తూర్పు గోదావరి: ‘అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.. విగ్రహాన్ని తొలగించి తహసీల్దార్ ఆఫీసులో పడేశారు’

దళిత మహిళలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"మా పిల్లలు టిఫిన్ తెచ్చుకోవాలి. కానీ అక్కడికి వెళ్తే మీకు టిఫిన్ ఇవ్వమని అంటున్నారు. ఏ సరుకు కావాలని వెళ్లినా ఇవ్వమనే చెబుతున్నారు. టెంట్ హౌస్ నడుపుతున్న ఓ ఎస్సీ యువకుడి మీద నిషేధం పెట్టారు. ఎవరైనా అతని టెంట్ హౌస్ సామాగ్రి వాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కూలీ పనులు లేవు. చివరకు మా కోసం కొన్ని సంఘాల నాయకులు పంపించిన కిరాణా సరుకులు కూడా మాకు ఇవ్వనీయలేదు" అని విప్పర్తి చందు అనే యువకుడు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయనది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం గ్రామం.

గోకవరం మండలానికి చెందిన ఈ గ్రామంలో ప్రస్తుతం దళితుల పట్ల సాంఘిక బహిష్కరణ కొనసాగుతోంది.

పంచాయతీకి చెందిన స్థలంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం ఈ వివాదానికి మూలం.

విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దానిని తొలగించారు. తొలగింపును అడ్డుకున్న దళిత యువతపై, మహిళలపై దాడి జరిగింది. పలువురు గాయపడ్డారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి.

ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రాజుకున్న వివాదం ఎస్సీ పేట ప్రజల మీద సాంఘిక బహిష్కరణకు దారి తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆ గ్రామాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. సాంఘిక బహిష్కరణకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు.

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు

20 రోజులుగా వివాదం

తిరుమలాయపాలెం మండల పరిషత్ స్కూల్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహా ఇతరుల విగ్రహాలున్నాయి.

కానీ, అందులో అంబేడ్కర్ విగ్రహం మీద కొన్ని రోజుల కిందట దాడి జరిగింది. ఎవరు చేశారన్నది ఇప్పటికీ తెలియలేదు.

దాని మీద స్థానికంగా ఉన్న ఎస్సీ యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

వేసవి సెలవుల్లో జరగడం వల్ల తగిన ఆధారాలు లేవని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.

ఈ ఘటన తర్వాత ఎస్సీ పేటకు వెళ్లే మార్గంలో మరో విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎస్సీ యువత ప్రయత్నించింది.

జూన్ 9న ఆ విగ్రహావిష్కరణ జరిగింది. పంచాయతీకి సంబంధించిన స్థలంలో దాన్ని ఏర్పాటు చేశారు.

విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఎక్కువగా కాపులు నివసిస్తున్నారు.

దాంతో మా ఇళ్లకు సమీపంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు వద్దని వారు అభ్యంతరం తెలిపారు.

దాంతో రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. కాపుల అభ్యంతరాలు పట్టించుకోకుండా ఎస్సీ పేటకు చెందిన వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహం పెట్టడం ఘర్షణకు దారి తీసింది.

దెబ్బతిన్న విగ్రహం

పోలీసుల మీద ఆరోపణలు

అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన వివాదం ముదురుతోందనే సమాచారంతో జూన్ 10న పోలీసు బలగాలు తిరుమలాయపాలెం వచ్చాయి.

రెండు వర్గాల వారితో పోలీసులు చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు.

పంచాయతీ స్థలంలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటుపై గ్రామంలో మెజార్టీ ప్రజలు అభ్యంతరం చెబుతున్నారు.

అదే సమయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించకూడదంటూ ఎస్సీలు కూడా అక్కడే బైఠాయించారు.

10న మధ్యాహ్నం అర్ధరాత్రి వరకూ అక్కడే రెండు వర్గాలు మోహరించాయి.

ఆ తర్వాత ఒక్కసారిగా ఎస్సీల మీద దాడి జరిగింది. కరెంటు తీసేసి తమను కొట్టారని దళిత మహిళలు ఆరోపించారు.

"ఏం జరిగిందో తెలియదు. రాత్రి రెండు గంటలు దాటిపోయింది. మా వాళ్లంతా అక్కడే ఉన్నారని మేము కూడా వెళ్లాం.

మేమంతా రోడ్డు మీద ఉన్నాం. పోలీసులు వచ్చి మీరు రోడ్డు మీద ఎందుకు, అందరూ ఒక చోట ఉండండి అంటే అటు వెళ్లాం. అంతే కరెంటు పోయింది.

ఎవరు కొడుతున్నారో కూడా తెలియదు. చీరలు కూడా లాగేశారు. నా చీర మెడకు చుట్టుకుంది. అప్పుడే నన్ను కొట్టారు. కాలు విరిగిపోయింది" అంటూ బి.సుబ్బలక్ష్మీ అనే మహిళ బీబీసీకి తెలిపారు.

ప్రస్తుతం ఆమె కాలికి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉన్నారు. తమ మీద దాడి జరగడానికి పోలీసులు కారణమంటూ ఆమె ఆరోపించారు.

కాళ్లు విరిగిన మహిళ

మా వాళ్ల మీదనే కేసులు పెట్టారు

తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ఉన్న గోకవరం మండలంలోని పెద్ద గ్రామాల్లో తిరుమలాయపాలెం ఒకటి.

దాదాపు 7 వేలకు పైగా జనాభా ఉంది. 5వేల వరకూ ఉన్న ఓటర్లలో ఎస్సీలు 600 మంది ఉంటారు.

మెట్ట ప్రాంతం కావడంతో వర్షాధారంగా వ్యవసాయం సాగు చేస్తారు.

ముఖ్యంగా చెరువుల మీద ఆధారపడి పంటలు పండిస్తారు.

ఎస్సీలలో అత్యధికులు వ్యవసాయ కూలీలు. ఇటీవల వారిలో విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది.

సమీపంలో రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లి చదువుకుంటున్న వారు 30 మంది వరకూ ఉన్నారు.

చదువుకున్న యువత ఇటీవల కాలంలో అంబేడ్కర్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఎస్సీ పేట మధ్యలో 1999లో ఆవిష్కరించిన అంబేడ్కర్ విగ్రహం ఒకటి ఉంది.

దానికి తోడుగా తమ పేటకు వెళ్లే మార్గంలో గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద మరో విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్సీ యువకులు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది.

పంచాయతీ స్థలంలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం, ఇతరుల అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో వివాదం రాజుకుంది.

"ఆరోజు పోలీసులు వచ్చి మాకు రక్షణగా ఉంటారని అనుకున్నాం. డీఎస్పీ, తహశీల్దార్, ఇతర గ్రామ పెద్దలంతా ఉన్నారు. అయినా మాపైనే దాడి జరిగింది.

మళ్లీ మా పిల్లల మీదనే కేసు పెట్టారు. కాలు విరిగిన నొప్పితో నేను ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే పోలీసులు నా దగ్గర తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నారు. న్యాయం చేస్తామని అన్నారు.

కానీ, అంబేడ్కర్ విగ్రహం పెట్టకూడదని అంటున్నారు. మా విగ్రహం అక్కడే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అది చేసే వరకూ పోరాడతాం. మమ్మల్ని కొట్టి, కేసులు పెట్టినా ఆగబోం" అంటూ దాడిలో గాయపడిన బోయి మహాలక్ష్మి అన్నారు.

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు మీద ఇంత వ్యతిరేకత వస్తుందని అనుకోలేదని, ఖాళీగా ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల రాద్ధాంతం సృష్టించారని ఆమె బీబీసీతో అన్నారు.

అంబేడ్కర్ విగ్రహం

‘న్యాయం చేస్తాం’

తిరుమలాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన వారిపై లాఠీ ఛార్జ్ చేసిన తర్వాత 11వ తేదీ తెల్లవారుజామున విగ్రహాన్ని గోకవరం తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.

జూన్ 26న బీబీసీ వెళ్లినప్పుడు ఆఫీసులోని ఓ మూల ముసుగువేసిన అంబేడ్కర్ విగ్రహం కనిపించింది.

అంతకుముందు పాక్షికంగా దెబ్బతిన్న తిరుమలాయపాలెం స్కూల్లోని విగ్రహం అలానే ఉంది.

వివాదం ముదరడంతో గ్రామంలో సాంఘిక బహిష్కరణ అమలులోకి వచ్చింది.

ఎస్సీపేటకు చెందిన వారికి నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.

దాంతో రాజమహేంద్రవరం నగరంలోని వివిధ ఎస్సీ సంఘాల ప్రతినిధులు సేకరించిన కిరాణా, బియ్యం, ఇతర సరుకుల పంపిణీకి సిద్ధమయ్యారు.

అయితే పోలీసులు ఆంక్షలు విధించి, ఇతర ప్రాంతాల వారిని ఆ గ్రామంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారంటూ రాజమహేంద్రవరంలో ఆందోళనలు నిర్వహించారు.

చివరకు జూన్ 24వ తేదీన ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తిరుమలాయపాలెంలో పర్యటించారు.

ఎస్సీ పేటకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

"అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఇప్పటికీ పోరాటం చేయాల్సి రావడం బాధాకరం. ఇదో చారిత్రక పోరాటం. వారికి న్యాయం చేస్తాం. సాంఘిక బహిష్కరణ విధించిన వారి మీద చర్యలు తీసుకోవాలి.

పాలు అమ్మబోము, కూరగాయలు అమ్మబోము, షాపుకి రావద్దని చెబుతున్నారో వారందరి మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. సోషల్ బాయ్ కాట్ ని ఉపేక్షించేది లేదు. బాధితులకు చట్టపరంగా న్యాయం జరగాలి" అంటూ పోలీసులకు ఆయన బహిరంగంగానే ఆదేశాలు ఇచ్చారు.

ఎస్సీ సంఘాలు సేకరించిన బియ్యం. కిరాణా సరుకులను ఆయన ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

బాధితుల మీద దాడికి పాల్పడిన పోలీసు అధికారుల మీద కూడా చర్యలుంటాయని ఆయన హామీ ఇచ్చారు.

ఎస్సీ కమిషన్ ఆదేశాల తర్వాత గ్రామంలో పోలీసు పికెట్, ఆంక్షలు తొలగించారు. కానీ మఫ్టీలో పోలీసులు తిరుగుతున్నారు.

ముసుగేసిన విగ్రహం

ఎస్సీలపైనే కేసులు

తిరుమలాయపాలెం ఘటనపై పోలీసులు ఎస్సీపేటకు చెందిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేశారు.

పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.

పంచాయతీకి చెందిన సర్వే నెం.183లోని 3సెంట్ల స్థలంలో అక్రమంగా ప్రవేశించి, ప్రహారీ గోడ కొంత వరకూ ధ్వంసం చేయడంతో పాటుగా అనుమతి లేకుండా అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారంటూ 16 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్ లో ప్రస్తావించారు.

వారితో పాటుగా ఇతరులు కలిసి జూన్ 9వ తేదీ రాత్రి పంచాయతీ స్థలం ఆక్రమించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నెం. 205 నమోదయ్యింది.

ఆ మరుసటి రోజు అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడి జరిగిందంటూ ఎం సుబ్రహ్మణ్యం అనే పోలీస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో 9 మంది పేర్లను ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ నెం. 206 కూడా నమోదు చేశారు.

అయితే ఎస్సీల నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని, అందుకే ఎటువంటి కేసులు నమోదు కాలేదని గోకవరం పోలీసులు చెబుతున్నారు.

"వాళ్లకి వాళ్లే పడిపోవడంతో కాళ్లు చేతులు విరిగాయి. ఆ విషయాన్ని వారే చెప్పారు. వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. ఆస్పత్రిలో ఉండగా వారి దగ్గర మేము వాంగ్మూలం తీసుకున్నాం.

దాని ప్రకారమే ఎస్సీలపై వచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి తప్ప, వారి నుంచి మాకు ఫిర్యాదులు రాలేదు. దాంతో రెండు కేసులు మాత్రమే ఉన్నాయి" అంటూ గోకవరం ఎస్సై నాగబాబు బీబీసీకి తెలిపారు.

పోలీసుల మీద ఆరోపణలు తగవని, తాము సమస్య పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్

ఈ ఘటనపై గ్రామంలో కాపు కులానికి చెందిన కొందరితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు స్పందించేందుకు నిరాకరించారు.

గ్రామ సచివాలయంలో ఉన్న ఓ వ్యక్తి తన పేరు చెప్పడానికి నిరాకరిస్తూ ఈ వివాదానికి ఎస్సీ యువకులు కొందరు రెచ్చగొట్టే ధోరణితో సాగడమే కారణమని ఆరోపించారు.

అంతేగాకుండా సాంఘిక బహిష్కరణ లేదని , సమస్య పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

తన పేరు చెబితే సమస్య అవుతుందని, దానికి తాను సిద్ధంగా లేనని, కానీ గతంలో మాదిరిగా అందరూ కలిసి మెలిసి సాగేలా చర్యలుండాలని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ గాయాలతో మంచానికే పరిమితమయిన ఎస్సీలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ వారంతా తొక్కిసలాటలో గాయపడిన వారే తప్ప తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.

కొందరి శరీరాలపై లాఠీ దెబ్బల మచ్చలు కూడా కనిపించాయి. అయినా ఎస్సీల తరపు నుంచి ఫిర్యాదులు లేవంటూ కేసులు నమోదు కాకపోవడం గమనించాల్సిన అంశం.

తొక్కిసలాటలో గాయపడినప్పటికీ చట్టప్రకారం దానికి కారకుల మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరగాలి.

కానీ గోకవరం పోలీసులు మాత్రం అలాంటి అవసరం లేదని చెబుతుండడం పట్ల ఎస్సీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)