రోహిత్ శర్మ ఆగ్రహంలో న్యాయం ఉందా? ఆయన ప్రశ్నలు ఎందుకంత ఘాటుగా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద ఉగరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐపీఎల్ అధికారిక ప్రసార సంస్థ ‘స్టార్ స్పోర్ట్స్’ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో క్రికెటర్ల ప్రైవసీకి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోపించారు.
ఛానళ్లు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం, ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఆటగాళ్ల అభిమానుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన చెప్పారు.
మే17న లఖ్‌నవూ జట్టుతో ముంబయి తలపడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో కెమెరా ఆపేయాలని స్టార్ స్పోర్ట్స్ కెమెరామెన్‌ను అడిగినట్లు రోహిత్ శర్మ తెలిపారు.
రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కెమెరాలు ఆపేయాలని కోరినా స్టార్ స్పోర్ట్స్ కెమెరామెన్ రికార్డింగ్ ఆపలేదు.
రికార్డు చేసిన వీడియోలో కొంత భాగాన్ని తొలగించి మిగతా భాగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్టార్ స్పోర్ట్స్.
ఇది ఆటగాళ్ల ప్రైవసీని ఉల్లంఘించడమేనని రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు కెమెరా ఆడియోను ఆపేయాల్సిందిగా చేతులు జోడించి అడిగాను. ఆ ఆడియోతో నాకు చాలా కోపం వచ్చింది” అని రోహిత్ చెప్పారు.
మే 11న స్టార్‌స్పోర్ట్స్ కెమెరామెన్ రికార్డు చేసిన ఆడియోలో రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ కోచ్, ముంబయి ఇండియన్స్ టీమ్ ప్లేయర్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడిన సంభాషణ రికార్డైంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియోలో శబ్ధాలు స్పష్టంగా లేవు. అయితే ఇందులో రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ జట్టులో నాయర్ భవిష్యత్ గురిచి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే తొలగించింది. అయితే అప్పటికే ఈ వీడియోలో రోహిత్ శర్మ సంభాషణ గురించి ఇంటర్నెట్‌లో విస్తృతమైన చర్చ జరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మైదానంలో 50 కెమెరాలు
ప్రస్తుతం టీవీ కెమెరాలు ఆటగాళ్ల ప్రతీ కదలికను రికార్డు చేస్తున్నాయని రోహిత్ శర్మ “ఎక్స్”లో మెసేజ్ పోస్ట్ చేశారు.
మ్యాచ్‌లు లేదా ప్రాక్టీస్ సెషన్లలో ఆటగాళ్లు తమ సహచరులు, సన్నిహితులతో వ్యక్తిగత అంశాలు మాట్లాడేటప్పుడు కూడా కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు.
తాను చెప్పేది మంచి విషయమే అన్నారు రోహిత్ శర్మ.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌లను ఎన్ని కెమెరాలతో కవర్ చేస్తున్నారో తెలిస్తే ఆటగాళ్లు నిర్ఘాంతపోయే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌ను 50 కెమెరాలతో రికార్డు చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ మ్యాచ్‌ల మీడియా హక్కుల్ని అమ్ముకునేందుకే రోహిత్ శర్మ తన తోటి క్రీడాకారులతో మాట్లాడుతున్న వీడియోలో ఆడియోను కూడా రికార్డు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్, డీటీహెచ్, కేబుల్ టెలివిజన్ హక్కుల్ని వేర్వేరు సంస్థలకు ఇచ్చారు.
ఐపీఎల్ మ్యాచ్‌లో శాటిలైట్ హక్కులు స్టార్‌స్పోర్ట్స్‌కు ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఈ మ్యాచ్‌లను టాటా ప్లే, ఎయిర్‌టెల్, డిష్ టీవీ, డీ2హెచ్, సన్ డైరెక్ట్ ద్వారా ప్రసారం చేస్తోంది.
ఇంటర్నెట్, డిజిటల్‌లో వయాకామ్ 18 తన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ యాప్ జియో సినిమా ద్వారా ప్రసారం చేస్తోంది.
ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, మ్యాచ్‌లలో కొన్ని దృశ్యాలను టీవీ న్యూస్ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి
మ్యాచ్ చూసే ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడమే కాదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఒత్తిడి పెరుగుతోంది.
సోషల్ మీడియాలో కంటెంట్ రేసు కోసం రెండు ప్రసార సంస్థల కెమెరామెన్లతో పాటు మ్యాచ్ ఆడే రెండు టీముల యాజమాన్యాలు కూడా స్టేడియంలో కెమెరామెన్లను పెడుతున్నాయి. ఈ పోటీలో ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యతను మర్చిపోతున్నారని క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు.
దీనికి తోడు, మ్యాచ్‌లకు సంబంధించిన కంటెంట్‌ను టీముల అధికారిక వెబ్‌సైట్లలో ప్రత్యేకంగా ప్రచురిస్తున్నారు.
దీంతో అందరికీ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాల్సి వస్తోంది. ఇలాంటి కంటెంట్ ఉంటేనే ఇంటర్నెట్‌లో వైరల్ కావడం, ట్రెండింగ్‌గా నిలవడం ద్వారా ఐపీఎల్‌కు కావల్సినంత ప్రచారం లభిస్తుంది.
ఇదంతా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్, గూగుల్ గ్లాన్స్ లేదా ఇతర వీడియో ఫ్లాట్‌ఫామ్‌ల కోసమే చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు కెమెరాల సంఖ్య పెరుగుతోంది.
మ్యాచ్‌లను కవర్ చేసేందుకు ఐపీఎల్ స్టేడియంలో అధికారికంగా 22 మంది కెమెరామెన్లను నియమించింది.
దీనికి తోడు పది ఆటోమేటిక్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆరు హాక్ ఐ కెమెరాలు. స్టంపుల్లో నాలుగు కెమెరాలను అమర్చారు.
దీని తర్వాత కామెంటరేటల్ బాక్సులో ఫిక్స్‌డ్ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక్కో మ్యాచ్‌ను 35 కెమెరాలతో కవర్ చేస్తున్నారు. ఈ కెమెరాల్లో రికార్డు చేసిన ఫీడ్‌ను స్టార్ స్పోర్ట్స్, వయాకామ్ 18కు అందిస్తున్నారు.
ఈ 35 మందికి తోడు స్టార్ స్పోర్ట్స్ , వయాకామ్ ఐదుగురు కెమెరామెన్లను ఎక్స్‌క్లూజివ్ దృశ్యాల కోసం స్టేడియంలో నియమించాయి. వీరు ఇచ్చె ఫీడ్ మీద కామెంటరేటర్లు వ్యాఖ్యానాలు చేయడం ద్వారా దాన్ని హైలెట్ చేస్తున్నారు.
రెండు ప్రసార సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరామెన్లు డ్రస్సింగ్‌రూమ్‌లో ఉండే కెప్టెన్లు, మైదానంలో పరిస్థితుల పట్ల స్పందిస్తున్న దృశ్యాలను రికార్డు చేస్తుంటారు.
ఈ కెమెరాలు ఆటగాళ్లు కూర్చున్న ప్రాంతం, వాళ్లు తినే ఆహారం, లేదా టీముల యజమానులు తమ టీమ్ సభ్యుల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు లాంటి అంశాలన్నింటినీ రికార్డు చేస్తున్నాయి.
ఇది ఇక్కడతో ఆగడం లేదు. సోషల్ మీడియాకు అవసరమైన ముబైల్ కంటెంట్ పోస్ట్ చేయడానికి ప్రత్యేకంగా మినీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డబ్బుల సంపాదన మీదనే శ్రద్ధ
ఐపీఎల్, బీసీసీఐ ఏర్పాటు చేసిన కెమెరా మెన్లతో పాటు మ్యాచ్‌ల యాజమాన్యాలు కూడా కొంతమంది కెమెరామెన్లను నియమించాయి.
దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లను కవర్ చేస్తున్న కెమెరాల సంఖ్య 50కి చేరింది.
ఈ ట్రెండును అటెన్షన్ ఎకానమీ అని పిలుస్తున్నారు. చమురు, బంగారం, వజ్రాలు లాంటివి ధరలు పెరిగినా, తగ్గినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. వీటి మాదిరిగానే ఐపీఎల్ కూడా ఎక్కువ మందిని ఆకర్షించేందుకు మ్యాచ్‌లను అన్ని కోణాల్లో కవర్ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం వరకు సామాజిక మాధ్యమాలు వ్యక్తుల మధ్య స్నేహాలు, చర్చలు, సెలబ్రిటీల తాము చేస్తున్న ప్రాజెక్టుల గురించి అభిమానులకు అప్‌డేట్లు అందించేందుకు ఉపయోగపడేవి. సమాచారాన్ని అందించడంలో, పంచుకోవడంలో సామాజిక మాధ్యమాల స్పీడుతో మెయిన్ స్ట్రీమ్ మీడియా, న్యూస్ పేపర్లు, మేగజైన్లు వెనకబడి పోయాయి.
ఐపీఎల్ కూడా క్రికెట్ మ్యాచ్‌ల గురించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు, ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటోంది. ఇందు కోసం ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి వీలైనంత ఎక్కువ సమాచారాం అభిమానులకు పంచుతోంది.
ఆటగాళ్లు కూడా ఈ ప్రచారాన్ని ఉపయోగించుకుని వివిధ వస్తువుల మార్కెటింగ్ ప్రచారకర్తలుగా మారుతున్నారు. అశ్విన్ ఏకంగా సొంత యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు.
ఐపీఎల్ టీములు ప్రతి సీజన్‌కు కొత్తగా ఇన్‌ఫ్లూయర్స్‌ను నియమించుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ మిస్టర్ నాగ్స్, కమేడిన్ డానిష్ సెయిత్ పని చేస్తున్నారు.
అటెన్షన్ ఎకానమీ పేరుతో జరుగుతున్న ప్రచారం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. అంతే కాదు ఇది ఆటగాళ్ల వ్యక్తిగ జీవితాల్ని పట్టించుకోవడం లేదు. గత వార రోహిత్ శర్మ విషయంలో జరిగినట్లు ఒక్కోసారి ఇది చాలా దూరం వెళుతోంది.

ఫొటో సోర్స్, ANI
మీడియా హక్కుల కోసం పోటీ
ఐపీఎల్‌కు సంబంధించిన ప్రసార హక్కుల్ని వివిధ భాగాలుగా విభజించి అమ్మడం చాలా తెలివైన ఆలోచన. అయితే దీని ప్రభావం మైదానంలో ఆటగాళ్ల మీద ఎక్కువగా కనిపిస్తోంది. ఇద్దరు ఆటగాళ్ల వ్యక్తిగత సంభాషణ సమాచారం రూపంలో ప్రజల్లోకి వస్తోంది.
రోహిత్ శర్మ ఆడియో బయటకు రావడం ఈ సీజన్‌కు మాత్రమే పరిమితం అని అనుకోవచ్చా?.
వాస్తవానికి ఈ ఏడాది మార్చ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా కలయిక నిర్థరణ అయింది.
దీనర్థం వచ్చే ఐపీఎల్ సీజన్ డీటీహెచ్, డిజిటల్ విభాగాలను ఒకే సంస్థ ప్రసారం చేస్తుంది.
దీంతో టీఆర్పీలు, వ్యూయర్‌షిప్ విషయంలో పోటీ ఉండదు.
పోటీ లేకున్నప్పటికీ స్టేడియంలో 40కి పైగా కెమెరాలు ఉంటాయనే విషయం మర్చిపోకూడదు.
ఎందుకంటే ప్రేక్షకుల సంఖ్యను పెంచుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని కూడా ప్రసార సంస్థ వదులుకోదు. వ్యూయర్స్ సంఖ్య పెరిగే కొద్దీ ప్రసార సంస్థకు లాభాలు కూడా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
- దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














