తుర్కియే, సిరియా భూకంపం: శిథిలాలలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు ఏం చెబుతున్నారు?

చిన్నారి అయా
ఫొటో క్యాప్షన్, చిన్నారి అయా

వాయువ్య సిరియాలో సోమవారం నాడు సంభవించిన భూకంపం కారణంగా కూలిపోయిన ఒక భారీ భవనపు శిథిలాలలో అప్పుడే పుట్టిన ఒక చిన్నారి కూడా ఉంది. ఇప్పడా చిన్నారిని దత్తత తీసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ముందుకు వస్తున్నారు.

ఆ పాపను రక్షించిన సమయంలో ఆమె బొడ్డుతాడు కూడా తెగలేదు. అప్పటికి ఆమె తన తల్లికి అనుసంధానమయ్యే ఉంది.

ఈ పాపకు అయా అని పేరు పెట్టారు. అయా అంటే అరబ్బీ భాషలో అద్భుతం అని అర్ధం.

జిందాయిరిస్ పట్టణంలో భూకంపం సంభవించడంతో ఆమె తల్లి, తండ్రితోపాటు ఆమె నలుగురు తోబుట్టువులు కూడా మరణించారు.

ప్రస్తుతం అయా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

''సోమవారంనాడు పాప మా దగ్గరకు వచ్చే సమయానికి చాలా దయనీయంగా ఉంది. శరీరం చల్లబడి ఉంది. ఒంటి మీద అనేక గాయాలున్నాయి. ఊపిరి కూడా పీల్చుకునే స్థితిలో లేదు'' అని అయాకు చికిత్స అందిస్తున్న శిశువైద్యుడు హనీ మరూఫ్ వెల్లడించారు.

ఆయా ను రక్షిస్తున్నప్పటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫుటేజీలో ఒక వ్యక్తి కూలిన భవనం శిథిలాల నుంచి పరిగెత్తుతూ కనిపిస్తారు. ఆయన చేతిలో దుమ్ముతో నిండిన ఒక చిన్నారి ఉంది.

అయా ను రక్షించిన వ్యక్తి పేరు ఖలీల్ అల్-సువాడి. అయా కు దూరపు బంధువు. శిథిలాల నుంచి ఆమెను రక్షించి సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో ఉన్న డాక్టర్ మరూఫ్ వద్దకు తీసుకువచ్చారు.

చిన్నారి అయాను పరిశీలిస్తున్న డాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నారి అయాను పరిశీలిస్తున్న డాక్టర్

దత్తత తీసుకోవడానికి పోటీ

ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన తర్వాత అనేకమంది ఆ చిన్నారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. దత్తత తీసుకుంటామని కోరుతున్నారు. అయితే, ఆ చిన్నారిని ఇప్పటికే ఆమె పెద్ద మామ దత్తత తీసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి.

"నేను ఆమెను దత్తత తీసుకొని ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను" అని ఒక వ్యక్తి చెప్పారు. ''చట్టపరమైన ఇబ్బందులు ఏమీ లేకపోతే నేను ఈ బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అని కువైట్‌కు చెందిన ఒక టీవీ యాంకర్ అన్నారు.

అయాను తాము పెంచుకుంటామంటూ ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్దీ కాల్స్ వచ్చాయని హాస్పిటల్ మేనేజర్ ఖలీద్ అట్టియా చెప్పారు.

వీడియో క్యాప్షన్, సిరియా శిధిలాల్లో శవంగా మారిన తల్లి నుంచి బొడ్డు తాడు కోసి బిడ్డను రక్షించిన సహాయ బృందాలు

డాక్టర్ అట్టియాకు కూడా ఒక కుమార్తె ఉన్నారు. ఆమె అయా కన్నా నాలుగు నెలలు పెద్ద. అయితే, ఈ పాపను తాను ఎవరికీ ఇవ్వబోనని డాక్టర్ అట్టియా అంటున్నారు.

''నేను ఈ పాపను ఎవరికీ దత్తతకు ఇవ్వను. ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పే వరకు సొంత కూతురిలాగే చూసుకుంటాను'' అని డాక్టర్ అట్టియా చెప్పారు.

ప్రస్తుతం అట్టియా భార్య తన కుమార్తెతో పాటు అయాకు కూడా పాలిచ్చి పెంచుతున్నారు.

భూకంపం అనంతర దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూకంపం అనంతర దృశ్యం

ఇంకా శిథిలాల కింద కొందరు...

డాక్టర్ అట్టియా సొంతూరైన జిందాయిరిస్‌ సోమవారం నాటి భూకంపానికి తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు తమ వారి కోసం కూలిపోయిన భవనాల శిథిలాలలో ఇంకా వెతుకుతూనే ఉన్నారు.

''పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శిథిలాల కింద చాలా మంది ఉన్నారు'' అని స్థానికంగా పని చేసే జర్నలిస్టు ఒకరు బీబీసీతో అన్నారు. పట్టణం 90% ధ్వంసమైందని ఆయన వెల్లడించారు.

అలెప్పో నగరంలో భూకంప ప్రభావంతో శిథిలాలుగా మారిన భవనాలు
ఫొటో క్యాప్షన్, అలెప్పో నగరంలో భూకంప ప్రభావంతో శిథిలాలుగా మారిన భవనాలు

రంగంలోకి దిగిన వైట్ హెల్మెట్స్

సిరియా అంతర్యుద్ధం సమయంలో కూలిన భవనాల నుంచి ప్రజలను వెలికితీయడంలో అనుభవం ఉన్న వైట్ హెల్మెట్స్ సంస్థ జిందాయిరిస్ పట్టణంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తోంది.

''భవనం మరీ పాతదైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు కూడా బాధితులుగా మారే ప్రమాదం ఉంది'' అని వైట్ హెల్మెట్స్ సంస్థకు చెందిన మహమ్మద్ అల్-కమెల్ అన్నారు.

''మేము ఈ శిథిలాల నుండి మూడు మృతదేహాలను బయటకు తీశాం. లోపల ఇంకా ఒక కుటుంబం సజీవంగా ఉందని మేము భావిస్తున్నాము. వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం'' అని ఆయన వెల్లడించారు.

సిరియాలో భూకంపం కారణంగా 3,000 మందికి పైగా మరణించారు. అయితే, ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో సంభవించిన మరణాలు ఇంకా తెలియరాలేదు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)