వారణాసి జీవితం: ఇక్కడ ఉండేవారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు

ఫొటో సోర్స్, IAN JACOBS/ALAMY
- రచయిత, రోమితా సలూజా
- హోదా, బీబీసీ ట్రావెల్
గత ఏడాది నవంబర్‌లో ఒక మధ్యాహ్నం నేను ముముక్షు భవన్ కాంపౌండ్‌లో ఉన్న వేప చెట్టు నీడలో నిలబడి ఉన్నా.
నాకు దగ్గరగా ఉన్న ఒక గది నుంచి భజన పాటల వినిపిస్తున్నాయి.
లావుగా ఉన్న ఒక మహిళ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. ఆమె వయసు 80 ఏళ్లుంటుంది, ఆమె నాకు తినడానికి తన చేతిలో ఉన్నదేదో ఇవ్వబోయారు.
నాకు ఆకలి లేదని చెప్పాను.
"ఏమీ తినకుండా నేను నిన్నిక్కడ్నుంచి వెళ్లనివ్వను" అని చిరునవ్వుతో ప్రేమగా అనడంతో ఆమె చేతిలోవి తీసుకుని తిన్నాను.
అప్పుడప్పుడు కొద్దిగా తింటుండాలని ఆమె నాకు సలహా ఇచ్చారు. భజన గురించి అడగాలనుకున్నాను కానీ అప్పటికే ఆ కాంపౌండ్ లోంచి ఆమె వెళ్లిపోయారు.
ఆమె పేరు సరస్వతి అగర్వాల్ అని లాడ్జి మేనేజర్ మనీష్ కుమార్ పాండే తర్వాత నాకు చెప్పారు. ఒక వితంతువు అని, వారసులు ఎవరూ లేరని అన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయినప్పుడు ఆమె ఇక్కడికొచ్చారు.
రాజస్థాన్‌కు చెందిన గాయత్రి దేవి కూడా ఆమెతో పాటు గత ఐదేళ్లుగా ఈ లాడ్జిలోనే ఉంటున్నారు.
ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు వేరే ఊళ్లో ఎక్కడో ఉంటారు. కానీ తల్లిని కలవడానికి మాత్రం ఎప్పుడూ వచ్చేవారు కాదు.

ఫొటో సోర్స్, ROMITA SALUJA
మృత్యువు కోసం ఎదురుచూపులు
మేం లాడ్జి దగ్గరే ఉన్న ఒక బెంచిపై కూర్చొని ఇల్లు, కుటుంబం, జీవితం, మహిళల హక్కులు, ఇలా అన్నిటి గురించీ మాట్లాడుకునేవాళ్లం.
గాయత్రి దేవి నవ్వు చాలా బాగుండేది. ఆమెతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉండేది. "పిల్లలకు పెళ్లైన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి" అని ఆమె చెప్పారు.
సతీ దేవి మా దగ్గరే బెంచిపై కూర్చునేవారు. ఆమె గాయత్రి దేవి మాటలను సమర్థించారు. సతీ దేవి కూడా ఐదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు.
"నాకు ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను చనిపోతే, నన్ను చితి వరకూ తీసుకెళ్లేటప్పుడైనా వాళ్లు వస్తారు" అని గాయత్రి దేవి అన్నారు.
వారణాసిలో మృత్యువు కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందితో కలిసి ఈ ముగ్గురు మహిళలు కూడా ఆ చివరి రోజు ఎప్పుడొస్తుందా అని వేచిచూస్తున్నారు.

మోక్షం కోసం అన్వేషణ
హిందువులకు అత్యంత పవిత్రమైన నగరాల్లో వారణాసి (కాశీ లేదా బనారస్) ఒకటి.
మహాభారత యుద్ధం గెలిచిన తర్వాత పాండవులు కూడా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి కాశీ వచ్చారు. మోక్షం కోసం అన్వేషిస్తూ శతాబ్దాల నుంచి జనం ఇక్కడకు వస్తున్నారు.
వారణాసిలో చనిపోయినా, గంగా తీరంలో దహన సంస్కారాలు చేసినా వారి జనన-మరణ చక్రం తెగిపోతుందని, మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.
మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో చితులు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఘాట్ మెట్లు గంగా తీరం వరకూ వెళ్తాయి.
నదిలో నీళ్లు పరిశ్రమలు, మానవ వ్యర్థాల వల్ల నల్లగా, మురికిగా మారాయి. అయినా ఆ గంగాజలం అన్ని పాపాలనూ ప్రక్షాళన చేస్తుందని విశ్వసిస్తారు.
ఒక వైపు పర్యాటకులు, యాత్రికులు పడవల్లో కూర్చొని ఘాట్లలో తిరుగుతుంటే, మరో వైపు చితి మంటల పొగల మధ్య పూజారులు, మృతుల బంధువులు మరణించినవారి ఆత్మశాంతి కోసం చేసే పూజలు కనిపిస్తుంటాయి.
ముక్తి కోసం కాశీ వచ్చే పురుషులు, మహిళలను కాశీవాసులు అంటారు.
వీరి కోసం ప్రత్యేక లాడ్జిలు ఉన్నాయి. వాటికి స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సముదాయాల నుంచి విరాళాలు లభిస్తాయి.

ఫొటో సోర్స్, Alamy
సుదీర్ఘ నిరీక్షణ
వారణాశిలోని అత్యంత పురాతన సంస్థల్లో ముముక్షు భవన్ ఒకటి. ఇక్కడ 116 గదుల్లో 40 గదులు మృత్యువు కోసం ఎదురుచూసే కాశీవాసులకు కేటాయించారు.
"ప్రతి ఏడాదీ మాకు చాలా అప్లికేషన్లు వస్తాయి. కానీ గదుల సంఖ్య పరిమితం కావడంతో, మేం అందరికీ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం" అని ముముక్షు భవన్ మేనేజర్ వీకే అగర్వాల్ చెప్పారు.
"ఎక్కువ అవసరమైనవారికి, తమ ఖర్చులు భరించగలిగేవారికి, మరణించిన తర్వాత అంత్యక్రియలు చేయగలిగే బంధువులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తాం".
ముముక్షు భవన్‌లో 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఉండనివ్వరు.
కాశీవాసులు తమ స్థోమతను బట్టి సుమారు లక్ష రూపాయల విరాళం ఇస్తే, వారికి ఒక గది కేటాయిస్తారు. చనిపోయేవరకూ వారు అక్కడే ఉండొచ్చు.
"ఇక్కడకు వచ్చేవారు తమ వంట స్వయంగా చేసుకోవాలి. మేం భోజన సదుపాయాలు కల్పించం. కానీ ఎవరైనా ఖర్చు భరించే స్థోమత లేనపుడు వారి దహన సంస్కారాల కోసం నిర్వాహకులు సాయం చేస్తారు" అని అగర్వాల్ చెప్పారు.
కొన్ని గదులు మిగతా వాటితో పోలిస్తే పెద్దగా ఉంటాయి. వాటిలో ఏసీ కూడా ఉంటుంది. అక్కడ వంట చేసుకోడానికి స్థలం కూడా ఉంటుంది.
ఇక్కడ షేరింగ్ బాత్రూం ఉంటుంది. ఎవరైనా జబ్బు పడితే, వారికి హోమియోపతి, ఆయుర్వేద మందులు ఇచ్చే సెంటర్ కూడా ఉంది.
ఈ లాడ్జిల్లో ఉండే వృద్ధులు వంట చేయడానికి, గది శుభ్రం చేయడానికి సహాయకులను పెట్టుకోవచ్చు.
"భజనలు, మిగతా వారితో మాట్లాడుతూ రోజులు గడిపేస్తుంటాం" అని ఒక పాత రేడియో వింటున్న గాయత్రి దేవి నాతో చెప్పారు.

ఫొటో సోర్స్, ROMITA SALUJA
15 రోజుల అతిథి
వారణాసి ఇరుకు వీధుల మధ్య ఉన్న ముక్తి భవన్‌కు మరో రకం నియమాలు ఉన్నాయి.
ముక్తి భవన్ కేర్ టేకర్ నరహరి శుక్లాను నేను ఆయన ఆఫీసులో కలిశాను. ఆయన అక్కడ నియమాలేంటో చెప్పారు.
"జనం ఇక్కడికి మోక్షం కోసం వస్తారు. ఇది హోటల్ కాదు. ఇక్కడ ఏసీ లాంటి విలాస వస్తువుల అవసరం ఏముంటుంది" అన్నారు శుక్లా.
ముక్తి భవన్‌లో గరిష్టంగా 15 రోజులు మాత్రమే అనుమతిస్తారు. జబ్బు పడి అక్కడికి తీసుకొచ్చినవారు ఆలోపు చనిపోకపోతే, వారిని గౌరవంగా అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెబుతారు.
"కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు మనిషి ఆరోగ్య పరిస్థితి చూసి మేనేజర్ వారికి కొన్ని రోజులు ఉండడానికి అనుమతి ఇస్తుంటారు" అని శుక్లా చెప్పారు.
ఇక్కడ ఉండే అతిథులు కరెంటు కోసం రోజూ 20 రూపాయలు ఇవ్వాల్సుంటుంది. వారు పూజలు-పునస్కారాలతో సమయం గడిపేస్తారని భావిస్తారు.
ముక్తి భవన్‌లో చిన్న మందిరం కూడా ఉంది. అక్కడ ప్రతి రోజూ భజనలు చేస్తుంటారు. అక్కడ పేకాట ఆడడం, మాంసం, గుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తినడం నిషేధం.
నేను అక్కడకు వెళ్లినప్పుడు ఆ లాడ్జిలో అతిథులు ఎవరూ లేరు. కానీ, శుక్లా నాకు 8 గదులున్న ఆ భవనం చూపించడానికి తీసుకెళ్లారు.
ఆకుపచ్చ రంగు వేసిన ఒక చెక్క తలుపు తెరిచిన శుక్లా నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ తెల్లటి గోడలు మురికిగా ఉన్నాయి.
అక్కడ వెలుతురు కోసం ఒక చిన్న కిటికీ ఉంది. దాన్లో నుంచి వస్తున్న వెలుతురుతో గదిలో దుమ్ము స్పష్టంగా కనిపిస్తోంది.

మృత్యు శయ్య
గదిలో ఒక మూల ఒక కొయ్య మంచం వేసుంది. నా మనసులో వెంటనే ఆ మంచంపై ఒక వృద్ధురాలు చనిపోయినట్లు ఒక దృశ్యం కనిపించింది.
శుక్లా నాతో "ఇక్కడకు వచ్చే అతిథుల బంధువులు ఇదే గదిలో ఉంటారు. పడుకోడానికి పరుపులు, దిండ్లు లాంటివి వారే తెచ్చుకుంటారు" అన్నారు.
చలికాలం(డిసెంబర్ నుంచి ఫిబ్రవరి) వేసవి(మే నుంచి ఆగస్టు)లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఆ నెలల్లో బలహీనంగా ఉన్న వృద్ధులు జీవించడం చాలా కష్టం అవుతుంది.
ఇక్కడ నుంచి వెళ్లిపోయాక రెండేళ్లు జీవించిన వారు కూడా ఈ లాడ్జికి వచ్చారు. మృత్యువు కోసం రెండు వారాలు ఇక్కడ గడిపి, తిరిగి ఇల్లు చేరగానే చనిపోయినవారు కూడా ఉన్నారు.
శుక్లా దానికి పైకి చూపిస్తూ "ఇక్కడ అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన ఆదేశం లేకుంటే మీరు కాశీలో ఎన్ని ఏళ్లు ఉన్నా చనిపోరు" అన్నారు.
నాకు ముముక్షు భవన్ ఉండే సతీ దేవి గుర్తొచ్చారు. "ఎప్పట్నుంచి కాశీలో ఉంటున్నానో గుర్తు లేదు" అని ఆమె నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
40 ఏళ్ల ఎదురుచూపులు
పాండే నాకు హైదరాబాద్‌కు చెందిన విమలా దేవి గురించి చెప్పారు. ఆమె వారణాసిలో 40 ఏళ్లు మృత్యువు కోసం ఎదురుచూశారు. గత ఏడాది ముముక్షు భవన్‌లో ఆమె చనిపోయారు.
గాయత్రీ దేవి, సరస్వతీ అగ్రవాల్ పిల్లలు వారిని తమతోనే ఉంచుకోవాలని అనుకుంటే, అప్పుడు కూడా వారు తమ చివరి క్షణాలను ఒంటరిగా గడపాలని వారణాసికి ఇంత దూరం వచ్చేవారా? అని నాకు అనిపించింది.
కానీ వారణాసి రావాలని బాగా నడిచే వ్యాపారాలను వారసుల చేతికి అప్పగించిన దంపతుల గురించి కూడా పాండే నాకు చెప్పారు.
చాలా మంది తమ పేరున ఎంతో కొంత పుణ్యం సంపాదించి ఈ లోకం నుంచి వెళ్లాలని అనుకుంటారని శుక్లా చెప్పారు.
హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డ ఒక నక్సలైటుకు కూడా ఒక మేనేజర్ ముక్తి భవన్‌లో ఆశ్రయం ఇచ్చారు.
"ఇక్కడకు చాలా మంది నేరస్థులు వచ్చారు. ఎంత క్రూరుడైనా అతడికి ఒక మతం ఉంటుంది. ఈ లోకం వదిలి వెళ్లే ముందు తన పాపాల నుంచి విముక్తి పొందాలని అలాంటి వారు అనుకుంటాడు" అని శుక్లా చెప్పారు.
శుక్లా ఆఫీసులోని అల్మారాల్లో హిందూ గ్రంథాలు, అతిథుల రికార్డులు ఉన్న లావుపాటి ఫైళ్లు కనిపిస్తాయి.
మృతుల గురించి నేను చాలా జాగ్రత్తగా అడుగుతుంటే, శుక్లా వారి గురించి చాలా ఉదాసీనంగా సమాధానం ఇచ్చారు. "మృత్యువు అంత సర్వసాధారణంగా ఉంటుందా?".

శివుడి నగరం
"అన్నివైపులా మృత్యువు చుట్టుముట్టినట్టు అనిపిస్తుంటే మీకు ఎలా ఉంటుంది" అని నేను ఆయన్ను అడిగాను. దానికి శుక్లా "మాకు చావంటే భయం లేదు. మేం దానిని వేడుకలా చేసుకుంటాం. జనం ఆ ఆశతోనే ఇక్కడికి వస్తారు, చావుకు భయపడరు. ఇది శివుడి నగరం" అన్నారు.
నాకు మనసులో మహా శివుడు గుర్తొచ్చాడు. హిందూ విశ్వాసాల ప్రకారం శివుడు సంహారం చేస్తాడు. ఆయన సృష్టి కోసం చంపుతాడు.
స్థానికులు ఒక మాట చెప్పుకుంటారు. "స్వర్గం వరకూ చేరాలంటే మనం మొదట మరణించాలి".
వారణాసి నుంచి నేను తిరిగొచ్చిన కొన్ని వారాలకే గాయత్రీ దేవి చనిపోయారు. నేను ఏదో వేరే పనితో పాండేకు ఫోన్ చేస్తే ఆయన నాకా విషయం చెప్పారు.
నేను షాక్ అయ్యాను. పాండే కూడా శుక్లా లాగే మౌనంగా, ఉదాసీనంగా ఉన్నారు.
నేను ఆయన్ను "ఆమెను చితి వరకూ తీసుకెళ్లేటప్పుడు గాయత్రీ దేవి కూతురు వచ్చారా"? అని అడిగాను. పాండే "ఆ.. ఆమె వచ్చారు" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై, ప్రపంచ కప్‌లో చోటు దక్కకపోవడమే కారణమా?
- గాంధీజీ మెచ్చిన పెన్ను రాజమండ్రిలో తయారైంది
- సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న ‘సైతాను’ రేపిన వివాదం
- ఘనాలో శవాల్ని ఆర్నెల్ల దాకా పూడ్చరు
- కోపిష్టికి మిరపకాయ, చిన్నారికి విమానం, ధనవంతునికి బెంజ్ కారు - శవపేటికల ‘ఘన’ చరిత్ర
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








