చైనా: పిల్లలను కనేందుకు మహిళలు ఎందుకు నిరాకరిస్తున్నారు?

బిడ్డను ఎత్తుకొని ఉన్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిల్వియా చాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘నేను పిల్లలను పోషించలేను’’ అని మూడు పదుల వయస్సులో ఉన్న వివాహిత గ్లోరియా అన్నారు.

గ్లోరియా, చైనాలో నివసిస్తారు. ఇతర ఖర్చులతో పాటుగా పిల్లలను పెంచడానికి నెలకు సుమారు 2400 డాలర్లు (రూ. 1,96,368) ఖర్చు అవుతాయని ఆమె లెక్కించారు.

‘‘ఆహారం వంటి రోజూవారీ ఖర్చుల కోసం 436 డాలర్లు (రూ. 35,673) ఖర్చు అవుతుంది. కిండర్‌గార్టెన్‌కు 291 డాలర్లు (రూ. 23,809), పార్ట్‌టైమ్ పిల్లల సంరక్షణకు 145 డాలర్లు (రూ. 11,863), పాఠశాల కోసం 1,456 డాలర్లు (1,19,130) ఖర్చు అవుతుంది’’ అని ఆమె లెక్కలు వేశారు.

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులోని ఒక ప్రాథమిక పాఠశాలలో గ్లోరియా, పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తున్నారు.

దేశంలోని ఈ ప్రాంతంలో ప్రైవేటు సెక్టారులో పనిచేసే వారి సగటు ఆదాయం నెలకు 873 డాలర్లు (రూ. 71,429).

చైనా అనుసరించిన వన్ చైల్డ్ (ఒక బిడ్డ మాత్రమే) పాలసీ కారణంగా తన కుటుంబంలో గ్లోరియా ఒక్కరే సంతానం.

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణతో పాటు వాయిదాల చెల్లింపుల కోసం డబ్బు ఆదా చేయడంపైనే తాను దృష్టి పెడుతున్నానని గ్లోరియా చెప్పారు.

చైనా మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంతానోత్పత్తి రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

జనాభా క్షీణత

చైనా జనాభా మార్పును ఎదుర్కొంటోంది. గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనా జనాభా తగ్గుతోంది.

చైనా మహిళల్లో ఎక్కువ మంది ఒకే బిడ్డను కోరుకుంటున్నారని, లేదా అసలే పిల్లలే వద్దని అనుకుంటున్నారని కొత్త డేటా ప్రకారం తెలుస్తోంది.

చైనా జనాభా, అభివృద్ధి పరిశోధన కేంద్రం ఇటీవల చేపట్టిన సర్వే ప్రకారం, చైనాలో సంతానం లేని మహిళల సంఖ్య 2015లో 6 శాతం ఉండగా, 2020 నాటికి 10 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో పిల్లలను కనాలనే ఉద్దేశం కూడా తగ్గిపోయినట్లుగా ఈ డేటా చూపించింది. చైనా మహిళల సంతానోత్పత్తి రేటు 2017లో 1.76 ఉండగా, 2021 నాటికి 1.64కి పడిపోయినట్లుగా తెలిసింది.

సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా సంతానోత్పత్తి రేటు 2 కంటే తక్కువగానే ఉంది. కానీ, వారు తమకు ఇద్దరు పిల్లలు కావాలని కోరుకుంటున్నారు. కానీ, చైనాలో మాత్రం ఈ పరిస్థితి లేదు.

‘‘చైనాలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటమే కాదు, సంతానం కావాలనే కోరిక కూడా తక్కువగానే ఉందని’’ డాక్టర్ షువాంగ్ చెన్ అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్‌లో ఇంటర్నేషనల్ సోషల్ అండ్ పబ్లిక్ పాలసీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చెన్ పనిచేస్తున్నారు.

చైనాలో జననాల రేటును పెంచడంపై మార్చి 4న జరిగిన రాజకీయ సమావేశంలో రాజకీయ సలహాదారులు వివిధ ప్రతిపాదనలను సమర్పించారు.

అండాలను సంరక్షణకు అవివాహిత స్త్రీలకు మద్దతు ఇవ్వడం, కిండర్‌గార్టెన్ నుంచి కాలేజీ వరకు పుస్తకాలు, ట్యూషన్ ఫీజులను మాఫీ చేయడం వంటి సూచనలు ఇచ్చారు.

పెళ్లికాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు కూడా సమాన హక్కులు కల్పించాలనే ఆలోచన కూడా చేశారు. చైనాలో అవివాహితులైన తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమానికి అవసరమైన అధికారిక రిజిస్ట్రేషన్ ‘హుకూ’ను పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల్ని కనాలనే నిర్ణయంతో ప్రొఫెషనల్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని చాలామంది మహిళలు భావిస్తున్నారు

వ్యయం పెరగడం

చైనీస్ మహిళలు పిల్లలు వద్దనుకోవడానికి గల కారణాలలో పిల్లలను పెంచడానికి అయ్యే అధిక వ్యయం ప్రధానమైనది.

చైనాలో పుట్టిన మరు నిమిషం నుంచే తోటివారితో పోటీ మొదలవుతుంది. ప్రముఖ పాఠశాలలు ఉండే ఊర్లకు దగ్గరలో ఇళ్లు కొనుగోలు చేయడం, బోధనేతర కార్యక్రమాల్లో పిల్లలను చేర్చడం వంటి పనులు తల్లిదండ్రులు చేయాల్సి ఉంటుంది.

"ఇలాంటి భయంకరమైన పోటీ ఉన్న వాతావరణంలోకి కొత్త జీవితాన్ని తీసుకురావడం నాకు ఇష్టం లేదు" అని కాలేజీ విద్యార్థిని, 22 ఏళ్ల మియా చెప్పారు.

ఉత్తర చైనాలోని ఒక చిన్న పట్టణంలో మియా జన్మించారు. తన చదువంతా పరీక్షల చుట్టూనే తిరిగిందని ఆమె చెప్పారు. జాతీయ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన ‘గావోకావో’ పరీక్ష రాసి బీజింగ్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చేరినట్లు ఆమె చెప్పారు. .

అయితే, తాను చాలా సార్లు ఒత్తిడికి గురవుతున్నానని ఆమె తెలిపారు.

ఈ రోజు గ్రాడ్యుయేట్లు, విదేశాల్లో చదువుకునే వారితో కూడా పోటీ పడాల్సి ఉందని ఆమె అన్నారు.

"ఈ అదనపు విద్య కోసం డబ్బు కావాలి. కానీ, భవిష్యత్‌లో ఎదురయ్యే పోటీ పరిస్థితులను తట్టుకొని పిల్లలను నిలబెట్టేంత డబ్బు సంపాదించగలనని నేను అనుకోవట్లేదు. పిల్లలు అభివృద్ధి చెందడానికి అలాంటి సౌకర్యాలను నేను కల్పించలేనప్పుడు, వారిని ఈ ప్రపంచంలోకి ఎందుకు తీసుకురావాలి?’’ అని ఆమె ప్రశ్నించారు.

యువాన్

ఫొటో సోర్స్, Yuan Xueping

ఫొటో క్యాప్షన్, యువాన్ జుపింగ్

ఉద్యోగ, వ్యక్తిగత జీవిత సమతుల్యత

ప్రొఫెషనల్ కెరీర్‌పై పడే ప్రతికూల ప్రభావాల రీత్యా కూడా పిల్లలను వద్దనుకుంటున్నట్లుగా బీబీసీ ఇంటర్వ్యూలో పలువురు మహిళలు చెప్పారు.

‘‘ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు రాబోయే కాలంలో పిల్లలను కనాలనుకుంటున్నారా? అని అడిగేవారు. ఒకవేళ అవును అని సమాధానం చెబితే ఆ ఉద్యోగం వచ్చే అవకాశాలు సగం తగ్గిపోతాయి. పదోన్నతులు పొందే అవకాశాలు కూడా తక్కువ అవుతాయి’’ అని వారు గుర్తు చేసుకున్నారు.

లింగ వివక్షతో కూడిన జాబ్ మార్కెట్‌లో కెరీరా? లేక బిడ్డను కనాలా? అనేది ఎంచుకోవడం చాలా కష్టమైన అంశమని మిషిగాన్ యూనివర్సిటీ సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ యన్ జు అన్నారు.

‘‘ఆన్‌లైన్ బెదిరింపులు’’

తాను ఎందుకు సంతానాన్ని వద్దనుకుంటున్నానో వివరిస్తూ రికార్డ్ చేసిన ఒక వీడియోను మియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆశ్చర్యకరంగా, ఆమెకు వందలాది అనుచిత వ్యాఖ్యలు వచ్చాయి.

చాలా మంది ఆమెను స్వార్థపరురాలని పిలిచారు. కొందరేమో ఇంకా 20 ఏళ్ల వయస్సులోనే ఉన్నందున తెలిసీ తెలియకుండా మాట్లాడుతుందని వ్యాఖ్యానించారు.

‘‘నేను 10 వేల డాలర్ల పందెం వేస్తున్నా. మీరు భవిష్యత్‌లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు చింతిస్తారు’’ అని మరో యూజర్ రాశారు.

పిల్లల్ని కనొద్దని ప్రేరేపిస్తున్న విదేశీ శక్తి అంటూ మరికొంతమంది ఆమెను దూషించారు.

2020 సెన్సస్ ఫలితాల తర్వాత 2021 మే నెలలో చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది. 2020 ఏడాదిలో కేవలం 12 మిలియన్ల జననాలే నమోదైనట్లు సెన్సస్ ద్వారా తెలిసింది. 1961 తర్వాత ఇవే అతి తక్కువ జననాలు.

పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టింది.

వీడియో క్యాప్షన్, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 9 మార్గాలు

‘‘నేను యుద్ధం చేశాను’’

పిల్లల విషయంలో కుటుంబ సభ్యులను ఎదుర్కోవడం పెద్ద సవాలు అని, తానో పెద్ద యుద్ధం చేశానని యువాన్ జుపింగ్ అన్నారు.

ఇంటి పేరును నిలబెట్టడానికి మగబిడ్డకు జన్మనివ్వడం స్త్రీ కర్తవ్యంగా భావించే గ్రామీణ ప్రాంతంలో యువాన్ పుట్టి పెరిగారు. తాను పిల్లల్ని కనాలనుకోవట్లేదని ఇంట్లో వారికి చెప్పడానికి ఆమె చాలా కష్టపడ్డారు.

యువాన్, ఆమె అక్క కాలేజీ విద్య చదువలేకపోయారు. హైస్కూల్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురిలో యువాన్ కూడా ఒకరు. అయినప్పటికీ ఆమె కాలేజీకి వెళ్లలేకపోయారు. తన తమ్ముడి పైచదువుల కోసమే తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారని ఆమె తెలిపారు.

‘‘ అమ్మాయిలు ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంచుతూ ఇంట్లో ఉండాలి. అమ్మాయిలు కాలేజీకి వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటి?’’ అని తన తల్లిదండ్రులు ఎప్పుడూ అంటారని ఆమె గుర్తు చేసుకున్నారు.

విడాకులు తీసుకొని ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచుతున్న తన అత్తను చూసి మరింత చలించిపోయినట్లుగా ఆమె చెప్పారు.

"నేను ఇకపై వివాహ సంస్థను విశ్వసించను. నేను చదువుతాను. ఖాళీ సమయాల్లో నా స్నేహితులతో ఉంటాను. స్వేచ్ఛగా ఉంటున్నా’’ అని ఇల్లు వదిలి నగరానికి వచ్చిన ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)