మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మనలో చాలా మంది రోజూ పాలు తాగుతుంటారు. పాలతోపాటు పెరుగు, టీ లాంటివి మన జీవితంలో భాగమైపోయాయి.
ఆరోగ్యానికి పాలు చాలా మేలు చేస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, ఎముకలు, దంతాలు గట్టి పడతాయి.
పాలతో శరీర జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఇంట్లో పెద్దవారు చెబుతుంటారు.
పాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2001 నుంచి ఏటా జూన్ 1ని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారం, వ్యవసాయం సంస్థ(ఎఫ్‌ఏవో) ‘ప్రపంచ పాల దినోత్సవం’గా పాటిస్తోంది.
అయితే, పాలు తాగాల్సిన విధంగా తాగడం లేదంటూ ఈ మధ్య యూట్యూబ్‌లో చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా, పచ్చిపాలను తాగాలని సూచిస్తున్నారు.
మరి, పచ్చి పాలు తాగాలా, లేదా కాచిన పాలు తాగాలా? ఈ రెండింటికీ తేడా ఏమిటి? ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది వెంటాడుతున్నాయి. వీటికి సమాధానాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
పాలు వేడి చేస్తే ఏమవుతుంది?
పాలలో కాల్షియం, పొటాషియం, విటమిన్-డీతోపాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే వీటిలో కొన్ని విటమిన్లు ‘‘హీట్ సెన్సిటివ్’’ ఉంటాయి. అంటే, పాలను వేడిచేస్తే వీటి స్థాయులు స్వల్ప మొత్తంలో తగ్గుతాయి.
ఇక్కడ వేడి చేయడం అంటే ఇంట్లో వేడిచేయడం మాత్రమే కాదు. పాశ్చరైజేషన్ కూడా వేడి చేయడం కిందకే వస్తుంది.
పాలలోని సూక్ష్మజీవులను హతమార్చేందుకు నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడాన్నే పాశ్చురైజేషన్ అంటారు. సాధారణంగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పాశ్చరైజేషన్ విధానాన్ని లూయీ పాశ్చర్ 1864లో కనిపెట్టారు. బీర్, వైన్‌లను దీర్ఘకాలం పాడవకుండా చూసేందుకు ఆయన ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత పాలను కూడా పాడవకుండా చూసేందుకు పాశ్చరైజ్ చేయడం మొదలుపెట్టారు.
20వ శతాబ్దం మొదట్లో పాల వినియోగం చాలా పెరిగింది. టీబీ, టైఫాయిడ్, స్కార్లెట్ ఫీవర్, డిఫ్తీరియా లాంటి చాలా వ్యాధులు కూడా పాల ద్వారా వ్యాపించేవి.
పాశ్చరైజేషన్‌తోపాటు డెయిరీ పరిశ్రమల నిర్వహణలో మార్పులతో చాలా వరకు ఈ వ్యాధులకు అడ్డుకట్ట పడింది.
అయితే, పాశ్చరైజేషన్‌తో పాలలో పోషకాలు తగ్గిపోతాయా?
ఈ విషయంపై కెనడాలోని సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ జూనోసిస్ పరిశోధకులు ఒక అధ్యయనం చేపట్టారు.
పాశ్చరైజేషన్‌తో పాలలో పోషకాలపై పెద్దగా ప్రభావం పడదని ఈ అధ్యయనంలో తేలింది. విటమిన్ బీ2 మినహా, పోషకాల స్థాయుల్లో పెద్ద తేడా ఉండదని వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
పచ్చి పాలలో మంచి బ్యాక్టీరియా ఉంటుందా?
పచ్చి పాలలో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పచ్చిపాలను తాగాలని సూచిస్తున్నారు.
పాలను వేడి చేసినా, లేదా పాశ్చరైజేషన్ చేసినా ఈ బ్యాక్టీరియా చనిపోతుందా? దీనిపై సెర్బియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ నోవిసాడ్ నిపుణులు ఒక అధ్యయనం చేపట్టారు.
పచ్చి పాలలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. పాలను వేడి లేదా పాశ్చరైజ్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుందని వెల్లడైంది.
అయితే, హానికారక చెడు బ్యాక్టీరియా మరణించడానికి పాలను తప్పనిసరిగా వేడి, లేదా పాశ్చరైజ్ చేయాలని ఇందులో నిపుణులు సూచించారు.
పాశ్చరైజ్జ్ చేసిన తర్వాత కూడా పాల నుంచి ఉత్పత్తి చేసే కొన్ని డెయిరీ ఉత్పత్తుల్లో కొన్ని రకాల ఆరోగ్యకర బ్యాక్టీరియా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
పచ్చిపాలతో ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
ఆస్థమాతోపాటు కొన్ని రకాల అలెర్జీలు తగ్గడానికి పచ్చి పాలకు సంబంధముందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ ట్రాపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చెబుతోంది.
‘‘అలర్జీ కారక సూక్ష్మజీవులను అడ్డుకునేందుకు పచ్చిపాలలో కొన్ని రకాల ప్రోటీన్లు, సమ్మేళనాలు ఉంటాయి’’ అని ఈ అధ్యయనం తెలిపింది.
అయితే, కొన్నిసార్లు పచ్చి పాలతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ముప్పు ఉంటుంది. దీనికి పచ్చిపాలు లేదా అన్‌పాశ్చరైజ్డ్ పాలలోని హానికారక బ్యాక్టీరియానే కారణమని బ్రిటన్‌కు చెందిన ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (ఎఫ్ఎస్ఏ) తెలిపింది.
‘‘శిశువులు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగ నిరోధక సమస్యలతో బాధపడేవారు పచ్చి పాలను తీసుకోకూడదు’’ అని ఎఫ్ఎస్ఏ హెచ్చరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పచ్చిపాలతో ఇన్ఫెక్షన్లు వస్తాయా?
పచ్చి పాలలో సాల్మొనెల్లా, ఈ-కోలై, లిస్టీరియా, క్యంపిలోబ్యాక్టర్ లాంటి హానికర బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే వీటిని నేరుగా తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.
‘‘పాశ్చరైజ్ చేయని పచ్చి పాలను అలానే తాగడం ఆరోగ్యానికి మంచిదికాదు. దీనిలో ప్రమాదకర సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి’’ అని డాక్టర్ ప్రతిభా లక్ష్మి బీబీసీతో చెప్పారు.
‘‘మార్కెట్‌లో ప్యాకెట్లలో అందుబాటులో ఉండే పాశ్చరైజ్డ్ పాలను లేదా ‘రెడీ టు డ్రింక్’ పాలను చాలా వరకు నేరుగా తీసుకోవచ్చు. కానీ, వాటిని కూడా కాసేపు వేడి చేస్తే మంచిది. పచ్చి పాలు అంటే నేరుగా పాల వ్యాపారుల నుంచి కొనే పాలను కచ్చితంగా వేడి చేయాల్సిందే. వీటిని వేడి చేయకుండా పిల్లలు, గర్భిణులు అసలు తాగకూడదు. ఎందుకంటే వీటి నుంచి అబ్డామినల్ టీబీ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని ఆమె హెచ్చరించారు.
పాశ్చరైజ్ చేసిన పాలను ఎక్కువ సేపు మరగబెట్టకూడదని ప్రతిభాలక్ష్మి అన్నారు.
‘‘ఎందుకంటే సూక్ష్మజీవులను హతమార్చేందుకు ఇప్పటికే వాటిని వేడిచేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు మరీ ఎక్కువసేపు మరగబెడితే, వీటిలో ఎంజైమ్‌లు, పోషకాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఎక్కువసేపు వేడి చేయడంతో విటమిన్ డీ స్థాయులు పడిపోతాయి. కాల్షియాన్ని శరీరం గ్రహించడంలో విటమిన్ డీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది తగ్గిపోవడంతో శరీరానికి తగిన మోతాదులో కాల్షియం అందదు’’ అని ఆమె వివరించారు.
ఎంత సేపు వేడిచేయాలి?
మరి పాలను ఎంత సేపు వేడి చేస్తే మంచిది?
‘‘ఒక గ్లాసు పచ్చి పాలను నాలుగైదు నిమిషాలపాటు ఒక మోస్తరు మంటపై మరగబెడితే చాలు. వీటిని అప్పుడు హాయిగా తాగొచ్చు. మరీ పది నిమిషాలకు మించి పాలను పొయ్యిపై పెట్టకూడదు’’ అని ప్రతిభాలక్ష్మి చెప్పారు.
అదే పాశ్చరైజ్ చేసిన పాలను అయితే, మరగబెట్టడానికి బదులుగా వేడి చేస్తే సరిపోతుందని ఆమె తెలిపారు. పాలు ఏవైనా కాసేపు వేడిచేస్తే వాటిలో సూక్ష్మజీవులు మరణిస్తాయని ఆమె చెప్పారు.
ఎలాంటి అనారోగ్యాలూ లేని పెద్దలు పచ్చి పాలను నేరుగా కూడా తాగొచ్చని న్యూట్రీషనిస్టు నీతా దిలీప్ అన్నారు.
‘‘ఎలాంటి అనారోగ్యాలు లేదా వ్యాధి నిరోధక శక్తి రుగ్మతలు లేకపోతే పచ్చి పాలను కూడా తాగొచ్చు. వేడి చేయడం వల్ల మనం కోల్పోయే ఎంజైమ్‌లను కూడా వీటి ద్వారా పొందే అవకాశం ఉంటుంది. కానీ, ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి అనారోగ్యాలూ లేనివారు మాత్రమే పచ్చి పాలు తీసుకోవచ్చు’’ అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
- ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
- దిల్లీ మైనర్ బాలిక హత్య: ప్రేమించినంత మాత్రాన చంపే హక్కు వస్తుందా? అబ్బాయిలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?
- వరంగల్ - లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్: సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు?
- తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది, మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















