విశాఖపట్నం: 'సీఎంఓ నుంచి కాల్ చేస్తున్నా.. వెంటనే 20 లక్షలు పంపండి' - సైబర్ క్రైమ్ కేసులో విశాఖ నివాసి అరెస్ట్

బేడీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యేను ఫోన్‌లో బెదిరించి, డబ్బులు డిమాండ్‌ చేసిన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజస్థాన్‌కు చెందిన ఎమ్మెల్యే సందీప్‌ యాదవ్‌ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. విశాఖలోని గాజువాక శ్రీనగర్‌ నివాసి పి.విష్ణుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు పలువురు ఎమ్మెల్యేలను బెదిరించి డబ్బులు వసూలు చేశాడని, ఆ డబ్బులతో తన ప్రియురాలికి రూ. 80 లక్షల ఖరీదైన ఇంటిని కొన్నాడని తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు.

సైబర్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

'సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా...'

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి డబ్బులు అడిగాడనే అభియోగంపై రాజస్థాన్ పోలీసులు పి.విష్ణుమూర్తి అలియాస్ సాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గాజువాక సీఐ మల్లేశ్వరరావు అందించారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం.. "నేను ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా'' అంటూ రాజస్థాన్ ఎమ్మెల్యేలకు వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (VPN) ద్వారా నిందితుడు ఫోన్ కాల్స్ చేసేవాడు. అలాగే 2022 ఏప్రిల్ 24న తిజార నియోజకవర్గం ఎమ్మెల్యే సందీప్ యాదవ్‌కు కాల్ వెళ్లింది.

''మీరు నా అకౌంట్‌కు అర్జెంట్‌గా రూ. 20 లక్షలు పంపాలి. మీకు అందించే సెక్యూరిటీ విషయంలో ఆ డబ్బు అవసరముంది'' అని ఎమ్మెల్యేకు విష్ణుమూర్తి చెప్పారు. అలాగే ఎమ్మెల్యేతో వాట్సాప్ చాట్ కూడా చేశాడు. ఆ వాట్సాప్ ప్రొఫెల్ పిక్‌గా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ ఫ్యామిలీ ఫొటో పెట్టుకున్నాడు. ఈ కాల్‌పై అనుమానమొచ్చిన ఎమ్మెల్యే సందీప్ యాదవ్ అక్కడి సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు" అని సీఐ తెలిపారు.

వీడియో క్యాప్షన్, మీ ఖాతాలో డబ్బులు పోతే బ్యాంకులు ఇస్తాయా

'వసూలు చేసిన డబ్బుతో ప్రియురాలికి ఇల్లు'

"సైబర్ క్రైం విభాగంతో పాటు స్థానిక బివాడీ పోలీస్ స్టేషన్‌లో కూడా ఎమ్మెల్యే సందీప్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బివాడీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ జితేంద్రసింగ్‌ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఫోన్ కాల్ నుంచి సేకరించిన సమాచారం అధారంగా అతడు విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాంతో ఇక్కడికి వచ్చిన రాజస్థాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై అతడిని రాజస్థాన్ తీసుకుని వెళ్లారు" అని గాజువాక సీఐ మల్లేశ్వరరావు వివరించారు.

ఆయన కథనం ప్రకారం.. ఎమ్మెల్యే సందీప్ యాదవ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు.. గతంలో కూడా విష్ణుమూర్తి రాజస్థాన్‌లోని మరికొందరు ఎమ్మెల్యేలకు సైతం 'సీఎంవో నుంచి మాట్లాడుతున్నా'నంటూ ఫోన్ చేసినట్లు తెలిసింది. ఇలా రాజస్థాన్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి దాదాపు రూ. 2.5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ. 80 లక్షలతో ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా...

ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా విష్ణుమూర్తి అలియాస్ సాగర్ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన 28 ఏళ్ల విష్ణుమూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఏపీలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ. 1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

దీనికి సంబంధించి విశాఖ సైబర్‌ క్రైం, శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు మోసం చేసే వ్యక్తులతో వాట్సప్ చాట్ కూడా చేస్తుండేవాడు. ఆ చాటింగ్‌లో వచ్చే సమాచారాన్ని మరికొందర్ని మోసం చేసేందుకు ఉపయోగించేవాడని పోలీసులు చెప్పారు.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ నంబర్లతో ఫోన్‌ కాల్స్...

విష్ణుమూర్తి తనకు కావలసిన ఫోన్స్‌ని హ్యాక్ చేసి అందులోని కాంటాక్ట్ లిస్టు సంపాదించి తద్వారా తాను టార్గెట్ చేసేవారి సమాచారం సేకరిస్తాడు. అలాగే అతడు virtual private network (VPN) నెంబర్ల ద్వారా కాల్ చేస్తాడు. అది కూడా ఇతర దేశాలకు చెందిన నంబర్లు వాడటం వలన అతడిని ట్రేస్ చేయడం కష్టమైంది.

అతడితో తరచూ మాట్లాడే వాళ్ల నంబర్ల ఆధారంగా విష్ణుమూర్తి నెంబరును పట్టుకోగలిగారని గాజువాక పోలీసులు తెలిపారు. అతడు VPN ద్వారా కాల్స్ చేయడంతో అతడిని పట్టుకోడానికి సమయం పట్టింది. అతడు స్నేహితుడు ఒకరికి విష్ణుమూర్తి పేరుతో ఉన్న ఫోన్ ఇవ్వడంతో అక్కడ నుంచి రాజస్థాన్ పోలీసులు వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు విష్ణుమూర్తిని పట్టుకోగలిగారు.

వీడియో క్యాప్షన్, సైబర్ నేరగాళ్లు బెదిరించినప్పుడు మహిళలు ఏం చేయాలి... వారికున్న హక్కులేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)