IPL ఎలా మొదలైంది, ఎన్ని రికార్డులు సృష్టించింది, ఎలాంటి విమర్శలు ఎదుర్కొంది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, భాను ప్రకాశ్ కర్నాటి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత స్టార్ క్రికెటర్లయిన మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు ప్రత్యర్థి జట్లుగా బరిలోకి దిగడాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నడూ చూసి ఉండరు. ఆ కలను నిజం చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్.

2008 మార్చిలో జరిగిన మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుంచి మొదలై ఇప్పటికి 16 సీజన్లు పూర్తి చేసుకుంది.

ఏటా మార్చి వస్తోందంటే క్రికెట్ అభిమానులకు పండగే.

ఆటగాళ్ల వేలం నుంచి మొదలుకొని లీగ్ పూర్తయ్యేవరకు ఐపీఎల్‌కు సంబంధించి ప్రతి వార్తా ఆసక్తికరమే.

రేపే 17వ సీజన్ మొదలు కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి.

క్రికెట్ అభిమానులు ధోనీ ప్రదర్శన కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో, రెండు నెలల తర్వాత బ్యాట్ పట్టబోయే విరాట్ కోహ్లీ కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు.

ఇంతకీ అసలు ఐపీఎల్ ఎలా మొదలైంది? ఎందుకు అంత క్రేజ్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్

ఎలా మొదలైంది?

2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తొలి అడుగు పడింది. ఆ సమయంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న లలిత్ మోదీ ఈ లీగ్‌ను ప్రారంభించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనే ఛైర్మన్‌గా వ్యవహరించారు.

నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) నిర్వహిాంచే లీగ్‌ల ప్రేరణతో 20 ఓవర్ల ఫార్మాట్‌తో ఐపీఎల్‌‌ను రూపొందించారు.

బీసీసీఐ అధికారికంగా 2007 సెప్టెంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించింది. తొలి సీజన్ 2008 మార్చిలో మొదలైంది.

అంతవరకు క్రికెట్‌ను దేశాల మధ్య పోటీలాగానే చూసిన అభిమానులకు అది కొత్త అనుభూతి.

భారత జట్టులో అంతా కలిసి ఆడిన తన ఫేవరెట్ ప్లేయర్లు, ఇక్కడే వేర్వేరు జట్లలో ఒకరికొకరు పోటీ పడతారు. వీరితోపాటు విదేశీ క్రికెట్ ప్లేయర్లు కూడా చేరతారు. 20 ఓవర్ల‌లోనే ఫలితం తేలే, ఉత్కంఠను కలిగించే మ్యాచ్. దానికితోడు వినోదం.

ఆ జట్లు కూడా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్..ఇలా లోకల్ ఫ్లేవర్‌ను యాడ్ చేశాయి. ఒక్కో జట్టు ఒక్కొక్కరికి ఫేవరెట్.. ఇవన్ని కలిసి ఐపీఎల్‌ మొదటి సీజన్‌ను సక్సెస్ చేశాయి. అలా మొదలైన ఐపీఎల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఏటా మార్చిలో మొదలై దాదాపు 56 రోజుల పాటు సాగుతుంది. తొలిసీజన్‌లో ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది.

ఆ తరువాత కొన్ని జట్లు లీగ్ నుంచి వైదొలగడం కొత్తవి రావడం కామన్‌గా మారింది. ఇప్పుడు ప్రారంభం కాబోయే 17వ సీజన్‌లో పది జట్లు తలపడనున్నాయి.

లలిత్ మోదీ

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2007లో బీసీసీఐ అధికారికంగా టీ20 ఐపీఎల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ప్లేయర్ల వేలం...

ప్రతీ సీజన్‌కు కొన్ని నెలల ముందు వేలం నిర్వహిస్తారు. లీగ్‌లో ఆడే ప్రతి జట్టులో గరిష్టంగా 25 మంది వరకు ప్లేయర్లు ఉండొచ్చు. వీరిలో ఎనిమిది మంది వరకు విదేశీ ఆటగాళ్లు ఉంటారు.

సీజన్‌కు ముందు ఆయా జట్ల యాజమాన్యాలు తమకు కావల్సిన ప్లేయర్లను రీటెయిన్ చేసుకుంటాయి. మిగిలిన వారి కోసం వేలంలో పాల్గొంటాయి.

ప్రపంచ క్రికెట్‌లో ఈ వేలం ప్రత్యేకం. స్టార్ ప్లేయర్లను కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తుంటారు.

2008 తొలిసీజన్ కోసం జరిగిన వేలంలో రికార్డు నెలకొల్పింది మాత్రం మహేంద్ర సింగ్ ధోనీనే.

రూ. 6 కోట్లు వెచ్చించి ధోనీని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అప్పటి నుంచి

ఆ జట్టులోనే ఆడుతున్నాడు ధోనీ.

ఏటా ఒక ఆటగాడు రికార్డు ధర పలుకుతున్నాడు.

17వ సీజన్ కోసం జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు రూ.24.75 కోట్ల ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆయన్ను కొనుగోలు చేసింది.

మరో ఆటగాడు పాట్ కమిన్స్‌ను సన్ రైజర్స్ జట్లు రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది.

మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలి సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీను చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది.

విమర్శలెందుకు?

ఐపీఎల్ ఆడే ప్లేయర్లపై విమర్శలు కూడా ఉన్నాయి. చాలామంది ప్లేయర్లు ఐపీఎల్‌‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని, అదే సమయంలో వరల్డ్‌కప్ లాంటి టోర్నీలపై వారికి ఫోకస్ తగ్గుతోందని విమర్శలు చేస్తుంటారు.

అయితే, అలాంటి భావన సరికాదని అన్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్.

ప్రభుత్వ ఉద్యోగమైతే శ్రద్ధ తక్కువ. ప్రయివేటు ఉద్యోగమైతే ఎక్కవ శ్రద్ధతో పనిచేస్తారని భావనలాంటిదే ఇది కూడా.

ఐపీఎల్ లాంటి ప్రయివేటు ఫ్రాంఛైజీల్లో ఆడే ఆటగాళ్లపై బాధ్యత ఉంటుంది. కోట్ల రూపాయలు వారిపై వెచ్చిస్తుంటాయి ఆయా జట్లు. అందువల్ల ప్లేయర్లు కూడా ఆ మేరకు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్‌లకు దూరం కాకుండా ఉండేందుకు గాయాల బారిన పడకుండా ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకానీ, దీనిని విమర్శలతో ముడిపెట్టొద్దు అంటున్నారాయన.

‘‘నిజానికి వారికి టోర్నీలు ఆడే సమయంలోనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. వరల్డ్‌కప్ గెలిస్తే వారికి కలిగే ప్రయోజనాలే ఎక్కువ. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. దేశమంతా వారికి బ్రహ్మరథం పడతారు. పైగా ప్రకటనలో రూపంలో ఆదాయాన్ని పొందొచ్చు. కాబట్టి అలాంటి విమర్శలు సరికాదు. నిజానికి ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్లే ఇటీవల భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్ వరకు వచ్చి, ఓటమిపాలైంది’’ అన్నారు వెంకటేష్.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకంత క్రేజ్?

ఏటా ఐపీఎల్‌కు ఆదరణ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. ఎక్కడ చూసినా అదే సందడి కనిపిస్తుంది. ఎందుకు ఐపీఎల్‌కు అంత క్రేజ్ వచ్చిందనే ప్రశ్నకు సి.వెంకటేష్ బదులిస్తూ, “క్రికెట్‌తోపాటు వినోదాన్ని పంచే వేదికగా ఐపీఎల్ నిలిచింది. క్రికెట్‌తోపాటు ఛీర్ గల్స్, డీజేలు..ఇవి ఒక కారణమైతే, దాదాపు రెండు నెలలపాటు రోజూ సాయంత్రం 7.30 గంటలయ్యేసరికి ఉత్కంఠను కలిగించే మ్యాచ్ వచ్చేస్తుంది. వారాంతాలైతే మధ్యాహ్నం నుంచే మొదలు, పైగా రెండు మ్యాచ్‌లు.. ఆ సమయానికి మన పనులన్ని ముగించేసుకునే ఉంటాం. తీరిగ్గా ఉంటాం కాబట్టి, కాలక్షేపానికైనా మ్యాచ్ చూస్తాం. అలా అలవాటైపోయింది. ఇది మరో కారణం.. అందువల్లే ప్రజలకు ఐపీఎల్ బాగా దగ్గరయింది” అన్నారు.

“మరో విషయమేంటంటే, బీసీసీఐ భారత ప్లేయర్లు ఇతర దేశాల్లో జరిగే ఇలాంటి తరహా లీగ్‌లలో ఆడేందుకు అనుమతులు ఇవ్వలేదు. అలా ఆడాలంటే, ఇక్కడ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి వెళ్లాలి. ఆ లెక్కన చూస్తే, మన స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరూ ఒక్కో జట్టులో ఆడే ప్రత్యేకమైన సందర్భం ఇది. అది కూడా ఐపీఎల్‌కు ఆదరణ పోకుండా ఉండేందుకు కారణమైంది” అన్నారు.

“విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని లాంటి స్టార్ ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉన్నారు. 2008 నుంచి ఏటా జరిగే టోర్నీ కాబట్టి ప్రతి ఒక్కరికీ ఫేవరెట్ టీం ఉంటుంది. వారి మ్యాచ్‌ను చూసి ఆస్వాదిస్తారు. అంతేకాదు ప్రతి క్రికెట్ అభిమానికి అన్ని జట్లలోనూ ఫేవరెట్ ప్లేయర్ ఉండొచ్చు. మొత్తంగా వారికి ఆ మ్యాచ్ చూడటం మంచి అనుభూతి. అందుకే ఐపీఎల్‌ ప్రేక్షకులను అలరిస్తోంది” అన్నారు

చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజేతగా నిలిచింది.

2008 నుంచి ఇప్పటివరకు ట్రోఫీ విజేతలు..

2008 నుంచి మొదలుకొని ఇప్పటివరకు జరిగిన సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు చెరో ఐదుసార్లు విజేతలుగా నిలిచాయి.

సీజన్ - విజేతగా నిలిచిన జట్టు

2008- రాజస్థాన్ రాయల్స్

2009- డెక్కన్ ఛార్జర్స్

2010- చెన్నై సూపర్ కింగ్స్

2011- చెన్నై సూపర్ కింగ్స్

2012- కోల్‌కతా నైట్ రైడర్స్

2013- ముంబయి ఇండియన్స్

2014- కోల్‌కతా నైట్ రైడర్స్

2015- ముంబయి ఇండియన్స్

2016- సన్‌రైజర్స్ హైదరాబాద్

2017- ముంబయి ఇండియన్స్

2018- చెన్నై సూపర్ కింగ్స్

2019- ముంబయి ఇండియన్స్

2020- ముంబయి ఇండియన్స్

2021- చెన్నై సూపర్ కింగ్స్

2022- గుజరాత్ టైటాన్స్

2023 - చెన్నై సూపర్ కింగ్స్

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

రికార్డులు..

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌కు ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ఇస్తారు.

16 సీజన్లకు కలిపి రికార్డు నెలకొల్పిన ప్లేయర్లు వీరే..

ఆల్ టైం బ్యాటింగ్ రికార్డులు:

ఆరెంజ్ క్యాప్- అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ- 7,263 పరుగులు

అత్యధిక ఫోర్లు- శిఖర్ ధావన్- 750 ఫోర్లు

అత్యధిక సిక్స్‌లు- క్రిస్ గేల్- 357 సిక్స్‌లు

అత్యధిక ఇన్నింగ్స్- క్రిస్ గేల్- 175

అత్యధిక స్ట్రయిక్ రేట్ - రస్సెల్ - 174

ఆల్ టైం బౌలింగ్ రికార్డులు:

పర్పుల్ క్యాప్- అత్యధిక వికెట్లు- ఛాహెల్- 187 వికెట్లు

అత్యుత్తమ బౌలింగ్ -అల్‌జారీ జోసెఫ్ -6/12

బెస్ట్ బౌలింగ్ యావరేజ్ - లుంగీ ఎంగిడి - 17.92

ఎక్కువ డాట్ బాల్స్ ఇచ్చినది - భువనేశ్వర్ కుమార్ -1534

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)