ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?

ఆంగ్లో ఇండియన్స్

ఫొటో సోర్స్, RUCHELLE BARRIE

రుచెల్ బారీ. పాఠశాలలో ఆమెకు స్థానమే లేనట్లు ఆమె ఫీలవుతుండేది. అక్కడ ఆమె పేరును కూడా ఎవరూ సరిగ్గా పలికేవారు కాదు.

హిందీ లేదా మరాఠీని ఎక్కువగా మాట్లాడే ముంబై నగరంలో రుచెల్ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటమూ ఓ సమస్యగానే మారింది.

ఆమెను చాలామంది చాలా ప్రశ్నలు అడిగేవారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కుటుంబం భారతదేశానికి చెందినదా, కాదా ? ఆంగ్లో-ఇండియన్ అంటే ఏమిటి?

చివరి ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టతరం. దీంతో ఆమె తప్పించుకోవడం నేర్చుకున్నారు. తన గుర్తింపులో అనుమానాల కారణంగా సమాజం నుంచి దూరంగా వెళ్లేవారు.

ఆంగ్లో-ఇండియన్ అనే పదం సాధారణంగా బ్రిటిష్, భారతీయ తల్లిదండ్రులను సూచిస్తుంది.

కానీ చట్టబద్ధంగా వారి తండ్రి యూరోపియన్ సంతతికి చెందిన భారతీయ పౌరుడు అని అర్థం. అంటే వారి తండ్రి పూర్వీకులు బ్రిటిష్, ఫ్రెంచ్ లేదా పోర్చుగీస్ వారు కావచ్చు,

ఇది భారతదేశంలో వలసరాజ్యాల సుదీర్ఘ చరిత్రను ప్రతిబింబిస్తుంది.

బారీకి 30 ఏళ్లు. ఆమె తండ్రి ఫ్రెంచ్ సంతతికి చెందినవారు. తల్లిది బ్రిటీష్ నేపథ్యం. ఆమె ఐడెంటిటీ విషయంలో ఇప్పటికీ ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

ఆంగ్లో ఇండియన్స్

ఫొటో సోర్స్, MUNA BEATTY

మూలాలను ఎలా తెలుసుకుంటున్నారు?

బారీ మాట్లాడుతూ "ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పూర్వీకుల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా" అని చెప్పారు.

ఆమె ఆంగ్లో-ఇండియన్లు గల ఫేస్‌బుక్ గ్రూప్‌లో చేరారు. అక్కడ ఆమె కమ్యూనిటీ గురించి, దాని సంస్కృతి గురించి ప్రశ్నలు అడుగుతారు.

బారీతో సహా అనేక మంది యువ ఆంగ్లో-ఇండియన్‌లు ఆ గ్రూపులో ఉన్నారు.

వారంతా తమ మూలాల గురించి లోతుగా తెలుసుకోవడానికి, వారి కమ్యూనిటీ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది దీనిని మరచిపోయే ప్రమాదం ఉంది.

కొందరు తమ కుటుంబ చరిత్రను పరిశోధిస్తున్నారు, డాక్యుమెంట్ చేస్తున్నారు. దూరంగా ఉంటున్న బంధువులతో సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నారు.

మిగతావారు తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటూ వాటిని సంరక్షించే మార్గాలపై దృష్టిపెట్టారు.

ఈ విధానంలో మరిచిపోయిన తమ సంస్కృతిని పెంపొందించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఆంగ్లో ఇండియన్స్

ఫొటో సోర్స్, BRIDGET WHITE-KUMAR

ఇండియాలో ఎంతమంది ఉన్నారు?

బ్రిటీష్ వ్యక్తులు భారతదేశాన్ని విడిచిపెట్టడంతో 1947 నుంచి ఆంగ్లో-ఇండియన్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని నిపుణులు అంటున్నారు.

అయితే ఈ వాదనపై అధికారిక గణాంకాలైతే లేవు.

2011లో భారతదేశం చివరి జనాభా గణనలో కేవలం 296 మంది ఆంగ్లో-ఇండియన్లు మాత్రమే ఉన్నారు.

అయితే ఈ సంఖ్యను ఆ కమ్యూనిటీ సభ్యులు ఇది హాస్యాస్పదం అంటూ కొట్టిపారేశారు.

దేశంలో దాదాపు 3,50,000-4,00,000 మంది ఆంగ్లో-ఇండియన్లు ఉన్నారని తమ సభ్యుల సంఖ్య సూచిస్తోందని ఆలిండియా ఆంగ్లో-ఇండియన్ అసోసియేషన్ పాలకమండలి సభ్యుడు క్లైవ్ వాన్ బ్యూర్లే వాదిస్తున్నారు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లారు.

అక్కడికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఇది దశాబ్ధాలుగా జరుగుతోంది. ఈ కారణంగా వారు తమ సంస్కృతికి దూరమయ్యారు. ఇప్పుడు వారంతా కలిసే అవకాశం ఏర్పడింది.

16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను వలస రాజ్యంగా చేసుకున్నారు.

రచయిత అయిన బారీ ఓబ్రియన్ తన 'ది ఆంగ్లో ఇండియన్స్‌ : ఎ పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ' అనే పుస్తకం రాశారు.

వలసవాదులు తమకు విధేయంగా ఉండే సమాజాన్ని సృష్టించడానికి, వలస రాజ్యంలో సౌకర్యవంతంగా జీవించడానికి స్థానిక మహిళలను వివాహం చేసుకోవాలని అప్పట్లో పోర్చుగీసు ఉన్నతాధికారులు సైనికులను ప్రోత్సహించారు.

ఆ తర్వాత బ్రిటిష్ వారు కూడా ఈ వ్యూహాన్ని అనుసరించారు.

ఆంగ్లో ఇండియన్స్

ఫొటో సోర్స్, CECILIA ABRAHAM

ఆంగ్లో-ఇండియన్స్‌పై వివక్ష ఎందుకు?

‘‘ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతుల కలయికతో ఆంగ్లో-ఇండియన్ ఐడెంటిటీ డెవలప్ అయ్యింది’’ అని విద్యావేత్త మెరిన్ సిమి రాజ్ అంటున్నారు.

కానీ ఈ సంస్కృతుల సమ్మేళనం అసౌకర్యానికి, పరాయీకరణకు కూడా మూలంగా మారింది.

"చర్మం రంగు, మిశ్రమ జాతి కారణంగా బ్రిటిష్ వారి నుంచి ఆంగ్లో-ఇండియన్స్ వివక్షకు గురయ్యారు. రాజరికం పట్ల వీరికి ఉన్న విధేయత కారణంగా స్థానిక భారతీయులు కూడా ఆంగ్లో-ఇండియన్స్‌ని అనుమానంతో చూశారు" అని రాజ్ వివరించారు.

ఆ పరాయీకరణ భావన పూర్తిగా అదృశ్యం కాలేదు. 2019లో తమ రెండు పార్లమెంటరీ సీట్ల కోటాను రద్దు చేయడంతో ఆంగ్లో-ఇండియన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మా ఐడెంటిటీని మా ప్రభుత్వమే గుర్తించనట్లుగా ఉంది" అని వాన్ బ్యూర్లే వ్యాఖ్యానించారు.

ఆంగ్లో-ఇండియన్ సంఘాలు రాజకీయ ప్రాతినిధ్యం కోసం వాదిస్తుండగా, బారీ వంటి వ్యక్తులు బంధుత్వం, సంఘీభావంపై ఆన్‌లైన్‌లో దృష్టిపెట్టారు.

బారీ మాట్లాడుతూ తాను "పక్కా ఆంగ్లో-ఇండియన్ హోమ్"లో పెరిగానని తెలిపారు.

మెర్లే హగార్డ్, బక్ ఓవెన్స్ ల పాటలు వింటూ, మీట్ బాల్ కూర, కొబ్బరి అన్నం, డెవిల్ చట్నీని ఆస్వాదిస్తూ పెరిగానని బారీ పేర్కొన్నారు.

వలసరాజ్యాల వంటకాల నుంచి, మరుగునపడిన తన కుటుంబ వారసత్వం వరకు... మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తాను ఆకలితో ఉన్నట్లు ఆమె చెప్పారు.

బ్రిడ్జేట్ వైట్-కుమార్ చాలా వంట పుస్తకాలను రాశారు. మైక్రోవేవ్ ఓవెన్‌లో ఆంగ్లో-ఇండియన్ వంటను వండటానికి సులభమైన పద్దతులున్న పుస్తకం ఇటీవలే వచ్చింది.

ఆంగ్లో-ఇండియన్ ఆహారాన్ని తయారుచేయడానికి చాలా మంది యువత "సులభమైన, సరళమైన, ఒత్తిడి లేని మార్గాలను"వెతుకుతున్నారని బ్రిడ్జేట్ చెబుతున్నారు.

"ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ భారతదేశం నుంచి వచ్చింది. కాబట్టి మా వంటకాల సంస్కృతిని సంరక్షించడం, వాటిని యువ తరాలకు అందించడం చాలా ముఖ్యం" అని ఆమె పేర్కొన్నారు.

ఆంగ్లో ఇండియన్స్

ఫొటో సోర్స్, AFP

మూలాల కోసం పాత రికార్డులు పరిశీలన

చాలామంది తమ కుటుంబ చరిత్రను పరిశోధిస్తూ వారి సొంత గుర్తింపును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

బెంగుళూరుకు చెందిన మునా బీటీ, ఆమె భర్త మైఖేల్‌లు వెబ్‌సైట్‌ల ద్వారా జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాలు వంటి పాత రికార్డులను పరిశీలించారు.

సైనిక కార్యాలయాలు, చర్చిలు, శ్మశానవాటికలు, పాత వలస కాలపు బంగ్లాలను సందర్శించి వారి పూర్వీకులు ఎక్కడ నివసించారు? ఎక్కడ పనిచేశారు లేదా ఎక్కడ ఖననం చేశారు? లాంటివి తెలుసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులతో మళ్లీ కనెక్ట్ కావడానికి ఈ అన్వేషణ తమకు సహాయపడిందని బీటీ అంటున్నారు.

ఆమె ఇప్పుడు ఫైండింగ్ ది బీటీస్ అనే వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు.

మార్సెల్లే బ్రిట్టో అనే ఆంగ్లో ఇండియన్ మహిళ చేసిన ప్రయత్నాలు తన తల్లి బాల్యం గురించి తెలుసుకోవడానికి సహాయపడింది.

మార్సెల్లే తండ్రి ఐరిష్ వంశానికి చెందిన వ్యక్తి. దీంతో మార్సెల్లే తల్లి తన సంస్కృతికి పూర్తి భిన్నమైన జీవితం గడిపారు.

డజన్ల కొద్దీ పనివాళ్లున్న ఒక పెద్ద వలస పాలకుల బంగ్లాలో పెరిగారు. టీ పార్టీలు, బాల్రూమ్ నృత్యాలకు ఆమెకు ఆహ్వానం అందేది.

బ్రిట్టో 1700 సంవత్సరం వరకు గల తన పూర్వీకులనైతే కనుగొనగలిగారు.

"నా తల్లి కథలు, నా సొంత గుర్తింపు ఇప్పుడు మరింత అర్థవంతంగా ఉన్నాయి" అని మార్సెల్లే అంటున్నారు.

వాన్ బ్యూర్లే మాట్లాడుతూ ''ఆంగ్లో-ఇండియన్లు తమ పూర్వీకుల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

ఎందుకంటే విదేశాలకు వలస వెళ్లడానికి ఇది వారికి ఎంతో సాయపడుతుంది. కానీ ఇండియాలో వారి కమ్యూనిటీ కలిసిపోవడంతో, చాలామంది దేశాన్ని విడిచిపెట్టడం లేదు.

తమ పూర్వీకులు, వారి గుర్తింపు ఇకపై రుజువుగా చూపించుకోవడం కంటే వారి చరిత్ర అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత చరిత్ర మరింత తెలుసుకోవడానికి ఇది ఒక ఉత్తేజకరమైన ప్రయాణం" అని బ్యూర్లే అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఆంగ్లో-ఇండియన్స్ ఏమంటున్నారు?

హైదరాబాద్‌కు చెందిన సిసిలియా అబ్రహం (47) ఆంగ్లో ఇండియన్ స్టోరీస్ అనే పేరుతో సోషల్ మీడియాలో క్రౌడ్‌సోర్స్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నారు.

ఇక్కడ కుటుంబ ఫొటోలు, పాత జ్ఞాపకాలను పంచుకోవడానికి తమ కమ్యూనిటీ సభ్యులను ప్రోత్సహిస్తారు.

ఆంగ్లో-ఇండియన్ పెంపకంలోనే పెరిగినప్పటికీ సిసిలియా తన పూర్వీకుల గురించి పెద్దగా తెలియదని చెబుతున్నారు.

తన తండ్రి "భారతీయ క్రైస్తవుడు" అని పిలిపించుకోవడానికే ఇష్టపడతారని అంటున్నారు సిసిలియా.

''ఆంగ్లో-ఇండియన్లు ఎక్కువగా మద్యం సేవిస్తారు, పార్టీలు చేసుకుంటారు. ఉన్నత చదువులు చదువుకోలేదు" అని ఆమె తెలిపారు.

"మా నాన్నగారు మమ్మల్ని అలా చూడాలని అనుకోలేదు" అని సిసిలియా చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టులో భారతదేశ రైల్వేలు, మిలిటరీతో తమ కుటుంబాలకు ఉన్న సంబంధాలు, స్వాతంత్య్రానికి ముందు, తరువాత జీవితం ఎలా ఉండేదో పలువురు వివరిస్తుంటారు.

కొంతమంది దగ్గరి బంధువులతో సంబంధాలు తెగిపోయాయని చింతిస్తుంటారు. ప్రజలు తమ గుర్తింపు తెలుసుకుని గర్వపడేలా తన ప్రాజెక్టు సహాయపడుతుందని సిసిలియా ఆశిస్తున్నారు.

"మేం ఏదైనా ఇష్టపడినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం. దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. సంస్కృతితో సహా చాలా విషయాలు భవిష్యత్తు తరాలకు కోసం భద్రంగా ఉంటాయి’’ అని సిసిలియా అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.