చికెన్ ధర అమాంతం పెరిగింది... ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోడి మాంసం ధర బాగా పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కిలో చికెన్ 320-350 వరకూ పలుకుతోంది.
ప్రస్తుతం ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులతో బతికున్న కోడి కిలో 170-200, చర్మంతో 280-300, చర్మం లేకుండా 320-350 వరకూ పలుకుతోంది.
అంటే ఒక్క నెలలోనే దాదాపు వంద రూపాయలు పెరిగింది.
అయితే వేసవి ప్రభావంతో పాటూ రా మెటీరియల్ ఖర్చుల పెరుగుదల కూడా ఈ సారి ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది.
అయితే ప్రతీ ఏటా వేసవి ఉన్నా ఈసారే ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి?
- వేసవిలో కోళ్లు మేత సరిగా తినవు. నీరు ఎక్కువగా తాగుతాయి. దీంతో వాటి పెరుగుదల రేటు తగ్గిపోతుంది.
- అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ 40 రోజుల్లో 2.5 కేజీలు పెరిగే కోడి, ఇప్పుడు మాత్రం 40 రోజుల్లో 2 కేజీల బరువు పెరగడం కూడా కష్టంగా ఉంటుంది.
- కోవిడ్ తరువాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి కాలం ఇదే. ఈసారి వడగాల్పుల తీవ్రత గత రెండేళ్ల కంటే ఎక్కువ ఉందని కోళ్ల పెంపకందార్లు చెబుతున్నారు.
- రవాణాలో, లోడింగ్, అన్ లోడింగ్ దగ్గర కూడా కొన్ని కోళ్లు అత్యధిక వేడి కారణంతో చనిపోతాయి.
- షాపుల్లో కోయడానికి సిద్ధంగా ఉన్న కోళ్లు కూడా వేడికి తట్టుకోలేక మరణిస్తున్నాయి.
- ఈ కారణాల వల్ల వేసవిలో కోడి మాంసం ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది.
- ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ధరల పెరుగుదలకు అది పెద్ద కారణం.
- పైగా ఈసారి వేసవి నిడివి ఎక్కువ కాలం ఉంది.

ఫిబ్రవరి వరకు భారీగా తగ్గిన ధరలు
ఫిబ్రవరి వరకూ కోడి మాంసం ధరలు బాగా పడిపోయాయి. రైతుకు అసలు గిట్టుబాటు కాలేదు. దీంతో పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించారు.
‘‘మొన్నటి ధరల తగ్గుదలలో రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు లైవ్ బర్డ్‌ని ఫామ్ దగ్గర 120-130కి కొంటున్నారు. కానీ మూడు నెలల క్రితం వరకూ కూడా కేజీ కేవలం 62-65కే అమ్మారు. వాస్తవానికి ఒక కేజీ లైవ్ బర్డ్ ఉత్పత్తికే 90 రూపాయల ఖర్చు అవుతుంది.
ఇప్పుడు వచ్చేది కూడా లాభం కాదు. కేవలం గత నష్టాలను పూడ్చుతున్నాం. అంతే. అప్పట్లో అందరూ నష్టాలకు అమ్మాల్సి రావడంతో తక్కువ కోళ్లను పెంచారు.’’ అంటూ తెలంగాణ బ్రాయిలర్ బ్రీడర్స్ అసోసియేషన్ ట్రెజరర్ రవీంద్ర రెడ్డి, బీబీసీకి వివరించారు.
నిజానికి దేశంలో సొంతంగా కోడి పిల్లలు కొని, పెంచి, అమ్మేవారు 20 శాతమే ఉంటారు. వీరు రిస్క్ వ్యాపారం చేస్తారు. మిగిలిన 80 శాతం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌లో ఉంటారు. అంటే వారు ముందుగానే ఏదో ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుని కోళ్లను పెంచుతారు.
షెడ్, లేబర్ మాత్రమే వీళ్లది. కోడి పిల్లలు, మేత, మందులు, వ్యాక్సీన్లు, అంతా కంపెనీలది. కోడి పిల్లల్ని బాగా పెంచితే దానికి ఇన్సెంటివ్, గ్రోయింగ్ కాస్ట్ మాత్రమే రైతులకు వస్తుంది. ఈ పద్ధతిలో రిస్కు తక్కువ ఉంటుంది.
అయితే ఈసారి ఇలా ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ చేసే కంపెనీలు కూడా కోళ్లు పెంచే శాతం తగ్గించాయి. దీంతో మొత్తం మీద ఒక 10 శాతం వరకూ తక్కువ ఉత్పత్తి ఉందని చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన ముడిసరుకు ధరలు
కోళ్ల మేతలో ప్రధానంగా వాడే మొక్కజొన్న ధరలు బాగా పెరిగాయి. ఒక దశలో మొక్క జొన్న 23-27 రూపాయల వరకూ వెళ్లింది. దీంతో కోళ్ల మేత ధరలు పెరిగాయి.
మందులు, వ్యాక్సీన్ల ధరలూ పెరిగాయి. దానికి తోడు కరోనా తరువాత రవాణా చార్జీలు బాగా పెరిగాయి. ఇవన్నీ కలసి కోడి మాంసం ఉత్పత్తి ధరను పెంచేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
శ్రావణ మాసం భయం
తెలంగాణ, మహారాష్ట్రలతో పాటూ చాలా చోట్ల శ్రావణ మాసంలో మాంసం తినరు. దానికితోడు ఈసారి అధిక శ్రావణ మాసం వచ్చింది. అంటే రెండు నెలలు మాంసం తినని వాళ్లు ఉంటారు. ఆ భయానికి కూడా కోళ్ల పెంపకం సంఖ్య తగ్గించారు రైతులు.
ఈ అన్ని కారణాలు కలపి బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి సాధారణం కంటే 30-40 శాతం తగ్గింది. దీంతో అమాంతం రేట్లు పెరిగిపోయాయి.
‘‘దీని వెనుక మార్కెట్ ఫోర్సులు ఉంటాయి. ఉత్పత్తిలో 2-5 శాతం తేడాలు ఉన్నా ధరల్లో మార్పులు వచ్చేస్తాయి. కానీ ప్రస్తుత పెరుగుదల వల్ల రైతులు కూడా ఏమీ బాగుపడటం లేదు. గత నష్టాల రికవరీయే సరిపోతోంది.’’ అని రవీంద్ర రెడ్డి అన్నారు.
పలువురు రైతులు వేసవి తాపం నుంచి కోళ్లను రక్షించడానికి షెడ్లపై నీళ్లు చల్లడం, చుట్టూ చాపలు కట్టి నీళ్లతో చెమ్మ చేయడం, కూలర్లు, స్ప్రింక్లర్లు.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
‘‘ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం చేపడుతోన్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భోజనాలు పెడుతున్నారు. దాంతో డిమాండ్ బాగా పెరిగింది. దాని వల్ల కూడా ధరలు పెరగడానికి ఒక కారణం..’’ అంటూ బీబీసీతో చెప్పారు కరీంనగర్‌కి చెందిన ఒక చికెన్ షాపు యజమాని.
‘‘ధరలు పెరిగాక కేజీ తినేవారు, అరకేజీయే పట్టుకెళ్తున్నారు. అరకేజీ తీసుకునేవారు వంద రూపాయల్ది తీసుకుంటున్నారు. ఎండాకాలం ప్రతిసారీ పెరుగుతుంది. షాపుల్లో చనిపోయే కోళ్లతో కూడా మాకు నష్టమే. అసలు 300 పెట్టి చికెన్ ఎందుకు ఇంకో వంద కలిపి 400 పెట్టి మటన్ కొనుక్కుందామని కొందరు వెళ్లిపోతున్నారు.’’ అని బీబీసీతో అన్నారు హైదరాబాద్ బేగంపేటలోని డాల్ఫిన్ చికెన్ షాపు యజమాని మయూర్.
ఇవి కూడా చదవండి:
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్... కీమో థెరపీకి బదులుగా సరికొత్త టాబ్లెట్
- కొలంబియా అమెజాన్ అడవులు: 'విమానం కూలిపోతుంటే, అమ్మే మమ్మల్ని పారిపోయి ప్రాణాలు కాపాడుకోమంది'
- రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం
- కోవిడ్ డేటా లీక్: ‘వ్యాక్సీన్ వేయించుకున్నవారి ఫోన్, ఆధార్, పాన్ నంబర్లు టెలిగ్రామ్‌లో’.. ఈ వార్తలపై ప్రభుత్వం ఏమంది?
- ఆమె చనిపోయారనుకున్నారు.. శవపేటికలో పెట్టాక ఊపిరి ఆడుతూ కనిపించింది
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














