శ్రీకాకుళం: ‘ఎస్టీలు’గా గుర్తింపు కోసం 20 ఏళ్లుగా పోరాడుతున్న వీరు ఎవరు? వీరికి సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమిటి?

బెంతు ఒరియా
ఫొటో క్యాప్షన్,
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, పాతపట్నం మండలాల్లో ‘బెంతు ఒరియా’ కులస్థులుగా చెప్పుకొనేవారు వేల మంది కనిపిస్తారు.

అధికారులు కుల ధ్రువీకరణపత్రాల్లో వీరిని ‘ఒరియా’ అనే ఓసీ కులంగా చూపిస్తున్నారు. ఈ ప్రజలేమో తాము బెంతు ఒరియా కులస్థులమని, గిరిజనుల కిందకు వస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వాలు తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ వీరు 20 ఏళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందడం లేదని వీరు అంటున్నారు.

వీళ్లు ఎస్టీ కాదని, వీరిని ఎస్టీలుగా ధ్రువీకరిస్తే గిరిజనులకు అన్యాయం చేసినట్లేనని కొన్ని గిరిజన సంఘాలు అభ్యంతరం చెప్తున్నాయి.

బెంతు ఒరియాలు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? వాటిని ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు? వీరిని ఎస్టీలుగా గుర్తించొద్దని గిరిజన సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయి? ఈ సమస్య ఎక్కడ మొదలైంది? దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమిటి, అది అమలైందా?

బెంతు ఒరియా

బెంతు ఒరియాలు ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌లోని కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, పాతపట్నం ప్రాంతం ఒకప్పుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాగా ఉండేది.

ఈ ప్రాంతంలోనే బెంతు ఒరియాలు ఉండేవారు. వీరు ఏజెన్సీ ప్రాంతానికి దిగువన కనిపిస్తారు.

ఒడిశా రాష్ట్రం ఏర్పాటు, ఆ తర్వాత జిల్లాల విభజనలో బెంతు ఒరియాలైన తమ పూర్వీకులు శ్రీకాకుళం ప్రాంతంలో ఉండిపోయారని ‘బెంతు ఒరియాల యువజన సంఘం’ నాయకుడు సుమన్ బిసాయ్ బీబీసీతో చెప్పారు.

“1973 నుంచి 2003 వరకు ఎస్టీలుగా గుర్తిస్తూ మాకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. వివరంగా చెప్పాలంటే- 1973-76, 1981-88, 1999-2003 మధ్య కాలంలో మాకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో, ఆ సమయంలో మమ్మల్ని గిరిజనులుగా గుర్తిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం, ఆ తర్వాత ఆపేయడం పరిపాటిగా మారింది. కానీ, 2003 తర్వాత నుంచి ఇప్పటివరకు ఏ సర్టిఫికెట్లు ఇవ్వలేదు’’ అని సుమన్ బిసాయ్ చెప్పారు.

తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ- బెంతు ఒరియాల సమస్య తనకు తెలుసని, దీనిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

జగన్ ప్రకటన మేరకు బెంతు ఒరియాల సమస్యపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మ ఆధ్వర్యంలో 2019లో ఏకసభ్య కమిషన్ ఏర్పాటైంది.

అయితే ఇప్పటికీ తమ సమస్య అలాగే ఉందని ‘బెంతు ఒరియాల సంఘం’ మరో నాయకుడు బృందావన్ బీబీసీతో చెప్పారు.

పత్రం

ఫొటో సోర్స్, UGC

ఎవరో తప్పు చేస్తే మాకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు: సంఘం

దశాబ్దాలుగా పోరాడుతున్నా తమకు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయడం లేదంటూ బెంతు ఒరియాలుగా చెప్పుకొనే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం తమను షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)గా గుర్తిస్తూ సర్టిఫికేట్లు ఇస్తామని అంటారని, ఆ తర్వాత ఇవ్వరని వారు విమర్శిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు 25 వేల మంది ఉన్నారని వారు చెబుతున్నారు.

‘‘బ్రిటిష్‌ పాలన నుంచే మేం గిరిజనులం. మా తాతలు, తండ్రులు అంతా గిరిజనులుగా ధ్రువపత్రాలు కూడా పొందారు. కానీ, 2003 నుంచి మాకు గుర్తింపు నిలిపివేశారు. 1992లో కుల గుర్తింపు కోసం మా పెద్దలు 100 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి గుర్తింపు కల్పించింది.

మేం 1951లో ఓటర్ల జాబితాలో ఉన్న బెంతు ఒరియాల సంతతికి చెందినవారా, కాదా అని పరిశీలించాలని జీవోలో సూచించారు. దీంతో 2003 వరకు ఎస్టీలుగానే కొనసాగాం’’ అని సుమన్ బిసాయ్ చెప్పారు.

‘‘1950 నుంచి బెంతు ఒరియాలను భారత్ గెజిట్‌లో గిరిజనులుగా గుర్తించారు. ఇందులో క్రమ సంఖ్య 17లో బెంతు ఒరియాలు గిరిజనులుగా స్పష్టంగా ఉంటుంది. కానీ ఏపీలో ఎస్టీలుగా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. 2005లో కొందరు వ్యక్తులు బెంతు ఒరియాలమంటూ దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారని, దాన్ని సాకుగా చూపిస్తూ మాకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అదే విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని అడిగితే అధికారులు ఇవ్వడం లేదు’’ అని ‘బెంతు ఒరియాల సంఘం’ నాయకుడు జైసాన్ బిసాయ్ అన్నారు.

బెంతు ఒరియా

దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారిని తొలగించాలి: ఆదివాసీ సంఘం

శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలమని చెప్పుకుంటూ కొందరు ఎస్టీ సర్టిఫికెట్లు పొందాలని చూస్తున్నారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేయవద్దని కొన్ని గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేనే లేరని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

‘‘1979లో విజయనగరం ఏర్పడక ముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొద్ది మంది బెంతు ఒరియాలు ఉండేవారు. విజయనగరం జిల్లా ఏర్పాటుతో బెంతు ఒరియాలు విజయనగరం జిల్లా సాలూరుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నవారంతా బెంతు ఒరియాలుగా చెప్పుకొనే బీసీలైన వడ్డి కులస్థులు’’ అని యోగేశ్వరరావు ఆరోపించారు.

బెంతు ఒరియాలమంటూ ఇప్పటికే రెండు వేల మంది నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొంది పలు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి సర్టిఫికెట్లు రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

‘‘ఇలా ఎస్టీలుగా వేరే కులాలు, జాతుల వారు సర్టిఫికెట్లు పొందితే నిజమైన ఆదివాసీల మనుగడకు ముప్పు వస్తుంది. పార్టీలు ఓట్ల కోసం ఆదివాసీలను దగా చేస్తూ గిరిజనేతరులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం న్యాయం కాదు’’ అని ఆదివాసీ జేఏసీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబు అన్నారు.

గిరిజన సంఘాల ఆందోళనల్ని ‘బెంతు ఒరియాల సంఘాలు’ ఖండిస్తున్నాయి.

కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, పాతపట్నం మండలాల్లో నివసించే వారికి ప్రభుత్వ నిబంధనల మేరకే గతంలో బెంతు ఒరియాలుగా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇప్పుడు మాత్రం ఏవో సాకులు చెప్పి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ‘బెంతు ఒరియాల సంఘం’ నాయకుడు బృందావన్ విమర్శించారు.

బెంతు ఒరియా

రెండు ఏకసభ్య కమిషన్‌లు

2019లో పలాస సభలో సీఎం జగన్ ప్రకటన మేరకు- బెంతు ఒరియాల సమస్యపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటైంది.

2022లో జీవో నంబర్‌ 52 ద్వారా శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌తో మరో ఏకసభ్య కమిషన్‌ను నియమించారు. ఈ జీవో ద్వారా బెంతు ఒరియాలతోపాటు బోయ, వాల్మీకి కులాలపైనా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

శ్రీకాకుళంలోని బెంతు ఒరియాలు ఎస్టీలా, కాదా అనే అంశంపై ఆంధ్రా యూనివర్శిటీ ఆంత్రోపాలజీ విభాగం ప్రొఫెసర్ సత్యపాల్ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

పీడిక రాజన్న దొర
ఫొటో క్యాప్షన్, ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర

మంత్రి: వాళ్లు ఎస్టీలే, కానీ తేలాల్సింది ఇదీ

ఈ వివాదంపై రోజూ తమకు నివేదికలు అందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర బీబీసీతో చెప్పారు.

‘‘బెంతు ఒరియాలు ఎస్టీలే. అందులో అనుమానం లేదు. కానీ ఇప్పుడు కవిటి, కంచిలి, పాతపట్నం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో నివపిస్తున్న వారు ఎస్టీలైన బెంతు ఒరియాలా లేదా వేరే కులస్థులా అనే దానిపై వివాదం ఉంది. దీన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లు వేసింది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అధ్యయనం కూడా చేయించింది’’ అని ఆయన అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బెంతు ఒరియాలు ఎస్టీలు కాదని 2019లో నియమించిన జేసీ శర్మ కమిషన్‌ తన నివేదికలో తెలిపిందని ఆయన చెప్పారు. కొందరు బెంతు ఒరియాల పేరుతో ఎస్టీ సర్టిఫికేట్లు పొందారని కమిషన్ చెప్పిందన్నారు.

‘‘ఏయూ ఆంత్రోపాలజీ విభాగం ప్రొఫెసర్ సత్యపాల్ కూడా ఈ సమస్యపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే బెంతు ఒరియాలు ఎస్టీలని, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న బెంతు ఒరియాలు ఎస్టీలు కాదని ఆయన అందులో రాశారు. తాజాగా ప్రభుత్వం శామ్యూల్ ఆనంద్ కుమార్ కమిషన్‌తో మరో స్టడీ చేయిస్తోంది. దీని రిపోర్టు వచ్చిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది” అని రాజన్న దొర చెప్పారు.

ప్రభుత్వం చేయిస్తున్న అధ్యయనాలు, కమిషన్ల నివేదికలు అన్నీ కలిపి పరిశీలించి, శాసనసభలో చర్చ జరిపి, వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)