హైదరాబాద్: ఎలక్ట్రిక్ కార్లు పోటీ పడే ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది

ఫార్ములా ఈ రేసులోని కారు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్ జరగబోతోంది. ఈ శనివారం జరిగే రేసుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.

హుస్సేన్ సాగర్ తీరంలో ఝామ్మంటూ దూసుకుపోనున్నాయి రేస్ కార్లు.

ఫార్ములా వన్ రేస్ లు చాలా మందికి తెలుసు. ఈ ‘ఫార్ములా ఈ’ సంగతి ఏంటి?

ఈ కార్ రేసులను నిర్వహించేది ఎఫ్ఐఎగా పిలిచే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీల సమాఖ్య ఇది. గత 70 ఏళ్లుగా ఇది ఫార్ములా-1 పేరుతో కార్ రేసులను నిర్వహిస్తోంది.

పదేళ్లుగా ఫార్ములా -ఈను ప్రారంభించింది. ఆ క్రమంలో భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ జరగబోతోంది. దాదాపు పదేళ్ల కిందట దిల్లీలో ఫార్ములా -1 రేస్ జరిగింది.

ఇన్నేళ్ల తరువాత మళ్లీ భారత్ లో ప్రపంచ స్థాయి కార్ రేసింగ్ జరుగుతోంది. మధ్యమధ్యలో దేశీయ స్థాయి రేసింగ్‌లు జరిగినప్పటికీ, ఒక అంతర్జాతీయ ప్రామాణిక రేసింగ్ దిల్లీ ఫార్ములా వన్, హైదరాబాద్ ఫార్ములా ఈ లే.

ఫార్ములా వన్ పేరుతో అంతర్జాతీయంగా కార్ రేస్ పోటీలు జరుగుతూ ఉంటాయి. అయితే పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ‘ఫార్ములా ఈ’ ప్రత్యేకత. అటు రేసింగ్ తో పాటూ ఇటు ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడం వీటి ఉద్దేశం.

2014 బీజింగ్ ఒలింపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ’ జరిగింది. ఎఫ్ఐఎ సంస్థ ‘ఫార్ములా ఈ’కి 2020లో వాల్డ్ ఛాంపియన్షిప్ హోదా ఇచ్చింది.

2014లో బీజింగ్‌లో ఈ రేస్ ప్రారంభం కాగా చివరి సారి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. ఆ తరువాత ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్ తరువాత దక్షిణ ఆఫ్రికా కేప్ టౌన్‌లో తరువాత రేస్ జరగబోతోంది.

అనేక దేశాలు ఈ రేస్‌కి శాశ్వత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. దిరియా, మొక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగారాల్లో ఈ పోటీ ఏటా జరుగుతాయి. 2023లో కొత్తగా భారతదేశం నుంచి హైదరాబాద్, బ్రెజిల్ నుంచి సావో పాలో నగరాలు ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉన్నాయి.

ఫార్ములా ఈ రేసులో కారు

ఇండియా నుంచి మహీంద్ర ఒక్కటే

సాధారణంగా రేసుల్లో ఆయా ఆటోమొబైల్ కంపెనీలు తమ టీములను రంగంలోకి దింపుతాయి. ఆయా కంపెనీలకు ఇది మంచి ప్రచారం. అలాగే కరెంటు కార్లలో కూడా అదే పద్ధతి. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఎలక్ట్రికల్ కార్ల కంపెనీలు ఇందులో తమ జట్లను రంగంలోకి దించుతున్నాయి. భారతదేశానికి చెందిన మహీంద్ర ఎలక్ట్రికల్ సంస్థ ఒక్కటే తమ జట్టును ఈ బరిలో దించుతోంది. మహీంద్రా ఆటోమొబైల్స్ సంస్థ ‘ఫార్ములా ఈ’ ప్రారంభం అయినప్పటి నుంచీ తన టీమ్ ని రంగంలోకి దించుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కార్ రేస్ అంటే ఒకప్పుడు ‘ఫార్ములా వన్’ మాత్రమే ఉండేది. తరువాత ‘ఫార్ములా ఈ’ మొదలు అయింది. ‘ఫార్ములా వన్’లో కార్లు ఫ్యూయల్‌తో నడిస్తే, ‘ఫార్ములా ఈ’లో ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయి. అదే ప్రధాన తేడా. ఫార్ములా వన్ 1950లలో మొదలు అయితే, ఫార్ములా ఈ 2014లో మొదలు అయింది. ప్రస్తుతం ఎఫ్ఈ లేదా ఫార్ములా ఈలో మొత్తం 10 టీములు పోటీ పడుతుండగా, ఎఫ్1 లేదా ఎఫ్ వన్ లేదా ఫార్ములా వన్‌లో మొత్తం 11 టీములు ఉంటాయి.

నిజానికి ‘ఫార్ములా 1’తో పాటూ ‘ఫార్ములా 2’, ‘ఫార్ములా 3 ’కూడా జరుగుతాయి. కానీ వాటిలో ‘ఫార్ములా వన్’ ప్రతిష్టాత్మకమైనది. ఫ్యూయల్ కార్ల రేస్‌లో ‘ఫార్ములా వన్’ ఎలానో, ఎలక్ట్రికల్ కార్ల రేసులో ‘ఫార్ములా ఈ’ అలా అన్నమాట.

ఫార్ములా ఈ రేసు నిర్వహించే రోడ్

హైదరాబాద్‌లో ప్రధాన రేస్

ఈ ఫిబ్రవరి 11 శనివారం హైదరాబాద్‌లో ప్రధాన రేస్ జరగబోతోంది. 10వ తేదీ శుక్రవారం ప్రాక్టీస్ రేస్ జరుగుతుంది. దీనికి సన్నద్ధంగా 2022 నవంబర్ లోనే ప్రాక్టీస్ సెషన్లు జరిగాయి. ఇప్పుడు ప్రధాన ఈవెంట్ జరగబోతోంది.

''ఇంత ప్రతిష్టాత్మకమైన రేస్ మొదటిసారి తెలంగాణ, హైదరాబాద్‌లో జరగడం చరిత్రాత్మకం. దీన్ని హోస్ట్ చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వానికీ, గ్రీన్ కో కంపెనీకి మా ధన్యవాదాలు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి, మార్కెట్ పెరుగుతున్నాయి. అలాగే కొత్త తరం ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ స్పోర్ట్ వైపు చూడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది'' అని ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడు అబ్దుల్ ఇబ్రహీం బీబీసీతో అన్నారు. ఆయన ఎఫ్ఐఎ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఫార్ములా ఈ రేసు

ఫొటో సోర్స్, Sam Bloaxham FIA Formula E

అసలు ఇంతకీ ఫార్ములా వన్ కీ ఫార్ములా ఈ కీ తేడా ఏంటి?

ఈ రెండిటి మధ్యా ప్రధాన తేడా ‘ఫార్ములా వన్’లో కార్లు శిలాజ ఇంధనాలతో నడుస్తాయి. కానీ ‘ఫార్ములా ఈ’ మాత్రం ఎలక్ట్రికల్ వాహనాలు అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ రక్షణ, పెట్రోల్, డీజీల్ వంటి తరిగిపోయే ఇంధనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మళ్లే ఆవశ్యకత, కాలుష్య నివారణ వంటి కాన్సెప్టుల్లో భాగంగా 'ఈ' వాహనాలను ప్రోత్సహించే క్రమంలో ‘ఫార్ములా ఈ’ ప్రారంభం అయింది.

ఎఫ్ 1 రేసులకూ, ఎఫ్ ఈ రేసులకూ ప్రధాన తేడా ట్రాక్. సర్క్యూట్‌గా పిలిచే ఈ ట్రాక్ విషయంలో ఎఫ్ 1 కి చాలా పెద్ద నిబంధనలు ఉన్నాయి. ఎఫ్ 1 ట్రాకులను ప్రత్యేకంగా నిర్మిస్తారు. అవి చాలా దూరం ఉంటాయి. పెద్దగా ఉంటాయి. ప్రత్యేకంగా రేస్ కోసం సిద్ధం చేస్తారు వాటిని. అంతేకాదు రేస్ మధ్యలో ఇంజిన్ సమస్య లేదా టైర్ మార్పులకు కొన్ని స్టాప్స్ కూడా పెడతారు.

కానీ ఎఫ్ ఈ రేసులకు అంత పెద్ద ట్రాక్ అక్కర్లేదు. అందుకే ఎఫ్ ఈ ని స్ట్రీట్ సర్క్యూట్‌లో నిర్వహిస్తారు. స్ట్రీట్ సర్క్యూట్ అంటే ఆయా నగరాల్లో అప్పటికే ఉన్న రోడ్లపై కొన్ని కనీస ఏర్పాట్లు చేసి, రేస్ నిర్వహిస్తారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న రోడ్డుపై ఈ రేస్ నిర్వహిస్తున్నారు. వీటి దూరం కూడా కాస్త తక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా ట్రాక్ వేయడం ఉండదు.

రేస్ జరిగే సమయం కూడా ఎఫ్ వన్ కంటే ఎఫ్ ఈకి తక్కువ. ఎఫ్ వన్ రేసులు మూడు రోజుల పాటూ జరుగుతాయి. మొదటి రోజు ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయనిస్తారు. రెండవ రోజు క్వాలిఫైయింగ్ రౌండ్ ఉంటుంది. మూడవ రోజు అసలు రేస్ జరుగుతుంది. కానీ ఎఫ్ ఈ లో మాత్రం అన్నీ కలిపి రెండు రోజుల్లోనే ముగిస్తారు.

సహజంగానే ఎలక్ట్రికల్ వాహనాలు కావడంతో ఎఫ్ 1 తో పోలిస్తే, ఎఫ్ ఈ లో సౌండ్ తక్కువ వస్తుంది. స్పీడ్ విషయంలో మాత్రం ఎఫ్ 1 కార్లే ఎక్కువ స్పీడ్ వెళతాయి. ఎఫ్ఐఎ నియమాల ప్రకారం, ఎఫ్ 1 కార్లు దాదాపు గంటకు 400 కిమీ స్పీడ్ వరకూ అందుకుంటాయి, ఎఫ్ఈ కార్లు గంటకు 322 కిమీ వరకూ స్పీడు వెళతాయి.

రేస్ కార్

ఫొటో సోర్స్, Sam Bloaxham FIA Formula E

జెన్ 3 కార్ల రేసింగ్

మొదటిసారి ప్రస్తుత 9వ సీజన్‌లో ‘జెన్ 3’ కార్లతో రేస్ నడవబోతోంది. గత 8 సీజన్లలో జెన్ టూ కార్లు నడిచాయి. జెన్ టూ, జెన్ త్రీ కార్లమధ్య ప్రధాన తేడా ఇంధన పొదుపు, అలాగే మరింత పర్యావరణ హితమైన, అదే సమయంలో మరింత సమర్థమైన బండిగా జెన్ త్రీ కార్లు తయారు అవుతాయి. జెన్ త్రీ కార్లలో మూడు బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి.

బ్రేక్ వేసినప్పుడు రీజనరేటివ్ పద్ధతిలో కరెంటు ఉత్పత్తి అవుతుంది. తక్కువ శబ్దం వస్తుంది.

విజేతను ఎలా నిర్ణయిస్తారు?

మన క్రికెట్ మ్యాచుల్లా వరుసగా జరిగిన మ్యాచులను బట్టి టోర్నమెంటు విజేతను నిర్ణయించడం ఉండదు.

ఒక టోరనీలో కొన్ని సీజన్లు ఉంటాయి. ఒక్కో సీజన్లో కొన్ని రేసులు ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది అంటే, 2023 లో ఫార్ములా వన్‌లో మొత్తం 23 రేసులు, ఫార్ములా ఈ లో మొత్తం 16 రేసులూ నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్ పొందిన పాయింట్ల వారీగా, సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ ఛాంపియన్‌ను ప్రకటిస్తారు.

వీడియో క్యాప్షన్, ఎగిరే రేసు గుర్రాలు: ఆకాశంలో ఫార్ములా-1 రేస్... పాల్గొనే కార్లు ఇవే

హైదరాబాద్కి అవకాశం ఎలా దక్కింది?

భారతదేశంలో ఫార్ములా రేస్‌లు జరపాలనే కోరిక చాలా ప్రభుత్వాలకు ఉండేది. 1997లో కలకత్తాలో నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి. 2003 నాటికి చెన్నై, కోయంబత్తూరుల్లో మాత్రమే రేస్ ట్రాకులు ఉండేవి. తరువాత ఈ విషయంలో బెంగళూరు, హైదరాబాద్ లు పోటీ పడ్డాయి. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు ఏర్పోర్టు దగ్గర 640 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధ పడగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1,500 ఎకరాలు వరకూ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

2007లోనే హైదరాబాద్‌లో ఫార్ములా వన్ నిర్వహించడం కోసం 2003లో ఒప్పందం కూడా జరిగింది. కానీ 2004లో మళ్లీ హైదరాబాద్‌కి ముంబై పోటీగా వచ్చింది. తరువాత రకరకాల కారణాలతో రెండూ జరగలేదు. మొత్తానికి అన్ని అడ్డంకులూ దాటి 2011లో దిల్లీ శివార్లలో అప్పటికి అధునాతనంగా నిర్మించిన బుద్ధ సర్క్యూట్‌లో రేస్ జరిగింది. ఆ తరువాత 2013లో అదీ ఆగిపోయింది.

తిరిగి 2021 తరువాత హైదరాబాద్‌లో రేస్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా వంటి వారు చొరవ చూపి కమిటీగా ఏర్పడ్డారు. రేస్ నిర్వహణకు స్పాన్సర్‌గా తెలంగాణ ప్రభుత్వంతో పాటూ గ్రీన్ కో కంపెనీ ముందుకు వచ్చింది.

2022 జనవరిలో ఫార్ములా ఈ బృందం హైదరాబాద్ వచ్చి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిగింది. అప్పుడే నిర్వాహకులు హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలు సందర్శించి అనుకూలతలను చర్చించారు. ఈ అగ్రిమెంటు జరిగినప్పుడు ''ఎన్నో ఏళ్ల కల నెరవేరింది'' అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఆ తరువాత అనేక చర్చలు, ఏర్పాట్లు, పరిశీలనలూ అన్నీ జరిగాయి. చివరగా 2022 జూన్ లో హైదరాబాద్ వేదికగా రేస్ జరుగబోతున్నట్టు ప్రకటన విడుదల అయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ప్రధాన ఈవెంట్‌కి తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్ కో కంపెనీలు నిర్వహణ బాధ్యత తీసుకున్నాయి.

ట్రాక్ సిద్ధం చేసే పని ప్రభుత్వం చేయగా, మిగతావన్నీ గ్రీన్ కో తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున మేఘా సంస్థ ట్రాక్ నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. దీని కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా రోడ్లను ఫార్ములా ప్రమాణాలతో వేశారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో కార్లు వెళ్లినా తట్టుకునేలా నిర్మించారు. చాలా చెట్లను కొట్టేశారు.

ఈ రేస్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ - సచివాలయం - ఎన్టీఆర్ ఘాట్- ఐమాక్స్, యూటర్న్, ఎన్టీఆర్ మార్గ్ - లుంబినీ - మీదుగా సాగుతుంది. పాల్గొన్న వారికీ, ప్రేక్షకులకీ, సిబ్బందికీ ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. జనాలు చూడ్డానికి వీలుగా గాలరీలు ఏర్పాటు చేశారు. ట్రాక్ మీదకు ఎవరూ రాకుండా మెస్‌లను ఏర్పాటు చేశారు.

ఐమాక్స్ దగ్గర 11 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 2.37 కిలోమీటర్ల ట్రాక్ ఉంటుంది.

''ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి ప్రమోటర్స్‌తో చర్చలు జరిపింది. అటు హైదరాబాద్ నగరానికే చెందిన గ్రీన్ కో కంపెనీ ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తోంది. ప్రభుత్వ మద్దతు, గ్రీన్ కో ఏర్పాట్లతో ఎఫ్ఐఎ సంతృప్తి చెందింది. వాళ్లు అన్నీ పరిశీలించే హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తున్నారు. ప్రతిపాదనల దశ నుంచి రేస్ ఫైనల్ అయ్యే ఈ మొత్తం ప్రక్రియ దాదాపు ఏడాది పట్టింది'' అని అబ్దుల్ ఇబ్రహీం బీబీసీతో అన్నారు.

Race Car

ఫొటో సోర్స్, Sam Bloaxham FIA Formula E

దిల్లీలో ఫార్ములా వన్ ఎందుకు ఆగిపోయింది?

2011-2013 ప్రాంతంలో దిల్లీలా ఫార్ములా వన్ రేసులు జరిగేవి. యమున ఎక్స్ ప్రెస్ వే దగ్గర్లో నిర్మిచిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఇవి జరిగాయి. జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ, ఎఫ్ఐఎతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుని వీటిని నిర్వహించింది. కానీ రకరకాల కారణాల వల్ల 2014 నుంచి అక్కడ రేస్ జరగలేదు.

దిల్లీ శివార్లలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ 5.125 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2011 అక్టోబరులో ప్రారంభం అయిన ఈ ట్రాకు 875 ఎకరాల్లో విస్తరించింది. ఇది జేపీ గ్రూపు గ్రీన్ స్పోర్ట్స్ సిటీలో భాగం. అక్కడ 2 లక్షల సీటింగ్ కెపాసిటీ ఉంటుంది.

2011 నుంచి 2014 వరకూ అక్కడ రేసులు జరిగాక, అనేక వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపులు, పన్ను మినహాయింపుల విషయంలో ప్రభుత్వాలకీ, నిర్వాహకులకూ ఏకాభిప్రాయం కుదర్లేదు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఫార్ములా వన్ రేస్ మీద ఎంటర్‌టైన్‌మెంట్ స్థాయి టాక్సులు వేసింది. అప్పట్లో భారత ప్రభుత్వం కూడా ఇతర క్రీడలకు ఇచ్చే పన్ను, కస్టమ్స్, దిగుమతి సుంకాల మినహాయింపు దీనికి ఇవ్వలేదు.

ఇది క్రీడ కాదు వినోదం అని వ్యాఖ్యానించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మరోవైపు బుద్ధ సర్క్యూట్‌ను శాశ్వత నిర్మాణంగా గుర్తించి తగిన పన్ను చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలా రకరకాల కారణాలతో ఎఫ్ఐఎ దిల్లీకి దూరంగా జరిగింది. ఆ తరువాత అక్కడ స్థానిక దేశీయ రేసులు జరుగుతూ వస్తున్నాయి.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)