ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం మందికి సంతాన సమస్యలు.. కారణం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మా పెళ్లి 2003లో జరిగింది. దీని తర్వాత నా భార్య గర్భవతి అయింది. కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆమెకు అబార్షన్ జరిగింది. ఆ తర్వాత గర్భం దాల్చడంలో సమస్యలు రావడం మొదలైంది. దీంతో కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు నాకు సూచించారు. వాటి ద్వారా నా స్పెర్మ్ కౌంట్ (శుక్రకణాలు) తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి నేను చికిత్స తీసుకుంటున్నా.’’ - డాక్టర్ జయంత్ కుమార్
‘‘ఈ మహిళ వయస్సు 30 ఏళ్లు. ఆమెకు పెళ్లి జరిగి ఏడేళ్లు అయింది. ఆమెకు హార్మోన్ల అసమతౌల్యం ఉంది. అండాశయంలో తిత్తులు ఉన్నాయి. వాటి కారణంగా ఆమె గర్భం దాల్చలేకపోతున్నారు. హార్మోన్ల కోసం మందులు ఇచ్చారు. ఆమె భర్త ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఐయూఐ ద్వారా గర్భం దాల్చారు.’’ ఇక్కడ ఆ మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతున్నాం.

ఫొటో సోర్స్, ©FITOPARDO/GETTYIMAGES
భారతదేశంలో సంతానలేమి సమస్య పెరుగుతోందా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ప్రపంచంలోని ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యను అనుభవించారు.
సంతానలేమి అనేది మహిళ లేదా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన వ్యాధి అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ వ్యాధి వల్ల దంపతులు 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ స్త్రీలు గర్భం దాల్చలేరని తెలిపింది.
డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 15 శాతం జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి. ఈ 15 శాతం జంటలు పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారే. 15-49 సంవత్సరాల మహిళలు, పునరుత్పత్తి వయస్సులోకి వస్తారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
40-45 ఏళ్ల తర్వాత పురుషుల స్పెర్మ్ కౌంట్ ప్రభావితం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, DR SMITA JAIN
భారత్‌లో సంతాన లేమి
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, భారత్‌లో సంతానలేమి 3.9 - 16.8 శాతంగా ఉంది.
నేషనల్ హెల్త్ పోర్టల్ (ఎన్‌హెచ్‌పీ)లో ఉన్న సమాచారం ప్రకారం, భారత్‌లోని ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సంతానలేమి3.7 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం, కశ్మీర్‌లో 15 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.
భారత్‌లో సంతానలేమి సమస్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. దంపతులపై ఇది సామాజికంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.
ఇంతకుముందు సంతానలేమి సమస్యకు మహిళలను మాత్రమే కారణంగా చూసేవారని, ఇప్పుడు పెరిగిన అవగాహన కారణంగగా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం పురుషులు ముందుకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, JULIA GALUZINSKAYA/GETTYIMAGES
మహిళల్లో సమస్య
మహిళల్లో సంతానలేమి సమస్య గురించి ఎస్‌సీఐ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ స్మితా జైన్, బీబీసీతో మాట్లాడారు.
"గతంలో మహిళలు ట్యూబల్ బ్లాకేజ్ లేదా ఫెలోపియన్ ట్యూబ్‌ల పూడిక సమస్యతో వచ్చేవారు. ఇన్ఫెక్షన్ వల్ల ఈ రకమైన సమస్యలు వస్తాయి. అలాగే మహిళలకు టీబీ ఉంటే, అది మహిళల జననేంద్రియాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా స్త్రీలకు యుటెరస్ లేదా ట్యూబ్‌లలో ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో వారు గర్భం దాల్చడంలో సమస్య ఎదురవుతుంది’’ అని స్మితా జైన్ వివరించారు.
ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు చిన్న వయస్సులోనే శారీరక సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారని, దీనివల్ల అమ్మాయిలు క్లమిడియా, గొనోరియా అనే ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని ఆమె చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తిలో సమస్యలు ఎదురవుతాయని తెలిపారు.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY - ZEPHYR
‘‘ఈ మధ్య కాలంలో స్త్రీల ఆరోగ్య విషయంలో కాస్త మార్పు వచ్చింది. గతంలో స్త్రీలు ఇన్ఫెక్షన్ కేసులతో వచ్చేవారు. కానీ, ఇప్పుడు హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు’’ అని స్మితా చెప్పారు.
“అండాశయ నిల్వలు తక్కువగా (పీఎంసీ) ఉన్న స్త్రీలలో అండాశయాలు సరిగ్గా పనిచేయవు. అండాల ఉత్పత్తిలో కూడా సమస్యలు వస్తాయి. అలాగే వారు ‘‘పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్’’తో కూడా బాధపడతారు. ఈ సిండ్రోమ్ కారణంగా హార్మోన్ల సమతుల్యత క్షీణించి, అండాశయంలో తిత్తులు ఏర్పడతాయి. ఇది రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మగవారిని కూడా సంతానలేమి సమస్య వేధిస్తోంది’’ అని స్మితా జైన్‌తో పాటు డాక్టర్ గుంజన్ సబర్వాల్ వివరించారు.
నోవా ఇన్ఫెర్టిలిటీ క్లినిక్‌లో డాక్టర్ గుంజన్ సబర్వాల్ పనిచేస్తున్నారు.
ఈరోజుల్లో సాధారణంగా 30 ఏళ్ల వయస్సులో వివాహాలు జరుగుతున్నాయని, ఆ తర్వాత పిల్లలను కనడానికి కూడా దంపతులు సమయం తీసుకుంటున్నారని వారు చెప్పారు.
ఆరోగ్యం, కెరీర్ మొదలైన చాలా కారణాల కారణంగా సంతానలేమి సమస్యలు పుట్టుకొస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, CAROL YEPES/GETTYIMAGES
మగవారిలో సంతానలేమికి కారణాలు
- స్పెర్మ్ కౌంట్‌లో తగ్గుదల
- స్పెర్మ్ నిర్మాణం, ఆకృతిలో మార్పులు రావడం వల్ల
- స్పెర్మ్ కదలిక క్షీణించడం వల్ల
- శుక్రకణాలు నశించడం వల్ల సంతానలేమి కలగొచ్చు.
ప్రస్తుతం సంతానలేమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనవి,
- హార్మోన్ అసమతౌల్యం
- ఫోన్, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే రేడియేషన్
- జీవనశైలి
- ధూమపానం, మద్యపానం
- కాలుష్యం
- పురుగుల మందులు వాడిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల
- ప్లాస్టిక్ ఉపయోగం
గర్భం దాల్చడానికి అనేక మార్గాలు ఉన్నాయని డాక్టర్ గుంజన్ సబర్వాల్ చెప్పారు. అందులో మొదటిది, దంపతులకు ఎటువంటి వైద్య సహాయం అవసరం అక్కర్లేదని అన్నారు. రెండవది, స్త్రీలో అండాలు లేదా పురుషుడిలో స్పెర్మ్ ఉత్పత్తి కాకపోతే, మందులు వాడి ఆ తర్వాత సహజ పద్ధతిలో గర్భం దాల్చవచ్చని చెప్పారు.
మూడవ పద్ధతి ఐయూఐ (ఇంట్రాయుటెరీన్ ఇన్‌సేమ్నేషన్). నాలుగో పద్ధతి ఇన్ విర్టో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్).
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ధనిక దేశాల్లోని 17.8 శాతం మంది ప్రజలు సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. ఆల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఇది 16.5 శాతం. పేద దేశాల్లో కూడా సంతాన సమస్యలపై ఎక్కువగానే ఖర్చు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
‘‘భారీ స్థాయిలో ప్రజలు ఈ సమస్యలతో బాధపడుతుండటంతో సంతాన ఆరోగ్యంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా పరిశోధనలు కూడా జరగాలి. సంతాన సమస్యల చికిత్సలు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. ఇవి సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలి’’అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అఢనమ్ చెప్పారు.
ఒకవైపు సంతాన సమస్యలు పెరుగుతుంటే, కృత్రిమ పద్ధతుల్లో తల్లిదండ్రులయ్యేందుకు అందుబాటులోకి వస్తున్న కొత్త విధానాలు కూడా పెరుగుతున్నాయని డాక్టర్లు అంటారు.
ఈ పద్ధతులకు ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఎగువ మధ్యతరగతి ప్రజలు, ధనికులు వీటిని తేలిగ్గానే ఆశ్రయించొచ్చు. అయితే, అల్పాదాయ వర్గాలకే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి.
అదే సమయంలో ఈ విధానాలతో తొలి ప్రయత్నాల్లోనే పాజిటివ్ ఫలితాలు వస్తాయని కూడా చెప్పలేం. అందుకే కెరియర్, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















