ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?

శ్వాస

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మటిల్డా కెనెల్స్, మర్సీడెస్ జిమెంనెజ్, నూరియా కాంపిలో
    • హోదా, బీబీసీ ముండో

శ్వాస తీసుకోవడాన్ని మనకు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచి మనం శ్వాస తీసుకుంటూనే ఉన్నాం.

అయితే, మనం సరిగ్గానే శ్వాస తీసుకుంటున్నామా? అసలు ముక్కుతోనే ఎందుకు శ్వాస తీసుకోవాలి? నోటితో తీసుకుంటే ఏమవుతుంది?

ఒక రోజులో మనం సగటున 10,000 నుంచి 12,000 లీటర్ల గాలిని పీల్చుకుంటాం. ఈ గాలిలో దుమ్ము, బాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి కూడా ఉంటాయి. ఇవి మన శ్వాస నాళాలతోపాటు, ఊపిరితిత్తుల వరకు కూడా చేరుకుంటాయి.

అయితే, ఈ విషయంలో మనం ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ కలుషిత పదార్థాలను ఎలా శుభ్రం చేయాలో మన శ్వాస వ్యవస్థకు తెలుసు.

శ్వాస వ్యవస్థను దాటుకొని చాలా సూక్ష్మకణాలు అంటే మూడు మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే అణువులు మాత్రమే ఊపిరిత్తుల్లోకి వెళ్లగలుగుతాయి.

శ్వాస

ఫొటో సోర్స్, Getty Images

ఎలా వడ పోస్తోంది?

గాలిలో ఈ కాలుష్యకర సూక్ష్మజీవులను మన శ్వాస వ్యవస్థ ఎలా వడపోస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా మనం ‘‘సిలియా’’గా పిలిచే సూపర్‌హీరోల గురించి తెలుసుకోవాలి.

సిలియా అనేది సన్నని వెంట్రుకల్లాంటి నిర్మాణం. ఇది గుండుసూది మొన కంటే సన్నగా ఉంటుంది.

మన శ్వాస నాళాల్లోని శ్లేష్మంపై ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. ముక్కులో ఉండే శ్లేష్మంలో ఒక్కో కణంపై 25 నుంచి 35 వరకు ఈ సిలియాలు కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కటి అయిదు నుంచి ఏడు మైక్రాన్ల పొడవు ఉంటాయి.

కణాల పైపొరల మీద కనిపించే ఇవి ఒక బ్రష్‌లా పనిచేస్తాయి. 0.5 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందముండే సూక్ష్మజీవులను లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడమే వీటి పని.

ఫలితంగా వడపోత జరిగి సూక్ష్మజీవులు ముక్కు నుంచి బయటకు వచ్చేస్తుంటాయి.

శ్వాస

ఫొటో సోర్స్, Getty Images

నోటితో ఎందుకు వద్దంటే..

మరోవైపు ముక్కులోని కణజాలం కూడా గాలిలోని సూక్ష్మజీవుల వడపోతకు అనువుగా ఉంటుంది. ఇక్కడ ఉండే శ్లేష్మం కూడా కొన్ని సూక్ష్మజీవులను లోపలకు అనుమతిస్తుంది. ముఖ్యంగా మన శరీరానికి హానిచేయని సూక్ష్మజీవులను అనుమతిస్తుంది.

అయితే, శ్లేష్మాన్ని దాటుకుని వచ్చే కొన్ని హానికర సూక్ష్మజీవులను అడ్డుకోవడంలో టైప్-బీ కణాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు ఐఏజీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మరి నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది? నోరు అనేది ప్రధానంగా ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ గాలిని వడపోసే సిలియా లాంటి నిర్మాణాలేవీ కనిపించవు.

ముఖ్యంగా ఆహారం నుంచి వచ్చే సూక్ష్మజీవులు శరీరంపై ప్రభావం చూపించకుండా ఇక్కడి వ్యవస్థ అడ్డుకుంటుంది.

అందుకే మనం ముక్కు నుంచి ఆహారం తీసుకోకూడదు. నోటి నుంచి గాలి తీసుకోకూడదు.

శ్వాస

ఫొటో సోర్స్, Getty Images

ముఖాల ఎముకల్లో మార్పు..

కొన్ని రకాల జన్యు మార్పులతోపాటు ముక్కులోని శ్వాస నాళాల సమస్యల వల్ల కొంతమంది నోటితో శ్వాస తీసుకుంటారు.

నిద్ర సమస్యలు కూడా కొన్నిసార్లు నోటితో శ్వాస తీసుకోవడానికి కారణం అవుతాయి.

అయితే, దీర్ఘకాలం నోటితో శ్వాస తీసుకునే పిల్లల్లో మొహంలోని ఎముకలు ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ముఖ్యంగా ఎముకల అభివృద్ధి, దంతాల సమస్యలకు ఇది కారణం అవుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.

పెద్ద వాళ్లలో అయితే, నోటితో శ్వాస తీసుకోవడంలో ముఖంలోని కండరాలు, మెడ నొప్పులతోపాటు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

వీడియో క్యాప్షన్, నోటితో గాలి పీల్చుకుంటే ఏమవుతుంది?
శ్వాస

ఫొటో సోర్స్, Getty Images

నోటితో శ్వాస తీసుకునే వారిపై స్పెయిన్‌లోని జనరల్ కౌన్సిల్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ డెంటిస్ట్స్ అండ్ స్టమటాలజిస్ట్స్ 2020లో ఓ అధ్యయనం చేపట్టింది. దీనిలో పాల్గొన్న 12 ఏళ్ల వయసున్న పిల్లల్లో సగం మంది దంతాల సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.

అదే పెద్దల విషయానికి వస్తే, శ్వాస తీసుకోవడానికి వీలుగా మెడను కాస్త ముందుకు వంచాల్సి ఉంటుందని, ఫలితంగా కండరాల నొప్పులు వస్తాయని ఆ అధ్యయనంలో తేలింది.

ముక్కుతో శ్వాస తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై మీకు ఏమైనా సందేహాలుంటే, ఒకసారి నోటితో శ్వాస తీసుకొని చూడండి. ముక్కుతో తీసుకునే శ్వాస సహజంగా ఉంటే, నోటితో బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది.

అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నోటితో శ్వాస తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)