‘ఒక్కో డోసుకు రూ. 750 చెల్లించి ప్రైవేటుగా టీకా వేయించుకున్నా.. నా కోవిడ్ వ్యాక్సీన్ సర్టిఫికెట్‌పై నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు ప్రచురించారు?’ - కోర్టులో కేసు వేసిన కేరళ వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్ వ్యాక్సీన్ వేసుకున్న తరువాత ఇచ్చే సర్టిఫికెట్‌లో కింద ఎడమ వైపు ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ ఉంటుంది. మన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో మోదీ బొమ్మ ఎందుకు? అనే ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది.
కేరళలో పీటర్ అనే వ్యక్తికి కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. దాంతో ఆయన కోర్టు మెట్లెక్కారు. మోదీ బొమ్మ లేకుండా కొత్త వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కావాలంటూ కోర్టులో కేసు వేశారు.
"ఇది నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది" అని 62 ఏళ్ల పీటర్ వివరించారు. వచ్చే వారం ఈ కేసు విచారణకు రానుంది.
పీటర్ కేరళలో సమాచార హక్కు కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.
"నా సర్టిఫికేట్ మీద ఆయన బొమ్మ ఉండడం అంటే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన చొరబడుతున్నట్టు లెక్క. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ తప్పుడు, సిగ్గుచేటు చర్యను తక్షణమే నిలిపివేయాలని గౌరవనీయులైన ప్రధానమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. దీనివల్ల దేశానికిగానీ, వ్యక్తులకుగానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు" అని కొట్టాయం చెందిన పీటర్ బీబీసీకి చెప్పారు.
వ్యాక్సీన్ వేసుకున్నవారికి ఆరోగ్య శాఖ ఇచ్చే ధృవపత్రంలో పౌరుల వ్యక్తిగత సమాచారంతో పాటూ మోదీ ఫొటో, పక్కనే ఆంగ్ల, స్థానిక భాషల్లో ఓ సందేశం ఉంటుంది.
సర్టిఫికెట్‌లో మోదీ ఫొటో, సందేశం "ప్రజా ప్రయోజనాల కోసం" చేర్చబడ్డాయని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆగస్టులో పార్లమెంటుకు తెలిపారు.
ఇది, టీకాలు వేసిన తరువాత కూడా కోవిడ్ పట్ల అప్రమత్తంగా, బాధ్యతతో మెలిగేలా ప్రజలను ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు.
అయితే, వ్యాక్సీన్ వేయించుకున్నారంటేనే "టీకా ప్రయోజనాలను గుర్తించారని అర్థం", మళ్లీ సర్టిఫికెట్ ద్వారా సందేశం ఇవ్వడం అంటే "చెప్పినవారికే మళ్లీ చెప్పినట్టు లెక్క" అని పీటర్ అంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'వన్ మ్యాన్ షో'గా ప్రచారం
"మోదీ మనకు తొలి ప్రధాని కాదు. పైగా, ఇది మన దేశంలో జరుగుతున్న మొట్టమొదటి వ్యాక్సినేషన్ కార్యక్రమమేం కాదు. కోవిడ్ 19కు వ్యతిరేకంగా ప్రచారం, టీకా కార్యక్రమాన్ని 'వన్ మ్యాన్ షో' లాగ చూపిస్తూ, ప్రధానికి ప్రచార సాధనంగా వాడుకుంటున్నారు."
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తన సొంత డబ్బులతో వ్యాక్సీన్ వేయించుకోవాల్సి రావడంతో పీటర్ విసుగు చెందారు.
"ఉచితంగా టీకాలు వేస్తున్న ప్రభుత్వాసుపత్రుల్లో పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. అందుకే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కో టీకా డోసుకు రూ. 750 చెల్లించాను. మరి, నా సర్టిఫికెట్ మీద మోదీ ఫొటో ఎందుకుండాలి?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
దీనిపై స్పందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేరళ హై కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది.
బీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులతో ఈ అంశంపై మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారిద్దరూ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'వ్యక్తిగత ప్రచారానికి వినియోగించుకుంటున్నారు'
వ్యాక్సీన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటోను ముద్రించడంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు కురిపించాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో మోదీ ఫొటోకు బదులు తమ సొంత ముఖ్యమంత్రుల ఫొటోలను ముద్రించారు.
వ్యాక్సీన్లను మోదీ "వ్యక్తిగత ప్రచారానికి" వినియోగించుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
మరణ ధృవీకరణ పత్రాలపై కూడా ఆయన తన ఫొటోను ముద్రించుకోవాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
"నేను మీ మద్దతుదారు కాదు.. నాకు మీరంటే ఇష్టం లేదు. అయినా మీ ఫొటో పట్టుకుని నేను తిరగాలి. ఎందుకు? పౌరులకు స్వేచ్ఛ ఎక్కడుంది? కోవిడ్ సర్టిఫికెట్‌లో మీ ఫొటో తప్పనిసరి చేశారు కదా. ఇప్పుడు మరణ ధృవీకరణ పత్రాలపై కూడా ముద్రించండి" అని ఆమె ఓ విలేఖరుల సమావేశంలో అన్నారు.
ఇదిలా ఉండగా, విదేశాలకు వెళుతున్న భారతీయులకు వ్యాక్సీన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో గందరగోళం సృష్టించింది.
మోదీ ముఖంతో అంతగా పరిచయం లేని ఇమిగ్రేషన్ అధికారులు ఈ ఫొటో చూసి కొందరు ప్రయాణికులను అడ్డగించారని, మోసం చేస్తున్నారంటూ ఆరోపించారని వైస్ న్యూస్ తెలిపింది.
ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే, మన పిల్లల "స్కూలు, కాలేజీ సర్టిఫికెట్లపై కూడా మోదీ తన బొమ్మను ముద్రిస్తారని" పీటర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే, కొన్ని అనవసర పత్రాల్లో మోదీ ఫొటో కనిపిస్తుండం పీటర్ అభ్యంతరాలకు మూలం.
సుప్రీం కోర్టుకు సంబంధించిన అధికారిక ఈమెయిల్స్‌లో మోదీ ఫొటోతో సహా ఓ ప్రభుత్వ ప్రకటనను జతపరుస్తున్నారు. ఇటీవలే సుప్రీం కోర్టు మందలించడంతో ఈ ప్రకటన తొలగించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'సొంత డబ్బా కొట్టుకునే నాయకులకు కొదవ లేదు'
ప్రధాని మోదీకి ఫొటోలు, సెల్ఫీలు తీయించుకోవడంలో ఉన్న సరదా విదితమే. సోషల్ మీడియాలో ఆయనకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడు ఏ ర్యాలీని నిర్వహించిన భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.
వ్యాక్సీన్ సర్టిఫికెట్లలో మోదీ ఫొటో ముద్రించడంలో ఎలాంటి తప్పూ లేదని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని అత్యంత పాపులర్ నాయకులలో ఆయన కూడా ఒకరని వారు అంటున్నారు.
రోడ్ల పక్కన కనిపించే బిల్‌బోర్డులు, హోర్డింగులలో పెద్ద గడ్డంతో ఉన్న మోదీ ఫొటోలు ఎక్కడికక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి. వార్తాపత్రికల్లో వచ్చే పూర్తి పేజీ ప్రకటనల్లో, పలు ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో నవ్వుతూ ఉన్న మోదీ బొమ్మ కనిపిస్తుంటుంది.
భారతదేశంలో సొంత డబ్బా కొట్టుకుంటూ, ప్రగల్భాలు పలికే నాయకులకు కొదవ లేదని విమర్శకులు అంటున్నారు.
దేశంలో వందలాది విమానాశ్రయాలకు, యూనివర్సిటీలకు, అవార్డులకు, సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ తమ కుటుంబ సభ్యుల పేర్లే పెట్టిందని గతంలో బీజేపీ ఆరోపించింది.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దళిత ఐకాన్ మాయవతి సొంత విగ్రహాలు ప్రతిష్టించడంలో ప్రసిద్ధి చెందారు. దాంతో, వ్యక్తి పూజను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా అమ్మ క్యాంటీన్లు, ఫార్మసీలు, ఉప్పు ప్యాకట్లపై తన ఫొటోలను ముద్రించారు.
"కానీ, మోదీ ఈ వ్యక్తిగత ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. జర్నలిస్టు అయిన ముఖోపాధ్యాయ్ మోదీ బయోగ్రఫీ రాశారు.
"ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఆర్ఎస్ఎస్‌లో వ్యక్తుల కన్నా సంస్థ గొప్పదని బోధిస్తారు. కానీ, ఆయన నేతృత్వంలో సంస్థ కన్నా వ్యక్తి చాలా ముఖ్యమైనవాడైపోయాడు.
ఆయన మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి.. మా ప్రభుత్వం అని ఎప్పుడూ అనరు. నా ప్రభుత్వం లేదా మోదీ ప్రభుత్వం అనే అంటారు. ఆయన చేసే ప్రసంగాల్లో 'నేను', 'నాది' అనే మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఫిబ్రవరిలో ఒక స్టేడియంకు ఆయన పేరు కూడా పెట్టుకున్నారు."
వ్యక్తి పూజను ప్రోత్సహించడానికి మోదీ కోవిడ్ మహమ్మారిని ఓ గొప్ప అవకాశంగా మలుచుకున్నారని ముఖోపాధ్యాయ్ అన్నారు.
"కోవిడ్ 19 నుంచి రక్షించేందుకు వ్యాక్సీన్ ఒక్కటే మార్గం. వ్యాక్సీన్ సర్టిఫికెట్‌లో తన ఫొటో పెట్టడం ద్వారా తనను అందరూ ఓ రక్షకుడిగా చూడాలన్నది ఆయన ఉద్దేశం.
తనను దైవత్వానికి ప్రతినిధిగా ప్రజలు భావించాలి. అప్పుడే ప్రజల నమ్మకాన్ని చూరగొనవచ్చు. ఆ నమ్మకమే తరువాత ఓట్లుగా పరిణామం చెందుతుంది."
వ్యాక్సీన్ సర్టిఫికెట్ మీద మోదీ ఫొటో "పార్టీ ఆకాంక్షలకు, ప్రభుత్వ ప్రమాణాలకు మధ్య ఉన్న హద్దులను చెరిపేస్తోందని" ఇమేజ్ గురు దిలీప్ చెరియన్ అన్నారు.
"ఓట్లు సంపాదించేందుకు సర్టిఫికెట్లను సాధనంగా మలుచుకున్నారు. దృష్టి అంతా ఎన్నికల మీదే. ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు. వ్యాక్సీన్ సర్టిఫికెట్లయినా, ప్రభుత్వ పథాకాల పత్రాలైనా అదే సందేశం వెళుతోంది."
పార్టీ గుర్తింపు వ్యక్తితో అనుసంధానం అయిపోయింది. "ముఖం కనిపించడం" చాలా ముఖ్యం అయిపోయింది అని చెరియన్ అన్నారు.
సర్టిఫికెట్‌లో మోదీ ఫొటో ప్రచురించడంలో ఇదే సమస్య అని పీటర్ భావిస్తున్నారు.
"ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకుడు. ఈ చర్యల వలన ఎన్నికల్లో ఆయనకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఇది ఇలా సాగడానికి వీల్లేదు" అని పీటర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీకి ప్రజాదరణ ఒక్కసారిగా ఎందుకు తగ్గింది
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- కోవిడ్ 19: భారత్‌లో పిల్లలకు వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- దేశ చరిత్రను చెరిపేయడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తోందా?
- పాకిస్తాన్ పేరెత్తకుండా, ఆ దేశానికి నరేంద్ర మోదీ ఏమని వార్నింగ్ ఇచ్చారు?
- కులాలవారీ జనగణను ప్రతిపక్షాలు ఎందుకు కోరుతున్నాయి, బీజేపీ ఎందుకు వద్దంటోంది
- నరేంద్ర మోదీకి గుడి.. నాలుగు రోజుల్లోనే మూత.. ఎందుకు? ఏం జరిగింది?
- పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?
- మోదీకి ఒబామా, ట్రంప్ ఇచ్చినంత ప్రాధాన్యత బైడెన్ ఇచ్చారా?
- మోదీపై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి జీవితఖైదు ఎందుకు పడింది?
- మోదీ-షాల కాలంలో కాంగ్రెస్: పునర్వైభవం కోసం కాదు, మనుగడ కోసం పోరాటం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













