Godavari Floods:‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''

వరదలకు షాపులో ఏమీ మిగల్లేదని శ్రీవాణి అన్నారు
ఫొటో క్యాప్షన్, వరదలకు షాపులో ఏమీ మిగల్లేదని శ్రీవాణి అన్నారు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ మాథ్స్ చదువుకున్న శ్రీవాణి, రేవంత్ భార్యాభర్తలు. మంచిర్యాలలో కిరాణా దుకాణం నడుపుకుంటున్నారు. భర్త రేవంత్ ప్రైవేటు లెక్చరర్ గా పనిచేస్తున్నా జీతం సరిపోక, ఎప్పుడిస్తారో తెలియక ఉంటుంటే, భార్య ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. భార్యాభర్తలిద్దరు కలిసి ఈ దుకాణం నిర్వహిస్తున్నారు.

మొన్న మంచిర్యాలలో వచ్చిన వరదల్లో వీరి షాపు మొత్తం మునిగిపోయింది. అందులోని ఏ వస్తువూ పనికిరాకుండా పోయింది. ఈ మధ్య తరగతి జంట రాత్రికి రాత్రి పది లక్షల రూపాయలు నష్టపోయి, ఒంటి మీదున్న దుస్తుల తప్ప మరేమీ లేని పరిస్థితిలో మిగిలారు.

''మేమిద్దరం మాత్రమే మిగిలి ఉన్నాం. ఇంకేం లేదు. ఆయనకు వచ్చే జీతం సరిపోక ఈ షాపు నడుపుకుంటూ ఇద్దరం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు శ్రీవాణి.

ఇది రేవంత్, శ్రీవాణి ఒక్కరి సమస్యే కాదు. మంచిర్యాల, మంథని పట్టణాల్లో ఇళ్లు నీట మునిగిన ఎందరో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఇది.

తెలంగాణలో వరదలు

మంచిర్యాల పట్టణంలో వరద గురించి ముందుగా హెచ్చరించినా, అది చిన్నదేనని అధికారులు చెప్పినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మంథని పట్టణంలో అయితే, అసలు వరద గురించే చెప్పలేదని విమర్శిస్తున్నారు.

వరద తీవ్రత గురించి సరైన, కచ్చితమైన సమాచారం ఉంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదని బాధితులు వాపోతున్నారు. మంచిర్యాల, మంథని - రెండు చోట్లా ఇదే ఫిర్యాదు.

ఈ పట్టణాలతో పాటూ, గోదావరి తీరంలోని అనేక పల్లెల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. టీవీలు, ఫ్రిజ్‌లు, మంచాలు, పరుపులు, దుస్తులు, బియ్యం, వంట సామాగ్రి, పుస్తకాలు అన్నీ బురదమయం అయ్యాయి. చాలా మంది ఇంట్లో డబ్బు, బంగారం కొట్టుకుపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

''పిల్లల ఒంటి మీదకు కూడా ఏమీ మిగల్లేదు. ఉన్న డబ్బు, బంగారం, సర్టిఫికేట్లు అన్నీ పోయాయి'' అని కన్నీరు పెట్టుకున్నారు పద్మలత అనే మహిళ.

తడిచిపోయిన వస్తువులను చూపిస్తున్న బాధితులు
ఫొటో క్యాప్షన్, తడిచిపోయిన వస్తువులను చూపిస్తున్న బాధితులు

ఇక మంథనిలో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రజలు బురద నిండిన ఇళ్లను శుభ్రపరచుకుంటూ కనిపించారు. వరద గురించి కనీసం సమాచారం చెప్పలేదని చాలా మంది స్థానికులు బీబీసీతో అన్నారు.

మొత్తంగా ఉత్తర తెలంగాణ వైపు ఉగ్ర గోదావరి తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. గోదావరితో పాటూ ఏదైనా వాగులు, బ్యారేజీలకు దగ్గర ఉన్న చోట్ల ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా కనిపించింది.

వీడియో క్యాప్షన్, యూట్యూబ్ నుంచి వస్తున్న ఆదాయంతో షెడ్డు నుంచి కొత్త ఇంట్లోకి ప్రయాణం

రెండు మూడు రోజుల పాటూ పలు కాలనీలు, వీధుల్లో నీరు నిలచిపోయింది. చాలాచోట్ల ప్రజలను ముందుగానే తరలించగలిగారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇంటిలో ఉండే ప్రతీ వస్తువూ నీటిలో నాని, బురదతో నిండిపోయింది.

వరద తగ్గిపోయినా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందుకోలేదు. చాలా కాలనీలకు, గ్రామాలకూ కరెంటు, మంచినీరు ఇంకా అందలేదు.

పెద్ద సంఖ్యలో రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. రోడ్లపై అడ్డంకులు తొలగించారు. మరమ్మత్తులకు సమయం పడుతుంది. చిన్న చిన్న పనులు ప్రారంభం అయ్యాయి. వరద ఉధృతి తగ్గిన మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి.

మంచిర్యాల, మంథని ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది
ఫొటో క్యాప్షన్, మంచిర్యాల, మంథని ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది

ఆసిఫాబాద్ గిరిజన ప్రాంతాలను కలిపే వాగులపై నిర్మించిన వంతెనలు కొట్టుకుపోవడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తమ గ్రామాలకు ఉండే ఒకే ఒక రోడ్డు, వంతెన కొట్టుకుపోవడంతో వారు నరకయాతన పడుతున్నారు.

ఈ మరమ్మత్తులు జరుగుతుండగానే గోదావరి నదిపై తెలంగాణ, మహారాష్ట్రలను కలిపే వంతెన అప్రోచ్ రోడ్ తెగిపోయింది. దీంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు తెలంగాణ నుంచి ఈ దారి ద్వారా ప్రయాణం ఆగిపోయింది.

అతి కీలకమైన వ్యవసాయ పంట నష్టం అంచనా ఇంకా మొదలు కాలేదు. సీజన్ మొదలే అయినప్పటికీ, పత్తి, మొక్కజొన్న, సోయా, కొన్నిచోట్ల వరి నాటారు. వరదకు పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుకమేటలు వేసింది. పొలాల నిండా రాళ్లు నిండాయి.

ఇక ఇల్లు, ఇంట్లోని వస్తువులు, పశువులను నష్టపోయిన వారి పరిహారంపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. చాలాచోట్ల కరెంటు, తాగునీరు పునరుద్ధరించాల్సి ఉంది.

గోదావరి వరద పైనుంచి తగ్గుతూ, కింది ప్రాంతాలలో పెరుగుతోంది. మొన్నటి వరకూ భయపెట్టిన కడెం ప్రాజెక్టు ఖాళీ అయింది. కానీ దిగువన కాళేశ్వరం దగ్గర తీవ్రత కనిపిస్తోంది. మేడిగడ్డ సామర్థ్యానికి మించి ప్రవాహం వెళుతోంది.

తెలంగాణలో వరదలు

భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు నీటి మధ్యలోనే ఉన్నాయి. అక్కడకు ఎవరూ చేరుకునే పరిస్థితి లేదు. నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడినా, భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది.

భద్రాచలం దగ్గర వరద ఉధ్రుతి పెరిగి, శనివారం ఉదయానికి నీటిమట్టం 71.2 అడుగులకు చేరుకుంది. సుమారు 24 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో భద్రాచలం పట్టణం మూడు దశాబ్దాలలో చూడని వరదను చూస్తోంది. వంద వరకూ గ్రామాలు నీట మునిగాయి. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయానికి ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. ఇది 25 లక్షల క్యూసెక్కుల వరకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏపీలోని 6 జిల్లాలకు చెందిన 44 మండలాల్లోని 628 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టులు, కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)