భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ

ఫొటో సోర్స్, THE BEGUM: A PORTRAIT OF RA'ANA LIAQUAT ALI KHAN
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"రానా లియాకత్ అలీ వచ్చారంటే గది అంతా ఒక వెలుగుతో నిండిపోయేది" అని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి జమ్షీద్ మార్కర్ చెబుతుండేవారు.
లియాకత్ అలీ ఒకసారి బ్రిడ్జ్ ఆడిన తర్వాత తమ నేత మహమ్మద్ అలీ జిన్నాతో, "మీరు ఒంటరితనం దూరం చేసుకోడానికి మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు" అన్నారు. దానికి జిన్నా "నాకు ఇంకో రానాను చూపిస్తారా, వెంటనే పెళ్లి చేసుకుంటా" అన్నారు.
రానా లియాకత్ అలీ 1905 ఫిబ్రవరి 13న అల్మోరాలో జన్మించారు. ప్రస్తుతం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా కేంద్రం. అప్పడు ఆమె పేరు ఐరీన్ రూథ్ పంత్.
ఆమె కుమావూలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తర్వాత క్రైస్తవం స్వీకరించారు.
రానా లియాకత్ అలీ జీవితచరిత్ర 'ది బేగమ్' సహరచయిత దీపా అగ్రవాల్ అందులో ఆమె గురించి వివరించారు.
"రానా లియాకత్ అలీలో బెరకు ఏమాత్రం కనిపించేది కాదు. స్వతంత్ర ఆలోచనలతో ఉండేవారు. ఆమెలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడేది. తన 86 ఏళ్ల జీవితకాలంలో ఆమె 43 ఏళ్లు భారత్‌లో గడిపారు. దాదాపు అన్నేళ్లు పాకిస్తాన్‌లోనూ ఉన్నారు. మారుతున్న చరిత్రను తన కళ్లారా చూడడమే కాదు, ఆమె అందులో భాగం కూడా అయ్యారు" అని రాశారు.
"జిన్నా నుంచి జనరల్ జియా ఉల్ హక్ వరకూ వారు ఎంత పెద్దవారైనా తన గొంతు వినిపించేందుకు ఆమె క్షణం కూడా వెనుకాడేవారు కాదు. అప్పట్లో ఆమె ఎంఏ క్లాసులో ఉన్న ఒకే ఒక అమ్మాయి. దాంతో రానాను ఏడిపించడానికి అబ్బాయిలు ఆమె సైకిల్ గాలి తీసేసేవారు. 1927లోనే ఆమె సైకిల్ మీద కాలేజీకి వెళ్లేవారు. అప్పుడు అలాంటిది ఊహించడమే కష్టం."

ఫొటో సోర్స్, PAKISTAN AIR FORCE
అల్మోరా పంత్ సమాజం కుటుంబ బహిష్కరణ
1874లో ఐరీన్ పంత్ తాత తారాదత్ పంత్ క్రైస్తవం స్వీకరించినపుడు కమావూ అంతటా కలకలం రేగింది.
అక్కడ వారి దానిని ఎంత అవమానంగా భావించిందంటే ఒక ఆచారం ప్రకారం ఆ కుటుంబం అంతా చనిపోయినట్లు ప్రకటించింది.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పుష్పేష్ పంత్ ననిహాల్ కూడా ఐరీన్ రూథ్ పంత్ కుటుంబం ఉన్న చోటే ఉండేవారు.
ఆయన ఆరోజులు గుర్తు చేసుకున్నారు. "నేను 60 ఏళ్ల క్రితం ననిహాల్ ఇంట్లో ఉన్నప్పుడు నా వయసు 8-10 ఏళ్లు. ఇది నార్మన్ పంత్ గారి ఇల్లు అని, జనం వాళ్ల గురించి రకరకాలుగా చెప్పుకునేవారు".
ఆయన సోదరి పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి లియాకత్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. నార్మన్ పంత్ చాలా విలువలున్న, మంచి వ్యక్తి కావచ్చు. కానీ, ఆయన్ను ఐరీన్ పంత్ సోదరుడిగానే గుర్తించేవారు" అన్నారు.
ఐరీన్ పంత్ తాత అల్మోరాలో ఉన్నత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అక్కడ ప్రముఖ వైద్యులు కూడా. వారు క్రైస్తవ మతం తీసుకున్నప్పుడు, ఆ ప్రాంతమంతా అదొక సంచలనంగా మారింది.
పంత్ కుటుంబం ఇచ్చిన ఆ షాక్ నుంచి తేరుకునేసరికే గ్రామంలో రెండు తరాలు మారాయి. తర్వాత ఆయన చెల్లెలు ఐరీన్ మరోసారి మతం మారి, ఇస్లాం స్వీకరించి రానా లియాకత్ అలీగా మారినపుడు, వారు మరోసారి వార్తల్లో నిలిచారు.
నార్మన్ పంత్ కుటుంబం గురించి రకరకాల కథలు ప్రచారం అయ్యాయి. ఆయన బీబీసీ మాత్రమే వినేవారు. ఆంగ్లేయుల్లా టోస్ట్, బటర్ నాష్టా చేసేవారు. ఒంటరిగా తిరగడానికి వెళ్లేవారు. అల్మోరాలోని బ్రాహ్మణులు తమను గౌరవించరని ఆయనకు తెలుసు. ఎందుకంటే రెండు తరాల నుంచీ వారు క్రైస్తవులుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రచయిత్రి శివానీ జ్ఞాపకం
అప్పట్లో అల్మోరాలో ఉన్న సంప్రదాయ వర్గాలు 'ఆధునిక' పంత్ ఇంట్లోని మహిళల గురించే చర్చించుకునేవారు. చాలామంది వారిని చూసి అసూయపడేవారు.
ప్రముఖ నవలా రచయిత్రి శివానీ కుమార్తె ఇరా పాండే తన 'దిధీ' అనే పుస్తకంలో "మా తాత పక్కింట్లోనే డేనియెల్ పంత్ ఉండేవారు. ఆయన క్రిస్టియన్. కానీ ఒకప్పుడు వాళ్లు మా అమ్మ తరపు చుట్టాలుగా ఉండేవారు" అని చెప్పారు.
సంప్రదాయాలకు కట్టుబడిన మా తాత వారిని మాతో వేరు చేసేందుకు ఇళ్ల మధ్య ఒక గోడ కూడా కట్టారు. అటువైపు కనీసం కన్నెత్తి చూడనిచ్చేవారు కూడా కాదు.
మా అమ్మ శివానీ ఒకసారి తన ఒక రచనలో "వాళ్ల వంటింట్లో నుంచి 'ఘాటైన' మాంసం వండే వాసన మా 'బోరింగ్' బ్రాహ్మణ వంటింట్లోకి చేరి మా పప్పు, అన్నం, కూరలు చిన్నబోయేలా చేసేది" అని రాశారు.
"బెర్లిన్ వాల్ అవతలివైపు పిల్లల్లో హెన్రీ పంత్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన చెల్లెలు ఓల్గా, మురియల్ జార్జెట్ చీరలు కట్టుకుని అల్మోరా మార్కెట్లో నడుస్తుంటే, మేం అసూయతో భరించలేకపోయేవాళ్లం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లక్నో ఐటీ కాలేజీలో చదువు
ఐరీన్ పంత్ మొదట లక్నోలోని లాల్ బాగ్ స్కూల్, తర్వాత అక్కడి ప్రముఖ ఐటీ కాలేజీలో చదివారు. చాలా మంది ప్రముఖులు ఇక్కడే చదివారు.
ఈ కాలేజ్ తమ విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఇచ్చేది. అప్పట్లో కాలేజీ అమ్మాయిలు తరచూ హజ్రత్‌గంజ్ వెళ్లేవారు.
ఐరీన్ బాల్య స్నేహితురాలు మైల్స్ తన 'ద డైనమో ఇన్ సిల్క్' పుస్తకంలో "ఆమె ఎక్కడుంటే అక్కడ చాలా ఉత్సాహంగా ఉండేది. ఆమె లక్నో యూనివర్సిటీలో ఎంఏ అడ్మిషన్ తీసుకున్నప్పుడు అక్కడి అబ్బాయిలు బ్లాక్ బోర్డుపై ఆమె బొమ్మలు వేసేవారు. కానీ ఆమెపై అవి ఎలాంటి ప్రభావం చూపించేవి కావు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లియాకత్ అలీతో మొదటి కలయిక
ముస్లిం లీగ్ నేత లియాకత్ అలీని ఐరీన్ కలవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
దీపా అగ్రవాల్ దాని గురించి చెప్పారు. "అప్పట్లో బిహార్‌లో వరదలు వచ్చాయి. లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థులు వరద బాధితుల కోసం నిధులు సేకరించేందుకు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నారు".
"ఐరీన్ పంత్ టికెట్లు అమ్మేందుకు లక్నో అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ ఆమె మొదట తట్టిన మొదటి తలుపు తెరిచింది లియాకత్ అలీనే. ఆయన మొదట టికెట్ కొనడానికి వెనకాడారు. రానా పట్టుబట్టడంతో ఒక టికెట్ కొనడానికి అంగీకరించారు".
ఐరీన్ ఆయనతో "కనీసం రెండు టికెట్లైనా కొనండి. మా షో చూడ్డానికి మీతోపాటు ఎవర్నైనా తీసుకురండి" అన్నారు. కానీ లియాకత్ "నాతో తీసుకురావడానికి తెలిసినవారు ఎవరూ లేరు" అన్నారు.
తర్వాత ఐరీన్ "నేను మీకోసం ఒక తోడు ఏర్పాటు చేస్తాను. ఒకవేళ ఎవరూ దొరక్కపోతే నేనే మీ పక్కన కూచుని షో చూస్తాను" అన్నారు. దాంతో ఆయన విధిలేక రెండు టికెట్లు కొనాల్సి వచ్చింది".
అదే సాయంత్రం గవర్నర్ విధాన మండలిలో సభ్యులందరి కోసం రాత్రి విందు ఏర్పాటు చేశారు. అక్కడ ఐరీన్.. లారెన్స్ హోప్ రాసిన 'పేల్ హాండ్స్ ఐ లవ్డ్ బిసైడ్ ద షాలిమార్' పాట పాడారు. అప్పుడు దాన్ని వినడానికి లియాకత్ అక్కడ లేరు. కానీ అది అయిపోయాక లియాకత్, తన స్నేహితుడు ముస్తఫా రజాతో ఆ షో చూస్తుండడం ఆమెకు కనిపించింది".

ఫొటో సోర్స్, PENGUIN PUBLICATION
దిల్లీ మెయిడెన్స్ హోటల్లో నిఖా
ఐరీన్ దిల్లీ ఇంద్రప్రస్థ్ కాలేజీలో ఆర్థికశాస్త్రం లెక్చరర్‌గా కూడా పనిచేశారు.
ఒకసారి లియాకత్ అలీని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారని వార్తాపత్రికల్లో వచ్చింది. దాంతో ఐరీన్ ఆయనకు అభినందనలు చెబుతూ లేఖ రాశారు.
లియాకత్ దానికి సమాధానం ఇస్తూ "మీరు దిల్లీలో ఉంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పూర్వీకుల పట్టణం కర్నాల్ అక్కడికి దగ్గరే. నేను ఢిల్లీ మీదుగా లక్నో వెళ్లేటపుడు మీరు నాతో వెంగర్ రెస్టారెంటులో టీ తాగడానికి వస్తారా?" అని రాశారు.
లియాకత్ ఆహ్వానాన్ని ఐరీన్ అంగీకరించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. అది 1933 ఏప్రిల్ 16న ఇద్దరూ పెళ్లి చేసుకునేవరకూ వెళ్లింది.
లియాకత్ అలీ వయసులో ఐరీన్ కంటే పదేళ్లు పెద్దవారు. వివాహితుడు కూడా. ఆయన జహా ఆరా బేగంను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు కూడా. అతడి పేరు విలాయత్ అలీ ఖాన్.
వారి వివాహం దిల్లీలోని ప్రముఖ మెయిడ్స్ హోటల్‌లో జరిగింది. జమా మసీదు ఇమామ్ వాళ్లకు నిఖా చేశారు. అప్పుడు ఐరీన్ ఇస్లాం మతం స్వీకరించారు. తన పేరును గుల్-ఎ-రానాగా మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, THE BEGUM: A PORTRAIT OF RA'ANA LIAQUAT ALI KHAN
సంగీతం అంటే ఇద్దరికీ ఇష్టం
లియాకత్ అలీ ఆ సమయంలో ముస్లిం లీగ్ రైజింగ్ స్టార్, మహమ్మద్ అలీ జిన్నాకు చాలా సన్నిహితుడు.
లియాకత్ అలీకి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకు మెకానికల్ వస్తువులంటే చాలా ఆసక్తి. ఆయన తరచూ కారు భాగాలను మారుస్తూ ఉండేవారు అని దీపా అగ్రవాల్ చెప్పారు.
"ఆయనకు సంగీతం కూడా తెలుసు. ఆయన మంచి గాయకులు. పియానో, తబలా వాయించేవారు. రానా కూడా పియానో, గిటార్ వాయించేవారు. ఆయన డిన్నర్ పార్టీల్లో గజల్స్ మాత్రమే కాదు, ఇంగ్లిష్ పాటలు కూడా వినిపించేవి" అన్నారు.

బంగళాను పాకిస్తాన్‌కు డొనేట్ చేశారు
భారత్ వదిలి వెళ్లడానికి ముందు జిన్నా ఔరంగజేబ్ రోడ్లో ఉన్న బంగళాను రామకృష్ణ దాల్మియాకు అమ్మారు. కానీ, లియాకత్ అలీ మాత్రం తన బంగళాను పాకిస్తాన్‌కు డొనేట్ చేశారు.
దాన్నే ఇప్పుడు 'పాకిస్తాన్ హౌస్' అనే పేరుతో పిలుస్తున్నారు. అక్కడ ఇప్పుడు కూడా భారత్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ ఉంటున్నారు. దాని కొత్త అడ్రస్ 8, తిలక్ మార్గ్.
1946లో బడ్జెట్ కాగితాలను నేరుగా ఇక్కడి నుంచి పార్లమెంటుకు తీసుకొచ్చేవారు. అప్పుడు లియాకత్ అలీ మధ్యంతర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండేవారు.
లియాకత్ అలీ తన ఇంట్లో ప్రతి ఒక్క వస్తువునూ పాకిస్తాన్‌కు ఇచ్చేశారు. ఆయన తన వ్యక్తిగత వస్తువులను కొన్నింటిని తనతో పాకిస్తాన్ తీసుకెళ్లారు అని దీపా అగ్రవాల్ చెప్పారు.
"వాటిలో సిగరెట్ లైటర్లతో నిండిన ఒక సూట్‌కేసు కూడా ఉంది. ఆయనకు లైటర్స్ సేకరించే అలవాటు ఉండేది. అన్నీ ప్యాక్ అయిన తర్వాత రానా, నేను నాతోపాటు ఒక కార్పెట్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే అది మా అమ్మది. దాన్ని ఇక్కడ వదలాలనిపించడం లేదు" అన్నారు.
1947 ఆగస్టులో లియాకత్ అలీ, రానా లియాకత్ అలీ తమ ఇద్దరు కొడుకులు అష్రఫ్, అక్బర్‌తో దిల్లీలోని వెల్లింగ్టన్ విమాన స్థావరం నుంచి ఒక డకోటా విమానంలో కరాచీకి వెళ్లారు.

ఫొటో సోర్స్, THE BEGUM: A PORTRAIT OF RA'ANA LIAQUAT ALI KHAN
లియాకత్ అలీ హత్య
లియాకత్ అలీ పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి అయినప్పుడు రానా ఆ దేశానికి 'ప్రథమ మహిళ' అయ్యారు. ఆమెకు లియాకత్ తన మంత్రిమండలిలో మైనారిటీ, మహిళా మంత్రిగా చోటిచ్చారు.
నాలుగేళ్లు గడిచాయో లేదో, రావల్పిండిలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న లియాకత్ అలీని హత్య చేశారు.
దాంతో, రానా తిరిగి భారత్ వెళ్లిపోతారని చాలా మంది భావించారు. కానీ, ఆమె పాకిస్తాన్‌లోనే ఉండాలని నిర్ణయించారు.
'ది బేగమ్' సహ రచయిత్రి తహమీనా అజీజ్ అయూబ్ "మొదట్లో ఆమె చాలా కంగారుపడ్డారు. లియాకత్ తన కోసం డబ్బు, ఆస్తులు ఏవీ వదిలి వెళ్లలేదని, ఇప్పుడు ఏం చేయాలా అని కాస్త భయపడ్డారు" అని చెప్పారు.
"ఆమె బ్యాంకు ఖాతాలో అప్పుడు 300 రూపాయలే ఉన్నాయి. రానాకు పిల్లలను ఎలా పెంచాలనేది పెద్ద సమస్యగా మారింది. అప్పుడు కొంతమంది స్నేహితులు ఆమెకు సాయం చేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు నెలకు 2000 రూపాయల స్టైఫండ్ ఇచ్చేది. మూడేళ్ల తర్వాత ఆమెను ఇంగ్లండ్‌లో పాకిస్తాన్ రాయబారిగా పంపించింది. దానితో ఆమెకు కాస్త అండ లభించింది.
రానా అంతకు ముందే 1949లో 'ఆల్ పాకిస్తాన్ విమెన్ అసోసియేషన్' స్థాపించారు. విదేశాల్లో ఉంటున్నా దానితో ఎప్పుడూ టచ్‌లో ఉండేవారు.

ఫొటో సోర్స్, THE BEGUM: A PORTRAIT OF RA'ANA LIAQUAT ALI KHAN
రాయబారి పదవిలో నియామకం
రానా లియాకత్ అలీ మొదట ఇంగ్లండ్, తర్వాత ఇటలీలో పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు.
రానా గురించి చెప్పిన తహమీనా అయూబ్ "అమె ఉన్నత విద్యావంతులు. చాలా తెలివైనవారు. ఆమెకు చాలా అంశాల గురించి తెలుసు. ఆమె మొదటిసారి 1950లోలియాకత్ అలీ ఖాన్‌తో అమెరికా వెళ్లినపుడు అక్కడ ఆమె తన ముద్ర వేశారు" అన్నారు.
"అప్పుడే ఆమెకు చాలా అవార్డులు కూడా లభించాయి. రానా ఆ పాత్రలో త్వరగా చాలా చక్కగా ఇమిడిపోయారు. హాలండ్‌లో అప్పట్లో రాణి పాలన ఉండేది. ఆమెకు రానాతో మంచి స్నేహం ఉండేది. దాంతో హాలండ్ ఆమెను దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆరెంజ్ అవార్డ్‌తో గౌరవించింది".
"అక్కడి రాణి ఆమెకు ఒక భారీ భవంతిని కూడా ఆఫర్ చేశారు. అది ఒక హెరిటేజ్ బిల్డింగ్. మీరు దీన్ని మీ ఏంబసీ కోసం చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు అన్నారు."
"అది సరిగ్గా నగరం మధ్యలో రాజమహలుకు కిలోమీటరు దూరంలో ఉండేది. ఆ బిల్డింగ్ ఇప్పటికీ పాక్ దగ్గరే ఉంది. అక్కడ ఇప్పటికీ పాకిస్తాన్ రాయబారి ఉంటున్నారు" అన్నారు అయూబ్.
ఆమె హాలండ్ అంతా చాలా తిరిగేవారు. అక్కడి ప్రాజెక్టులు చూసేవారు. ఒక దౌత్యవేత్తలాగే తన ఇంట్లో పెద్ద పెద్ద విందులు ఇచ్చేవారు.

ఫొటో సోర్స్, THE BEGUM: A PORTRAIT OF RA'ANA LIAQUAT ALI KHAN
జగత్ మెహతా పిల్లలకు తనే స్నానం చేయించారు
రాయిబారిగా ఉన్న సమయంలో ఆమె ఒకసారి స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ వెళ్లారు. అక్కడ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి జగత్ మెహతా ఫ్లాటులో ఆయనతోపాటే ఉన్నారు. అప్పుడు ఆయన స్విట్జర్లాండ్‌లో భారత జూనియర్ దౌత్యవేత్తగా ఉండేవారు.
తర్వాత జగత్ మెహతా తన "నెగోషియేటింగ్ ఫార్ ఇండియా: రిసాల్వింగ్ ప్రాబ్లమ్స్ త్రూ డిప్లొమసీ" అనే పుస్తకంలో ఆమె గురించి రాశారు.
"రానా తన ఇద్దరు పిల్లలతో కలిసి మా చిన్న ఫ్లాట్‌కు వచ్చారు. అప్పుడు అక్కడ పాకిస్తాన్ రాయాబిర ఆమెను తమ ఇంట్లో ఉండాలని కూడా ఆహ్వానించారు. కానీ ఆమె వెళ్లలేదు".
"ఆమె మా ఇంటిరి రాగానే, ఏ పరిచయం లేకపోయినా నేరుగా వంటింట్లోకి వెళ్లారు. నా ఇద్దరు పిల్లలకు కూడా తనే స్నానం చేయించేవారు. దౌత్య చరిత్రలో భారత్, పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య ఇలాంటి స్నేహానికి ఉదాహరణ బహుశా ఎప్పటికీ లభించదు" అన్నారు జగన్ మెహతా.

ఫొటో సోర్స్, GOVERNMENT OF PAKISTAN
అయూబ్‌తో విభేదాలు
దౌత్యరంగంలో పేరు ప్రఖ్యాతుల సంపాదించినా, పాకిస్తాన్ నియంత అయూబ్ ఖాన్‌కు ఆమె అంటే ఎప్పుడూ పడేది కాదు. దాంతో ఆమెను వేధించడానికి అయూబ్ ఖాన్ ఏ ఒక్క అవకాశాన్నీ వదిలేవారు కాదు.
"అయూబ్ ఖాన్ ఆమెను చాలా వేధించేవారు. ఎందుకంటే ఆమె ఫాతిమా జిన్నాకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన ఒకసారి అనుకున్నారు. కానీ, తాను పాకిస్తాన్ రాయబారిని కాబట్టి అలా చేయనని ఆమె తిరస్కరించారు" అని తహమీనా అజీజ్ చెప్పారు.
"నేను మీవైపు ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తాను" అన్నందుకు, అయూబ్ ఖాన్ ఆమెను ఇటలీ నుంచి వెనక్కి పిలిపించారు.

ఫొటో సోర్స్, THE BEGUM: A PORTRAIT OF RA'ANA LIAQUAT ALI KHAN
జనరల్ జియాతో కూడా గొడవ
రానా లియాకత్ అలీ అందించిన సేవలకు పాకిస్తాన్ ఆమెను దేశ అత్యున్నత పౌర 'పురస్కారం నిషాన్-ఎ-ఇంతియాజ్'తో గౌరవించింది. ఆమెకు 'మాదరే-పాకిస్తాన్' అవార్డు కూడా లభించింది.
రానా లియాకత్ అలీ పాకిస్తాన్ మరో నియంత జనరల్ జియా ఉల్ హక్‌కు కూడా కొరకరాని కొయ్యగా నిలిచారు.
భుట్టోను ఉరి తీయాలని జనరల్ జియా ఉల్ హక్ అనుకున్నప్పుడు, సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఆమె నేతృత్వం వహించారు. ఇస్లాం చట్టం అమలు చేయాలనే జనరల్ జియా నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు.
జనరల్ జియా ఆమెను అరెస్టు చేయించే ధైర్యం చేయలేకపోయారు. కానీ, ఆమె అనుచరులు చాలా మందిని అరెస్టు చేశారు.
1990 జూన్ 30న రానా లియాకత్ అలీ తుదిశ్వాస విడిచారు.
1947 తర్వాత పాకిస్తాన్‌నే తన ఇల్లుగా భావించిన రానా లియాకత్ అలీ, మూడుసార్లు భారత్ వచ్చారు. కానీ, ఎప్పుడూ అల్మోరా వెళ్లలేదు.
అయితే, ఆమె అల్మోరాను ఎప్పుడూ మర్చిపోలేదు. దానికి తన మనసులో స్థానం ఇచ్చారు.
"ఆమె కుమావూలో ఒకప్పుడు తిన్న రాగి రొట్టె, అన్నం, ఉలవల పప్పు, దానిమ్మ చట్నీని తలుచుకునేవారు. పాకిస్తాన్ వెళ్లాక కూడా ఆమె మనసు భారత్‌లోనే ఉండేది. ఒకసారి ఆమె తన సోదరుడు నార్మన్‌కు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షల టెలిగ్రాంలో కూడా "ఐ మిస్ అల్మోరా" అని పెట్టారు. అని అజీజ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- ఈ గాయని నోటికి టేప్ అతికించుకుని నిద్రపోతారు.. కారణమేంటో తెలుసా
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








