అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
అప్పర్ భద్ర ప్రాజెక్ట్. కర్ణాటకలో మూడు దశాబ్దాలుగా నానుతున్న ప్రాజెక్ట్. తాజాగా దీని పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధమయ్యింది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లోనే దీనికి ప్రతిపాదనలు చేశారు. దాంతో ఆ రాష్ట్రంలో హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలం పాటు కలగా ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనే ఆశలు అక్కడ ప్రజల్లో కనిపిస్తున్నాయి.
అదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తామంటోంది. రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పర్ భద్ర పూర్తయితే సాగు, తాగు నీటి కష్టాలు వస్తాయని వారు భావిస్తున్నారు.
ఇంతకీ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ ఏమిటి... పూర్తయితే ఏమవుతుంది... రాయలసీమ వాసుల కలవరం ఎందుకు? అనే విషయాలు ఇప్పుడు చర్చల్లోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో ఇప్పటికే పలు వివాదాలున్నాయి. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఈ సమస్య ఎక్కువగా ముందుకొస్తుంది. గతంలో ఆల్మట్టి డ్యామ్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం చుట్టూ పెనువివాదం చెలరేగింది.
కృష్ణా నదీ జలాల్లో ప్రధానంగా ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే నీటితో పాటుగా కర్ణాటకకి చెందిన తుంగభద్ర నుంచి వచ్చే జలాల వాటా ఉంటుంది. తుంగ, భద్ర అనే రెండు ఉపనదులు ఏకమయ్యి తుంగభద్ర పేరుతో కృష్ణా నదిలో కలుస్తాయి.
తుంగ నది నుంచి 17.4 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి భద్ర నదికి తరలిస్తారు. అక్కడి నుంచి రెండో దశలో భద్ర నుంచి అజ్జంపుర సమీపంలోని టన్నెల్ ద్వారా 29.9 టీఎంసీల జలాలను మళ్లిస్తారు. మధ్య కర్ణాటకలోని చిక్కమగుళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దావణగెరె వంటి జిల్లాల్లో సాగు, తాగు నీటి అవసరాలకు ఈ నీటిని వినియోగిస్తారు.
తద్వారా కృష్ణా బేసిన్‌లోనే ఉన్న తుంగభద్ర సబ్ బేసిన్‌గా పిలిచే ప్రాంతంలో 2,25,515 హెక్టార్లకు సాగు నీరు అందుతుందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. మరో 367 చెరువులకు 50 శాతం సామర్థ్యంతో నింపడం ద్వారా తాగునీటి సమస్య తీరుతుందని అంటోంది.
రెండు దశల్లో సాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 2018-19 నాటి అంచనాల ప్రకారం రూ.21473.67 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి డీపీఆర్ సిద్ధం చేశారు.
2008లోనే ఈ ప్రాజెక్ట్ ప్రాథమికంగా పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకూ సుమారుగా రూ. 4,800 కోట్లు వెచ్చించినట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, ANI
ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చింది
2008 నుంచి నిర్మాణం ముందుకు సాగని ఈ ప్రాజెక్ట్ మీద ఆరంభం నుంచే అనేక అభ్యంతరాలున్నాయి. అయినప్పటికీ 2010లో కొన్ని అనుమతులు లభించాయి. తుంగ నది నుంచి 15 టీఎంసీల నీటిని భద్ర రిజర్వాయర్‌కు తరలించి, ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 21.5 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది నాటి ప్రతిపాదన.
ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా బచావత్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం కృష్ణ జలాలలో కర్ణాటకకు 21 టీఎంసీల అదనపు జలాలు ఉపయోగించుకొనే అవకాశం ఉందని చెబుతూ అప్పర్ భద్ర పరిధి పెంచారు. దాంతో అదనంగా మరిన్ని జలాలను కర్ణాటక వినియోగించుకునే అవకాశం వచ్చింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ప్రతిపాదనల్లో అప్పర్ భద్ర కోసం ఏకంగా రూ.5,300 కోట్లు కేటాయించింది.
"కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న రాజకీయ నిర్ణయమే. అయినప్పటికీ సాగునీటి ప్రాజెక్ట్‌కి ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించడం ఆహ్వానించాలి. ఇటీవల కాలంలో పోలవరం వంటి ప్రాజెక్టులకే కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. మొదట్లో ప్రతి బడ్జెట్‌కి వందా, రెండు వందల కోట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం నాబార్డ్‌కి అప్పగించేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి పనులు చేయాలి. బిల్లులు పెడితే నాబార్డ్ నుంచి రీయంబర్స్ చేస్తారు. జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించిన పోలవరం విషయంలోనే అలా ఉంటే అప్పర్ భద్రకి ఆ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న తీసుకున్న నిర్ణయమే అయినా మేలు చేస్తుంది" అని రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ఈ ఎం.రామ్మోహన్ రావు అన్నారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఈ అంశం ప్రభావితం చేస్తుందని ఆయన అంచనా వేశారు. రాజకీయ ప్రయోజనాల రీత్యానే ఇప్పుడు అప్పర్ భద్ర తెరమీదకు వచ్చినట్టు తాను భావిస్తున్నానని బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఎందుకు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన సవరించిన డీపీఆర్ ఆమోదానికి ఆరేళ్లుగా ఏపీ ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కేంద్ర జల సంఘం సాంకేతిక కమిటీ ఆమోదించినప్పటికీ జలవనరుల శాఖ ఆమోదించి, ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయాలంటూ నాడు చంద్రబాబు, నేడు వైఎస్ జగన్ ఎన్నిమార్లు విన్నవించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కూడా 2013 నాటి లెక్కల ప్రకారమే తాము నిధులు చెల్లించబోతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంతుచిక్కని అంశంగా ఏపీ ప్రభుత్వం ముందు కనిపిస్తోంది.
అదే సమయంలో కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కోసం ఉదారంగా నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు వీలు దొరుకుతోంది. దాని ప్రభావం ఏపీ మీద తీవ్రంగా ఉంటుందని ఏపీ ప్రభుత్వంతో పాటుగా రాయలసీమ వాసులు చెబుతున్నారు.
తుంగభద్రా నది మీద కర్ణాటకలోని బళ్ళారి జిల్లా హోస్పెట్ వద్ద 1943లో తుంగభద్ర డ్యామ్ నిర్మాణం చేపట్టి 1953లో పూర్తిచేశారు. ఇది కర్ణాటక-ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. డ్యామ్ నిర్మించిననాటికి నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు. పూడిక కారణంగా ప్రస్తుతం సుమారు 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే వుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 72 టీఎంసీలు, తెలంగాణకు 6.51 టీఎంసీలు, కర్ణాటకకు 151.49 టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ డ్యామ్ పూర్తిసామర్థ్యం ప్రకారం నీటి వాటా దక్కాలంటే భద్ర నుంచి వచ్చిన వరద నీరు ఆధారం.

ఫొటో సోర్స్, ugc
తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, కె.సి.కెనాల్ ద్వారా ప్రస్తుతం ఏపీకి వచ్చిన వాటా జలాల వినియోగం జరుగుతోంది. అనంతపురం, కర్నూలుతో పాటుగా కడప జిల్లాకు కూడా నీరు అందుతోంది. అనంతపురం జిల్లాలో సగం ఆయకట్టు 1,45,236 ఎకరాలకు ప్రధాన వనరు ఇదే. కర్నూలు జిల్లాలో 14,744 ఎకరాలు, కడప జిల్లాలో 1,40,600 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. ప్రస్తుతం మొత్తంగా కలిపి లక్ష ఎకరాలకు కూడా నికర సాగు నీరు అందడంలేదనే వాదన ఉంది.
మైలవరం ప్రాజెక్టు కింద కడప జిల్లాలో 68,749.934 ఎకరాలు, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 50,810 ఎకరాలు, కెసి కెనాల్ కింద కడప జిల్లాలో 92,001 ఎకరాలు, కర్నూలు జిల్లాల్లో 1,73,627 ఎకరాలు, తుంగభద్ర దిగువ కాలువ కింద కర్నూలు జిల్లాలో 1.51లక్షల ఎకరాల ఆయకట్టు వుంది. ఈ ప్రాజెక్టులు, కాలువలన్నీ తుంగభద్ర డ్యామ్ మీద ఆధారపడినవే.
"అప్పర్ భద్ర పూర్తయితే ఇన్ ఫ్లో తగ్గిపోతుంది. దానివల్ల హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద ఉన్న ఆయకట్టు నష్టపోతుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యంతరాలు పెట్టాయి. అయినా దిగువన ఉన్న రాయలసీమ, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి కేంద్రం వ్యవహరిస్తోంది. రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పిన బీజేపీ అందుకు విరుద్ధంగా ఎగువ ప్రాజెక్టులకి నిధులు కేటాయించి ఆయకట్టు దిగువన ఉన్న వారిని దగా చేస్తోంది" అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి అన్నారు.
అప్పర్ భద్ర పూర్తి చేయడానికి ముందుగా రాయలసీమ ప్రయోజనాల రీత్యా సిద్ధేశ్వరం, గుండ్రేవుల వంటివి నిర్మించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఏమంటోంది
అప్పర్ భద్ర నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమయ్యింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు వచ్చే జలాల్లో సమస్యలు వస్తాయని, కృష్ణా డెల్టా ఇక్కట్లలో పడుతుందని చెబుతోంది. సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, జాతీయ హోదా నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.
"కె-8, కె-9 బేసిన్లలో కర్ణాటక ఎక్కువగా నీటిని వినియోగించుకుంటోంది. దాంతో విజయనగర చానెళ్లు, తుంగ, భద్ర వాటాలో మిగులు లేదు. అయినప్పటికీ కేంద్ర జలశక్తిశాఖ తాను పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా జాతీయ హోదా ఇస్తోంది. బేసిన్‌లో కేటాయింపులు లేకుండా, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తన మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం" అని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బీబీసీకి తెలిపారు.
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే సమస్య తీవ్రంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
"ఏడాది క్రితమే జలశక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సిఫార్సు చేసింది. ఏడాదిగా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది. ఎందుకు మౌనంగా ఉంది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం లొంగుబాటు వైఖరి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోంది. అనంతపురం నగరానికి తాగునీరు సహా అన్నింటికీ తుంగభద్ర జలాలే ఆధారం. ఇప్పుడు వాటిని లిఫ్ట్ చేస్తే పెను సమస్య తప్పదు" అంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు అన్నారు.
ఏపీ ప్రభుత్వం పోలవరం పూర్తి చేయలేదు, రాయలసీమ నీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వీడడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
సమగ్ర దృక్పథం అవసరమా
కృష్ణా జలాల వినియోగం విషయంలో సమగ్రదృష్టి అవసరముందని సీనియర్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ప్రయోజనాలకు దెబ్బ తగలకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అభిప్రాయపడుతున్నారు.
"అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల కర్ణాటకకి విశేష ప్రయోజనాలున్నాయి. అక్కడి రైతాంగం చాలాకాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తోంది. దానిని పూర్తి చేయాలి. అదే సమయంలో రాయలసీమ, తెలంగాణలోని సాగు, తాగునీటి సమస్యలకు తగిన పరిష్కారం చూడాలి. కృష్ణా జలాల వినియోగంలో ఎక్కువ సీజన్లలో సమస్యలు వస్తున్నాయి. కానీ కొన్నిసార్లు వందల కొద్దీ టీఎంసీల నీటిని సముద్రం పాలు చేస్తున్నాం. కాబట్టి వరద జలాల వినియోగం అవసరం’’అని కేంద్ర జలశక్తి శాఖలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ పీఆర్ మోహన్ అన్నారు.
"సిద్ధేశ్వరం వద్ద ఇటీవల ప్రతిపాదించిన వంతెనకు బదులుగా బ్యారేజ్ నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. అది కొంత ఉపయోగపడుతుంది. అదే సమయంలో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ వంటి వాటిలో పూడిక పెద్ద సమస్య అవుతోంది. దాని వల్ల వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. కాలువలు పూడిక తీయడం, వెడల్పు చేయడం వంటివి జరగాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం లేకుండా నీటిని సద్వినియోగం చేసుకోవడం కోసం తగిన మార్గాలను కేంద్రమే ప్రతిపాదించి, అపోహలు తొలగించడం అవసరమని ఆయన బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














