నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షులుగా ఒబామా, ట్రంప్ ఇచ్చినంత ప్రాధాన్యత బైడెన్ ఇచ్చారా?

జో బైడెన్‌తో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, facebook/POTUS

    • రచయిత, సలీం రిజ్వీ
    • హోదా, బీబీసీ కోసం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో, మోదీ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశం హాయిగా, సహృద్భావంతో సాగింది. ఇరు దేశాల నేతలూ పరస్పర సహకారం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు.

క్వాడ్ సభ్య దేశాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కూడా తొలిసారిగా ముఖాముఖి సమావేశమయ్యాయి.

ఇండో-ఫసిఫిక్ క్షేత్రంలో సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఆ దిశలో, వివిధ రంగాలలో సహాకారం కోసం నాలుగు దేశాలూ వర్కింగ్ గ్రూపు కమిటీలను ఏర్పాటు చేయడమే కాక వాటి పనితీరును కూడా సమీక్షించాయి.

గత ఆరు నెలల్లో భారత ప్రధాని చేసిన తొలి విదేశీ పర్యటన ఇది. కరోనా మహమ్మారి కారణంగా మోదీ విదేశీ పర్యటనలు తగ్గుముఖం పట్టాయి.

క్వాడ్ సభ్య దేశాల నేతలు

ఫొటో సోర్స్, facebook/POTUS

ఫొటో క్యాప్షన్, క్వాడ్ సభ్య దేశాల నేతలు

2019 మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో స్నేహం

దీనికి ముందు 2019లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ డోనల్డ్ ట్రంప్ పాలన నడుస్తూ ఉంది. వీరిరువురి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి.

మోదీ, ట్రంప్‌ను ప్రశంసిస్తూ ఉండేవారు.

"గొప్ప దేశానికి గొప్ప నాయకుడు" అంటూ ట్రంప్, మోదీని పొగడ్తలతో ముంచెత్తేవారు.

ఆ సమయంలోనే, సెప్టెంబర్‌లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో 'హౌడీ మోదీ' కార్యక్రమం నిరవహించారు. ఇందులో మోదీతో పాటు ట్రంప్ కూడా పాల్గొన్నారు. దాంతో పాటు ఈ సభకు హాజరైన యాభై వేలకు పైగా భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు.

అనేకమంది అమెరికా చట్టసభ సభ్యులు, సెనేటర్లు, గవర్నర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలను ఈ సభ మరో ఎత్తుకు తీసుకువెళ్లిందని మోదీని అందరూ ప్రశంసించారు.

హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2019లో హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో మోదీ, ట్రంప్

హౌడీ మోదీ కార్యక్రమం గురించి అమెరికా మీడియాలో చాలారోజులు వార్తలు కొనసాగాయి. ట్రంప్, మోదీ కలిసికట్టుగా వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ఎలా ప్రసంగించారో టీవీల్లో చర్చించారు.

అయితే, అదే సమయంలో కొన్ని పత్రికలు మోదీని విమర్శించాయి కూడా. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అంతకు నెల క్రితం కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించాయి. సాధారణ ప్రజలు ఆంక్షలు ఎదుర్కొంటున్నారంటూ కథనాలు ప్రచురించాయి.

ఒక అమెరికన్ పత్రికలో మోదీని "భారతదేశ ట్రంప్" అని సంభోదించారు.

అయినప్పటికీ, న్యూయార్క్, హ్యూస్టన్ నగరాల్లో మోదీకి ఘన స్వాగతమే లభించింది.

హౌడీ మోదీ కార్యక్రమంలో, 2020 అమెరికా ఎన్నికల గురించి మోదీ ప్రస్తావిస్తూ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని తనదైన రీతిలో సమర్థించారు. పక్కనే నిల్చున్న ట్రంప్, ఆయన మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

కాగా, 2020 ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు నిరాశే మిగిల్చాయి. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.

ఈ ఎన్నికల ప్రచారంలో, బైడెన్, కమలా హారిస్ కూడా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

నరేంద్ర మోదీ అమెరికా పర్యటన

ఫొటో సోర్స్, @MEAIndia

2021 మోదీ అమెరికా పర్యటన.. మారిన పరిస్థితులు

ప్రస్తుతం 2021లో మోదీ అమెరికా పర్యటన సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ఈసారి కరోనా కారణంగా మోదీ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలూ నిర్వహించలేదు. క్రితం సారి అమెరికాలో వేలాదిమంది భారతీయులను కలిసిన మోదీ ఈసారి వందలమందితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మోదీకి స్వాగతం పలకడానికి వాషింగ్టన్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి, వైట్ హౌస్ ముందు గుమికూడారు. వారంతా ఉత్సాహంగా భారత ప్రధానికి స్వాగతం పలికారు. మోదీ బొమ్మ ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు.

అయితే, మోదీకి వ్యతిరేకంగా మరో గుంపు కూడా అక్కడ గుమికూడింది. వారంతా మోదీని విమర్శిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లపై మోదీని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు రాశారు.

ఈ రెండు గుంపులూ గొడవకు దిగుతాయేమోనన్న భయంతో పోలీసులు అక్కడే కాపు కాచారు.

నరేంద్ర మోదీ అమెరికా పర్యటన

ఫొటో సోర్స్, Salim Rizvi

ద్వైపాక్షిక సమావేశానికి మోదీ వైట్ హౌస్ చేరుకున్నప్పుడు బైడెన్ వెలుపలకు వచ్చి స్వాగతం పలకలేదు. అధికారులు, ఆయనను నేరుగా ఓవల్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ బైడెన్, మోదీని స్వాగతించారు.

ఇరువురు నేతలూ పలు విషయాలపై చర్చించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు, వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా కలిసి పోరాడేందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఇద్దరు నేతలూ ప్రతీ అంశాన్ని ఆచితూచి చర్చించారు.

ప్రస్తుతం మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, భారత్, అమెరికాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఒకేలా ఉన్నాయి. అంతే కాకుండా, ఈ రెండు దేశాలకు పరస్పర అవసరం ఉంది.

ఈ సమావేశంలో కరోనా ప్రభావం బాగానే కనిపించింది. మోదీ, బైడెన్‌కు కౌగలించుకోలేదు. బైడెన్, మోదీని మహా నేత అని పొగడలేదు.

కానీ, బైడెన్‌ను మహా నాయకుడిగా అభివర్ణించేందుకు మోదీ ప్రయత్నించారని అనిపించింది.

నరేంద్ర మోదీ అమెరికా పర్యటన

ఫొటో సోర్స్, Salim Rizvi

కాగా, బైడెన్, కమలా హారిస్ ఇద్దరూ కూడా మోదీతో చర్చల్లో.. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

బైడెన్, మోదీ కూడా మహాత్మా గాంధీని తలుచుకున్నారు. ఆయన చూపిన అహింసామార్గం నేటి సమాజానికి అవసరమని పేర్కొన్నారు.

ఈసారి, భారత ప్రధాని అమెరికా పర్యటన గురించి అక్కడి వార్తాపత్రికల్లో ప్రత్యేక కథనాలు ప్రచురించలేదు.

కాగా, మోదీ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందంటూ కొన్ని పత్రికలు ప్రస్తావించాయి.

లాస్ ఏంజిల్స్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక కథనం శీర్షికలో "కమలా హారిస్ మానవ హక్కుల విషయంలో మోదీపై స్వల్పంగా ఒత్తిడి తెచ్చారని" రాశారు.

భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనను బైడెన్ ప్రభుత్వం విస్మరించిందంటూ అమెరికా వార్తాపత్రిక పొలిటికోలో చర్చించారు.

హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా అడ్వకసీ డైరెక్టర్ జాన్ సిఫ్టన్ వ్యాఖ్యను కూడా ఈ కథనంలో జత చేశారు.

"భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై బైడెన్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అమెరికా అధికారులు ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు? వ్యూహం ఏమిటి?" అంటూ సిఫ్టన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)