కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికుల్ని కాపాడారు

కేరళలో 190 మంది ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం గత వారం ఒక విమానాశ్రయంలో ప్రమాదానికి గురవగానే ఎంతోమంది స్థానికులు వారికి సాయం చేయడానికి పరుగులు తీశారు.
ప్రయాణికులను కాపాడి ఆస్పత్రుల్లో చేర్చారు. ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గడానికి అది కూడా ఒక కారణమని అధికారులు చెప్పారు. కేరళ జర్నలిస్ట్ అష్రఫ్ పదన్నా ఆరోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడిన స్థానికులతో మాట్లాడారు.
తమను కలవాలని ఒక వ్యక్తి వచ్చినపుడు 32 ఏళ్ల ఫజల్ పుథియకాత్, అతడి 8 మంది స్నేహితులు క్వారంటైన్‌లో ఉన్నారు. అక్కడకు వచ్చింది నజీర్ అనే పోలీస్ అధికారి. ఆయన దూరంగా నిలబడి వారితో మాట్లాడాడు. ప్రమాదం జరిగిన రోజు వారు చూపిన ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.
“మీరంటే, నాకు చాలా గౌరవం ఏర్పడింది. కానీ, మీకు ఇవ్వడానికి నేనేంతీసుకురాలేదు. నేను మీకు ఇవ్వగలిగింది ఇదొక్కటే”.. అని నజీర్ వారికి సెల్యూట్ చేశాడు.
కోళికోడ్ విమానాశ్రయంలో దుబయి నుంచి వచ్చిన విమానం లాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది, రెండు ముక్కలైపోయింది. అప్పుడు అందులోని ప్రయాణికులను కాపాడ్డానికి పరుగులు తీసిన చాలామందిలో పుథియకత్, అతడి స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్ల సహా 18 మంది చనిపోయారు.
అప్పుడు చాలా మందిని కాపాడిన వీరు, వారి నుంచి తమకు కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉండడంతో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. వెరాండలోని క్వారంటైన్ సెంటర్ దగ్గర పోలీస్ అధికారి నజీర్ వారికి సెల్యూట్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తమకు లెక్కలేనన్ని కాల్స్ కూడా వచ్చాయని వారు చెబుతున్నారు. విమానంలో ప్రయాణికులను కాపాడినందుకు వారి బంధువులు తమకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పుథియకత్ విమానాశ్రయానికి వంద మీటర్ల దూరంలోనే ఉంటాడు. అక్కడకు మొదట వెళ్లిన వారిలో అతడు కూడా ఉన్నాడు.
“దాదాపు మేం ఆరుగురం అక్కడ క్రాష్ అయిన కాసేపటికే చేరుకోగలిగాం. గేట్లు మూసున్నాయి. జనం సాయం కోసం అరుస్తున్నారు. అగ్నిమాపక దళం విమానం మీద ఫోం కొడుతుండడంతో సెక్యూరిటీ వాళ్లు గేట్లు తెరవడానికి ఒప్పుకోలేదు. కానీ మంటలు అంటుకునే ప్రమాదం లేకపోవడంతో మమ్మల్ని లోపలికి వదిలారు. అక్కడి దృశ్యం దారుణంగా ఉంది” అని పుథియకత్ చెప్పారు.
“చాలామంది స్పృహలో లేరు. కొందరు సీట్ల కింద ఇరుక్కుపోయి ఉన్నారు. మేం వాళ్ల సీట్ బెల్టులు తీసి విమానం బయటకు తీసుకొచ్చాం” అన్నారు.
ప్రయాణికులను సీట్ల నుంచి విడిపించేందుకు, ఆస్పత్రులకు చేర్చేందుకు వారు సిబ్బందికి సాయం చేశారు. స్థానికులు ప్రయాణికులను కాపాడ్డానికి చాలా రిస్క్ తీసుకున్నారని స్థానిక అగ్నిమాపక శాఖ అధికారి అబ్దుల్ రషీద్ చెప్పారు.
“విమాన ప్రమాదం జరగ్గానే అగ్నిమాపక దళం మంటలు చెలరేగకుండా ఫోం చల్లుతోంది. ఒక చిన్న నిప్పు రవ్వ వచ్చినా, పెను విషాదానికి కారణం అవుతంది’’ అన్నారు.
ఈలోపు, విమాన ప్రమాదం వార్త వాట్సాప్ ద్వారా స్థానికంగా వ్యాపించింది. పదుల సంఖ్యలో జనం సాయం చేయడానికి పరుగులు తీశారు.
రెస్క్యూ సిబ్బంది ప్రయాణికులను బయటకు తీసే సమయానికి, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అక్కడ అప్పటికే ప్రైవేటు వాహనాలు బారులు తీరాయి. అంబులెన్సులు తక్కువ ఉండడంతో అవి చాలా మంది ప్రాణాలు కాపాడాయని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫజల్ కరలిల్ ఒక ట్రక్కు డ్రైవర్, ఆయన కూడా ఆ సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో తాను కరోనావైరస్ గురించి పట్టించుకోలేదని ఆయన బీబీసీకి చెప్పారు.
“మాకు కనిపించిన వాహనాల్లో వారిని ఆస్పత్రులకు పంపించాం.. ట్రక్కులు, ఆటోలు కూడా వదల్లేదు. అక్కడ అంబులెన్సుల కోసం ఎదురుచూసే టైం లేదు” అన్నారు.
వారిని స్థానికులు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 20 ఆస్పత్రుల్లో చేర్చారు. తమ ప్రాణాల గురించి పట్టించుకోకుండా వారిని కాపాడారు అని రషీద్ చెప్పారు.
స్థానికులు స్పందించడం వల్ల కనీసం పది మంది ప్రాణాలు కాపాడగలిగామని కోజికోడ్ ఆస్పత్రిలో ఉన్న అత్యవసర సేవల వైద్యుడు డాక్టర్ పీపీ వేణుగోపాలన్ చెప్పారు.
“ఆ చుట్టుపక్కలవారు అలాంటి పరిస్థితుల్లో ఎలా సాయం అందించాలో కాస్త శిక్షణ పొందారు. 2012లో జిల్లా యంత్రాంగం విమాన ప్రమాదాలపై ఒక మాక్ డ్రిల్ నిర్వహించింది. అందులో 650 మందికి శిక్షణ ఇచ్చారు. అది దేశంలోనే అతిపెద్దది అనుకుంటా, విమానం సరిగ్గా అదే ప్రాంతంలో కూలింది” అన్నారు.
స్థానికులకు శిక్షణ ఇవ్వడానికి నెల పట్టింది. ఆ శిక్షణ తీసుకున్నవారిలో టాక్సీ డ్రైవర్లు, అందరూ ఉన్నారు. అది మృతుల సంఖ్య తగ్గడానికి ఇక్కడ సాయం అయ్యింది. కేరళ కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో 2 లక్షల మంది.. ప్రమాదాలు జరిగినపుడు క్షతగాత్రులను ఎలా కాపాడాలి, ప్రాణాలు ఎలా నిలపాలి అనే శిక్షణ పొందారు.

‘‘స్థానికులు వెంటనే స్పందించడంతో అక్కడికి వెళ్లిన చాలా అంబులెన్సులు ఖాళీగా వచ్చాయి, అప్పటికే ప్రయాణికులందరూ ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రులకు చేరుకున్నారు. ఈలోపు వారికి వైద్య చికిత్స అందించాం. తమవారికి సమాచారం అందించలేక కష్టపడుతున్న ప్రయాణికులకు కూడా స్థానికులు సాయం చేశారు”.
“మేం వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాం. మేమందరం మాకు తెలిసిన సమాచారం అంతా అందులో పోస్ట్ చేయడం ప్రారంభించాం. అలా ప్రయాణికులు ఏ ఆస్పత్రుల్లో ఉన్నారో వారి కుటుంబ సభ్యులు తెలుసుకోగలిగారు” అని పుథియకత్ చెప్పారు.
అతడు ఇంటికెళ్లే సరికి తర్వాత రోజు ఉదయం 3.30 అయ్యింది. కొన్ని గంటల తర్వాత ఘటనాస్థలంలో పోలీసులకు ప్రమాదం వివరాలు చెప్పిన అతడు, తర్వాత క్వారంటైన్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి వారిని అందరూ హీరోల్లా చూస్తున్నారు. వారి కథలను సోషల్ మీడియాలో చూపిస్తున్నారు.
“మేం 14 రోజులు ఉండడానికి క్వారంటైన్‌లోకి వచ్చిన తర్వాత జనం ఇప్పుడు మాపై చాలా ప్రేమ, ఆప్యాయత చూపిస్తున్నారు. మాకు రోజూ మంచి భోజనం పంపిస్తున్నారు” అని కరలిల్ నవ్వుతూ చెప్పాడు.
స్వచ్ఛందంగా ప్రయాణికులకు సాయం చేసిన స్థానికులకు కేరళ హైకోర్ట్ జస్టిస్ దేవన్ రామచంద్రన్ చట్టపరమైన విషయాలకు అంకితమైన ఒక న్యూస్ పోర్టల్‌లో కవితా నివాళి అర్పించారు.
“నిన్న స్వర్గం నుంచి దేవతలు దిగివచ్చారు. గుండెలనిండా ప్రేమ తప్ప, భయం ఎరుగని సామాన్యులు కోవిడ్‌కు కూడా ఎదురెళ్లారు. ఎంతో బాధలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రాణాలకు కూడా తెగించారు. ఈ సాహసోపేత, స్వచ్ఛమైన ఆత్మల చేతిలో కేరళ సురక్షితంగా ఉంది” అన్నారు.
అష్రాఫ్ పదన్న ఒక కేరళ జర్నలిస్టు
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- కశ్మీర్: భారతదేశంలో ఇలా కలిసింది
- కశ్మీర్లో 'ఇజ్రాయెల్ మోడల్'.. అసలు ఆ మోడల్ ఏంటి? ఎలా ఉంటుంది?
- భారత్‌ను ఆక్రమించుకోవాలని రష్యా, కాపాడుకోవాలని బ్రిటన్... చివరికి ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








