ఆంధ్రప్రదేశ్: ధనవంతులైన ఎంపీల వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతుందా?

ఫొటో సోర్స్, AP SPECIAL STATUS CAMPAIGN
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు దక్కించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడి ఉంది. రైల్వే జోన్, ప్రత్యేక హోదా.. ఇలా చాలా అంశాలపై ఏ పార్టీ ఎంపీ కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. పార్టీలే బీజేపీకి అనుకూలంగా ఉండడం ఒక కారణం అయితే, మాట్లాడగలిగే ఎంపీలు లేకపోవడం మరో సమస్య.
ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఎంపీలు అత్యంత ధనవంతులుగా, బడా వ్యాపారవేత్తలుగా ఉండడం వల్ల వారు గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారనేది ప్రధాన ఆరోపణ. తాజాగా గల్లా జయదేవ్ వ్యవహారం దానికి ఊతం ఇచ్చింది.
పార్లమెంట్‌లో అత్యంత ధనవంతులైన ఎంపీల్లో ఒకరైన తెలుగు దేశం పార్టీకి చెందిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
ఈ విషయంలో జయదేవ్ ఒక విషయాన్ని అంగీకరించారు. తాను మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో అందుబాటులో లేననీ, అయినప్పటికీ గుంటూరు కోసం దిల్లీలో చేయాల్సిందంతా చేస్తున్నానని ఒప్పుకున్నారు.
బడా పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉండడం వల్ల వచ్చే సమస్యల్లో ఇదొకటి.
అయితే జయదేవ్ కాస్త నిజాయితీగా తాను ఏం చేసింది, ఏం చేయలేకపోతున్నదీ బహిరంగంగా ప్రజలకు చెప్పి, రాజకీయాలకు విరామం ప్రకటించారు.
లోక్ సభలో చివరిసారి ప్రసంగించిన ఆయన రాజకీయాలు, వ్యాపారం అనే రెండు పడవల్లో ఒకేసారి ప్రయాణించడం సులభం కాదన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Jayadev Galla
కొద్ది రోజుల క్రితం ఆయన నియోజకవర్గం గుంటూరులో పెట్టిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ప్రస్తుతం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేదు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపై నిఘా పెడుతున్నారు. పార్లమెంటులో ప్రశ్నించకుండా ఉండలేం. ప్రభుత్వాలతో ఇబ్బందని పార్లమెంటులో మౌనంగా ఉండలేను. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను’’ అని జయదేవ్ చెప్పారు.
‘‘ఆంధ్రాలో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కంపెనీలు పెడుతున్నాం. రెండింటికీ న్యాయం చేయలేను. నన్ను కేంద్ర, రాష్ట్రాలు టార్గెట్ చేశాయి. అయినా తట్టుకున్నా. వ్యాపారాల్లో పెట్టే ఇబ్బందులను కోర్టుల ద్వారా ఎదుర్కొంటున్నాం’’ అని జయదేవ్ ఆరోపించారు.
అంతకు మించిన తీవ్ర ఆరోపణలు కూడా జయదేవ్ చేశారు. ‘‘లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంలో మాట్లాడాను. తర్వాత నాపై ఈడీ విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి. నాపై నిఘా పెట్టారు’’ అని అన్నారు.
జయదేవ్ ఒక్కరే కాదు. ఆంధ్రా నుంచి చాలా మంది వ్యాపారులు ఎంపీలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో వ్యాపారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఆ సంఖ్య ఆంధ్రా నుంచి చాలా ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో ఆంధ్రా నుంచి బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నడిపే వారు ఎంపీలు అవుతున్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం దూకుడుగా వెళ్లే వారు తక్కువ.

ఫొటో సోర్స్, Facebook/Alla Ayodhya Rami Reddy
రెండు సభల్లోనూ దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీలు తెలుగువారే
ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత ధనవంతులైన ఎంపీలలో ప్రస్తుతం మొదటిస్థానంలో ఆళ్ల అయోధ్యరామి రెడ్డి ఉన్నారు. మొత్తం దేశంలోనే ధనవంతులైన ఎంపీల్లో రెండో స్థానం ఆయనది. మొదటిస్థానం తెలంగాణకు చెందిన పార్థసారథి రెడ్డిది. లోక్‌సభలో గల్లా జయదేవ్, కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆళ్ల అయోధ్యరామి రెడ్డి టాప్ 5 ధనవంత ఎంపీల్లో ఉన్నారు.
ఇక కేశినేని నాని, ఆదాల ప్రభాకర రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ వంటి వారు చాలా మందే ఉన్నారు. ఇక పెద్దల సభలో సుజనా చౌదరి కూడా రాష్ట్రానికి చెందిన ధనవంతులైన ఎంపీల్లో ఒకరు.
గత లోక్‌సభలో గల్లా జయదేవ్ టాప్ 1గా ఉంటే, గోకరాజు గంగరాజు, బుట్టా రేణుకలు అత్యంత ధనవంత జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంతకుముందు నామా నాగేశ్వర రావు దేశంలో రిచెస్ట్ ఎంపీ అయితే, లగడపాటి మూడవ రిచెస్ట్ ఎంపీగా ఉండేవారు.
గతంలో రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఎస్పీవై రెడ్డి, మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, టీజీ వెంకటేశ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి, టి సుబ్బరామిరెడ్డి ఇలా పెద్ద జాబితాయే ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం రెండు సభల్లోనూ దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీలు తెలుగువారే.
ఈ దశాబ్దంలో టీడీపీ, టీఆర్ఎస్, వైయస్సార్సీపీ ఎంపీలే ముందు నుంచీ సంపన్న ఎంపీల జాబితాలో ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రా నుంచి 25 శాతం ఎంపీలకు వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
కోటీశ్వరులైన ఎంపీలు కొందరు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వారిని మినహాయిస్తే, మిగతా వారు మాత్రం, రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం కేంద్రంతో కొట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ప్రాంతీయ పార్టీలు కేంద్రం విషయంలో భయంతో ఉండాలన్న నిబంధన పాటించడంతో పాటూ వ్యక్తిగత స్థాయిలో వ్యాపారాలకు చేటు అనే భయం కూడా వీరిలో ఉంది.

ఫొటో సోర్స్, LOKSABA TV
‘వ్యాపార ప్రయోజనం కోసమే రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది’
చాలామంది రాజకీయ నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టి వారిని తమవైపు తిప్పుకుంటున్నారన్న ఆరోపణ బీజేపీపై ఎప్పట్నుంచో ఉంది. తాజాగా జయదేవ్ వ్యాఖ్యలు అందుకు ఊతం ఇచ్చాయి. అవిశ్వాసంపై మాట్లాడిన వెంటనే ఆయనను ఈడీకి విచారణకు పిలవడం దీనికి సంకేతంగా కనిపిస్తోంది.
ఇప్పుడే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా విభజన తరువాత ఆంధ్రాకు రావాల్సిన వాటి విషయాల్లో పట్టుదలకు పోకుండా ఉన్నారన్న అపవాదు అప్పటి ఎంపీలపై ఉంది.
అప్పటి లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువ మంది వ్యాపారస్తులే ఉండేవారు. వారిలో లగడపాటి రాజగోపాల్ మినహాయింపు. మిగతా వారు ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడిన దాఖలాలు కనిపించవు.
రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయడం వేరే. కానీ, వ్యాపారులు తమ వ్యాపార ప్రయోజనం కోసమే రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.
‘‘పూర్వం కూడా డబ్బున్న ఎంపీలు ఉండేవారు. కానీ వారు ఒక అలంకారంగా వస్తుండేవారు. ఏదో ఒక సోషల్ ఎచీవ్‌మెంట్ కింద వచ్చేవారు. ఎవర్ని బాధపెట్టకుండా తమ వ్యాపారం దెబ్బతినకుండా సాఫ్ట్‌గా ఉండేందుకు ప్రయత్నం చేసేవారు. డబ్బున్న వారు రాజకీయాల్లోకి ఒక అలంకారంలా వచ్చి వెళ్లవచ్చు. కానీ దుందుడుకుగా ఉంటే వ్యవస్థ సహించదు. వెంటనే దాడి చేస్తారు. ఆఫ్రికా, థాయిలాండ్ వంటి దేశాల్లో అయినా ఇదే కనిపిస్తుంది’’ అని విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు బీబీసీతో అన్నారు.
‘‘జయదేవ్ అందుకు మినహాయింపు కాదు. వీరంతా తమ సొంత ప్రయోజనాల కోసమే వస్తున్నారు. వారికి తమ వ్యాపారం పెరగడం, ఈగో తృప్తి చెందడం, తాము కూడా సెలబ్రిటీ నెట్‌వర్క్‌లో భాగం కావడం కోసం చూస్తారు. సేవే చేయాలంటే బయటి నుంచే చేయవచ్చు. చాలా కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయి. ఒకవేళ అగ్రెసివ్ పాలిటీషియన్‌గా ఉండాలంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే మిగిలిన రాజకీయ నాయకులు వారిపై ఎటాక్ చేస్తారు’’ అని అన్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.
‘‘ఆంధ్రాలో ధనవంతులైన ఎంపీల సంఖ్య పెరుగుతూ వస్తోంది కాబట్టి, అధికారంలో ఉన్నవారితో వారు ఎక్కువ ఆవేశంగా ఉండరు. భయపడతారు. అందుకే ఏపీకి కావాల్సినవి తీసుకురాలేరు. కాంట్రాక్టర్లు, మైనింగ్ వ్యాపారులు వాళ్ల ప్రయోజనాలు చూసుకుంటున్నారు. రాష్ట్రం సంగతి చెప్పనక్కర్లేదు. డబ్బు ఇచ్చి ఓట్లు కొంటున్నారు. ఓట్లతో పాటూ పలుకుబడి కొంటున్నారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘చాలా మంది ధనిక ఎంపీలకు రాజకీయాలు పూర్తి స్థాయి వృత్తి కాదు’
‘‘గతంలో కూడా ధనవంతులు ఉండేవారు కానీ ఎక్కువ మంది రాజ్యసభలో ఉండేవారు. పార్టీలకు కావాల్సిన డబ్బు కోసం పార్టీలే వ్యాపారులను చేరదీసేవి. తమ వ్యాపారానికి రాజకీయం అనే దాన్ని తాయత్తులాగా కట్టుకు కూర్చునే వారు. అది ఉంటే ఎవరూ తమను తాకలేరు అని. అధికార పార్టీ వారికి రక్షణ వలయంలా ఉంటుంది’’ అని భండారు శ్రీనివాస రావు బీబీసీతో అన్నారు.
‘‘అప్పట్లో కూడా రాజకీయాల్లో ధనవంతులు ఉండేవారు కానీ ఇంతలా కాదు. అప్పుడప్పుడు ఒకరు కనిపించేవారు. కానీ, ఇప్పుడు అంతా సంపన్నులే ఉంటున్నారు. వారికి పైరవీలు తొందరగా అవుతాయి. లీడర్ల దగ్గరకు నేరుగా వెళ్లగలుగుతారు. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి దాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లో చేరేవారు, సామాన్యులుగా మొదలై రాజకీయాల ద్వారా సంపాదించి దాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లో కొనసాగేవారూ.. ఇలా అందరూ ఉన్నారు’’ అని అన్నారు భండారు శ్రీనివాస రావు.
అటు నియోజకవర్గ స్థాయిలో కూడా ధనవంత ఎంపీల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది ధనిక ఎంపీలకు రాజకీయాలు పూర్తి స్థాయి వృత్తి కాదు. దీంతో ప్రజలకు వారిని కలవడం అనేది అంత తేలిక కాదు. చాలా సందర్భాల్లో వారి ప్రతినిధులతోనే వ్యవహారాలు నడుస్తుంటాయి’’ అని చెప్పారు.
ఈ డబ్బున్న వారి ఎంపీ హోదా ఎంత స్థాయికి వెళ్లింది అంటే రిలయన్స్ గ్రూపు ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితులైన వ్యక్తి పరిమళ్ నత్వానీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపించింది. ఆయనకు ఆంధ్రాకు సంబంధం ఏంటో? రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఆయన ఏం పోరాడారో ఎవరికీ తెలియదు.
గతంలో ఝార్ఖండ్ నుంచి ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎంపీగా ఉన్న పరిమళ్ నత్వానీ రిలయన్స్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
‘‘పరిమళ్ నత్వానీ రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రాకు చిన్న సాయమైనా అయినా చేశారా? కనీసం మనం అడగడానికి కూడా లేదు. పైగా ఆయనిక్కడ ఎవరి మాట వినరు. ఎందుకంటే ఆయనకు పదవి ఎవరి వల్ల వచ్చిందో వారి మాటే వింటారు. ఒక ఎంపీ ఇంటిపై మూడు రోజులు కేంద్ర సంస్థలు దాడులు చేశాయి. బలవంతంగా లాకర్లు కూడా ఓపెన్ చేయించారు. కానీ ఆయన అధికార పార్టీలో చేరగానే అంతా సైలెంట్ అయిపోయింది’’ అని శ్రీనివాస రావు అన్నారు.
‘‘గల్లా జయదేవ్ ఇప్పుడు రాజకీయాలకు హాలిడే ప్రకటించారు. బహుశా ఆయనకు కొత్తగా ప్రయోజనం ఏమీ కనిపించలేదేమో. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన వారు బాగానే ఉన్నారు. వాళ్ల నెత్తిమీద కత్తిలేదు ’’ అని శ్రీనివాస రావు చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సమస్య, విశాఖపట్నం రైల్వే జోన్ సమస్య, వెనుకబడిన జిల్లాల అదనపు నిధుల సమస్య.. ఇలా రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కేంద్రంలో అడిగే వారు లేరు. జయదేవ్ తన సంగతి బహిరంగంగా చెప్పారు. మిగతా వారు చెప్పరు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే...
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- మాంసం బియ్యం: ఈ హైబ్రిడ్ బియ్యం తింటే, మాంసం తిన్నట్లే...
- హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మకు మరోసారి టీ20 కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఇదేనా?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














