పార్లమెంటు సమావేశాలు లేకుండా మోదీ ప్రభుత్వం ఎలా నడుస్తోంది?: ‘ప్రజా పార్లమెంటు’లో ప్రశ్నలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
“కోవిడ్ కాలంలో మన పార్లమెంట్ మూతపడడమే కాదు, ప్రజలకు నేతృత్వం కూడా వహించడం లేదు. దీంతో నచ్చినట్టు పనిచేయడానికి ప్రభుత్వానికి ఇప్పుడు మినహాయింపు లభించింది. దీనిపై ప్రశ్నలు లేవనెత్తడానికి ఇప్పుడు సంస్థాగత విధానం ఏదీ లేకుండాపోయింది”.
మాజీ జడ్జి జస్టిస్ ఏపీ షా చేసిన వ్యాఖ్యలివి. ఆయన ఆదివారం (ఆగస్టు 16) ప్రారంభమైన ఆరు రోజుల జనతా సంసద్ (ప్రజా పార్లమెంటు)లో ఈ మాటలన్నారు.
దేశంలోని వివిధ సామాజిక సంస్థలు, విద్యావేత్తలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇందులో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చు.
కరోనా మహమ్మారితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రోజులు తగ్గించేశారు. పార్లమెంటరీ కమిటీ రెండు నెలల నుంచీ పనిచేయడం లేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై మధ్యలోనే ప్రారంభం కావాలి. కానీ అవి కూడా జరగలేదు.
కోవిడ్ వల్ల పార్లమెంటు నడవడం లేదని కార్యక్రమం నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే, ప్రభుత్వం నుంచి జవాబుదారీ కోరడం కష్టం అన్నారు. అదే ఉద్దేశంతో ఈ వర్చువల్ ప్రజా పార్లమెంటును ఏర్పాటు చేశారు.
ప్రజా పార్లమెంటు ప్రారంభ సమావేశంలో జస్టిస్ ఏపీ షా, సామాజిక కార్యకర్తలు సైదా హమీద్, సోనీ సోరీ, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాణీ పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటు ఆన్‌లైన్‌లో ఎందుకు నడవదు?
ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ ఏపీ షా “పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరిలో జరిగాయి. ఆ తర్వాత కోవిడ్ వల్ల ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ కష్టకాలంలో మిగతా చాలా దేశాల్లో పార్లమెంటు పనిచేయడం మనం చూస్తున్నాం. కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో పార్లమెంట్ పని విధానాల్లో మార్పులు చేసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించారు. కొన్ని దేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉండాలని ఇంటర్నెట్ ద్వారా ఓటు వేసి నిర్ణయించారు” అన్నారు.
“ఫ్రాన్స్, చిలీ లాంటి దేశాల పార్లమెంటు కార్యకలాపాలు కూడా నడుస్తున్నాయి. మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో కూడా సమావేశాలు జరిగాయి. మాల్దీవుల్లో ఒక సాఫ్ట్ వేర్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్లమెంట్ నడిపించారు. కరోనా కాలం అయినా సరే, పార్లమెంట్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ ఆగిపోకూడదన్నారు ఆ దేశ స్పీకర్” అని ఆయన పేర్కొన్నారు.
“కానీ, మన ఎంపీలకు అలాంటి ఆలోచన వచ్చినట్లు కనిపించడం లేదు. మార్చి తర్వాత పార్లమెంట్ మూసేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తీవ్రవాదుల దాడి, యుద్ధం వచ్చినపుడు కూడా పార్లమెంట్ కార్యకలాపాలు నడిచాయి. 2001లో దాడి జరిగిన తర్వాత రోజే పార్లమెంటు కార్యకలాపాలు జరిగాయి” అని జస్టిస్ ఏపీ షా ప్రస్తావించారు.
“భారత్‌లో ఇంటర్నెట్ సాయంతో పార్లమెంటు కార్యకలాపాలు కుదరదని అనలేం. ఇక్కడ కూడా అలా ఉభయసభలు నడపవచ్చు. అందులో రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవడం ముఖ్యం. ప్రభుత్వానికి అన్ని అధికారాలూ అప్పగిస్తే, అది ఒక నియంతలా మారిపోతుందని రాజ్యాంగం రూపొందించిన భారత రాజ్యాంగ సభ భయపడింది. అందుకే, ప్రభుత్వం పార్లమెంటు పట్ల జవాబుదారీగా ఉండాలనే ఈ వ్యవస్థను ఏర్పాటుచేసింది”.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఆదివాసీ ప్రాంతంలో ఆన్‌లైన్ విద్య ఎలా సాధ్యం?: సోనీ సోరీ
జస్టిస్ ఏపీ షా తన ప్రసంగంలో “ఇలాంటి పార్లమెంటరీ జవాబుదారీతనం వల్లే ఇందిరాగాంధీ 1977లో అధికారం వదలాల్సి వచ్చింది. పార్లమెంటులో ప్రశ్నలు అడగడం అనేది, జవాబుదారీ తనాన్ని నిర్ణయించే ప్రక్రియలో భాగం. కానీ, కోవిడ్ మహమ్మారి కాలంలో మన పార్లమెంటును మూసివేయడమే కాదు, ప్రజలకు నేతృత్వం కూడా లేకుండాపోయింది. ఏకపక్షంగా పనిచేయడానికి ప్రభుత్వానికి ఇప్పుడు మినహాయింపు లభించింది. దానికి వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తేందుకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థాగత విధానం లేదు” అన్నారు.
ఈ సమావేశంలో ఆదివాసీల హక్కుల కోసం పనిచేసే సామాజిక కార్యకర్త సోనీ సోరీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా పనిచేస్తోందని ఆరోపించారు.
“ఆన్‌లైన్ విద్య గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ఆదివాసీ ప్రాంతాల్లో, ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు అదెలా సాధ్యం. కరోనా ముసుగులో ప్రభుత్వం తనకు నచ్చినట్టు చేస్తోంది. మా నీళ్లు, నేల, అడవి అనే హక్కులను లాక్కుంటోంది” అన్నారు,
నేరుగా ప్రధాని నరేంద్ మోదీని లక్ష్యంగా చేసుకున్న గుజరాత్ వడగామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ గుజరాత్ తరహాలో నరేంద్ర మోదీ దేశ ప్రజాస్వమ్య వ్యవస్థను కూడా నాశనం చేశారని చెప్పారు.
జస్టిస్ ఏపీ షా వ్యాఖ్యలతో ఏకీభవించిన ఆయన “కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం చాలా జవాబుదారీగా ఉండాలి. దానిని చాలా ప్రశ్నలు అడగాలి. పార్లమెంట్, అసెంబ్లీల్లో ఎక్కువగా చర్చ జరగాలి. కానీ పార్లమెంటు, అసెంబ్లీలే నడవడం లేదు. ప్రజాస్వామ్యం తలుపులు మూసేశారు” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నం’
ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసే మిగతా వ్యవస్థల గురించి కూడా జస్టిస్ ఏపీ షా ప్రస్తావించారు. వాటిని మెల్లమెల్లగా బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.
“మీడియా, పౌర సమాజాలు, ప్రభుత్వేతర సంస్థలు లాంటివి ప్రభుత్వ జవాబుదారీతనం నిర్ణయించడానికి సాయం చేస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ, వాటన్నింటినీ బలహీనపరిచారు. 2014 తర్వాత ఈ సంస్థలను బలహీనం చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలూ జరిగాయి. అవి ఇందిరాగాంధీ పాలనలో వాటిని బలహీనపరచడానికి జరిగిన ప్రయత్నాలకు భిన్నంగా ఏం లేవు. తక్కువ జవాబుదారీ ఉండడం వల్ల ప్రభుత్వం బలం చాలా పెరిగింది” అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు, సామాజిక కార్యకర్త సైదా హమీద్ “ముస్లింలకే కాదు, మైనారిటీలకు కూడా ఈ దేశంలో మీరు రెండో తరగతి పౌరులనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు” అని పేర్కొన్నారు.
మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్, న్యాయవ్యవస్థ బలహీనం అయిపోయాయని ఆరోపించిన జస్టిస్ ఏపీ షా దానిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బలహీనమవుతున్న ప్రజాస్వామ్యం’
“న్యాయవ్యవస్థ చాలా బలహీనంగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థ చాలా కీలక అంశాలను పరిష్కరించాల్సుంది. పౌర సవరణ చట్టం, కశ్మీర్‌లో ఇంటర్నెట్ అందించడం, కశ్మీర్ పరిస్థితికి సంబంధించిన అంశాలు కోర్టులో చాలాకాలం నుంచీ పెండింగులో ఉన్నాయి. వాటిని విచారించడం లేదు. ఇలాంటి, ఎన్నో బాధ్యతలను పూర్తిచేయాల్సిన న్యాయవ్యవస్థ వాటిని నెరవేర్చడం లేదు. లోక్‌పాల్ ఏర్పడిన తర్వాత అక్కడ ఏం జరుగుతోందో కూడా మనకేదీ తెలీడం లేదు. మానవ హక్కుల కమిషన్ కూడా చాలాకాలంగా చురుకుగా కనిపించడం లేదు. సమాచార కమిషన్ సమర్థంగా పనిచేయడం లేదు” అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మీడియా, పౌర సమాజం, విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ణయించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే విశ్వవిద్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని, అల్లర్లు ప్రేరేపించారని విద్యార్థులపై ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
“భారత్ మీడియా చాలా కాలం క్రితమే చీలిపోయింది. కశ్మీర్‌లో తీసుకొచ్చిన కొత్త మీడియా విధానం వల్ల, ఇప్పుడు కాస్తో కూస్తో మిగిలిన మీడియా కూడా చచ్చిపోయింది. పౌర సమాజం గొంతును కూడా మెల్లమెల్లగా నొక్కేస్తున్నారు” అని చెప్పారు,.
“ఏ సంస్థా తమకు వ్యతిరేకంగా గొంతు వినిపించకూడదు, దాని గొంతు నొక్కేస్తాం అనే వ్యూహంతో ప్రభుత్వం వెళ్తోంది. ఇలా, ప్రతి సంస్థనూ బలహీనం చేస్తూవెళ్తే, ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా మారుతుంది. అలా, చివరికి ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది”
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








