రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

“హే జైస్వాల్.. ఈ ఫీల్డింగ్ నీకోసమే..ఇక నీ సత్తా చూపించు”

ధర్మశాలలో మ్యాచ్‌కు సిద్ధం అవుతున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ నోటి నుంచి వచ్చిన మాటలకు యశస్వి జైస్వాల్‌తోపాటు అక్కడే ఉన్న కుల్‌దీప్ యాదవ్‌లు కూడా నవ్వుకున్నారు.

లెజండరీ ఆటగాడైన అశ్విన్ యువ ఓపెనర్‌ను ట్రీట్ చేసిన తీరు అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు.

అశ్విన్ మొదటి టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎలా ఉన్నాడో, 100వ టెస్ట్ మ్యాచ్ సమయంలోనూ అలానే ఉన్నాడు.

ఆటగాడిగా బరిలో తన క్రికెట్ కెరీర్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, వ్యక్తిత్వంలో మరింత ఉన్నతంగా మారాడు.

అందువల్లే జట్టులోని ప్రతి ఆటగాడితోనూ ఇట్టే కలిసిపోతాడు.

సాధారణంగా తమిళనాడు నుంచి వచ్చే ఆటగాళ్లకు హిందీ మాట్లాడటంలో ఇబ్బందులు ఉంటాయి.

అనధికారికంగా డ్రెస్సింగ్‌రూంలోనూ ఆటగాళ్లంతా హిందీలోనే సంభాషించుకుంటారు.

అశ్విన్‌ అన్నిటినీ సమన్వయపరచుకున్నాడు.

100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తొలి తమిళనాడు ఆటగాడిగా ఎలా ఉందనే ప్రశ్నకు అశ్విన్ ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది.

“విజయవంతమైన భారత క్రికెటర్‌గా కొనసాగటం వెనుక చాలా అంశాలున్నాయి. అందుకోసం వందలాది సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది” అన్నాడు.

అంతేకాకుండా రానున్న రోజుల్లో తన అనుభవాన్ని తమిళనాడు నుంచి వచ్చే ఆటగాళ్ల కోసం ఉపయోగిస్తానని, తన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లను తయారుచేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

అశ్విన్ అద్భుతమైన కెరీర్‌ను కేవలం తమిళనాడుకు చెందిన, భారత క్రికెటర్‌గానే పరిమితం చేసి చూడటం సరికాదు.

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అశ్విన్‌ను షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌లతో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్.

షేన్ వార్న్‌తో పోలిక..

అంతర్జాతీయ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న అశ్విన్‌ను లెజెండరీ ఆటగాళ్లు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌లతో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్.

ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, బ్యాటర్ జో రూట్ తన మాటల్లో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్, అశ్విన్‌ల మధ్య తేడా చెప్తూ.. లియాన్ ఎదుటివారు తప్పు చేసేవరకు ఎదురుచూస్తూ కూర్చోడు (బ్యాటర్ గురించి), అలాగే అశ్విన్ కూడా అంతే, వైవిధ్యంతో ప్రయత్నం చేస్తూనే ఉంటాడే కానీ, రిలాక్స్ అవడని చెప్పారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలినాళ్లలో బ్యాటర్ కావాలని అనుకున్న అశ్విన్ చివరకు బౌలర్‌గా మారాడు.

బ్యాటర్‌ కావాలనుకుని..

ధర్మశాల టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అశ్విన్‌ను ఆకాశానికెత్తేశాడు.

తొలినాళ్లలో బ్యాటర్ కావాలని అనుకున్న అశ్విన్ చివరకు బౌలర్‌గా మారాడని, తాను తొలుత బౌలర్ కావాలని అనుకుని, చివరకు బ్యాటర్‌గా మారానని అన్నాడు రోహిత్ శర్మ. ఆ ఫలితం భారత క్రికెట్‌కు లాభించిందని కూడా చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో జట్టులో సీనియర్ ఆటగాడిగా తనకు ఏ విధంగా అశ్విన్ మద్దతు ఇస్తున్నాడో తెలిపాడు రోహిత్ శర్మ.

రవీంద్ర జడేజాతో కలిసి కెప్టెన్‌గా తన భారాన్ని తగ్గించడంలో అశ్విన్ అందించే మద్దతు గురించి ప్రెస్‌మీట్‌లో చెప్పాడు రోహిత్ శర్మ.

ప్రెస్‌మీట్‌లో అశ్విన్ ఆనందంగా కనిపించాడు. అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

బౌలర్ అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెస్ట్ కెప్టెన్సీ అశ్విన్‌కు ఇంకా దక్కలేదు. కానీ ఎన్నడూ ఆ విషయంపై స్పందించలేదు.

వరించని కెప్టెన్సీ

తన కెరీర్‌లో ఒకే విషయం అశ్విన్‌ను బాధిస్తుంటుంది. అదే కెప్టెన్సీ.

టెస్ట్ కెప్టెన్సీ విషయంలో ఎన్నడూ అశ్విన్‌ను పరిగణలోకి తీసుకోలేదు.

బౌలర్‌గా అనిల్ కుంబ్లేతో అశ్విన్‌ను పోలుస్తారు.

కుంబ్లే మాదిరిగానే అశ్విన్‌ కూడా తొలినాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విదేశీ పిచ్‌లపై అంతగా రాణించలేదు.

కుంబ్లే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటూ, తనదైన శైలిలోనే విమర్శలకు స్పందించేవాడు. అశ్విన్‌ కూడా ప్రతి విమర్శకూ తనదైశ శైలిలో సమాధానం చెప్పేవాడు. అందుకే అంతర్జాతీయంగానూ అశ్విన్‌పై విమర్శలు పెద్దగా రాలేదు.

అయితే, కుంబ్లేకు తన కెరీర్ తుది దశలో ఉన్నప్పుడు కెప్టెన్సీ అవకాశం వరించింది. కానీ, అశ్విన్ మాత్రం ఆ రేసులో లేడనే చెప్పాలి.

దాని గురించి అశ్విన్ ఎన్నడూ బాహాటంగా చెప్పలేదు. అసంతృప్తిని వ్యక్తపర్చలేదు.

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెస్ట్ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తరువాత 500 వికెట్ల మైలురాయిని దాటిన రెండో బౌలర్ అశ్విన్.

స్ఫూర్తిదాయకమైన కెరీర్..

అశ్విన్ కెరీర్ స్ఫూర్తిదాయకమైనది.

పరిశీలిస్తే, టెస్ట్ క్రికెట్‌లో 50వ వికెట్ నుంచి 500 వికెట్ మైలురాయిని చేరుకోవడంలో అశ్విన్ ఇతర భారత బౌలర్ల కన్నా చాలా వేగంగా ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తరువాత 500 వికెట్ల మైలురాయిని దాటిన రెండో బౌలర్ అశ్విన్.

2011 నవంబర్ 6న మొదటి టెస్ట్ ఆడిన అశ్విన్ అతితక్కువ కాలంలోనే ఈ రికార్డును సాధించాడు.

హర్భజన్ సింగ్‌తో పోల్చి చూసినా, అశ్విన్ తన ప్రతిభతో రాణించి, కెరీర్‌లో తనదైన ముద్రవేశాడు.

అశ్విన్ టెస్ట్ కెరీర్‌లో 3000 పరుగులు, 5 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ రికార్డులను భారత బ్యాటర్‌లలో చాలామంది ఇంకా చేరుకోలేదు. దీనిని బట్టి చూస్తే, కెరీర్‌లో అశ్విన్ ఎంతటి విజయం సాధించాడో గమనించొచ్చు.

విదేశీ పిచ్‌లపై ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్‌లలో ప్రదర్శన, ప్రతి కెప్టెన్ జట్టులో సమతుల్యత పేరుతో ఎదురయ్యే ప్రశ్నలకు ఇబ్బంది పడకుండా అశ్విన్ జట్టులో కొనసాగడంలోనూ అతడి విజయం ఉంది.

తన కెరీర్ ముగిసే సమయానికి 100-150 టెస్ట్ మ్యాచ్‌లు, 500-600 టెస్ట్ వికెట్లతో తన కెరీర్‌ను గర్వపడేలా మార్చుకునే అశ్విన్‌ను ‘అల్టిమేట్ టీం మ్యాన్’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)