఇరాన్ ప్రభుత్వం మమ్మల్ని సహాయం కోరింది. ఇలాంటి పరిస్థితిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేం ఇరాన్ ప్రభుత్వానికి చెప్పాం. కానీ చివరికి పలు లాజిస్టిక్ సమస్యల వల్ల సహాయం చేయలేకపోయాం’’ అని అన్నారు.
ఈ ప్రమాదంపై అమెరికాను ఇరాన్ నిందిస్తుందేమో అని భయపడుతున్నారా అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ను ప్రశ్నించగా, ‘‘ఈ హెలికాప్టర్ ప్రమాదంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని ఆయన బదులిచ్చారు.
యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన సంభాషణల ఆధారంగా, ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక కుట్ర ఉందని చెప్పడానికి ఆధారాలు లేవని యుఎస్ సెనేటర్ చక్ షుమెర్ సోమవారం అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
ఇజ్రాయెల్ మీడియా స్పందన
హెలికాప్టర్ ప్రమాదంతో ఇజ్రాయెల్‌కు ఎటువంటి సంబంధం లేదని ఒక అధికారి చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక వార్తను ప్రచురించింది.
"రైసీ మరణం ఇజ్రాయెల్ విధానాలను మార్చలేదు. రైసీ మరణవార్త మాకు ముఖ్యం కాదు. ఇది ఇజ్రాయెల్ స్థితిని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ఇరాన్ విధానాలను వారి అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమెనేయి నిర్ణయించారు. రైసీ కూడా క్రూరమైన వ్యక్తే. ఆయన మృతి పట్ల మేం సంతాపం వ్యక్తం చేయం’’ అని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు అవిగ్‌డోర్ లైబర్‌మాన్ అన్నారని ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు.
“ఒక నెల క్రితం, ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఖాయమని రైసీ బెదిరించారు. కానీ ఇప్పుడు ఆయనే లేకుండా పోయారు” అని ప్రధానమంత్రి కార్యాలయంలోని డిప్యూటీ మినిస్టర్ అవీ మావోస్ అన్నారని ఈ వార్తా కథనంలో చెప్పారు.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ వ్యాఖ్యలను పేర్కొంటూ రైసీ మరణాన్ని ఇజ్రాయెల్‌కు శుభవార్తగా అభివర్ణించింది.
ఈ కథనంలో రైసీ మరణం తరువాత కొన్ని చోట్ల వేడుకలు, నృత్యాలు చేసినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
పత్రికలు ఏం రాశాయి?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఎదుగుదల గురించి వైనెట్‌న్యూస్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో ఒక కథనం రాశారు. దాని పేరు 'ది బుచ్చర్ ఆఫ్ టెహ్రాన్' (టెహ్రాన్ కసాయి).
మరో వార్తా వెబ్‌సైట్, ‘‘డెత్ ఆఫ్ ఇరాన్స్ మోస్ట్ హేటెడ్ మ్యాన్'' పేరిట కథనాన్ని ప్రచురించింది. దీనిలో రైసీ మృతికి ఎవరూ కన్నీళ్లు కార్చరు అని రాశారు.
ఇజ్రాయెల్ వార్తా కథనాల ప్రకారం, ఇరాన్ మహిళలు రైసీని అసహ్యించుకుంటారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో హిజాబ్‌ను కఠినంగా అమలు చేయడానికి రైసీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు.
ఇస్లామిక్ విప్లవం తర్వాత రైసీ అనేక నగరాల్లో న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రైసీ 1988లో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ కోర్టులో చేరారు, దీనిని చాలా మంది 'డెత్ స్క్వాడ్' అని పిలుస్తారు.
రాజకీయ కార్యకలాపాల కారణంగా జైలుశిక్ష అనుభవిస్తున్న వేలాది మంది రాజకీయ ఖైదీలను ఈ కోర్టుల్లో విచారించేవారు. ఈ కోర్టుల ద్వారా మరణశిక్ష విధించిన రాజకీయ ఖైదీల కచ్చితమైన సంఖ్య తెలియదు,
అయితే మానవ హక్కుల సంస్థలు వీరి సంఖ్య దాదాపు 5,000 వరకు ఉండవచ్చని భావిస్తున్నాయి. వీరిలో పురుషులు, మహిళలు ఉన్నారు. ఉరి తీశాక, వారందరినీ బయటి ప్రపంచానికి తెలీకుండా సామూహిక సమాధులలో పాతిపెట్టారని అంటారు.
ఈ నేరాలలో తన ప్రమేయం లేదంటూ ఇబ్రహీం రైసీ ఈ ప్రచారాన్ని ఖండించారు. అయితే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమెనేయి ఫత్వా ప్రకారం ఈ శిక్షలు 'సరైనవే' అని ఆయన ఒకసారి అన్నారు.
ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?
ఇజ్రాయెల్‌లోని కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి రైసీ మరణం మీద మీమ్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. రైసీ హెలికాప్టర్‌ను ‘‘ఎలీ కాప్టర్’’' అనే మొసాద్ ఏజెంట్ నడుపుతున్నారని కొందరు వ్యంగ్యంగా మీమ్స్ పంచుకున్నారు.
ఎలీ కోహెన్ ఇజ్రాయెల్ గూఢచారి. ఇస్లాంలో "కామిల్" హోదాను పొంది, కోహెన్ సిరియా అధ్యక్షుడికి చాలా దగ్గరయ్యారు. ఆ తర్వాత సిరియా డిప్యూటీ రక్షణ మంత్రి అయ్యారు. కోహెన్ సేకరించిన ఇంటెలిజెన్స్‌తోనే 1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించిందని అంటారు. ‘‘ఎలీ కాప్టర్’’ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న మీమ్ ఈ ఎలీ కోహెన్‌దే.
ఇజ్రాయెల్ ఫ్రెంచ్-భాషా వార్తా ఛానెల్ (I-24) సైతం ‘‘ఎలీ కాప్టర్’’ జోక్‌పై వార్తలు ప్రసారం చేసింది. అయితే, ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో, ఆ ఛానెల్ క్షమాపణలు చెప్పింది.

ఫొటో సోర్స్, BBC/PUNEET KUMAR
రైసీ మరణవార్త విని ఇజ్రాయెల్ నాయకులు సంబరాలు చేసుకున్నారా?
రైసీ మృతి పట్ల ఇజ్రాయెల్ నేతలు సంబరాలు చేసుకున్నారని తుర్కియే వార్తా సంస్థ అనడోలు పేర్కొంది.
ఇజ్రాయెల్ సాంస్కృతిక మంత్రి అమిచాయ్ ఎలియాహు, ఎక్స్ సోషల్ మీడియా సైట్‌లో కప్పులో ఉన్న వైన్ చిత్రాన్ని ‘‘చీర్స్’’ అంటూ పోస్ట్ చేశారు.
మరో ట్వీట్‌లో, "ఈ ఉన్మాదులు, మితవాదులు నిన్నటి వరకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణాన్ని కోరుకున్నారు. ఇప్పుడు ఈ ఇరాన్ అధ్యక్షుడి మరణాన్ని మనం వేడుక చేసుకోకూడదని అంటున్నారు" అని ఆయన అన్నారు.
కొంతమంది ఇజ్రాయెల్ నాయకులు రైసీ పాత ప్రకటనలను ఉటంకిస్తూ, రైసీ మృతికి తాము సంతాపం వ్యక్తం చేయడం లేదన్నారు.
ఇబ్రహీం రైసీ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
- దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














