వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ‘విపక్షాలు మాట్లాడిన బూతులను సహించలేక అభిమానులు ఇచ్చిన రియాక్షన్ ఇది’

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఏపీలో విపక్షాల విమర్శలు, ప్రతిగా వైసీపీ శ్రేణుల దాడుల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇదంతా విపక్షాల బూతు మాటలను జీర్ణంచేసుకోలేని తమ అభిమానుల రియాక్షన్‌గా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందంటూ అయన విమర్శించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకంలో భాగంగా లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదలకు మంచి జరగడాన్ని ప్రతిపక్షం సహించలేకపోతోందన్నారు.

"ప్రజలు ఆప్యాయతలను చూపుతున్నారు. దానిని ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది. మీడియాలోని ఓ సెక్షన్ కూడా అలానే తయారయ్యింది. ఎవరూ మాట్లాడలేని బూతులు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ మాట్లాడని బూతులను వాళ్లు మాట్లాడుతారు. దానికి రియాక్షన్‌గా మనల్ని అభిమానించేవాళ్లు, ఆ బూతులు వినలేక ఎవరికో బీపీ వచ్చి.. రియాక్షన్ రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. కావాలనే తిట్టించి, కావాలని వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం రాష్ట్రంలో కనిపిస్తోంది. అబద్ధాలు ఆడతారు, అసత్యాలను ప్రచారం చేస్తారు. వంచన కనిపిస్తోంది. ప్రతీ మాటలోనూ, రాతలోనూ వక్రబుద్ధి కనిపిస్తోంది. మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికి వెనుకాడరు. కులాల మధ్య చిచ్చు పెడతారు. మతాల మధ్య విబేధాలు సృష్టిస్తారు. వ్యవస్థలను పూర్తిగా కూడా మ్యానేజ్ చేసేందుకు చూస్తారు. పేదవారికి మంచి జరకూడదని, జగన్‌కి మంచి పేరు వస్తుందని, ఆ మంచిని ఆపేందుకు రకరకాల కోర్టు కేసులు కూడా వేయిస్తారంటూ" జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Telugudesam party

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు

చంద్రబాబు 36 గంటల దీక్ష

టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేపట్టాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.

గురువారం(21.10.2021) ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం(22.10.2021) రాత్రి 8 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ దీక్ష కొనసాగుతుందని టీడీపీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

‘‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌరసంఘాలు కలిసి రావాలి’’ అని ఆ ప్రకటనలో కోరారు.

టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. విపక్ష టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తుండడం వివాదాలకు దారితీస్తోంది.

ఇప్పటికే అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.

దానికి తోడుగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కూడా నోటికి పనిచెప్పడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై దాడులకు పూనుకున్నాయి.

డ్రగ్స్ తో మొదలయ్యి..

ఏపీలో కొంతకాలంగా మంత్రి కొడాలి నాని సహా పలువురు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీద తీవ్రమైన పదజాలం ప్రయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల టీడీపీ నేతలు ఈ ధోరణిని అనుసరించారు.

గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విషయంలో తాడేపల్లి ప్యాలెస్ లోనే అసలు నిందితులున్నారంటూ సీఎం మీద వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ రాకెట్ కి సీఎం బాధ్యుడంటూ ఆరోపణలు గుప్పించారు.

విజయవాడ అడ్రస్ తో జీఎస్టీ సర్టిఫికెట్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేయడంతో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందంటూ టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేశారు.

గుజరాత్ లో పట్టుబడిన డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదని విజయవాడ సీపీ, ఏపీ డీజీపీ వివరణ ఇచ్చినప్పటికీ టీడీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. దాంతో చివరకు ఏపీ పోలీస్ బాస్ నేరుగా నోటీసులు కూడా ఇచ్చారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేదంటే పరువు నష్టం కేసు దాఖలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి
ఫొటో క్యాప్షన్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

గంజాయితో విస్తృతమైంది..

ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన గంజాయికి మూలాలు ఏపీలోనే ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. దాంతో రాష్ట్రమంతా గంజాయి సాగవుతోందని, దానికి వైసీపీ నేతలే మూలకారకులంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

ఇటీవల చింతపల్లి సమీపంలో నల్గొండ జిల్లా పోలీసులపై గంజాయి రవాణా చేస్తున్న వారు ఎదురుదాడికి పాల్పడడంతో టీడీపీ మరిన్ని ఆరోపణలు గుప్పించింది.

ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించిన మాజీ మంత్రి , టీడీపీ నేత నక్కా ఆనందబాబుకి నర్సీపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం రాత్రి నర్సీపట్నం నుంచి వచ్చిన పోలీసులు ఆనందబాబు ఇంటి వద్ద ఆయన్ని విచారించారు. ఆయన విమర్శలకు ఆధారాలు కావాలని ప్రశ్నించారు. అయితే ఆయన తగిన ఆధారాలు చూపలేదని విశాఖ డీఐజీ ప్రకటించారు.

అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

మాజీ మంత్రి ఆనందబాబుకి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం పట్ల టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదుపు తప్పి బూతులు కూడా ఉపయోగించారు. ముఖ్యమంత్రి, డీజీపీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆయన టార్గెట్ చేస్తూ బూతులు ప్రయోగించారు. ఇక్కడ రాయలేని బూతులను, భాషను కూడా ఆయన ఉపయోగించారు.

‘‘నోటీసులు మాకివ్వడం కాదు..దమ్ముంటే యూపీ పోలీసులకు ఇవ్వండి. తెలంగాణా పోలీసులకు ఇవ్వండి. గుజరాత్ పోలీసులకు ఇవ్వండి. నక్కా ఆనందబాబు లాంటి నాయకుడిని నోటీసులు ఇచ్చి బెదిరిస్తారా..ఇక్కడెవరూ మీ నోటీసులకు బెదిరేవాళ్లు లేరు. పత్రికల నిండా గంజాయి రాజ్ అని వార్తలు వస్తున్నాయి. వాళ్లందరికీ నోటీసులు ఇవ్వండి. తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మలకు చెబుతున్నాం. దమ్ముంటే వాళ్లకివ్వాలి నోటీసులు. చవటలాగా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని నోటీసులు ఇస్తారా. యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తుపదార్థాల వ్యాపారం చేస్తారా. యువత భవిష్యత్తు కాపాడాలంటే నోటీసులిస్తారా.. యూజ్ లెస్ ఫెలో. చేతిలో పోలీసులు న్నారు కదా అని ఇష్టమొచ్చినట్టు వాడుకుంటారా.. పాలేరుకి పాలేరుని ఆడిస్తున్న పబ్జీ దొరకు దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై ప్రతాపం చూపండి. మాకు నోటీసులు ఇవ్వడం కాదు. తోపు తురుంఖాన్ అనుకుంటున్నావా.. అర్థరాత్రి పూట నోటీసులు ఇవ్వడం ఏంటీ అంటూ పట్టాభి వ్యాఖ్యానించారు.

ఈ మాటలే ఒక్కసారిగా కలకలం రేపాయి.

టీడీపీ ఏపీ బంద్

కనిపించని తెలుగుదేశం పార్టీ బంద్ ప్రభావం

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై జరిగిన దాడులకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చారు.

అయితే తెల్లవారుజాము నుంచే ముఖ్య నాయకుల హౌస్ అరెస్టులతో రాష్ట్రంలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించట్లేదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. దుకాణాలు సైతం పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. కొన్ని మినహా స్కూల్స్, కాలేజీలు సైతం పూర్తిగా తెరుచుకున్నాయి.

విజయవాడ థియేటర్లలో మార్నింగ్ షోలు కూడా ప్రారంభమయ్యాయి.

బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా మొదలయ్యాయి. అయితే, అన్ని చోట్లా ముందు జాగ్రత్త కోసం పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

విజయవాడ బీసెంటు రోడ్డు
ఫొటో క్యాప్షన్, విజయవాడ బీసెంటు రోడ్డులో ఉదయం నుంచి యధావిధిగా జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు

కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ బస్టాండుల వద్ద బైఠాయించి, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

టీడీపీ నాయకులు, పోలీసులు మధ్య పలుచోట్ల వాగ్వాదాలు జరిగాయి. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అరెస్టులు కూడా చేశారు.

నిరసన ప్రదర్శనలు, బస్టాండుల వద్ద ఆందోళనలకు పూనుకున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎంపీ కింజారపు రామ్మెహన్ నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నర్సారావుపేట టీడీపీ నేత అరవిందబాబు అరెస్ట్ సమయంలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది.

వీడియో క్యాప్షన్, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి... రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు

ముందస్తు అరెస్టులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు బంద్ పాటించేందుకు ఆపార్టీ నేతలు సన్నద్ధమవుతుండగా పలు చోట్ల ముందస్తు అరెస్టులు జరిగాయి. టీడీపీ నేతలను రాత్రి నుంచే గృహనిర్బంధంలో ఉంచే ప్రయత్నాలు చేశారు. వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు సహా వివిధ ప్రాంతాల్లో నేతలను నిర్బంధించారు.

టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

పోలీసు బలగాల మోహరింపు

బంద్ కారణంగా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలో దింపారు. అనేక చోట్ల ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. బస్లాండ్ల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపిస్తున్నారు.

టీడీపీ నేతలు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో వారిని నిలువరించే ప్రయత్నం జరిగింది. బస్సులు యధావిధిగా తిరిగేందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేసింది.

మేకతోటి సుచరిత

ఫొటో సోర్స్, facebook/Sucharitha.Mla

దాడులతో మాకు సంబంధం లేదు

టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు తన కార్యకర్తలను ప్రేరేపించి ఈ దాడికి పురిగొల్పినట్టు అనుమానం వస్తోందంటూ ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు.

‘‘టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు నోటి దురుసుతనం ప్రదర్శిస్తే సహించబోము. నక్కా ఆనందబాబును కేవలం సమాచారం మాత్రమే అడిగారు. ప్రభుత్వం మీద, సిఎం జగన్ పైనా పదే పదే బురద చల్లుతున్నారు. టీడీపీ నాయకులు నీచమైన బాష మాట్లాడుతూ, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు వెనకనుండి నడుపుతున్నాడని బలంగా నమ్ముతున్నాం. మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించారనే అనుమానం కలుగుతోంది. వ్యక్తి గతంగా దూషించడం, అవమానకరంగా మాట్లాడటం తగదు. డిజిపి ఫోన్ తీయలేదు అనేది అవాస్తవం.. అమరవీరుల పెరేడ్‌లో డీజీపీ వున్నారు. మొదటి నుండి రాష్ట్ర ప్రతిష్టకు, ముఖ్యమంత్రికి భంగం కలిగేలా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు’’ అని హోం మంత్రి వ్యాఖ్యానించారు.

అందరినీ హౌస్ అరెస్టులు చేసి బంద్ విఫలమయ్యిందనడం ఏమిటీ - టీడీపీ

ఏపీ హోం మంత్రి వ్యాఖ్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహార్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి తమ అనుచరులే దాడులు చేశారని అంగీకరిస్తారు, కానీ హోం మంత్రి మాత్రం చంద్రబాబు చేయించుకున్నారు అనటం ఏమిటని ప్రశ్నించారు.

‘‘చంద్రబాబు తన ఆఫీసుపై తానే దాడి చేయించుకున్నారని, తన కార్యకర్తల తలలు పగులగొట్టించారని అనడానికి హోం మంత్రి ఎంత బాధ్యతారాహిత్యం. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. డీజీపీ ఆఫీసు మీదుగానే వాళ్లంతా వచ్చారు. అయినా పోలీసులు అడ్డుకోలేదు. నేరుగా చంద్రబాబు ఫోన్ చేసినా డీజీపీ స్పందించలేదు. పైగా ఆయన మీటింగులో ఉన్నారని చెప్పడం సిగ్గుచేటు. వైసీపీ వాళ్లే దాడులు చేస్తూ మళ్లీ తప్పులు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం విచారకరం. దేశంలో బీహార్ తర్వాత అత్యంత దయనీయంగా ఏపీ పోలీస్ వ్యవస్థ ఉంది. దానికి హోం మంత్రి చేతగానితనం మూలం. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రౌడీరాజ్యం చేయాలని చూస్తున్నారు. పోలీసులు అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు కూడా హరించారు. అందరినీ హౌస్ అరెస్టులు చేసి బంద్ విఫలమయ్యిందనడం ఏమిటీ’’ అంటూ జవహార్ వ్యాఖ్యానించారు.

సవాంగ్

ఫొటో సోర్స్, APPolice

డీజీపీ సవాంగ్ ఏమన్నారంటే..

''పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదు. ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రి పై అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదు. ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశాం. పోలీసులకు నిన్నటి దాడుల పై సమాచారం లేదు. పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదు....ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారు. పరేడ్‌లో బ్యాండ్ జరుగుతున్న సమయం లో నాకు నిన్న వాట్స్ యాప్ కాల్ వచ్చింది. నిన్న సాయంత్రం 5.03 గంటలకు నాకు కాల్ వచ్చింది కానీ ఆ సౌండ్స్‌లో మాట్లాడలేక పోయాను. చట్ట ప్రకారం కారకులపై చర్యలు ఉంటాయి'' అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

కాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన వారిలో 70 మందిపై మంగళగిరి పోలీసులు కేసునమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)