ఒక బిడ్డలో తల్లిదండ్రులతోపాటు మరొకరి డీఎన్‌ఏ, ఇదెలా సాధ్యం?

బిడ్డలో ముగ్గురి డీఎన్‌ఏ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, హెల్త్, సైన్స్ కరెస్పాండెంట్

బ్రిటన్‌లో అరుదైన ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏతో ఒక శిశువు జన్మించింది. ఈ విషయాన్ని ఫెర్టిలిటీ నియంత్రణ సంస్థ ధ్రువీకరించింది.

ఈ శిశువు డీఎన్‌ఏలో ఎక్కువ భాగం తల్లిదండ్రులదేనని, 0.1 శాతం డీఎన్‌ఏ మాత్రం మూడో వ్యక్తి అయిన మరో మహిళదని తెలిపింది.

పిల్లలకు పుట్టుకతో ప్రాణాంతకమైన మైటోకాండ్రియా సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధించడానికి ఒక కొత్త టెక్నాలజీని ప్రయోగించడంతో ఇలా జరిగింది. ఇప్పటివరకు ఈ విధానంలో అయిదుగురు శిశువులు జన్మించారు. అయితే, వీరికి సంబంధించిన ఇతర వివరాలేవీ లేవు.

మైటోకాండ్రియల్ వ్యాధులు నయం చేయలేనివి. ఈ వ్యాధితో పుట్టిన పిల్లలకు గంటల వ్యవధిలో లేదా రోజుల వ్యవధిలో మరణం సంభవించవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఈ బాధను అనుభవించారు. అలాంటి తల్లిదండ్రుల్లో ఈ టెక్నాలజీ కొత్త ఆశలు రేపుతోంది.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

మైటోకాండ్రియా ఎందుకు ముఖ్యం?

మానవ శరీరంలోని ప్రతీ కణంలో మైటోకాండ్రియా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని మైటోకాండ్రియా శక్తిగా మార్చుతుంది.

మైటోకాండ్రియాలో సమస్య ఉంటే అది ఆహారాన్ని శక్తిగా మార్చలేదు. ఫలితంగా మెదడుపై, కండరాలపై దుష్ప్రభావం పడుతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. కళ్లు కూడా కనిపించవు.

ఇది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే వ్యాధి. మైటోకాండ్రియల్ డొనేషన్ థెరపీ అనేది ఐవీఎఫ్‌ పరివర్తన రూపం. ఈ విధానంలో ఆరోగ్యకరమైన మహిళ అండం నుంచి మైటోకాండ్రియాను ఉపయోగిస్తారు.

బిడ్డలో ముగ్గురి డీఎన్‌ఏ

ఫొటో సోర్స్, Getty Images

ఒక బిడ్డలో ముగ్గురి డీఎన్‌ఏలు ఎలా సాధ్యం?

మైటోకాండ్రియాకు సొంత డీఎన్‌ఏ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలు డీఎన్‌ఏను వారసత్వంగా పొందుతారు. ఈ విధానంలో అండాన్ని దానం చేసిన మహిళ డీఎన్‌ఏ కూడా పుట్టబోయే పిల్లలకు చేరుతుంది. అలాగే రాబోయే తరాలకు కూడా ఈ డీఎన్ఏ సంక్రమణ జరుగుతూనే ఉంటుంది.

దాత నుంచి వచ్చిన డీఎన్‌ఏ కేవలం శిశువులో ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా ఏర్పడటంలో మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేతప్ప పిల్లల వ్యక్తిత్వం, గుణంలో దాని జోక్యం ఉండదు. ఈ లక్షణాలు పిల్లలకు వారి తల్లిదండ్రుల డీఎన్‌ఏ ద్వారానే లభిస్తాయి.

బ్రిటన్‌లోని న్యూకాజిల్ నగరంలో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ విధానాన్ని ఉపయోగించి శిశువులను సృష్టించే చట్టాలను బ్రిటన్‌లో 2015లో ఆమోదించారు.

2016లో ఈ విధానంలో తొలి శిశువు జన్మించింది. అమెరికాలోని జోర్డానియన్ కుటుంబం ఈ టెక్నాలజీతో శిశువును పొందింది.

హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ(హెచ్‌ఎఫ్‌ఈఏ) ప్రకారం 2023 ఏప్రిల్ 20 నాటికి ఈ విధానంలో గరిష్ఠంగా ఐదుగురు శిశువులు జన్మించారు. కుటుంబాల గోప్యత దృష్ట్యా ఇంతకుమించిన వివరాలను హెచ్‌ఎఫ్‌ఈఏ వెల్లడించలేదు.

సమాచార హక్కు చట్టం కింద ‘ద గార్డియన్‌’ పత్రిక ప్రశ్నించగా ఈ సమాచారాన్ని అందించింది.

మెడికల్ రీసెర్చ్

ఫొటో సోర్స్, Getty Images

మైటోకాండ్రియా రీప్లేస్‌మెంట్ థెరపీ విజయవంతమైనదా, కాదా?

మైటోకాండ్రియా రీప్లేస్‌మెంట్ థెరపీ చికిత్స విజయవంతమైనదా? కాదా? అనే అంశాన్ని న్యూకాజిల్ వైద్య బృందం కచ్చితంగా చెప్పలేకపోతోంది.

"మైటోకాండ్రియా రీప్లేస్‌మెంట్ థెరపీ టెక్నాలజీ ఎంత బాగా పని చేసిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. మైటోకాండ్రియా వ్యాధుల నుంచి పిల్లలు విముక్తి పొందారా? వారు తర్వాత జీవితంలో ఈ తరహా సమస్యలను ఎదుర్కొంటారా అనేది ఆసక్తికరంగా మారింది’’ అని ఫ్రాన్సిస్ క్రిక్ పరివోధన సంస్థ ప్రొఫెసర్ రాబిన్ లోవెల్-బ్యాడ్జ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)