ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?

జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, @AndhraPradeshCM

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు చేయనిదే రోజు గడవడం లేదు.

నెల, రెండు నెలలు కాదు ఏకంగా ఏడాదిలో పదకొండు నెలల పాటు అప్పులు తెస్తేనే రాష్ట్రాన్ని నడిపించే స్థితికి ఏపీ చేరుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నఅప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసే దిశగా వెళుతోందా ? ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు ఏం సూచిస్తున్నాయి?ఈ అంశాల గురించి తెలుసుకుందాం.

రాబడి ఎంత? లోటు ఎంత?

ఏదైనా ఒక రాష్ట్రం అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం.

రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేస్తుంటాయి.

దీనికి రాష్ట్రంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చు.

సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్థాయిలో నిధుల లభ్యత రాష్ట్రానికి ఉండకపోవచ్చు.

దీని కారణంగా కేంద్రం నుంచి రుణాలు తెచ్చుకోవడంతోపాటు బయటి సంస్థలు, ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకోవాల్సి వస్తుంది. వీటిలో స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఫొటో సోర్స్, BUGGANA RAJENDRANATH REDDY/FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఏపీ విషయానికొస్తే,

2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రకారం ఏపీ బడ్జెట్ రూ.2,86,389 కోట్లు.

ఈ మొత్తంలో రూ.2,05,352 కోట్లు రాబడి రూపంలో వస్తుందని ప్ర‌భుత్వం అంచనా వేసింది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల రూపంలో రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందనేది అంచనా.

ఇవి కాకుండా పన్నేతర ఆదాయం రూ.14,400 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.32,127 కోట్లు వస్తాయని అనుకున్నారు.

ఈ ఆదాయమే కాకుండా బహిరంగ మార్కెట్ నుంచి రూ.71 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ.61,642 కోట్లు, వేర్వేరు వనరుల నుంచి రూ.25 వేల కోట్లు అప్పు చేయాలని బడ్జెట్‌‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.

‘‘2023-24 సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.31,534 కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు రూ.60,153 కోట్లు. ఇవి జీఎస్‌డీపీ(రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి)లో 2.19శాతం, 4.18శాతం.

2024-25 సంవత్సరానికి వచ్చేసరికి రెవెన్యూలోటు రూ. 24,758 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు. ఇవి జీఎస్‌డీపీలో 1.56శాతం, 3.51శాతంగా అంచనా వేస్తున్నాం’’ అని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

ఈ అప్పులు, రాబడి అంతా అంచనా మాత్రమే.

రియాలిటీలోకి వచ్చే సరికి రాబడి ఆ స్థాయిలో ఉండదు. అందుకే అప్పులు పెరిగిపోతుంటాయి.

జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

‘కాగ్’ ఏం చెప్పింది?

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విశ్లేషించింది. ఈ నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

దీని ప్రకారం చూస్తే, ఏడాదిలోని 365 రోజుల్లో ఏపీ ప్రభుత్వం 341 రోజులపాటు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తూనే ఉంది.

ఆర్‌బీఐ వేస్ అండ్ మీన్స్ (చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాల ద్వారా రుణాలు తీసుకుంది.

ఆర్‌బీఐ వద్ద ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం కనీస నిల్వ నిర్వహించాలి.

బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాలు కనీస నిల్వలు ఉంచుకోవాలి.

ఒకవేళ ఈ నిల్వలు పడిపోతే వేస్ అండ్ మీన్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ కింద లోన్లు తీసుకునేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పిస్తుంది.

అంటే ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేకుండా అయిపోతున్నందున పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం లోన్లు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటాయి.

కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేని దుస్థితి ఉందా?

ఏపీకి సంబంధించినంత వరకు కనీస నిల్వల మొత్తం రూ. కోటి 94 లక్షలుగా ఉంది. ఈ మొత్తం తగ్గిపోతే వేస్ అండ్ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ కింద తక్కువ కాలానికి వడ్డీకి లోన్లు తీసుకోవచ్చు.

ఏపీ మాత్రం ఏడాదిలో 341 రోజులు మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేని పరిస్థితిలో ఉంది.

2020-21 సంవత్సరంలో ఇది 221 రోజులకే పరిమితం కాగా, తర్వాత ఇది మరింత పెరిగింది.

వేస్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ: దీన్ని చేబదుళ్లుగా చెప్పుకోవచ్చు. ఇవి తక్కువ కాలానికి తీసుకునే రుణాలు.

సహజంగా వేస్ అండ్ మీన్స్ కింద మూడు నెలల కాలానికి తిరిగి ఇచ్చేలా రుణాలు తీసుకుంటారు.

దీనికి రెపో రేటు ఎంత ఉంటే, అంత వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అదే మూడు నెలలు దాటితే రెపో రేటు మీద అదనంగా ఒక శాతం వడ్డీని కలిపి కట్టాలి.

ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.50గా ఉంది.

అలాగే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పులు తీసుకుంటే రెపోరేటుపై ఒకటి లేదా రెండు శాతం తక్కువ వడ్డీనే ఉంటుంది.

ఏపీ విషయానికి వస్తే, కాగ్ చెప్పిన వివరాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వేస్ అండ్ మీన్స్ కింద 166 రోజులపాటు అప్పులు చేసింది.

స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 23 రోజులపాటు అప్పులు చేసింది. ఈ రెండు సదుపాయాల కింద రూ.60,973 కోట్లు అప్పులు చేసింది.

ఇందుకోసం రూ.149 కోట్ల అప్పులను ఆర్‌బీఐకి కట్టింది.

హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్ర్తం ఆచార్యులు చిట్టెడి కృష్ణారెడ్డి
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రం ఆచార్యులు చిట్టెడి కృష్ణారెడ్డి

ఓవర్ డ్రాఫ్ట్

వేస్ అండ్ మీన్స్ కింద రుణాలు తీసుకున్నప్పటికీ, మినిమం బ్యాలెన్స్ రూ. 1.94 కోట్ల కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కింద అప్పులు చేసే వీలుంటుంది.

కాగ్ నివేదిక ప్రకారం 2022-23 సంవత్సరంలో ఓవర్ డ్రాఫ్ట్ కింద ఏపీ రూ. 57,066 కోట్ల అప్పులు చేసింది.

ఇలా 152 రోజులపాటు ఓవర్ డ్రాఫ్ట్‌లో పడింది.

మొత్తంగా చూస్తే ఓవర్ డ్రాఫ్ట్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్ కలిపి 341 రోజులపాటు ఏపీ అప్పులు చేస్తూనే ఉంది.

మొత్తంగా ఒకే ఏడాదిలో రూ. 1,18,039 కోట్లు అప్పులు చేసింది.

అదే ఏడాది మొత్తం అప్పులన్నీ చెల్లించేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.

రాష్ట్రం నడిపించడానికి వీల్లేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లను ఉపయోగించుకొని రుణాలు పొందుతారని చెప్పారు హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రం ఆచార్యులు చిట్టెడి కృష్ణారెడ్డి.

‘‘రాష్ట్రానికి ఆర్థిక వనరులు లభించే మార్గం లేనప్పుడు ఇలాంటి రుణాలకు వెళుతుంటాయి. దీనివల్ల రాష్ట్రం దివాలా తీసిందని అప్పుడే చెప్పలేం కానీ, ఆ దిశగా వెళుతోందని అర్థం చేసుకోవాలి. ఇదొక వార్నింగ్‌గా భావించాలి. మున్ముందు దివాలా తీసేందుకు కారణమయ్యే అవకాశాలున్నాయని గమనించాలి. ‌ఇవన్నీ కూడా స్వల్పకాలిక అప్పులు కావడంతో ఒకసారి తీసుకుని కట్టేసి మళ్లీ తీసుకోవడం జరుగుతుంది. అప్పులు తీసుకుని వేరొక అప్పులు చెల్లించడానికి ఉపయోగిస్తుండవచ్చు’’ అని చెప్పారు.

ఏపీ రెవెన్యూ లోటు

ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చింది?

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. ఇందుకు భారీగా నిధులు అవసరం అవుతున్నాయి.

అమ్మఒడి, రైతుభరోసా, ఆసరా, విద్యా దీవెన సహా 29 కార్యక్రమాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది జగన్ ప్రభుత్వం.

‘‘గత అయిదేళ్లలో మన ప్రభుత్వం రెండు లక్షల 55 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఇవి కాకుండా మరిన్ని పథకాల కింద లక్షా 70వేల కోట్లు మీకు అందించాం. మీ కొడుకుగా ఇప్పటివరకు 125 సార్లు బటన్ నొక్కి రెండు లక్షల 55వేల కోట్లు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాను అని చెబుతున్నా’’ అని ఇటీవల రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్.

ఇంత భారీ స్థాయిలో నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపడా లేదు. దీనివల్ల ఎక్కువ రోజులపాటు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించింది వైసీపీ ప్రభుత్వం.

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం, 2019 జూన్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో రూ.2,54,894 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం వేసింది.

ఇవి కాకుండా వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1,70,873కోట్లను అందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటిల్లో విద్యార్ధులకు కంప్యూటర్ ట్యాబెట్ల పంపిణీ, ఉపకారవేతనాలు, రుణాలు, సబ్సిడీ బియ్యం వంటి పథకాలున్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో నేరుగా డబ్బు పంపిణీ పథకాలతో రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి.

దీనివల్ల రెవెన్యూ లోటు పెరుగుతూ వచ్చింది.

‘‘పథకాలు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేవి అయినప్పటికీ, కొన్నిసార్లు అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేవి కాకపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వంపై భారం పడుతుంది. ఆదాయాన్ని తెచ్చే లేదా పెంచే కార్యక్రమాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తే దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. ఏపీలో కొన్ని పథకాలు గమనిస్తే, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి కాకుండా భారం మోపుతున్నట్లుగా అర్థం అవుతుంది’’ అని చెప్పారు చిట్టెడి కృష్ణారెడ్డి.

ఆంధ్రప్రదేశ్ చెల్లిస్తున్న వడ్డీ

ఎఫ్ఆర్‌బీఎం పరిమితులు ఏం చెబుతున్నాయి?

ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్ఆర్‌బీఎం) చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు.

దీని ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎంత ఉండాలనే నిబంధన ఉంటుంది. వీటి పరిమితి దాటేందుకు వీలుండదు.

ఎఫ్ఆర్‌బీఎం చట్టానికి, 2021 సంవత్సరంలో పరిమితులు రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

2005లో తెచ్చిన చట్టంలోని నాలుగో భాగంలోని డి క్లాజును మార్చేసింది. అదనంగా అప్పులు తీసుకునేందుకు వీలుగా 90 శాతం ఉన్నచోట 180 శాతంగా మార్చింది.

కానీ, అప్పులు తెచ్చి కూడా అభివృద్ధికి వెచ్చించడం లేదని కాగ్ నివేదికలో పేర్కొంది.

2022-23 సంవత్సరంలో రూ.67,985 కోట్ల రుణాల్లో రూ.9,017 కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు చేసింది.

కాగ్ నివేదిక ప్రకారం చూస్తే, 2021-22 నుంచి 2030-31 మధ్య కాలంలో రూ.3,47,944 కోట్ల అప్పును ఏపీ తీర్చాల్సి ఉంటుంది.

ఇందులో అసలు, వడ్డీని తీర్చడానికే ఏడాదికి రూ.40 వేల కోట్లను వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు నివేదించింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2020-21 నుంచి 2023-24 మధ్య అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, అంతిమంగా అప్పుల భారం ప్రజలపైనే పడుతుందనడంలో సందేహం లేదు.

‘‘నాన్ టాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి చూడాలి. అప్పుడు కొంతవరకు అప్పుల ‌‍భారం తగ్గుతుంది. అలాగే సంక్షేమ పథకాల ద్వారా అనవసర ఖర్చులు తగ్గించుకోగలిగితే ఆదాయ సుస్థిరత సాధించే వీలుంటుంది’’ అని చిట్టెడి కృష్ణారెడ్డి బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)