కశ్మీర్ అంశంపై టర్కీ అధ్యక్షుడి వైఖరి మారిందా

ఫొటో సోర్స్, @trpresidency
ఐక్యరాజ్యసమితి వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. 76వ సర్వప్రతినిధి సభ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి టర్కీ కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు.
‘‘గత 74ఏళ్ల నుంచి కశ్మీర్ సమస్య అలానే ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా రెండు దేశాలు దీన్ని పరిష్కరించుకోవాలి’’ అని ఆయన అన్నారు.
అయితే, ఈసారి కశ్మీర్ విషయంలో ఎర్దోవాన్ వైఖరి కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. 75వ సర్వప్రతినిధి సభ సమావేశాల్లో ప్రసంగించినప్పుడు ఆయన ఈ విషయంపై చాలా గట్టిగా మాట్లాడారు.
గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్-370 రద్దు అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈసారి అన్ని వివరాల్లోకి వెళ్లేదు. చైనాలోని వీగర్ ముస్లింలపై అణచివేతతో మొదలుపెట్టి, ఇజ్రాయెల్, సిరియా, లిబియా, యుక్రెయిన్, అజర్‌బైజాన్‌ల సమస్యల గురించి చెబుతూ.. కశ్మీర్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
అన్నింటికంటే ప్రధానమైన అంశం ఏమిటంటే, గత ఏడాది ఆయన చైనాలో వీగర్ల గురించి మాట్లాడలేదు. ఈ విషయంపై ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మెత్తబడ్డారా?
చైనాలో వీగర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘చైనా ప్రాదేశిక సమగ్రతకు భంగం కలగకుండానే.. వీగర్ టర్క్ ముస్లింలకు హక్కులు కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరముంది’’అని ఎర్దోవాన్ అన్నారు.
అఫ్గానిస్తాన్ గురించి మాట్లాడుతూ.. ‘‘అఫ్గాన్‌వాసులను ఒంటరిగా వదిలేశారు’’ అని వ్యాఖ్యానించారు. వారికి అంతర్జాతీయ సమాజం సాయం అవసరముందని వివరించారు. ఈ కష్టకాలంలో అఫ్గాన్‌వాసులకు టర్కీ అండగా నిలుస్తుందని అన్నారు.
గత ఏడాది కశ్మీర్ అంశం గురించి ప్రస్తావించేటప్పుడు, ఎర్దోవాన్ స్వరం చాలా భిన్నంగా వినిపించింది.
‘‘దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత ఏర్పడటంలో కశ్మీర్ సమస్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికీ ఈ సమస్య అలానే రగులుతోంది. ఆర్టికల్-370ని రద్దు చేసిన తర్వాత, పరిస్థితులు మరింత జటిలం అయ్యాయి’’ అని ఆయన అన్నారు.
‘‘ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీరీల ఆకాంక్షలు, చర్చలకు అనుగుణంగా కశ్మీరీ సమస్యను పరిష్కరించేందుకు మేం మద్దతు పలుకుతున్నాం’’ అని గతేడాది ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాక్ స్పందించలేదు..
ఈసారి కూడా కశ్మీరీ సమస్య పరిష్కారానికి ఐరాస తీర్మానాలు, చర్చల గురించి ఎర్దోవాన్ మాట్లాడారు. కశ్మీరీ ప్రజల ఆకాంక్షలు గురించి ప్రస్తావించలేదు.
గత ఏడాది ఎర్దోవాన్ ప్రసంగం అనంతరం, పాకిస్తాన్ చాలా ఉత్సాహం చూపించింది. ఎర్దోవాన్ ప్రసంగ దృశ్యాలను ట్విటర్‌లో పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ షేర్ చేశారు.
‘‘కశ్మీరీ హక్కుల గురించి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మరోసారి గొంతు విప్పిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోవాన్‌ను మేం ప్రశంసిస్తున్నాం. కశ్మీరీల న్యాయపరమైన పోరాటానికి టర్కీ కూడా మద్దతు పలుకుతోంది’’ అని ఆనాడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
మరోవైపు ఎర్దోవాన్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ అంశంపై ఐరాసలోని భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి స్పందించారు.
‘‘ఇది భారత్ అంతర్గత అంశం. దీని గురించి వేరే దేశం మాట్లాడటాన్ని భారత్ సహించదు. భారత్ సార్వభౌమత్వాన్ని టర్కీ గౌరవించాలి’’ అని ఆయన అన్నారు.
మరోవైపు గత ఏడాది ఎర్దోవాన్ వ్యాఖ్యలపై పాక్ మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. కానీ ఈసారి పాక్ వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు. అలానే పాక్ మీడియా కూడా అంత ఉత్సాహం చూపించలేదు.
గత ఏడాది ఫిబ్రవరిలో టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. ఆనాడు పాక్ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కశ్మీరీ అంశం పాకిస్తాన్‌కు ఎంత ముఖ్యమైనదో.. టర్కీవాసులకూ అంతే ముఖ్యమైనదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీతో మోదీ ప్రభుత్వ సంబంధాలు..
ఇటీవల కాలంలో భారత్, టర్కీల మధ్య సంబంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్నాక, పశ్చిమాసియాలోని దాదాపు అన్ని ప్రధాన దేశాల్లోనూ ఆయన పర్యటించారు. కానీ టర్కీకి మాత్రం వెళ్లలేదు.
2019 చివర్లలో మోదీ టర్కీ పర్యటనకు వెళ్లాల్సిందని గత ఏడాది అక్టోబరు 20న ఆంగ్ల పత్రిక ద హిందూ ఓ కథనం ప్రచురించింది. అయితే, కశ్మీర్ విషయంలో ఎర్దోవాన్ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ పర్యటన రద్దయిందని వివరించింది.
‘‘అంకారాలో మోదీకి ఆహ్వానం పలికేందుకు మా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో ప్రయత్నాలన్నీ జరిగాయి. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దైంది. మరో తేదీ కోసం మేం ప్రయత్నిస్తున్నాం. మోదీ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలోనే ప్రకటిస్తాం’’ అని భారత్‌లోని టర్కీ రాయబారి సాకిర్ ఓజ్కాన్ ఆనాడు ద హిందూతో చెప్పారు.
కశ్మీర్ విషయంలో చైనా అధ్యక్షుడు కూడా భారత్‌ను విమర్శించారు. అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. భారత్‌లో పర్యటించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో బంధాలు ఇలా..
భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్, టర్కీల మధ్య సంబంధాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు దేశాలూ సున్నీల ఆధిక్యం ఉన్న ఇస్లామిక్ దేశాలే. ఎర్దోవాన్ మొదట్నుంచి పాకిస్తాన్‌తో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు.
జులై 2016లో టర్కీలో ఎర్దోవాన్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగినప్పుడు, పాక్ బహిరంగంగానే ఎర్దోవాన్‌లు మద్దతు తెలిపింది. అప్పటి పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఎర్దోవాన్‌కు ఫోన్‌చేసి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత టర్కీలో షరీఫ్ పర్యటించారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో చాలా పురోగతి కనిపించింది.
2017 నుంచి నేటివరకు బిలియన్ డాలర్లకుపైనే పాక్‌లో టర్కీ పెట్టుబడులు పెట్టింది. పాకిస్తాన్‌లోని చాలా ప్రాజెక్టుల్లో టర్కీకి భాగస్వామ్యముంది. మరోవైపు పాక్‌లో మెట్రో బస్సు సేవలను కల్పించే ప్రాజెక్టును టర్కీకి అప్పగించారు.
రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య (ఫ్రీ ట్రేడ్) ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం 90 మిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి.
టర్కీ ఎయిర్‌లైన్స్ సేవలు కూడా పాక్‌లో బాగా విస్తరించాయి. చాలా పశ్చిమ దేశాలకు టర్కీ గుండానే పాక్‌వాసులు వెళ్తుంటారు. ఇస్తాంబుల్ రీజినల్ ఏవియేషన్ హబ్‌గా మారుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, టర్కీలో పర్యటించాలంటే పాకిస్తాన్ ప్రజలకు వీసా తప్పనిసరి. ఒకసారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఇటీవల కాలంలో పశ్చిమ దేశాలు, యూరప్ నుంచి టర్కీకి వస్తున్న పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ పర్యటకులు మిగతా ముస్లిం దేశాలకు వచ్చేలా చూసేందుకు టర్కీ ప్రయత్నిస్తోంది.
టర్కీ ఆర్థిక, రాజకీయ మోడల్‌ను పాక్ ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. పాక్ మాజీ అధ్యక్షుడు, సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్.. టర్కీ వ్యవస్థాపకుడు ముస్తాఫా కమల్ పాషాను చాలా అభిమానించేవారు.
ముస్తాఫా సెక్యులర్ సంస్కరణలు, పటిష్ఠమైన పాలన వ్యవస్థను ముషారఫ్ కొనియాడేవారు. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఎర్దోవాన్‌ను అలానే కొనియాడుతున్నారు.
2016లో టర్కీలో తిరుగుబాటు విఫలం అయిన తర్వాత, ఎర్దోవాన్‌ను ఇమ్రాన్ ఖాన్ హీరోగా అభివర్ణించారు. అయితే, ఇలాంటి తిరుగుబాటు వచ్చే ముప్పు పాకిస్తాన్‌ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
గత ఫిబ్రవరి 14న ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్-టర్కీ బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీచేసినా ఎర్దోవాన్ కచ్చితంగా గెలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ విషయంలో తాలిబాన్లు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు - ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీ
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








