ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడి భార్యను ఎందుకు కలిశారు... వారి సమావేశం ఎందుకు వివాదాస్పదమైంది?

ఫొటో సోర్స్, Anadolu Agency
- రచయిత, అపూర్వకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దవాన్ భార్య ఎమైన్ ఎర్దవాన్‌తో సమావేశం కావడం ఎందుకు వివాదాస్పదమైంది? ఆమిర్ ఖాన్, ఎమైన్ ఎర్దవాన్‌ల సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.
అసలు ఆమిర్ ఖాన్ టర్కీ వెళ్లడాన్నే కొందరు తప్పుబట్టారు. ఎందుకిలా జరిగింది ? ఎందుకంటే భారత్‌కన్నా పాకిస్తాన్‌ను టర్కీ తన ఆప్త మిత్ర దేశంగా చూస్తుంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణియం స్వామి మాటల్లో చెప్పాలంటే టర్కీ యాంటీ-ఇండియా.
ఈ మాటలు నిజమేనా ?
"ఇవి పూర్తిగా అర్ధంలేని వ్యాఖ్యలు. ఇలా చెప్పేవాళ్లకు టర్కీపై అవగాహన లేదు" అని టర్కీలో భారత రాయబారిగా పని చేసిన ఎం.కె.భద్రకుమార్ అన్నారు.
టర్కీ భారతదేశానికి మిత్రదేశమా లేక శత్రు దేశమా? దీన్ని అర్థం చేసుకోవాలంటే వారి సంబంధాలకు సంబంధించిన గతాన్ని కూడా తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
తొలి స్నేహం
స్వాతంత్ర్యం వచ్చాక టర్కీతో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చిన వారిలో నెహ్రూ ఒకరు.
"రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి టర్కీతో నెహ్రూ మంచి సంబంధాలను కోరుకున్నారు'' అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాయంలో పశ్చిమాసియా వ్యవహారాల శాఖ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎ.కె.పాషా అన్నారు.
"ఒటోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి ముస్తఫా కెమాల్ పాషా లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఒక పెద్ద ముస్లిం దేశం లౌకిక దేశంగా మారబోతోందని తెలిసి నెహ్రూ చాలా సంతోషించారు'' అని పాషా వెల్లడించారు.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాలు అమెరికా, రష్యా అనే రెండు వర్గాలుగా విడిపోయాయి. అప్పుడు టర్కీ, పాకిస్థాన్ అమెరికా పక్షాన చేరాయి. భారత్ మాత్రం తటస్థంగా ఉండిపోయింది. "టర్కీ వైఖరిపై నెహ్రూ తీవ్ర నిరాశకు గురయ్యారు'' అని ప్రొఫెసర్ పాషా అన్నారు.

ఫొటో సోర్స్, BETTMANN
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పెరిగిన దూరం
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, భారతదేశం, టర్కీ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. టర్కీ అమెరికా పంచన చేరింది. భారతదేశం సోవియట్ యూనియన్‌కు చేరువైంది. ఈ సమయంలో టర్కీ, పాకిస్తాన్ స్నేహితులుగా మారాయి. పాకిస్తాన్‌కు టర్కీ సైనిక సహాయం కూడా అందించింది. 1965, 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధాలలో టర్కీ పాకిస్తాన్‌కు ఎంతో సాయపడింది.
1974లో టర్కీ సైప్రస్‌పై దాడి చేసినప్పుడు భారతదేశం సైప్రస్‌కు మద్దతు ఇవ్వడంతో టర్కీతో భారత్ సంబంధాలు మరింత క్షీణించాయి. అప్పటి టర్కీ అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ మక్రియోస్ నయీమ్ అలీనోద్యమ నాయుడు.
"సైప్రస్‌లో కొంత భాగాన్ని టర్కీ స్వాధీనం చేసుకోవడంపై ఇందిరా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలీనోద్యమ నాయకుల మద్దతుతో టర్కీపై చర్యలకు ఇందిరాగాంధీ ప్రతిపాదించారు. ఆ తర్వాత అనేక ఘటనలతో రెండు దేశాల మధ్య అగాథం పెరిగింది. పాకిస్తాన్, టర్కీ మరింత దగ్గరయ్యాయి" అని ప్రొఫెసర్ పాషా వివరించారు.
స్నేహం కోసం రెండో ప్రయత్నం
1984లో రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత టర్కీతో సంబంధాలను మెరుగుపర్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం 80ల చివరిలో కశ్మీర్ సమస్య ముదరడం. ఆ సమయంలో, ముస్లిం దేశాల సంస్థ OIC కశ్మీర్‌లో మానవ హక్కుల పరిస్థితిని పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. టర్కీ, సౌదీ అరేబియావంటి దేశాలు ఇందులో క్రియాశీలంగా వ్యవహరించాయి.
టర్కీతో తమకు అవసరం ఉన్నందున ఆ దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోడానికి పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయిలాంటి ప్రధానమంత్రులు టర్కీని సందర్శించారని ప్రొఫెసర్ పాషా చెప్పారు. అదే సమయంలో టర్కీ ప్రధాని ముస్తఫా బులెంట్ పాకిస్థాన్‌లో సైనిక పాలనను వ్యతిరేకించారు.
జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. ఆయన పాకిస్థాన్ మీదుగా ప్రయాణించడానికి నిరాకరించి, భారత్‌కు నేరుగా వచ్చారు.

ఫొటో సోర్స్, TARIK TINAZAY
"నేను రాయబారిగా ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. టర్కీ ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చారు. భగవద్గీత, గీతాంజలిని ఆయన అనువదించారు" అని 1998- 2001 మధ్య టర్కీలో భారత రాయబారిగా ఉన్న ఎం.కె. భద్రకుమార్ చెప్పారు.
"1990,2001లలో టర్కీ పాకిస్థాన్‌కు కాకుండా భారతదేశానికి దగ్గరగా వస్తున్నట్లు అనిపించింది. కాని 2002లో ఇస్లాం మతం పేరిట ఎర్దవాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారడం ప్రారంభమైంది" అని ప్రొఫెసర్ పాషా అన్నారు.
ఎర్దవాన్ కూడా ప్రయత్నించారా ?
ఇస్లాం మతాన్ని ఒక రాజకీయ అజెండాగా చేసుకుని అధికారంలోకి వచ్చిన జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ నాయకుడు ఎర్దవాన్ అటాటర్క్ ముస్తఫా కెమాల్ పాషా రూపొందించిన టర్కీ స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నించారు.
అంతేకాదు టర్కీని ముస్లిం దేశాలకు నాయకత్వం వహించేలా, ఒక ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. పాలస్తీనా సంక్షోభం, కశ్మీర్ సమస్యతో సహా అంతర్జాతీయ వేదికలపై ముస్లిం వర్గాలకు సంబంధించిన వివాదాస్పద సమస్యలను ఆ దేశం ప్రస్తావించడం ప్రారంభించింది.
ఎర్దవాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత్‌తో సంబంధాలను మెరుగు పరిచే ప్రయత్నాలు జరిగాయని, అయితే దీనికి రెండు పెద్ద సమస్యలు అడ్డుపడ్డాయని ప్రొఫెసర్ పాషా వెల్లడించారు.
"మొదటి సమస్య ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో అసమతుల్యత. అంటే టర్కీకి భారతదేశం ఎక్కువ వస్తువులను ఎగుమతి చేస్తోంది. టర్కీ నుండి దిగుమతులు తక్కువగా ఉండేవి. దీన్ని సరిదిద్దాలని టర్కీ కోరుకుంది. భారతదేశం దిగుమతులను పెంచింది. టర్కీతో మధ్య ప్రాచ్యంలో కొన్ని ప్రాజెక్టులలో భారత్ కలిసి పని చేసింది.
రెండవ సమస్య టర్కీకి సొంతంగా చమురు, సహజవాయు నిక్షేపాలు లేవు. దీంతో అణు విద్యుత్‌ను తయారు చేయాలని టర్కీ భావించింది. కేరళలోలాగే టర్కీలో కూడా థోరియం నిల్వలున్నాయి. థోరియం నుంచి అణు విద్యుత్‌ను తయారు చేసే టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉంది. ఆ టెక్నాలజీ కావాలని టర్కీ కోరగా, భారత్ అందుకు నిరాకరించింది" అని ప్రొఫెసర్ పాషా వెల్లడించారు.
"ఎర్దవాన్ 2017, 2018లో భారతదేశాన్ని సందర్శించారు. కానీ భారతదేశంపై ఆశలు పెట్టుకోవడం వృథా అని వదిలేశారు'' అని పాషా తెలిపారు.
ఒకపక్క భారత్‌కు ఇజ్రాయెల్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలతో సాన్నిహిత్య పెరగ్గా, టర్కీ బాగా దూరమైంది. "భారత్-టర్కీ సంబంధాలు ఎప్పుడూ సరిగ్గా లేవు. టర్కీతో సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఇజ్రాయెల్‌తో సంబంధంకన్నా టర్కీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి'' అని మాజీ రాయబారి భద్రకుమార్ అన్నారు.
కశ్మీర్ సమస్య
2016-17లో టర్కీలో తిరుగుబాటు మొదలైనప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అమెరికాలో ఉండే టర్కీ మత నాయకుడు ఫెతుల్లా గులెన్ నాయకత్వంలోని గులెన్ మూమెంట్ ఈ తిరుగుబాటు వెనక ఉందని, అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు టర్కీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించాయని ఎర్దవాన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
"గులెన్ ఉద్యమం భారతదేశంలో కూడా యాక్టివ్‌గా ఉంది. గులెన్ ఉద్యమాన్ని ప్రచారం చేసే పాఠశాలలు, కళాశాలలను మూసేయాలని భారత్‌ను ఎర్దవాన్ కోరారు. భారత్ ఆయన మాటలను వినకపోవడంతో ఆయన కశ్మీర్ సమస్యను లేవనెత్తడం ప్రారంభించారు" అని ప్రొఫెసర్ పాషా అన్నారు.
భారత్‌తో సత్సంబంధాలు పెరగలేదు. ఇదే సమయంలో ముస్లిం దేశాలకు నాయకత్వం వహించడంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ కారణంగా ఖతార్ విషయంలో సౌదీ అరేబియాను ఆయన బెదిరించేదాకా వెళ్లారు. గాజాస్ట్రిప్ ముట్టడి జరిగితే అక్కడి పాలస్తీన ప్రజలకు సాయం చేయడానికి ఓడలను పంపారు.
సోఫియా మ్యూజియంను మసీదుగా ప్రకటించడం ద్వారా తాను ముస్లిం పాలకుడిని అని చెప్పుకోడానికి ఆయన ప్రయత్నించారు. ముస్లిం ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు వారి తరఫున తన గొంతు వినిపిస్తారు.
కశ్మీర్‌పై ప్రకటన
కశ్మీర్ పాకిస్తాన్‌కు ఎంతో, టర్కీకి కూడా అంతేనంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు ఎర్దవాన్ అక్కడి పార్లమెంటులో ప్రకటన చేశారు. గతేడాది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన కశ్మీర్ సమస్యను కూడా లేవనెత్తారు.
అయితే, కశ్మీర్‌పై టర్కీని ఒప్పించాలని భారత్ చేస్తున్న ప్రయత్నం సరిగా లేదని మాజీ రాయబారి భద్రకుమార్ అన్నారు.
"కాశ్మీర్‌పై మన చర్యలను ప్రపంచం మొత్తం అంగీకరించాలని మనం కోరుకుంటాం. కాని చాలా దేశాలు దానితో ఏకీభవించవు. వారు దానిని సమస్యగా చేయకపోయినా, ఏకీభవించరు. అంటే వాళ్లు మన శత్రువులు అని అర్ధం కాదు. కశ్మీర్‌లో ప్రభుత్వం చేస్తున్నది సరైందికాదని అందువల్లే అక్కడి ప్రజలు భారతదేశానికి వ్యతిరేకులుగా మారారని నమ్ముతున్న వారు మనదేశంలో చాలామంది ఉన్నారు'' అని భద్రకుమార్ వ్యాఖ్యానించారు.
"టర్కీ కశ్మీర్ అంశంపై మాట్లాడినా, పాకిస్థాన్‌కు సహాయం చేస్తామని చెప్పలేదు. కశ్మీరీలకు మద్దతిస్తామని మాత్రమే ఆ దేశం చెబుతోంది.'' అని ప్రొఫెసర్ పాషా అన్నారు.
"టర్కీతో సంబంధాలు దిగజారడానికి ప్రధాన కారణాలలో ఒకటి మారుతున్న భారతదేశపు విధానాలు" అని మాజీ రాయబారి భద్రకుమార్ అన్నారు.
"ఇంతకీ భారత్‌కు టర్కీ మిత్రుడా, శత్రువా అంటే రెండూ అని చెప్పాలి. ఇద్దరూ ఒకరినొకరు వేధించడానికి పోటీ పడుతున్నారు. భారతదేశం పెద్ద శక్తిగా ఎదగాలని అనుకుంటున్నట్లుగానే టర్కీ కూడా శక్తిగా మారాలని కోరుకుంటోంది" అని ప్రొఫెసర్ పాషా అన్నారు.
"వీళ్లు 1985కి పూర్వపు గాయాలను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంటే, వాళ్లు కాశ్మీర్ విషయంలో 50-60-70ల విధానాలను పునరావృతం చేస్తున్నారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇలాంటి సమయంలో ఆమిర్ ఖాన్ టర్కీకి వెళ్లడం మంచి పరిణామం. భారతదేశం అటువంటి వ్యక్తులపై దాడి చేయకుండా వారిని సాంస్కృతిక రాయబారులుగా గుర్తించాలి'' అని భద్ర కుమార్ అన్నారు.
"టర్కీతో సంబంధాలు బాగా లేని సమయంలో ఇలాంటి పరిణామాలు విశ్వాసాన్ని పెంచుతాయి. ఆమిర్ ఖాన్‌కు సరిసమానమైన వ్యక్తి పాకిస్తాన్‌లో ఎవరైనా ఉన్నారా?'' అని భద్ర కుమార్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్తో విలవిల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- పార్లమెంటు సమావేశాలు లేకుండా మోదీ ప్రభుత్వం ఎలా నడుస్తోంది?: ‘ప్రజా పార్లమెంటు’లో ప్రశ్నలు
- సౌదీ అరేబియాకు పాకిస్తాన్ కన్నా భారత్ ఎందుకు మిన్న?
- 50 ఏళ్ల కిందట అంతరించిన అరుదైన జీవి.. ఆఫ్రికాలో మళ్లీ ప్రత్యక్షం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి పై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం
- మాలిలో సైనికుల తిరుగుబాటు... దేశాధ్యక్షుడి రాజీనామా, పార్లమెంటు రద్దు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








