డ్రగ్స్: అంతర్జాతీయ స్మగ్లర్‌ టోనీని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు - ప్రెస్‌రివ్యూ

హైదరాబాద్‌ సిటీ పోలీసులు

ఫొటో సోర్స్, Hyd city police/twitter

ఏటా రూ.కోట్లలో డ్రగ్స్‌ దందా చేస్తూ.. ఏడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన ఘరానా స్మగ్లర్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఎట్టకేలకు ముంబయిలో పట్టుకున్నట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

''అతనితో పాటు అతని వద్ద భారీగా డ్రగ్స్‌ కొనుగోలు చేసి వినియోగిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 గ్రాముల కొకైన్‌, ఒక కారు, 11 మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ నెల 6న స్మగ్లర్‌ టోనీ అనుచరులను అరెస్టు చేసిన అనంతరం వారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి, వారి ఫోన్‌ల నుంచి విలువైన డేటాను సేకరించారు.

టోనీ గురించి ఆధారాలు సేకరించిన అనంతరం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సీపీ ఆనంద్‌, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌ పర్యవేక్షణలో ఆ బృందం ముంబైలో టోనీని అరెస్టు చేసింది.

అతని ద్వారా భారీగా డ్రగ్స్‌ కొనుగోలు చేసిన మరో తొమ్మిది మంది వినియోగదారులను కూడా అరెస్టు చేశారు.

వారిని హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్‌ కుమార్‌ జైన్‌, బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శశావత్‌ జైన్‌, కాంట్రాక్టర్‌ దండు సూర్య సుమంత్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపారి వెంటక్‌ చెలసాని, గౌలీపురాకు చెందిన వ్యాపారి యాగ్యా ఆనంద్‌, ఎర్రగడ్డకు చెందిన వ్యాపారి బండి భార్గవ్‌, బంజారాహిల్స్‌కే చెందిన తమ్మినేని సాగర్‌, ప్రైవేట్‌ ఉద్యోగి అల్గాని శ్రీకాంత్‌, ఆఫీస్‌ బాయ్‌ గోడి సుబ్బారావులుగా గుర్తించారు.

ఘరానా డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ అసలు పేరు చుక్వు ఒగ్బొన్నా డేవిడ్‌. నైజీరియా నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత అతని పేరు టోనీ అభియా మర్షా అలియాస్‌ టోనీగా మారింది.

2013లో తాత్కాలిక వీసాతో ముంబయికి వచ్చాడు. వీసా గడువు ముగిసినా ముంబయిలోనే ఉంటున్నాడు.

టోనీని పట్టుకోవడంలో హైదరాబాద్‌ పోలీసులకు సాంకేతికత దన్నుగా నిలిచింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

ప్రతి జిల్లాలో విమానాశ్రయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలన్నది మంచి భావన అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నట్లు 'సాక్షి' తెలిపింది.

''వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ఎయిర్‌పోర్ట్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్లు, విమానాశ్రయాల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, వైఎస్సార్‌ కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు.. రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రద్దీకి తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పన, విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని, పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈఓ రవిసుభాష్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సలహాదారు వీఎన్‌ భరత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు'' సాక్షి పేర్కొంది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, kishan reddy/face book

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఉదయం ట్విటర్‌ ద్వారా వెల్లడించారని 'ఈనాడు' ఒక వార్తను రాసింది.

''తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఏకాంతంగా ఉంటున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.

మరోవైపు తెలంగాణలో గురువారం ఒక్కరోజులోనే కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,22,403కు పెరిగింది.

ఒకేరోజున ఇంత భారీ సంఖ్యలో కొత్త పాజిటివ్‌లు నమోదవడం గత ఏడాది మే తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.5 శాతంగా నమోదైంది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మరణించారు.

ఏపీలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల మధ్య 47,420 నమూనాలను పరీక్షిస్తే 12,615 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అయిదుగురు మృతిచెందారని'' ఈనాడు తెలిపింది.

మంత్రి కే తారకరామారావు

ఫొటో సోర్స్, FB/KALVAKUNTLA TARAKA RAMA RAO

రూ. 7800 కోట్లు ఇవ్వండి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలకు కేటీఆర్‌ వినతి

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు రూ.7,800 కోట్ల మేర కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసినట్లు 'నమస్తే తెలంగాణ' కథనంలో తెలిపింది.

''ఈ మేరకు గురువారం లేఖ రాశారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రతిపాదించిన పనులకు వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని లేఖలో కోరారు.

ఎస్సార్డీపీ, వరంగల్‌ మెట్రో నియో ప్రాజెక్టు, ఎస్టీపీలు, ఓఆర్‌ఆర్‌కు లింకు రోడ్ల పనులకు నిధులు కేటాయించాలని కోరారు.

హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయబోయే మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఎంఆర్టీఎస్‌)కు నిధులను కేటాయించాలన్నారు.

మెట్రో నియో నెట్‌వర్క్‌ కేపీహెచ్‌బీ - కోకాపేట- నార్సింగి కారిడార్‌ కోసం రూ.3,050 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశామని లేఖలో తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయంలో కనీసం 15 శాతం నిధులు రూ.450 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారని'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)