ఏపీ-కోనసీమ: అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన వారినే పోలీసులు జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?

గోపాలపురం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

గోపాలపురం. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్న ఓ గ్రామం ఇది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దు గ్రామం. ఎన్‌హెచ్-16 మీదుగా గోదావరిపై సిద్ధాంతం వద్ద వంతెన దాటగానే గోపాలపురం ఉంటుంది.

ఇది పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామం. ఈ గ్రామంలో ఓ చిన్న హోటల్ వద్ద ఫాస్ట్‌ఫుడ్ అందించే పేపర్ ప్లేట్లపై రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బొమ్మ ముద్రించడం వివాదాస్పదమైంది.

ఈ ప్లేట్లపై కొందరు అభ్యంతరం తెలిపారు. అయితే, నిరసన వ్యక్తంచేసిన వారు వారం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. దీనికి కారణమేంటి? గోపాలపురంలో ఏం జరుగుతోంది?

కోనసీమలో కులం చాలా సున్నితమైన విషయమనేది కాదనలేనిది. గోపాలపురం అందుకు అతీతం కాదు. ఇక్కడ కూడా ఎస్సీలు కొంత ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇది వ్యవసాయక గ్రామం, గోదావరి తీరంలో ఉంటుంది.

గోపాలపురం ఎస్సీ కాలనీకి చెందిన మాలలు, మాదిగల నుంచి కొందరు ఉన్నత స్థానాలకు ఎదిగారు. గుజరాత్‌లోని కాండ్ల లాంటి ప్రాంతాల్లో పోర్టు కాంట్రాక్టర్లుగా ఎదిగారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నత స్థాయి పదవులకు గోపాలపురం ఎస్సీలు చేరుకున్నారు.

గోపాలపురం

గ్రామంలోని ఎస్సీ సంఘానికి సొసైటీ పేరుతో కొంత భూమి ఉండడం దానికి మూలం. ఆ భూమి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఎస్సీలకు దక్కింది. ఇతర కులస్థులకు సమానంగా నిలిచేందుకు దోహదపడింది. అయితే గ్రామంలో రెడ్లు, కాపులు, గౌడ లాంటి కులాలు ప్రధానంగా ఉంటాయి. అందులో రెడ్లు ఆర్థికంగానూ, రాజకీయంగానూ ప్రభావితం చేస్తుంటారు.

గోపాలపురం వాసి చిర్ల సోమసుందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ గ్రామంలో కులాల వారీ వ్యవహారాల్లో ఎస్సీలను అణచి ఉంచే యత్నం, అందుకు ప్రతిఘటన నిత్యం ఉంటాయని రావులపాలెం మండలానికి చెందిన జర్నలిస్ట్ పమ్మి నరేష్ బీబీసీతో చెప్పారు.

గోపాలపురంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన రెండు ఘటనలు తాజాగా మరోసారి చర్చలోకి వచ్చాయి. ఒకసారి ఎస్సీ యువకుడు నిర్వహిస్తున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాన్ని రెడ్డి కులస్థుడు ఒకరు ధ్వంసం చేశారు. ఆయన కారు వెళుతున్న మార్గంలో అడ్డుగా ఉందని చెప్పి వాహనాన్ని ధ్వంసం చేసిన వివాదం కేసుల వరకూ వెళ్లింది. అంతకుముందు, సైకిల్ రోడ్డుపై పార్క్ చేసి ఉండగా మరో ఎస్సీ యువకుడిపై కూడా దాడి చేశారు. అప్పట్లో ఆ దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బంధువును ఎస్సీలంతా కలిసి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిలదీశారు. దాడి చేసిన వ్యక్తి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. “ఇలాంటి వివాదాల నేపథ్యంలో అంబేడ్కర్ బొమ్మని ముద్రించిన ప్లేట్లలో ఫుడ్ సప్లై చేయడం గమనించాలి” అని నరేష్ అభిప్రాయపడ్డారు.

గోపాలపురం

హోటల్ వద్ద ఏం జరిగింది?

జులై 5వ తేదీ సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొందరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అన్నపూర్ణ హోటల్‌కు వెళ్లారు. నూడుల్స్ ఆర్డర్ ఇచ్చారు.

ఆ హోటల్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటుంబానికి చెందిన పెట్రోల్ బంక్‌కు అతి సమీపంలో ఉంటుంది.

నూడుల్స్ అందించిన పేపర్ ప్లేట్‌పై అంబేడ్కర్ బొమ్మ ముద్రించి ఉండడాన్ని కొందరు చూశారు. అదే సమయంలో ఇంటికి పార్సిల్ తీసుకెళ్లిన వారికి కూడా ఆ పేపర్ ప్లేట్లు కనిపించాయి. దాంతో వారు కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. దీనిపై హోటల్ యజమానిని ప్రశ్నించారు. అలా వివాదం రాజుకుంది.

పోలీసులు జోక్యం చేసుకున్నారు. కొంత మంది ఎస్సీ యువకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారు అరెస్ట్ అయినట్టు ప్రకటించారు. అరెస్ట్ అయిన వారిలో నవీన్ కుమార్ అనే యువకుడి సోదరి లలిత కుమారి బీబీసీతో మాట్లాడారు.

"మా తమ్ముడు వాళ్లు సెంటర్‌కు వెళ్లి బొమ్మ ఎందుకు వేశారని అడిగారండి. అంబేడ్కర్ మా దేవుడు. ఆయన్ని అవమానించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వచ్చి స్టేషన్‌కు రండి మాట్లాడుదాం అన్నారు. అక్కడకొచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటే స్టేషన్‌కు తీసుకునివెళ్లారు. ఆ రాత్రికి రాలేదు. పొద్దున్న వస్తాడని అనుకున్నాం. కానీ సాయంత్రానికి తెలిసింది మా వాడితో పాటుగా 18 మందిని అరెస్ట్ చేశారని. వాళ్లందరినీ ముఖానికి ముసులుగు వేసి రాజోలు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాకినాడ సబ్ జైలుకి, మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. వారం పాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. అంబేడ్కర్‌ను అవమానించడంపై అడగడమే వాళ్లు చేసిన నేరమా"అని ఆమె ప్రశ్నించారు.

పోలీసుల వాదన ఏంటి?

గోపాలపురంలో జరగిన ఘటనపై రావులపాలెం పోలీసులు 263/2022 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హోటల్ యజమాని తమ్మనపూడి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. నిందితులపై ఐపీసీ 120బీ, 386, 452 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుని రావులపాలెం ఎస్‌ఐ జే. భాను ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. కేసు గురించి వివరాలపై ఆయన్ని బీబీసీ సంప్రదించగా స్పందించలేదు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం '5వ తేదీ రాత్రి 8గం.ల ప్రాంతంలో అంబేడ్కర్ బొమ్మలున్న ప్లేట్లతో సర్వీస్ చేస్తున్నావా..నా.. అంటూ బూతులు తిడుతూ కొంతమంది హోటల్‌పై దాడి చేశారు. కొన్ని వస్తువులు ధ్వంసం చేశారు. ప్రాణ భయంతో ఫిర్యాదుదారుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 6వ తేదీ 12.45 నిమిషాలకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులో ఉందుర్తి నాగేంద్ర ప్రసాద్, రొక్కాల నవీన్ కుమార్, కుక్కల కుమార్, పిల్లి ప్రదీప్, వాసు, గణపతి, రాజేశ్, గుమ్మడి నరేష్, చీకట్ల ప్రసాద్ సహా మరికొందరు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా కేసులు నమోదు చేసి వారిని చట్ట ప్రకారం కోర్టుకి తరలించడం జరిగింది.' ఆ తర్వాత కోర్డు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో నిబంధనల ప్రకారమే వ్యవహరించామని అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి చెప్పారు.

అంబేడ్కర్ రాజ్యాంగమే నడుస్తుందా..

గడిచిన కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకుడు ఆండ్ర మాల్యాద్రి అంటున్నారు. గోపాలపురం ఘటనలో అంబేడ్కర్‌ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

డాక్టర్ సుధాకర్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు వరకూ అన్ని చోట్లా ఎస్సీలపై దాడుల పరంపర చూడవచ్చు. అధికార పార్టీకి చెందిన వారి పాత్ర అన్ని చోట్లా ఉంది. గోపాలపురంలో కూడా అంబేడ్కర్‌ను అవమానిస్తూ పేపర్ పేట్లపై ఆయన బొమ్మను ఎలా ముద్రిస్తారు. అందుకు బాధ్యులు ఎవరు. వారిపై ఇప్పటి వరకూ చర్యలెందుకు తీసుకోలేదు. గోపాలపురం గ్రామస్థులనే కాకుండా సమీపంలోని నాలుగు గ్రామాలకు చెందిన యువకులను ఎంపిక చేసుకుని ఈ కేసులో ఇరికించారు. వారిపై కుట్ర కేసులు బనాయించడం ఏవిధంగా సమంజసం? ఇది అంబేడ్కర్ రాజ్యాంగమేనా. ప్రజాస్వామ్య విరుద్ధంగా అధికార గర్వంతో ప్రశ్నించిన వారినే నిందితులుగా పేర్కొనడం దారుణం” అని ఆయన అన్నారు.

గోపాలపురం ఘటనలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బాధితుల పట్ల మాట్లాడిన తీరు సందేహాలను పెంచుతోందని మాల్యాద్రి వ్యాఖ్యానించారు.

పోలీసులతో హర్షకుమార్
ఫొటో క్యాప్షన్, పోలీసులతో హర్షకుమార్

వరుస ఆందోళనలు

గోపాలపురం ఘటనపై పలు దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించాయి. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపాయి. 18 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు, అంబేడ్కర్ చిత్రాన్ని పేపర్ ప్లేట్ల మీద ముద్రించిన వారి మీద, వాటిని సరఫరా చేసిన వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రశ్నించారు.

"తప్పుడు కేసులు పెట్టారు. వాళ్లంతా కుట్ర పన్ని ఆ హోటల్ మీద దాడి చేశారా? రోజూ సాయంత్రం పనుల్లోంచి వచ్చి అక్కడే టిఫిన్లు తింటారు. అలాంటిది ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మీద దాడి చేసి, యజమానిని చంపాలని కుట్ర చేస్తారా? రావులపాలెం పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. సీఐ, ఎస్ఐలను డిస్మిస్ చేయాలి. బాధితుల మీద పెట్టిన కేసులన్నీ తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఆందోళన కొనసాగుతుంది. ఎస్సీల మీద ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టి నోళ్లు నొక్కాలని చూస్తే సహించబోము" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఈ వివాదం నేపథ్యంలో- ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులను పరామర్శించారు. వారి నుంచి వివరాలు సేకరించారు. గోపాలపురంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అందరికీ న్యాయం జరుగుతుందని ప్రకటించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.

పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
ఫొటో క్యాప్షన్, పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే

స్వగ్రామానికి చెందిన ఎస్సీ యువకులను జైలుకు పంపించిన ఘటనపై ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా సీరియస్ అయ్యారు.

10వ తేదీ రాత్రి రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో ఈ అంశంపై ఆయన పోలీసులను ప్రశ్నించారు. వారి తీరును నిరసిస్తూ రాత్రంతా స్టేషన్‌లోనే ఉన్నారు. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసినవారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"నేను ఆ రోజు ప్లీనరీకి వెళ్లాను. రాత్రి ఫోన్ చేసి చెప్పాను. సాక్ష్యాలు లేకుండా కేసులకు వెళ్లొద్దని అన్నాను. వాళ్లేమయినా మర్డర్లు చేశారా? మనసులు గాయపడేలా ప్లేట్లపై ఇలా పెడతారా అని అడిగారు. అందులో తప్పేంటి. వాళ్లనీ, వీళ్లనీ పిలిచి మాట్లాడితే సరిపోయేది. లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారు. ఎక్కడో సికింద్రాబాద్‌లో రైళ్లను తగులబెట్టిన కుట్ర కేసులా, అమలాపురంలో మంత్రి గారి ఇల్లు తగులబెట్టిన కేసులు పెట్టడం ఏంటి? తల్లిదండ్రులను కూడా పిలవకుండా, కేసులు ఎలా పెడతారు"అని డీఎస్పీ సమక్షంలో ఆయన ప్రశ్నించారు.

పోలీసులు ఎమ్మెల్యేకు ఎలాంటి సమాధానమూ ఇవ్వకుండా వింటూ ఉండిపోయారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్ దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత... అంతేనా?

‘‘మా బిడ్డలకు అన్యాయం జరిగింది’’

గోపాలపురం కేసులో అరెస్ట్ అయిన వారి ఇళ్లకు బీబీసీ వెళ్లింది. గోపాలపురం, పొడగట్లపల్లి, ముమ్మిడివరప్పాడు వంటి గ్రామాల యువకులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు.

అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు జులై 12 సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మరో 11 మందిని కూడా విడుదల చేసేందుకు అవసరమైన ప్రక్రియ జరుగుతోందని దళిత సంఘాల నేతలు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

‘‘నా బిడ్డ డిగ్రీ చదువుకున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద సెక్షన్లల కింద కేసు పెట్టారు. వాడి భవిష్యత్ ఏమి కావాలి. అంబేడ్కర్‌ను అవమానించారని నిలదీయడం నేరమవుతుందని అనుకోలేదు. ఇలా కేసులు పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు. అంబేడ్కర్ బొమ్మ ముద్రించిన ప్టేట్లలో ఫుడ్ ఇచ్చిన వ్యక్తి రోజూ హోటల్ నడుపుకుంటున్నాడు. ఆ పేపర్ ప్లేట్ల మీద రాజ్యాంగ నిర్మాత బొమ్మ ఎక్కడ ముద్రించారన్నదీ తేల్చలేదు. వాళ్లమీద చర్యలూ లేవు. మా బిడ్డలు మాత్రం జైలు పాలయ్యారు. ఇంత అన్యాయంగా వ్యవహరిస్తారా”అని కుమారి అనే మహిళ వాపోయారు. ఆమె కుమారుడు రాజేశ్ జైలులో ఉన్నారని ఆమె తెలిపారు.

జులై 12న అన్నపూర్ణ హోటల్ మూసివేసి ఉంది. యజమాని స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

జులై 13న రావులపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడికి కొన్ని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు జీవీ హర్షకుమార్‌, మరికొందరు నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. రావులపాలెం స్టేషన్ ముందు భారీగా బలగాలను మోహరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)