హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
మనదేశంలో ముప్పై శాతం జనాభా అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు అధిక రక్తపోటు ఉన్నట్టు తెలియదు. తెలిసిన వారిలో దాదాపు సగం మంది ప్రజలకు చికిత్స సరిపడా తీసుకోక పోవడం వల్ల అది అదుపులోకి రావడం లేదు.
గుండె సంబంధిత సమస్యలకు గల ముఖ్య కారణాల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక జబ్బులు.. సగటున అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. ఈ మధ్య మాత్రం అవి ఒక దశాబ్ద కాలం ముందే, అంటే సుమారు యాభై ఏళ్ల వయసు నుంచే అధికంగా కనిపిస్తున్నాయి.
సాధారణ రక్తపోటు 120/80. అయితే, 140/90 కన్నా ఎక్కువ రక్తపోటు ఉన్నప్పుడు, మూడు వేరు వేరు సందర్భాలలో పరీక్ష చేసి, రక్తపోటు ఉన్నట్టు నిర్ధారించి మందులు ప్రారంభిస్తారు.
120/80 నుండి 140/90 మధ్యలో రక్తపోటు ఉన్నట్టయితే, జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో తరచూ పరీక్ష చేసుకుంటూ ఉండాలి.

ఫొటో సోర్స్, Empics
రక్త పోటు పరీక్ష చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
- గడిచిన గంటలో, ధూమపానం లేదా వ్యాయామం చేసి ఉండకూడదు, కాఫీ కూడా తాగకూడదు.
- కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాక పరీక్ష చేయాలి.
- పరీక్ష చేసే సమయంలో బీపీ చూసే మెషీన్ ఆ వ్యక్తి గుండె ఎత్తులో ఉండాలి.
- ఆ వ్యక్తి పాదాలు పూర్తిగా నేల మీద ఉండాలి.
- వెనక ఆసరా ఉండాలి. చెయ్యి ఎక్కడైనా ఆసరాతో పెట్టి ఉండాలి.
- బీపీ చూసే సమయంలో కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అంటే ఏమిటి?
కొన్ని సందర్భాలలో కేవలం ఆసుపత్రిలో మాత్రమే బీపీ అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అంటారు. అలాంటి అనుమానం ఉన్నప్పుడు, ఇంట్లో ఆ వ్యక్తిని స్వయంగా లేక కుటుంబ సభ్యుల ద్వారా బీపీ పరీక్ష చేసుకొమ్మని చెప్పాలి.
ఈ మధ్య కాలంలో 24 గంటలు రక్తపోటు పర్యవేక్షించే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ఏ సమయంలో రక్తపోటు పెరుగుతుంది? అనేది గమనిస్తూ, ఆ సమయంలో అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
అధిక రక్త పోటు ముఖ్యంగా రెండు రకాలు
ప్రైమరీ - జన్యు పరంగా మధ్య వయసు వచ్చిన వారికి ఇది కలగవచ్చు.
సెకండరీ - ఏవైనా ఇతర సమస్యల వల్ల అధిక రక్త పోటు రావడం. ఇందులో సాధారణంగా కనిపించే కారణాలు
- థైరాయిడ్ సమస్యలు - థైరాయిడ్ అధికంగా, లేక తక్కువగా ఉన్న వారికి..
- మూత్ర పిండాల సమస్య - అధిక రక్తపోటు వల్ల మూత్ర పిండాలు పాడవడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఏ కారణంగా అయినా, దీర్ఘకాలికంగా మూత్ర పిండాల సమస్య ఉన్నా.. వారికి అధిక రక్తపోటు ఉంటుంది.
- ఫియోక్రోమోసైటోమ - మూత్రపిండాల వద్ద ఉండే, అడ్రినల్ గ్రంధులలో పెరిగే ఒక కణితి వల్ల..
- రక్తనాళాలలో సమస్యలు - గుండె నుండి రక్తం తీసుకువెళ్లే ప్రధాన రక్త నాళం కుంచించుకు పోవడం, (coarctation of aorta) మూత్ర పిండాలకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలలో సమస్య (renal artery stenosis), లేక కొన్ని ఇతర రక్త నాళాల సమస్యల వల్ల అధిక రక్తపోటు కలుగవచ్చు.
- అధిక బరువు వల్ల, ముఖ్యంగా నిద్రలో సరిగ్గా ఊపిరి అందకపోవడం వల్ల..
- కొన్ని మందుల వల్ల కూడా అధిక రక్తపోటు కలుగవచ్చు.
అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రమాదాలివీ..
- అదుపులో లేని రక్తపోటు వల్ల, రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం, (atherosclerosis) పక్ష వాతం, గుండె పోటు లాంటి అత్యవసర పరిస్థితులు కలుగవచ్చు.
- ఎక్కువ కాలం అధిక రక్తపోటుతో ఉండడం వల్ల, గుండె వాపు రావడం దానితో గుండె సరిగ్గా పని చేయక, ఆయాసం వంటి లక్షణాలు కలగవచ్చు.
- మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల దీర్ఘకాలికంగా డయాలసిస్ చేసుకునే అవసరం కూడా కలుగవచ్చు.
- అధిక రక్తపోటు వల్ల, కళ్ళ మీద ప్రభావం పడి, చూపు మందగిస్తుంది.
- ఒక్క సారిగా రక్తపోటు చాలా ఎక్కువగా అవ్వడం వల్ల మెదడు సరిగ్గా పని చేయకుండా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.
- అధిక రక్తపోటు వల్ల జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉప్పు తగ్గించడం చాలా ముఖ్యం
మన దేశంలో అధిక రక్తపోటుకు ముఖ్య కారణం అధికంగా ఉప్పు తినే అలవాటు. ఉప్పు తినడాన్ని తగ్గిస్తే బీపీ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
పచ్చడి, చట్నీలు, అప్పడాలు, వడియాలు, మ్యాగీ, పాస్తా, బిస్కెట్ల నుంచి బయట దొరికే దాదాపు అన్ని ఆహార పదార్థాలలో మనకు తెలియకుండానే అధిక మోతాదులో ఉప్పు ఉంటుంది.
ప్రతి మనిషికి రోజుకు 2.5గ్రా ఉప్పు అవసరం ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గరిష్ఠంగా రోజుకు 5 గ్రా. వరకు ఉప్పు తీసుకోవచ్చు అని సూచించింది.
అయితే, మన దేశంలో సగటున ప్రతి మనిషి పది గ్రాముల వరకు ఉప్పు తింటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
ఉప్పు రుచి అనేది నాలుకకు పుట్టకతో తెలిసినది కాదు. మనం అలవాటు చేసేదే. కాబట్టి, కొద్ది రోజులు తక్కువ ఉప్పు తినడంతో మన నాలుకకు అదే అలవాటు అవుతుంది. అధిక మోతాదులో పండ్లు తీసుకోవడంతో ఉప్పు తినడాన్ని, అలాగే రక్త పోటును నియంత్రించవచ్చు.
వ్యాయామం కూడా..
రోజూ వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గడానికి తగిన ఆహారపు, జీవన శైలి మార్పులు చేసుకోవడం తప్పనిసరి. జీవితంలో ఒత్తిడి తగ్గించడానికి యోగా, ధ్యానం వంటి వాటిని ప్రారంభించాలి.
అధిక రక్తపోటుకు మరొక ముఖ్య కారణం, పొగాకు నమలడం, లేక ధూమపానం చేయడం. అది మానేయడం చాలా అవసరం. అలాగే అధికంగా మద్యపానం చేసే వారు, అధికంగా కొవ్వు పదార్థాలు తినే వారు, ఆ అలవాట్లు మానుకోవాలి.
ఇన్ని చేసినా రక్త పోటు అదుపులో లేకపోతే ఆలస్యం చేయకుండా మందులు వాడడం ప్రారంభించాలి.
ఎక్కువ గురక పెట్టే అలవాటు ఉన్న వారికి (శరీర బరువు సాధారణంగా ఉన్నప్పటికీ) నిద్రలో ఊపిరి అందక, అధిక రక్తపోటు కలిగే అవకాశం ఉంది. వారు ఒక సారి నిద్ర పరీక్ష చేసుకుంటే, (sleep study) అలాంటి సమస్య ఏమైనా ఉంటే గుర్తించవచ్చు.
మాత్రలు వేసుకున్నప్పుడు రక్తపోటు అదుపులో ఉంది అంటే, దాని అర్థం మాత్రలు క్రమం తప్పకుండా వాడుకోవాలి. అదుపులో ఉంది అని మాత్రలు మానెస్తే అత్యవసర ప్రమాదరక పరిస్థితి కలిగే అవకాశం ఉంది.
అలాగే అధిక రక్తపోటు వల్ల ఇంకా ఏమైనా సమస్యలు వస్తున్నాయా అని కనీసం ఏడాదికి ఒక సారి అన్ని పరీక్షలు చేసుకొని దానికి తగిన మాత్రలు వాడుకోవాలి.
కొవ్వు తగ్గడానికి, మూత్ర పిండాల రక్షణకు, గుండె పోటు లేదా పక్షవాతం కలిగే అవకాశం ఉన్నా.. రక్తం పలచన చేయడానికి మాత్రలు వాడవలసి ఉంటుంది. అలాగే అవసరాన్ని బట్టి విటమిన్ బీ12 మాత్రలు వాడాల్సి రావచ్చు.
(రచయిత వైద్యురాలు,ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















