బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?

ఫొటో సోర్స్, YMA
- రచయిత, అమితాబ్ భట్టాసాలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బంగ్లాదేశ్‌లోని బండార్బన్ జిల్లా నుంచి పారిపోయి వచ్చిన 500 మంది భారత్‌లోని మిజోరం రాష్ట్రంలో ఆశ్రయం పొందారు.
కుకీ చిన్ నేషనల్ ఆర్మీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నుంచి తప్పించుకునేందుకు పారిపోయి భారత్‌కు వచ్చినట్లు వారు చెబుతున్నారు.
అయితే, వారంతా దేశం నుంచి పారిపోలేదని, భద్రతా కారణాల రీత్యా సరిహద్దు దాటి వెళ్లారని బంగ్లాదేశ్ పోలీసులు అంటున్నారు.
గతేడాది నవంబర్ నుంచే ఈ శరణార్థులు, భారత్‌కు రావడం ప్రారంభించారని బీబీసీతో మాట్లాడిన మిజోరం మంత్రి ఒకరు అన్నారు.
ఆశ్రయం కోరుతున్న వారిలో ఎక్కువ మంది ‘బమ్’ తెగకు చెందినవారు ఉన్నారు. వీరితో పాటు టంగ్‌టంగియా తెగకు చెందిన కొంతమంది కూడా ఆశ్రయం కోరుతున్నారు.
బమ్ తెగ ప్రజలు క్రైస్తవులు. ఈ బంగ్లాదేశీ తెగకు చెందిన పౌరులలో మహిళలు కూడా ఉన్నారు.
దక్షిణ మిజోరాంలోని లాంగ్‌తలై జిల్లాకు చెందిన అయిదు గ్రామాల్లో వారు ఆశ్రయం పొందారు.
మిజోరం ప్రభుత్వంతో పాటు స్థానికంగా ప్రముఖ క్రైస్తవ సంఘమైన ‘యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)’ వారు ఈ శరణార్థుల కోసం బస, ఆహార ఏర్పాట్లను చేశాయి.

ఫొటో సోర్స్, YMA
శరణార్థులుగా వచ్చిన 132 కుటుంబాలు
టుయ్‌చాంగ్ ప్రాంతంలోని యంగ్ మిజో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లాల్‌థన్‌పుయా, బీబీసీతో మాట్లాడారు.
‘‘మా ప్రాంతంలో బంగ్లాదేశ్‌కు చెందిన 132 కుటుంబాల్లోని 548 మంది ప్రజలు ఆశ్రయం పొందారు. వారికి మేం నిత్యావసరాలు అందిస్తున్నాం. వారే స్వయంగా వంట చేసుకుంటారు. దుస్తులు, ఔషధాలు కూడా ఇస్తున్నాం. చాలా మందికి చిన్న చిన్న ఇళ్లను ఏర్పాటు చేశారు’’ అని ఆయన చెప్పారు.
టుయ్‌చాంగ్ ప్రాంతంలోని పర్వ్-3 గ్రామంలో ఎక్కువమంది శరణార్థులు నివసిస్తున్నారు. వైఎంఏ, మిజోరం ప్రభుత్వాలు తరచుగా శరణార్థుల సంఖ్యను లెక్కిస్తున్నాయి.
చివరగా సేకరించిన గణాంకాల ప్రకారం, ఆ శరణార్థి శిబిరంలో 216 మంది నివసిస్తున్నారు. అందులో కొంతమంది వెదురుబొంగులతో ఇళ్లను కట్టుకున్నారు. మరికొందరు పెద్ద హాళ్లలో జీవిస్తున్నారు.
ఇళ్ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని కూడా స్థానిక మిజో ప్రజలే వారికి అందజేశారు.

ఫొటో సోర్స్, YMA
బంగ్లాదేశ్ ఆర్మీ ఆపరేషన్
ఈ శరణార్థి శిబిరంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతోన్న వారు బంగ్లాదేశ్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.
‘‘బంగ్లాదేశ్ సైన్యం, మా గ్రామాలపై దాడులు చేస్తోంది. అక్కడ తరచుగా ఫైరింగ్, బాంబు దాడులు జరుగుతున్నాయి. మా ఇంటి దగ్గర కూడా బాంబు పేలుడు జరిగింది. ఆర్మీ వాళ్లు, గ్రామంలోని 14 మందిని తీసుకుపోయారు. మేమంతా భయపడి అడవి మార్గంలో పారిపోయి వచ్చాం’’ అని ఫోన్ ద్వారా బైలియాన్ చెప్పారు.
బంగ్లాదేశ్ ఆర్మీ గతేడాది నవంబర్ 15న బైలియాన్ గ్రామంలో ఆపరేషన్‌ను ప్రారంభించింది. మరుసటి రోజే ప్రజలంతా ఆ గ్రామం నుంచి పారిపోయారు.
‘‘మేం పిల్లలు, వృద్ధులు, మహిళలతో కలిసి మూడు రోజులు అడవిలో నడిచాం. ఆహరం, నీరు లేకపోవడంతో మార్గమధ్యలోనే ఒక పాస్టర్ చనిపోయారు’’ అని బైలియాన్ చెప్పారు.
బండార్బన్ జిల్లా రూమా పాడా ప్రాంతానికి చెందిన వాషిందా మంగలియాంగ్ థంగ్కో కూడా ఈ శిబిరంలో ఆశ్రయం పొందారు. వాషిందా కూడా తన కుటుంబంతో కలసి మూడు రోజుల పాటు కాలినడకన మిజోరం చేరుకున్నారు.
‘‘దారి తెలియకపోవడంతో మేం పొరపాటున మయన్మార్‌లోకి వెళ్లిపోయాం. అక్కడ రెండు రోజులు ఉండి భారత్‌కు వచ్చేశాం. తొలుత ఒక పెద్ద హాలులో చాలా మందితో కలిసి ఉండాల్సి వచ్చింది.
ఆ తర్వాత వైఎంఏ, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటికి కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. వాటితోనే కొంతమంది ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ మేం మా ఇళ్లకు ఎప్పుడు వెళ్తామో నాకు తెలియదు. గ్రామం నుంచి పారిపోయి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేకపోయాం’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కుకీ చిన్ నేషనల్ ఆర్మీపై చర్యలు
‘‘ఇది వలస సమస్య కాదు. భద్రతా సమస్యల వాళ్లు వారు గ్రామాలను విడిచి వెళ్లిపోయారు. మొదట్లో కూడా వారు ఆశ్రయం కోసం మిజోరం ప్రాంతానికే వెళ్లేవారు’’ అని బీబీసీ బంగ్లా ప్రతినిధి సంజనా చౌధరీతో బంగ్లాదేశ్ రూమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన పోలీసు అధికారి మొహమ్మద్ ఆలంగీర్ అన్నారు.
ఆర్మీ ఆపరేషన్ కారణంగా దాదాపు నాలుగైదు వందల మంది గ్రామాలను విడిచి వెళ్లిపోయారని ఆయన చెప్పారు.
కేఎన్‌ఎఫ్ సంస్థకు వ్యతిరేకంగా ఈ ఆర్మీ ఆపరేషన్ జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తెగకు చెందిన ప్రజలే ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఏ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి, ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నారనే సంగతి ఆర్మీ వారికి బాగా తెలుసు అని ఆయన చెప్పారు.
కేఎన్‌ఎఫ్ సభ్యులు ఆయుధాల వాడకంలో శిక్షణ పొందుతున్నారు. ఆ కాల్పులు శబ్ధాలు విని భయబ్రాంతులకు గురైన సామాన్యులు సరిహద్దులు దాటి ఉండొచ్చు. సరిహద్దు దాటాల్సిందిగా వారిపై ఎవరి ఒత్తిడి లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ (కేఎన్‌ఎఫ్) అనేది ఒక రాజకీయ సంస్థ. ఈ సంస్థకు కుకీ చిన్ నేషనల్ ఆర్మీ అనే సాయుధ విభాగం కూడా ఉంది.
బంగ్లాదేశ్ సైన్యంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్‌ఏబీ) వర్గాలు నిరంతరం కేఎన్‌ఎఫ్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంటాయి.

ఫొటో సోర్స్, YMA
సరిహద్దు సంబంధాలు
మిజోరం గ్రామీణాభివృద్ధి మంత్రి లాల్‌రుట్కిమా, కొద్ది రోజుల క్రితం పర్వ్-3 గ్రామంలో సందర్శించారు. ఈ గ్రామంలోనే ఎక్కువ మంది బంగ్లాదేశ్ పౌరులు శరణార్థులుగా జీవిస్తున్నారు.
‘‘బంగ్లాదేశ్ నుంచి వస్తున్న శరణార్థులు, మిజో ప్రజల కుటుంబ సభ్యులే. మా పూర్వీకుల్లో కొంతమంది బండార్బన్, మియాన్మార్‌లో నివసించేవారు. మరికొందరు ఇక్కడ మిజోరంలో ఉండేవారు. ఇప్పటికీ మా బంధువుల్లో చాలామంది బండార్బన్, మియన్మార్‌లలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులే. అందుకే వారి బాగోగులు చూసే బాధ్యతను మేం తీసుకుంటున్నాం’’ అని లాల్ రుట్కిమా అన్నారు.
ఈ శరణార్థులు, మిజోరం ప్రజల సోదర సోదరీమణులని పేర్కొంటూ శుక్రవారం మిజోరం అసెంబ్లీలో తీర్మానాన్ని చేశారు. కాబట్టి వారి వసతి, ఆహార ఏర్పాట్లు చేయడం మిజోరం ప్రభుత్వ బాధ్యతగా మారింది.
బీఎస్‌ఎఫ్ సిబ్బంది, శరణార్థులను సరిహద్దుల వద్ద అడ్డుకోకుండా చూడాలని మిజోరం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















