నా బెడ్‌రూంలోనే బాంబు పడింది.. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది

ఫొటో సోర్స్, LAILA PENCE
- రచయిత, జిల్ మార్టిన్ వ్రెన్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
అమెరికాలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచిన లైలా పెన్స్ ఈజిప్టులో జన్మించారు. ఆమెకు 12 ఏళ్ల వయసులో ఎదురైన భయంకరమైన అనుభవం, ఆ తర్వాత వారి కుటుంబం అమెరికాకు వెళ్లడం, ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొని ప్రముఖ ఆర్థిక సలహాదారుగా ఎదిగిన క్రమం గురించి అనేక విషయాలను లైలా బీబీసీతో పంచుకున్నారు.
1967లో ఈజిప్టు, జోర్డాన్, సిరియాలకు ఇజ్రాయెల్‌కు మధ్య ఆరు రోజులపాటు భీకర యుద్ధం జరిగింది.
ఈజిప్టులోని సూయెజ్ కాలువ పక్కనే లైలా కుటుంబం నివాసం ఉండేది.
ఓరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా ఒక్కసారిగా సైనిక వాహనాల సైరన్ మోత వినిపించింది. దాంతో, ఏదో జరగబోతోందన్న భయంతో అందరూ ఇంటి నుంచి బయటకు పరుగుతీశారు.
కొద్దిసేపటి తర్వాత కనీసం బట్టలనైనా తీసుకెళ్దామని ధైర్యం చేసి మళ్లీ ఇంటికి వెళ్లారు. బట్టలు మూటకట్టుకుని అలా ఇంటి నుంచి బయటకు వెళ్లగానే మళ్లీ సైరన్ మోగింది. ఆ వెంటనే బాంబుల వర్షం కూడా మొదలైంది. వీరి ఇంటి మీద కూడా బాంబులు పడ్డాయి.
"సరిగ్గా నా గదిలోనే ఒక బాంబు పడింది. మా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది" అని లైలా గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరికి కొద్ది దూరంలోనే బాంబులు పడ్డాయి. కళ్లముందే ఇల్లు శిథిలాలుగా మారింది. అదృష్టంకొద్దీ లైలాతో పాటు, ఆమె తల్లిదండ్రులు, ముగ్గురు అక్కలు క్షేమంగా బయటపడ్డారు.
ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ... చిన్నవయసులో ఎదురైన ఆ భయంకర అనుభవం తన విజయానికి దోహదపడిందని అంటారు లైలా. "మనం అన్నీ కోల్పోయిన తర్వాత, భయపడటానికి ఇంకేం ఉంటుంది" అంటున్నారు ఆమె.
ఆ ఘటనతో సర్వం కోల్పోయిన లైలా కుటుంబం, ప్రాణాలు అరచేత పట్టుకొని ఈజిప్టు రాజధాని కైరోకు వెళ్లింది. అయితే, అక్కడ జీవనం సాగించడం వారికి కష్టంగా మారింది. దాంతో, వారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆమె తండ్రి బ్యాంకులో పనిచేసేవారు. ఆయన స్నేహితులు కొందరు న్యూయార్క్‌లో ఉన్నారు. వారి సాయంతో అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీసా వచ్చింది. కానీ, అప్పుడే ప్రమాదవశాత్తు లైలా తండ్రి కాలు విరిగింది.
వీసా గడువు దగ్గరపడుతోంది. కానీ, తండ్రి ఆరోగ్యం బాలేదు. దాంతో, తండ్రి, ముగ్గురు అక్కలు కైరోలోనే ఉండగా.. లైలా, ఆమె తల్లి మాత్రమే అమెరికా వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఏడాదికి తండ్రి కూడా అమెరికా వచ్చారు. ముగ్గురు అక్కలు మాత్రం ఈజిప్టులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, LAILA PENCE
న్యూయార్క్ చేరుకున్నాక తాము అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని లైలా చెప్పారు.
"న్యూయార్క్‌లో అందరూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడతారు. కానీ, ఆ భాష నాకు రాదు, మా అమ్మకూ రాదు. దాంతో, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డబ్బులు లేవు. చిన్న గదిలో మరో కుటుంబంతో కలిసి ఉండేవాళ్లం. చలికి తట్టుకోలేక బాగా ఇబ్బందిపడేదాన్ని. ఆ కష్టాలను నేను ఎప్పటికీ మరచిపోలేను" అంటారు లైలా.
కొన్నాళ్లకు న్యూయార్క్‌లోని స్టేటెన్ ఐలాండ్ స్కూలులో లైలా చేరారు. తన క్లాస్‌మేట్ సాయంతో చిన్న పార్ట్‌టైం ఉద్యోగం సంపాదించారు. పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత రోజూ సాయంత్రం ఒక ఓడలో ఆమె స్నాక్స్ అమ్మేవారు. ఆ పనికి గంటకు మూడు డాలర్లు వచ్చేవి. ఆ కొద్దిపాటి సంపాదనతో ఆమె ఇంటి అద్దె చెల్లించేవారు.
"అప్పటి వరకు హాట్‌డాగ్, కెనిష్ అంటే ఏంటో, వాటిని ఎలా సర్వ్ చేయాలో కూడా నాకు తెలియదు. కానీ, ఆ ఉద్యోగంలో చేరాక వాటిని ఎలా సర్వ్ చేయాలో తొందరగా నేర్చుకున్నాను. వినియోగదారులతో ఎలా వ్యవహరించాలి? కెరీర్‌లో ఎలా ముందుకెళ్లాలి? అన్న విషయాల గురించి ఆ ఉద్యోగం ద్వారా ఎంతో నేర్చుకున్నాను" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చదివారు. అక్కడ కూడా తన చదువు కోసం హోటల్‌లో వెయిట్రస్‌గా పనిచేశారు.
ఆ కోర్సు చివరి ఏడాదిలో ఉండగానే, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ఉద్యోగం వచ్చింది. జీతం ఏడాదికి 20,000 డాలర్లు.
విశ్వవిద్యాలయం చదువు పూర్తయ్యాక డ్రైడెన్ పెన్స్‌తో ఆమెకు వివాహమైంది. ఆ తర్వాత, 1980లో 'పెన్స్ వెల్త్ మేనేజ్‌మెంట్' పేరుతో ఆమె ఫైనాన్షియల్ అడ్వైజర్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కంపెనీకి 1,500 క్లయింట్లు ఉన్నారు. 150 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడుల నిర్వహణ వీరి చేతుల్లోనే ఉంటుంది.

ఫొటో సోర్స్, LAILA PENCE
ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం... అమెరికాలోని ప్రముఖ మహిళా ఆర్థిక సలహాదారుల ర్యాంకింగుల్లో లైలా 4వ స్థానంలో నిలిచారు.
తనకు కూడా జాతివివక్ష అనుభవాలు ఎదురయ్యాయని, అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని ఆమె చెప్పారు.
దక్షిణ కాలిఫోర్నియాలో స్థిరపడిన లైలా, ఇప్పటికీ తన పుట్టిన గడ్డ ఈజిప్టుకు వెళ్తూనే ఉంటారు. ఈజిప్టులోని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇస్తుంటారు. రెండేళ్ల క్రితం ఆమె ఈజిప్టులో జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.
('ది బాస్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తల జీవిత విశేషాలను బీబీసీ వారంవారం ప్రచురిస్తోంది. అందులో భాగంగా ఈ వారం అమెరికన్‌కు చెందిన ప్రముఖ మహిళా ఆర్థిక సలహాదారు లైలా పెన్స్‌తో బీబీసీ మాట్లాడింది.)
ఇవి కూడా చదవండి:
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








