ఒక పైలట్ కథ: ముంచుకొస్తున్న మృత్యువు నుంచి ఈ మంచమే నన్ను కాపాడింది

ఒక పైలెట్ కథ

ఏడాది క్రితం గ్రీక్ పైలట్ వాసిలియోస్ వసిలియో కాబూల్‌లోని ఒక లగ్జరీ హిల్‌టాప్ హోటల్‌లో దిగారు.

అది ఎక్కువగా విదేశీయులు దిగే ప్రముఖ హోటల్. అందుకే జనవరి 20న ఆ హోటల్‌పై తాలిబన్లు దాడి చేశారు.

సుమారు 40 మందిని కాల్చిచంపారు. ఆ సమయంలో తనెలా ప్రాణాలతో బయటపడ్డాడో వాసిలియోస్ చెప్పారు.

నేను ఆరోజు కాస్త ముందే డిన్నర్ చేసేద్దామనుకున్నా. సాధారణంగా రాత్రి 8.30కు భోంచేసే నేను ఆ రోజు ఏడున్నరకే భోజనానికి వెళ్లొచ్చేశా.

నా రూంకు వెళ్లా. దాని నంబర్ 522. పై అంతస్తులో ఉంది. రాత్రి 8.47కు నేను ఫోన్లో మాట్లాడుతుండగా లాబీలో ఒక పెద్ద పేలుడు వినిపించింది.

బాల్కనీలోకి వెళ్లి చూశా. అక్కడ కిందంతా రక్తం కనిపించింది. హోటల్ లోపలి నుంచి, బయటి నుంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి.

నేను తొందరగా భోంచేసి రావడం మంచిదైందనిపించింది. ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, పైలెట్లు వసిలియో వాసిలియో(ఎడమ), మైకేల్ పౌలికాకోస్

లాబీలో అందరినీ చంపేశారు

బాల్కనీ తలుపు తెరిచే ఉంచి నా రూం తలుపు లాక్ చేశా. నా గదిలో రెండు బెడ్స్ ఉన్నాయి. వాటిపైన ఒక మాట్రెస్ తీసి దానిని గ్రెనేడ్లు విసిరినా నాకేం కాకుండా తలుపుకు అడ్డంగా పెట్టా.

కొన్ని బెడ్ షీట్లు, బట్టలు తీసి వాటిని నాలుగో అంతస్తుకు దిగగలిగేలా ఒక తాడులా చేశా.

నేను పైలెట్, ట్రైనర్ అవడంతో క్రైసిస్ మేనేజ్‌మంట్, డెసిషన్ మేకింగ్ గురించి ఏళ్ల నుంచి చదువుతున్నా.

తర్వాత ఏం చేయాలా అని ఆలోచించా. హోటల్ భవనంపై ఎంత మంది దాడి చేశారో తెలీదు. ఐదో అంతస్తు నుంచి దూకడం కూడా అంత మంచిది కాదు. దాంతో వీలైనంత వరకూ నన్ను నేను కాపాడుకోవాలని అనుకున్నాను.

మాట్రెస్ ఉన్న బెడ్‌ను చెల్లాచెదురుగా చేశా, మాట్రెస్ లేని పడకను అలాగే వదిలేశా.. లైట్లు ఆఫ్ చేసి చీకట్లో కర్టెన్ల వెనక దాక్కున్నా.

దాదాపు అరగంట గడిచింది. దుండగులు లాబీ, రెస్టారెంట్, అన్ని అంతస్తుల్లో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరినీ చంపేస్తూ వస్తున్నారు.

వాళ్లు పైన తిరుగుతున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. బయట అప్పుడప్పుడూ అంతర్జాతీయ దళాల హెలికాప్టర్ల శబ్దం కూడా వస్తోంది.

ఒక పైలెట్ కథ

నా పిల్లల ముఖాలు కనిపించాయి

నాకు దగ్గరగా కారిడార్లో తుపాకీ కాల్పులు వినిపించాయి. అప్పుడే ఉన్నట్టుండి హోటల్లో కరెంటు పోయింది.

ఐదో అంతస్తులో మొదటి రూంలోకి దుండగులు వెళ్లారు. అది 521, నా గదికి పక్కనే ఉంది. రాత్రంతా హోటల్లో ఉండడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నారు.

నా గది తలుపుపైన కాల్పులు జరిపిన శబ్దం వినిపించింది. దాంతో నేలపైకి జారిన నేను మెల్లగా మాట్రెస్ ఉన్న బెడ్ కిందికి పాక్కుంటూ వెళ్లా. తక్కువ ఎత్తున్న దాన్ని నా పిడికిళ్లు, కాలి వేళ్లతో మోస్తూ ఉండిపోయా.

నాకు కాస్త కనిపిస్తోంది. వాళ్లు తలుపు తాళాన్ని షూట్ చేశారు. తలుపును పెద్ద సమ్మెటతో కొట్టారు. తర్వాత నలుగురు నా గదిలోకి వచ్చారు. బాల్కనీ తలుపు తెరిచి ఉండడంతో ఒకడు వెంటనే అక్కడికెళ్లి చూశాడు.

తర్వాత పిస్టల్‌తో కాల్చడం వినిపించింది. అప్పుడు నాకు ఇక కొన్ని క్షణాల్లో నా ప్రాణాలు పోతున్నాయనిపించింది. నా కుటుంబం గుర్తొచ్చింది. నా పిల్లల ముఖాలు కనిపించాయి.

ఆ తలుపు తెరిచే ఉంచారు, తుపాకులు ధరించిన వారు మాటిమాటికీ ఆ గదిలోకి వస్తూనే ఉన్నారు. తర్వాత వాళ్లు ఐదో అంతస్తులో ఉన్న మిగతా గదుల తలుపులు కూడా తెరవడం మొదలెట్టారు.

ఒక పైలెట్ కథ

రెండోసారి ప్రాణాలు దక్కాయి

కారిడార్‌కు ఆ వైపున నాతో పనిచేసే కొందరు ఉద్యోగులు ఉన్నారు. కాల్చిచంపే ముందు నాకు వాళ్ల ఏడుపులు వినిపించాయి.

ఐదో అంతస్తులో ప్రతి గది తలుపూ తెరిచిన వాళ్లు తమకు కనిపించిన ప్రతి ఒక్కరినీ కాల్చిచంపారు. నాకు ఏడుపులు, బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఒక్కో బుల్లెట్ పేల్చి తలుపు తెరుస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత ప్రతిసారీ నవ్వుతున్నారు. ఒక పెద్ద పార్టీ చేసుకుంటున్నట్టు అంతా తిరుగుతున్నారు.

ఉదయం 3 గంటలప్పుడు వాళ్లు ఐదో అంతస్తులో మంటలు పెట్టారు. అంతా పొగ కమ్ముకోవడంతో వెళ్లిపోయారు. 20 నిమిషాల వరకూ అక్కడ తుపాకీ శబ్దం వినిపించలేదు. దాంతో నేను బెడ్ కింద నుంచి బయటికి రావాలనుకున్నా.

బయటికొచ్చాక నేను పడుకున్న బెడ్‌పై కాకుండా ఇంకొక బెడ్‌పై వాళ్లు కాల్పులు జరిపినట్టు కనిపించింది.

ఆరోజు నాకు రెండోసారి నా ప్రాణాలు దక్కినట్టు అనిపించింది.

గదిలో పొగ అలుముకోకముందే.. ఏదో ఒకటి చేయాలనుకున్నా. బయట బాల్కనీలోకి వెళ్లా. మంటలు నాకు కనిపిస్తున్నాయి. తిరిగి గదిలోకి వెళ్తే బతకనని నాకు తెలుసు.

పైనుంచి కింది వరకూ కొన్ని టీవీ కేబుళ్లు కనిపించాయి. వాటిని పట్టుకుని కిందికి జారదామని ప్రయత్నించా. సరిగ్గా అప్పుడే నన్ను తాకుతూ బుల్లెట్లు వెళ్లాయి. ఒక బుల్లెట్ నా ఎడమ భుజానికి 20 సెంటీమీటర్ల దూరంలో దూసుకెళ్లింది. నా వెనక కిటికీ అద్దం భళ్లున పగిలింది.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, కారిడార్ చివర్లో గోడలపై బుల్లెట్ రంధ్రాలు

నన్ను తాలిబన్ అనుకున్నారు

అవి బహుశా అంతర్జాతీయ దళాల స్నైపర్ దగ్గర్నుంచి వచ్చాయని అనుకున్నా. వాళ్లు నేను 522 నుంచి రావడం చూసుటారు. నేను కూడా తాలిబన్లలో ఒకరని అనుకుని ఉంటారు. కానీ వేగంగా నేను లోపలికి వచ్చేశా.

తర్వాత మెల్లగా బాత్రూంలోకి వెళ్లా. అక్కడ ఉన్న నెయిల్ కట్టర్స్, ఇంకా కొన్ని వస్తువులను తీసుకున్నా. వాటితో బెడ్ కింద చెక్కపై ఉన్న ప్లాస్టిక్ కవరును తెరవడంతో నాకు కాస్త చోటు దొరికింది.

రెండు వాటర్ బాటిళ్లు, గదిలో ఉన్న చిన్న ఫ్రిజ్ నుంచి కొన్ని పాలు, ఒక టీషర్ట్ తీసుకున్నా. షర్టును చిన్న ముక్కలుగా చేసి పొగను ఫిల్టర్ చేయడానికి నా ముక్కులో దూర్చా.

మరో ముక్కను నా నోటి చుట్టూ పెట్టుకున్నా. దానిపై డబుల్ ఫిల్టర్లా ఉండేలా నీళ్లు, పాలు పోశా. అలా పొగ ఫిల్టర్ అవుతుంది.

నేను తిరిగి బెడ్ కిందకు రాగానే, ఒకడొచ్చి ఆ బెడ్ పైనే కూచున్నాడు. నాకు అతడి పాదాలు కనిపిస్తున్నాయి. తను నేలపై మాటిమాటికీ ఉమ్ముతున్నాడు.

రెండు సార్లు చావు నుంచి తప్పించుకున్న నాకు ఈసారీ ఏమీ కాదనే నమ్మకం కలిగింది.

ఎప్పుడో ఒకప్పుడు అంతర్జాతీయ దళాలు లోపలికి వస్తాయనే అనుకుంటున్నా. అప్పటివరకూ ఏం చేయకుండా అలాగే పడుకోవాలని అనుకున్నా.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, వేసిలియో గది నంబర్ 522

మనుషుల శరీరం కాలిన వాసన

కానీ వేకువజామునే భద్రతాదళాలు ట్యాంకుతో గదుల్లోకి ఫైరింగ్ మొదలెట్టాయి. వాళ్లు 521నే టార్గెట్ చేశారు. అది నా పక్కనే ఉంది. కానీ వేరే గదుల్లోకి కూడా ఫైర్ చేస్తున్నారు. ఎందుకంటే తాలిబన్లు ఆ గదుల్లోంచి వారిపై కాల్పులు జరుపుతున్నారు.

కాల్పులు జరుగుతున్న ప్రతిసారీ మొత్తం హోటల్ ఊగిపోతున్నట్టు అనిపిస్తోంది. జరిగిన నష్టాన్ని నేను తర్వాత చూశాను. మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసమైపోయింది. సీలింగ్ అంతా రంధ్రాలు పడ్డాయి. నేను అదృష్టవశాత్తూ బతికానని అనిపించింది.

హోటల్లో ఉన్న వాళ్లు నా అల్మరాలో కొన్ని బట్టలు తీసుకున్నారు. కార్పెట్లు తీసుకుని వాటిపై డీజిల్ పోసి నిప్పు పెట్టారు. 521 గదిని కూడా తగలబెట్టారు.

మంటలు నాకు దగ్గరగా వస్తున్నాయి. ఆ వేడి, పొగకు 15 లేదా 20 నిమిషాలు మాత్రమే బతకగలనని నాకు తెలుసు. నేలపై పడుకునే గాలి పీలుస్తున్నా.

బాల్కనీ తలుపు తెరిచుండడంతో లోపలికి భయంకరమైన చలిగాలి వస్తోంది. పొగ వాసన ఏదో తేడాగా ఉంది. అది మనుషుల శరీరాలు కాలుతున్నట్టు ఉంది.

చుట్టూ శబ్దాలేవీ వినపడకపోవడంతో బయటికొద్దామనుకున్నా. కానీ బయటికి రాగానే, కిటికీలు పగిలిన శబ్దం వినిపించిది. దాంతో మళ్లీ వెంటనే దాక్కున్నా.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, 520, 521 వెసిలియో ఉన్న 522 గదులు(కుడివైపు నుంచి)

నవ్వు రాకుండా ఆపుకున్నా

బయట ఉన్న అంతర్జాతీయ దళాలు వాటర్ జెట్లతో గదుల లోపలికి నీళ్లు కొడుతున్నాయి. మంటలు ఆర్పుతున్నాయి. అందుకే కిటికీలు పగులుతున్నాయి.

కిటికీలు లేని గదిలో, మైనస్ 3 డిగ్రీల కాబూల్ చలిలో చల్లటి నీళ్లు పైన పడేసరికి ప్రాణాలు తోడేసినట్టైంది.

ఉదయం 9.25కు కారిడార్, ఎలివేటర్ల నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. అది భిన్నంగా ఉంది. అంటే అవి సంకీర్ణ దళాలవే అనిపించింది.

తర్వాత అంతర్జాతీయ దళాలు లెక్కలేనన్ని గ్రెనేడ్స్ విసిరాయి. ఫ్లోర్ మీద అవి దొర్లడం, తర్వాత పేలడం నాకు వినిపిస్తున్నాయి.

ఆ గ్రెనేడ్ల వల్ల సొట్టపడ్డ ఫ్లైట్ కేస్ ఇప్పటికీ నా దగ్గరుంది. దాన్ని నేను ఒక జ్ఞాపకంలా ఉంచుకున్నా.

11.30కు సాయుధుడు ఒక్కడే మిగిలినట్లు అనిపించింది. అతడు 521లో ఉన్నాడు. ఏకే 47 పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్నాడు.

తన దగ్గర మందుగుండు అయిపోయింది. తర్వాత బ్లో టార్చ్ తో మంటలు చిమ్మాలని చూశాడు. కానీ అందులో గ్యాస్ అయిపోయింది.

అది చూసి నేను గట్టిగా నవ్వేస్తానేమోనని చేతిని అడ్డం పెట్టుకున్నా. తర్వాత కాసేపటికి తను కూడా కనిపించలేదు.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, దాడి తర్వాత రూం నంబర్ 520 తలుపులు విరిగిపోయాయి

నాకు తుపాకులు గురిపెట్టారు

చాలా అలసటగా ఉంది. తర్వాత నాకు వేరే శబ్దాలు వినిపించాయి.. జనం నా గది వైపు నడిచి వస్తున్నారు. వాళ్లు తాలిబన్లా, సైనికులా అనేది తెలీడం లేదు.

ఎవరో 'పోలీస్, పోలీస్' అని గట్టిగా అరిచారు. కానీ వాళ్లు తాలిబన్లేమో అని నేను బయటకు రాలేదు.

తర్వాత పది సెకన్లకు.. ఇంగ్లీషులో అరవడం వినిపించింది. వాళ్లు పోలీస్ అని కూడా అన్నారు. దాంతో నాకు ప్రాణం లేచొచ్చింది.

అరుస్తూ పాక్కుంటూ బెడ్ కింద నుంచి బయటికొచ్చా. శ్వాస ఆడటం లేదు. బెడ్ కిందే ఒకే పొజిషన్లో అలాగే ఉండిపోవడం వల్ల చాతీ అదుముకుపోయింది.

పొగ వల్ల నేను నల్లగా అయిపోయా. దాంతో కమాండోలు నన్ను చూడగానే 'స్టే డౌన్' అని అరిచారు, నాకు తుపాకులు గురిపెట్టారు.

నేను బలమంతా కూడగట్టుకుని 'నేను కామ్ ఎయిర్ కెప్టెన్‌ని, డోంట్ షూట్' అన్నా.

వాళ్లు తాము చూస్తున్నది నమ్మలేకపోయారు. 'ఇక్కడ ఇన్ని గంటల నుంచి ఉన్నావ్' అన్నారు. నేను 'పూర్తిగా ఇక్కడే ఉన్నా' అని చెప్పా. వాళ్లు బెడ్ చూసి 'దీని కింద ఎలా ఉండగలిగావ్' అన్నారు.

వాళ్లలో ఒకరు 'సరే నేను నిన్ను కిందికి తీసుకెళ్తా, కానీ మనం వెళ్లే ముందు నేను నీతో ఒక ఫొటో తీసుకోవాలి' అన్నాడు. ఇది గుర్తుండిపోయేలా 'నాక్కూడా ఫొటో తీసుకోవాలనే ఉంది' అన్నా.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, వేసిలియోకు చలి తట్టుకోడానికి బ్యాటరీ శక్తితో నడిచే దుప్పటి ఇచ్చారు

నేను చనిపోయానని అనుకున్నారు

ఆ హోటల్ నుంచి బయటికొచ్చిన ఆఖరివాడిని నేనే. వాళ్లు కాపాడిన అందర్నీ కాబూల్‌లోని బ్రిటిష్ బేస్‌కు తీసుకెళ్లారు.

అక్కడ నా కొలీగ్ మైకేల్‌ను చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. అది నమ్మలేకపోయా. నాకు ఏడవాలో, నవ్వాలో తెలీలేదు.

మేం చాలా మంది స్నేహితులను కోల్పోయాం. నాతో పనిచేసిన పైలెట్లు, ఇంజనీర్లు చాలా మంది ఆ దాడిలో చనిపోయారు.

విదేశాంగ శాఖ అధికారులు నేను కనిపించలేదని నా కుటుంబానికి చెప్పామని తెలిపారు.

దాంతో అందరూ నేను చనిపోయానని అనుకున్నారు.

తర్వాత నాలుగు గంటలకు వాళ్లకు ఫోన్ చేసి నేను బాగున్నానని చెప్పగానే, ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేను.

ఒక పైలెట్ కథ
ఫొటో క్యాప్షన్, దాడి తర్వాత రెండు నెలలకు హోటల్‌ను మళ్లీ తెరిచారు

జీవితాన్ని ఆస్వాదించాలి

నేనెప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటాను. కానీ ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువైంది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను.

జీవితం ఒక బహుమతి లాంటిది. అది ఉన్నంతవరకూ మనం దాన్ని ఆస్వాదించాలి.

పనులు, ఒత్తిళ్లు, జీవితంలో జరిగిన చెడు ఘటనలు పట్టించుకోకండి. మంచి విషయాలపైన, మీ చుట్టూ ఉన్న మంచివారిపైనే దృష్టి పెట్టండి. ఎందుకంటే జీవితం చాలా అందమైనది.

ఆ కాబూల్ ఘటన తర్వాత జీవితం నిజంగా చాలా అందమైనదని నాకు తెలిసొచ్చింది. 'నన్ను నమ్మండి. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి'.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)