ఆంధ్రప్రదేశ్: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్నారా... గ్రామస్తులు ఏమంటున్నారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు ఖాళీ చేస్తూ, సామానులను బళ్లకు ఎక్కించుకుంటూ కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.
మరి కొందరు తమకి ఇంకా న్యాయం జరగలేదని, బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆ గ్రామాల్లో ఇళ్లు, బడి, చెట్లు ఇలా అన్నీ కూలుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం 2015లో తమకి ప్రకటించిన నిర్వాసిత ప్యాకేజీని పూర్తిగా అమలు చేయకుండా గ్రామాలు ఖాళీ చేయించేందుకు కరెంట్, నీళ్లు నిలిపేస్తున్నారని నిర్వాసితులు కొందరు ఆరోపిస్తున్నారు.
పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదని, పైగా 18 ఏళ్లు దాటిన యువతకు ఉపాధి, ఆర్థిక సహాయం, ఖాళీ చేసేటప్పుడు రవాణా ఖర్చులకు ఇస్తామన్న రూ. 50 వేలు లాంటివి ఇవ్వలేదని అంటున్నారు.
“మాకు ఇస్తానన్న వాటి కోసం అడిగితే... ఇచ్చేస్తాం, ముందు ఖాళీ చేసేయండని అంటున్నారు. డబ్బులు అందినోళ్లు, ఊరితో సంబంధం లేనోళ్లు కొందరు ఖాళీ చేశారు. మాకు ఇంకా ప్యాకేజీలో భాగంగా ఇస్తామన్నవి ఇవ్వకుండా ఎలా ఖాళీ చేస్తాం? అని ప్రశ్నిస్తే... అంతా వెళ్లిపోతున్నారు, మీరెందుకు వెళ్లరు? ఒక వేళ మీరు ఉన్నా కూడా మీ ఇల్లు జేసీబీలతో తీసేస్తామని బెదిరిస్తున్నారు. మేం ఇళ్లలో ఉండగానే కరెంట్ తీసేశారు, నీళ్లు రానివ్వకుండా చేశారు” అని బొల్లింకలపాలెం నిర్వాసితుడు రాము బీబీసీతో చెప్పారు.
బొల్లింకలపాలెంలో ఒకటి, రెండు మినహా మిగతా ఇళ్లన్నీ కూల్చేశారు. అక్కడ వారికి ఉపయోగపడే వస్తువులేమైనా ఉన్నాయోమోనని కూలిన ఇళ్ల వద్ద ఇంటి యాజమానులు వెదుక్కుంటూ కనిపించారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
‘4 గ్రామాలు, 400 కుటుంబాలు’
భోగాపురం మండలంలో మరడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెం, రెల్లిపేట...400 కుటుంబాలున్న ఈ నాలుగు గ్రామాలు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ నిర్వాసిత గ్రామాలు.
ప్రస్తుతం మరడపాలెం, బొల్లింకలపాలెం గ్రామాలను ఖాళీ చేయించే పనిలో అధికారులు ఉన్నారు. ఆయా గ్రామస్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు ఉన్నవారితో చర్చలు జరుపుతున్నారు.
2023 మార్చి నుంచి విమానాశ్రయ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస కాలనీలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, తామెక్కడికి వెళ్లిపోవాలని కొందరు నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
“నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మొత్తం రూ.9 లక్షల 75 వేలు. కానీ చాలా మందికి రూ.9 లక్షల 20 వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.50 వేలు ఇవ్వలేదు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు రవాణా ఖర్చులు ఇస్తామన్నారు. అవీ కొంత మందికి ఇవ్వలేదు. ఇంకా 18 ఏళ్లు దాటిన వాళ్లకి ఉద్యోగం, కొంత ఆర్థిక సాయం చేస్తామన్నారు. అదీ చేయలేదు. ఇలా చెప్పి, ఇప్పుడు అవేవి చేయకుండా వెళ్లిపోమంటున్నారు. అడిగితే ఊర్లోకి పోలీసులని తీసుకుని వచ్చారు” అని మరడపాలెనికి చెందిన నీలాపు రమణమ్మ బీబీసీతో చెప్పారు.

అసలు నిర్వాసిత ప్యాకేజీలో ఏముంది?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితులకు రీహాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్ యాక్ట్ 2013 (దీనినే ప్రస్తుతం నూతన భూసేకరణ చట్టం 2013గా పిలుస్తున్నారు) ప్రకారం భూ సేకరణ వల్ల ఏ ప్రయోజనాలు సమకూర్చాలో ప్రభుత్వం అధ్యయనం చేసింది.
భోగాపురం విమానాశ్రయం కోసం భూములిచ్చిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఇందిరావాస యోజన పథకం క్రింద రూ.2,75,000/-, జీవనాధార భృతిగా రూ.5,00,000/-, తాత్కాలిక భృతి నెలకు రూ.3,000/- చొప్పున 12 నెలలకు గాను రూ.36,000/-, దుకాణాలుంటే అదనంగా రూ.25,000/-, చేతి వృత్తిదారులకు రూ.25,000/-, పునరావాస భత్యం రూ.50,000/-, గ్రామాన్ని ఖాళీ చేసేటప్పుడు రవాణా ఖర్చుల కింద రూ.50,000/- ఇస్తామని ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రకటించింది.
గ్రామంలో నిర్వాసిత కుటుంబం అంటే 31.08.2015 నాటికి మూడేళ్ల ముందు నుంచి గ్రామంలో నివాసం కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
‘ప్రధాన సమస్య 18 ఏళ్లు నిండిన వారి ప్యాకేజీ’
ప్యాకేజీ ఇచ్చేటప్పుడు 18 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగం, కొంత ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని నిర్వాసితులు అంటున్నారు. కానీ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే నిర్వాసిత గ్రామాల్లో ఎక్కువ మంది చెప్తున్న సమస్య.
ఈ విషయంపై బీబీసీ స్థానికులతో మాట్లాడిన తర్వాత, ఆర్డీవో సూర్యకళ దృష్టికి తీసుకుని వెళ్లింది.
“భోగాపురం విమానాశ్రయ నిర్వాసితులకు అందిస్తున్న ప్యాకేజీ కోసం 31.08.2015 తేదీని కటాఫ్‌గా తీసుకున్నాం. దాని ప్రకారమే ఇప్పటివరకు నిర్వాసితులకు ప్యాకేజీని అందిస్తున్నాం. కానీ కొందరు ఖాళీ చేసేనాటికి అంటే ప్రస్తుతం గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు కాబట్టి...ఇప్పుడు 18 ఏళ్లకు చేరుకున్నవారికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని అంటున్నారు. ఇది సాధ్యం కాదు. అలాగే స్థానికంగా నివాసం లేకపోయిన కొందరు మమ్మల్ని సంప్రదించారు. వారి కోసం ఓటరు కార్డు, ఆధార్ చిరునామా ఆధారంగా చూసుకుని 31 మందికి ప్యాకేజీ అందించాం. ఇలా మాకు చేతనైనవి, పునరావాస చట్ట పరిధి దాటి కూడా కొందరికి సాయం అందించాం. ఇంతకు మించి మేం ఏం చేయలేం” అని ఆర్డీవో సూర్యకళ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
2015 నుంచి 2023 ఫిబ్రవరి వరకు....
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి తొలుత 15 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంత భారీ స్థాయిలో భూ సేకరణ ఎందుకంటూ విపక్షాలు, స్థానికులు ఆందోళనలు చేయడంతో క్రమంగా భూ సేకరణ 2,700 ఎకరాలకు పరిమితమైంది.
2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఆ శిలాఫలకం తప్ప ఒక్క ఇటుక కూడా పడలేదు. నిర్వాసితుల కాలనీల నిర్మాణం మాత్రం జరుగుతోంది.

నిర్వాసిత గ్రామాలైన మరడపాలెంలో 223, ముడసర్ల పేటలో 39, బొల్లింకలపాలెంలో 55, రిల్లిపేటలో 65 కుటుంబాల పునరావాసం కోసం రెండు కాలనీలను నిర్మిస్తున్నారు. గూడెపువలసలో 17 ఎకరాలు, లింగాలవలసలో 25 ఎకరాల్లో ఈ కాలనీల నిర్మాణం జరుగుతోంది. ఒక్కొక్కరికి ఐదేసి సెంట్లు భూమిని కేటాయించారు. 2021 అక్టోబరులో పనులు ప్రారంభమయ్యాయి.
2022 ఫిబ్రవరిలో నిర్వాసిత కాలనీలైన లింగాలవలస, ఎయిర్‌పోర్టు కాలనీలను బీబీసీ సందర్శించింది. అప్పడు పునాదుల స్థాయిలో కనిపించాయి. 2023 పిభ్రవరి నాటికి కొన్ని ఇల్లు పూర్తయ్యాయి. పూర్తైన ఇళ్లలో కొందరు నిర్వాసితులు నివాసముంటున్నారు.
కొండపై ఈ కాలనీలకు స్థలం ఇవ్వడంతో అక్కడ స్థలం చదును చేయడానికే ఖర్చు ఎక్కువైపోతుందని కొందరు నిర్వాసితులు చెప్పారు. అందుకే ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు కొంత సమయం ఇస్తే ఇల్లు పూర్తి చేసుకుని గ్రామాల నుంచి వచ్చేస్తామని కొందరు నిర్వాసితులు అన్నారు. కానీ సమయం ఇవ్వకుండా అధికారులు బెదిరిస్తున్నారని మరడపాలెం నివాసి కుమారి బీబీసీతో చెప్పారు.
‘మరడపాలెంలో ఉద్రిక్తత...చివరి అవకాశం’
నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహాయాన్ని రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. బొల్లింకలపాలెం, మరడపాలెం గ్రామాలను అధికారులు దగ్గరుండి ఖాళీ చేయిస్తున్నారు. మరడపాలెంలో అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరు పక్షాలు చర్చించాయి. చివరకు నిర్వాసితులకు గ్రామాన్ని ఖాళీ చేసేందుకు మరో మూడు రోజులే సమయం ఇస్తామని, ఇదే చివరి అవకాశమని అధికారులు చెప్పారు.
“పునరావాస చట్టం ప్రకారం వాళ్లకు ఏవైతే ప్రకటించామో అన్నీ చేశామని, గత ఎనిమిది నెలలుగా నిర్వాసితులకు సమయం ఇస్తూ వచ్చాం, అయినా కూడా ప్యాకేజీలో లేనివి కూడా కావాలని అడుగుతున్నారు. అది సాధ్యం కాదు. ఎప్పటికైనా నిర్వాసితులు ఖాళీ చేయాల్సిందే. ఇంతకు మించి సమయం కూడా ఇవ్వలేం. ఇప్పటికే అనేక సార్లు సమయమిచ్చాం. నెలకు నాలుగు సార్లు నిర్వాసిత గ్రామల్లో సమావేశాలు పెట్టి వారికి అందవలసినవన్నీ అందించాం. ఇప్పుడు సమయం మించిపోతున్నా కూడా వారు ఖాళీ చేయడం లేదు. పైగా కరెంట్, నీరు నిలిపి వేశామంటూ చెప్తున్నారు. అదంతా అవాస్తవం” అని ఆర్డీవో సూర్యకళ బీబీసీకి వివరించారు.
పీడీఎఫ్ (ప్రాజెక్ట్ డిస్ ప్లేస్ మెంట్ ప్యామిలీ) లను నిర్వాసిత గ్రామాల నుంచి తరలించే వరకు యాక్ట్ ప్రకారమే ప్యాకేజీని అందిస్తున్నాం, ఇంకేవరైనా యాక్టు ప్రకారం అర్హులైన వారు ఉంటే వారికి కూడా పునరావాస ప్యాకేజిని అంద చేస్తాం’’అని ఆర్డీవో సూర్యకళ చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















