కశ్మీర్‌లో 'ఇజ్రాయెల్ మోడల్'.. అసలు ఆ మోడల్ ఏంటి? ఎలా ఉంటుంది?

ఇజ్రాయెల్ మోడల్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వెస్ట్ బ్యాంక్‌లో నిర్మించిన భవనాలు

అమెరికాలోని ఒక భారత అగ్ర దౌత్యవేత్త చేసిన ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్‌కు మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం దొరికింది.

న్యూయార్క్‌లో కాన్సులేట్ జనరల్ సందీప్ చక్రవర్తి ఒక ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ "భారత ప్రభుత్వం కశ్మీరీ పండితులను తిరిగి కశ్మీర్‌ రప్పించేందుకు 'ఇజ్రాయెల్ లాంటి విధానం' అవలంబించాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో భారత చలనచిత్ర రంగానికి సంబంధించిన కొందరు ప్రముఖులు, వారితోపాటూ అమెరికాలో ఉంటున్న కొందరు కశ్మీరీ పండిట్లు కూడా హాజరయ్యారు. సందీప్ చక్రవర్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై ఇప్పటికే స్పందించారు. ఆయన ట్విటర్‌లో "భారత్ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభుత్వంలో ఫాసిస్టు మనస్తత్వం కనిపిస్తోంది. భారత్ ఆక్రమిత కశ్మీర్‌ను సీజ్ చేసి వంద రోజులు పైనే అయ్యింది. కశ్మీరీల హక్కులను అణచివేస్తున్నారు. ప్రపంచంలో బలమైన దేశాలు కూడా వ్యాపార ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నాయి" అన్నారు.

కశ్మీరీ పండితులు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ అవలంబించిన ఏ విధానం గురించి సందీప్ చక్రవర్తి మాట్లాడారు. అసలు ఆ విధానం ఎలా ఉంటుంది. అందులో ఇజ్రాయెల్ ఏ మేరకు విజయం సాధించింది.

ఇజ్రాయెల్ మోడల్

ఫొటో సోర్స్, SANDEEP CHAKRAVARTY/ TWITTER

యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పునరావాస విధానం

1967లో పశ్చిమాసియాలో యుద్ధం జరిగినపుడు ఇజ్రాయెల్ తను ఆక్రమించిన అన్ని ప్రాంతాల్లో యూదులకు ఆశ్రయం కల్పించాలనే విధానం పెట్టుకుంది. వాటిలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెం, గోలాన్ పర్వతాలు ఉన్నాయి.

ఆ యుద్ధానికి ముందు వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంపై జోర్డాన్ అధికారం ఉండేది. 1948-49లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోర్డాన్ వాటిని ఆక్రమించింది.

ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్ వాచ్‌డాగ్ పీస్ నౌ ప్రకారం ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మొత్తం 132 కాలనీలు, 113 అవుట్‌పోస్టులు(అనధికారిక కాలనీలు) ఉన్నాయి. ఈ రిపోర్టు ప్రకారం ఈ ప్రాంతాల్లో నాలుగు లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఈ గణాంకాలు ఏటేటా పెరుగుతున్నాయి.

అంతే కాదు, ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌లో కూడా చాలా కాలనీలు సిద్ధం చేసింది. ఆ ప్రాంతాన్ని 1967 యుద్ధంలో అది ఈజిఫ్టు నుంచి తన అధీనంలోకి తెచ్చుకుంది.

ఇజ్రాయెల్ మోడల్

ఫొటో సోర్స్, Getty Images

ఏకాభిప్రాయంతో నిర్ణయం

"ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో ఆరు రోజులు యుద్ధం చేసింది. యుద్ధం తర్వాత ఒక పెద్ద ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతమంతా దాదాపు ఖాళీగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఉన్నవారు యుద్ధ భయంతో పారిపోయారు" అని టెల్ అవీవ్ నగరంలో ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ హరేంద్ర మిశ్రా చెప్పారు.

"ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ గ్రీన్ లైన్ బయట ప్రాంతాన్ని ఆక్రమించింది. గ్రీన్ లైన్ అంటే అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌దిగా గుర్తించిన ప్రాంతం. గ్రీన్ లైన్ బయట ఉన్న ప్రాంతాల నుంచి తమకు ముప్పు రావచ్చని భావించిన ఇజ్రాయెల్ ఆ ఖాళీ ప్రాంతాలను వదలాలనుకోలేదు" అన్నారు.

"అప్పట్లో ఇజ్రాయెల్ నేతలందరూ ఆ ఖాళీ ప్రాంతాల్లో కాలనీలు నిర్మించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. అప్పుడు ఇజ్రాయెల్ జాతీయ విధానంలో అది ఒక భాగమైపోయింది. ఏ భావజాలం ఉన్న నేతలైనా, అందరూ ఆ కాలనీల ఏర్పాటు విధానాన్ని ఆమోదించారు."

ఈ కాలనీల్లో వీలైనంత ఎక్కువ మంది వచ్చి నివసించేలా ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలకు రకరకాల తాయిలాలు ప్రకటించింది. వారికి ఎన్నో పన్ను మినహాయింపులు ఇచ్చింది. ఇంకా చాలా సౌకర్యాలు అందించింది.

ఇజ్రాయెల్ మోడల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాల్లో యూదులు

జాతి ప్రయోజనంగా వర్ణించారు

ఈ కాలనీల్లోకి ప్రజలను రప్పించడానికి ఇజ్రాయెల్ దేశ ప్రజలను ప్రోత్సహించింది. ఈ కాలనీల్లో నివసించడం అంటే ఒక విధంగా జాతిహితం కోసం పనిచేసినట్టేనని వర్ణించే ప్రయత్నాలు కూడా జరిగాయి.

"మీరు వెస్ట్ బ్యాంక్, గోలాన్ పర్వత ప్రాంతాల్లో, లేదా గాజా స్ట్రిప్‌కు వెళ్లి అక్కడ నివసిస్తే అది జాతిప్రయోనమే అవుతుందని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించారు. ఇజ్రాయెల్ ఈ ప్రాంతాలను భద్రతాపరంగా చాలా కీలకంగా భావించడమే కారణం. ప్రజలు వచ్చి నివసించిన తర్వాత అక్కడ భద్రతాదళాలను కూడా మోహరించారు" అని హరేంద్ర చెప్పారు.

"ఒకప్పుడు ఈ కాలనీల్లో ఉండేలా ప్రజలను రప్పించాలనే నిర్ణయాన్ని అన్ని పార్టీలూ అంగీకరించాయి. కానీ, ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు దానిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోందని వామపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి".

అవే కాలనీల గురించి 2010లో ప్రచురించిన ఒక నివేదికలో "వెస్ట్ బ్యాంక్ మొత్తం ప్రాంతంలో 2 శాతంలో మాత్రమే నివసిస్తున్నారని చెప్పాయి. విమర్శకులు మాత్రం కాలనీలతోపాటూ అక్కడ వ్యవసాయం, రహదారుల నిర్మాణం కూడా ఎక్కువైందని చెబుతున్నారు. దానివల్ల అన్ని ప్రాంతాల్లో రక్షణ కోసం భద్రతాదళాల అవసరం అవుతోందని అన్నారు.

ఈ కాలనీలు చట్టవిరుద్ధం అంటూ అంతర్జాతీయ సమాజం కూడా గళం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇటీవల వీటిని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయలేదని అన్నారు.

అంతే కాదు, తూర్పు జెరూసలెం ఇప్పుడు అరబ్ మెజారిటీ ప్రాంతం అయినా, ట్రంప్ దానిని ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించేశారు.

ఇజ్రాయెల్ మోడల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా ఈ కాలనీలను వ్యతిరేకిస్తోంది

యూదులకు ఆశ్రయం కల్పించడానికేనా?

కశ్మీరీ పండిట్లను తిరిగి కశ్మీర్‌కు రప్పించేందుకు ఇజ్రాయెల్ విధానం అవలంబించాలనే మాట తెరపైకి రావడంతో, అసలు ఇజ్రాయెల్‌ ఈ కాలనీల్లోకి జనాలను రప్పించే ప్రయత్నం చేసినప్పుడు, అది కూడా యూదులనే తీసుకురావాలని భావించిందా అనే ప్రశ్న వస్తుంది.

"వెస్ట్ బ్యాంక్, గోలాన్ పర్వతాలు, గాజా స్ట్రిప్ పూర్తిగా ఖాళీగా ఉండేవి. అందుకే అక్కడ కొత్తవారు వచ్చేలా చేయాల్సి వచ్చింది. కొత్త వారు కచ్చితంగా యూదులే అయ్యుంటారు. దానితోపాటూ సంప్రదాయ భావజాలం ఉన్న వారిని ఇక్కడకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అందుకే, ఈ ప్రాంతాల్లో సంప్రదాయవాద రాజకీయాలు ఎక్కువ కనిపిస్తుటాయి" అని హరేంద్ర మిశ్రా చెప్పారు.

యూదులు ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నా, వారికి ఇజ్రాయెల్ వచ్చి నివసించే హక్కు ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూదులు ఇజ్రాయెల్‌లో స్థిరపడుతుంటారు.

"ఈశాన్య భారతంలో నివసించిన కొంతమంది యూదులు కూడా ఇజ్రాయెల్‌లో ఈ కాలనీల్లో ఉండడం ప్రారంభించారు. బయటి నుంచి వచ్చే ఈ యూదుల గురించి ఇజ్రాయెల్ పార్లమెంటులో ఒకసారి చర్చ కూడా జరిగింది. ఏదైనా ప్రత్యేక పథకం కింద వీరిని తీసుకొచ్చి నివాసాల్లో ఆశ్రయం ఇస్తున్నారా అని ప్రశ్నించారు" అని హరేంద్ర చెప్పారు.

ఇజ్రాయెల్ మోడల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ఈశాన్య రాష్ట్రాలలో కూడా యూదు సమాజాలు నివసిస్తున్నాయి

ఈ విధానం సఫలమా, విఫలమా

ఇజ్రాయెల్‌లో ఈ కాలనీల్లో ఆశ్రయం కల్పించే విధానం ఏ మేరకు విజయవంతం అయ్యింది. దీనిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 2016లో ఈ కాలనీలకు ఎలాంటి చట్టబద్ధత ఇవ్వలేదు.

"ఈ ప్రాంతం భద్రత విషయంలో మాత్రం ఇజ్రాయెల్ విజయవంతం అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వారి సొంతవారే ఉంటున్నారు. అందుకే ఇజ్రాయెల్‌కు ఇప్పుడు అక్కడ ఎలాంటి ముప్పు లేదు. ఆ దేశం ఈ విధానాన్ని అవలంబించడం వెనుక ఉద్దేశం కూడా అదే" అంటారు హరేంద్ర.

కానీ, తర్వాత ఈ యూదుల భద్రత కోసం చాలా డబ్బు, శ్రమ వృథా అవుతోందని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావించింది. 2005లో గాజా ప్రాంతం ఖాళీ చేయించాలని నిర్ణయించింది.

ఐక్యరాజ్యసమితితోపాటు అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ కాలనీలను చట్టవిరుద్ధంగా చెప్పింది. దీనికి ముఖ్య కారణం 1949లో జరిగిన జెనీవా ఒప్పందం. ఆక్రమించిన ఏ ప్రాంతంలో అయినా, అధికార బలంతో తమవారి కోసం నివాసాలు ఏర్పాటు చేయకూడదని ఆ ఒప్పందంలో ఉంది.

అయితే, ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒప్పందంలో నియమాలు తమకు వర్తించవని చెబుతోంది. సాంకేతికంగా వెస్ట్ బ్యాంక్‌ను తాము ఆక్రమించలేదని అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)