చంద్రశేఖర్ ఆజాద్ నిజంగా తనను తాను కాల్చుకొని చనిపోయారా?

ఫొటో సోర్స్, SUNIL RAI/BBC
- రచయిత, సునీల్ రాయ్
- హోదా, బీబీసీ కోసం
స్వాతంత్ర్య యోధుడు, హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ 1931 ఫిబ్రవరి 27 ఉదయం ఉపయోగించిన పిస్తోల్ నేటికీ అలహాబాద్ మ్యూజియంలో ఉంది.
ఆజాద్ ఈ పిస్తోల్‌తో తనను తాను కాల్చుకొని మృతి చెందాడని చాలా మంది భావిస్తారు. కానీ పోలీసుల దస్తావేజులు చెబుతున్నది మాత్రం మరో విధంగా ఉంది.
అలహాబాద్‌లోని కర్నల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఉన్న నాటి బ్రిటిష్ పోలీసు నేర రిజిస్టర్‌ను పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతుంది.
అప్పటి పోలీసు రికార్డుల ప్రకారం ఆ రోజు ఉదయం 10.20 గంటలకు ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్‌లో ఉన్నాడు.
ఆయన అక్కడ ఉన్న సమాచారం ఇన్‌ఫార్మర్ పోలీసులకు చేరవేశాడు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న చంద్రశేఖర్ ఆజాద్ పేరు అప్పటికే బ్రిటిష్ పోలీసుల హిట్‌లిస్ట్‌లో ఉంది.
1906 జులై 23న చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో జన్మించాడు.
చదువు కోసం ఆయన వారణాసి వెళ్లారు. 1921లో బెనారస్ సత్యాగ్రహోద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన దమనకాండ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
కాకోరీ కేసు, 1929లో జరిగిన బాంబు పేలుడు సంఘటన తర్వాత నుంచి పోలీసులు ఆజాద్ కోసం వేట మొదలుపెట్టారు. అయితే ఆ కాలం నాటి దస్తావేజులు చాలా వరకు నేడు అందుబాటులో లేవు.
ఆ తర్వాత స్వాతంత్ర్యోద్యమం గురించి పుస్తకాలు రాసిన వారు కూడా అసలా రోజు ఉదయం సరిగ్గా ఏం జరిగిందో వివరించలేకపోయారు.

ఫొటో సోర్స్, SUNIL RAI/BBC
పోలీసుల రిజిస్టర్‌లో నమోదు
భారత్‌లో క్రిమినల్ నేరాల దర్యాప్తు వ్యవస్థ నేటికీ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ లాగానే ఉంది.
ఉదాహరణకు నేటి కాలంలో ఎవరైనా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే, బ్రిటిష్ కాలంలో కేసు నమోదు చేసినట్టుగానే చేస్తుంటారు.
నేర రిజిస్టర్‌లో నేరం సంఖ్య, నిందితుడి పేరు, సెక్షన్-307 (ప్రాణాంతక దాడి), ఆఖరున తుది నివేదిక వివరాలు నమోదు చేస్తారు.
అంటే, నిందితుడు పోలీసు దళంపై ప్రాణాంతకమైన దాడికి పాల్పడ్డాడు. దానికి జవాబుగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం జరిగిన ఈ దాడిలో నిందితుడు చనిపోయాడు.
అయితే తన వద్ద చివరి బుల్లెట్ మిగిలి ఉన్న సమయంలో ఆజాద్ తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచారని చాలా మంది విశ్వాసం. కానీ ప్రభుత్వ రికార్డులలో మాత్రం ఈ వివరాలేవీ లేవు.
అలహాబాద్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో ఉన్న నేర రికార్డుల అభిలేఖాగారంలో 1970కు ముందటి దస్తావేజులేవీ లేవు.
కర్నల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఈ కేసు రిజిస్టర్ అయిందనీ, అందులో ఎన్‌కౌంటర్ జరిగినట్టు పేర్కొన్నారనీ అలహాబాద్ తూర్పు జోన్ ఐజీ ఆర్.కె. చతుర్వేది తెలిపారు.

ఫొటో సోర్స్, SUNIL RAI/BBC
ఆజాద్‌పై కేసు
"పోలీసు రికార్డుల దృష్టితో చూసినపుడు దీనిని ఎన్‌కౌంటర్ కేసుగానే నమోదు చేస్తారు" అని ఆయన చెప్పారు.
"ప్రాథమికంగా చూసినపుడు ఆయన చివరి బుల్లెట్‌ను తనపైనే కాల్చుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రాణాలతో పట్టుబడగూడదని కోరుకునేవాడు."
అయితే బ్రిటిష్ పోలీసులు తమ గొప్పతనాన్ని చాటుకునేందుకే నేర రిజిస్టర్‌లో ఆజాద్ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టుగా నమోదు చేశారని అలహాబాద్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ యోగేశ్వర్ తివారీ అభిప్రాయపడ్డారు.
పోలీసు పార్టీపై ప్రాణాంతక దాడి చేసినట్టు బ్రిటిష్ పోలీసులు ఆజాద్‌పై సెక్షన్ 307 కింద కర్నల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఉర్దూలో నమోదు చేసిన నాటి నేర రిజిస్టర్ ఒక్కటే ఇప్పడు మిగిలి ఉన్న ఆధారం. ఇందులో కక్షిదారులుగా చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు మరో అజ్ఞాత వ్యక్తిని పేర్కొన్నారు.
అలహాబాద్ మ్యూజియంలో లభించే సమాచారం ప్రకారం, 1931 ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్‌లో ఒక నేరేడు చెట్టు కింద కూర్చొని తన సహచరుడితో మాట్లాడుతున్నారు.
ఒక ఇన్‌ఫార్మర్ అందించిన సమాచారంపై డిప్యూటీ ఎస్‌పీ ఠాకుర్ విశ్వేశ్వర్ సింగ్, పోలీసు ఎస్‌పీ జాన్ నాట్ బావర్ ఆ పార్కును చుట్టుముట్టారు.

ఫొటో సోర్స్, Twitter @pib_india
ఆజాద్ ఎదురుదాడి
ఎస్‌పీ బావర్ చెట్టును కవర్‌గా చేసుకొని ఆజాద్‌పై కాల్పులు జరపగా, బుల్లెట్ ఆజాద్ తొడను చీల్చుకుంటూ వెళ్లింది. మరుసటి తూటా విశ్వేశ్వర్ సింగ్ పేల్చాడు. అది ఆయన కుడి భుజం గుండా వెళ్లింది.
గాయపడిన తర్వాత కూడా ఆజాద్ ఎడమ చేతితో కాల్పులు కొనసాగించాడు. దీనికి జవాబుగా ఆజాద్ తూటా పేల్చగా అది విశ్వేశ్వర్ సింగ్ దవడను చీల్చుకుంటూ వెళ్లింది.
ఆజాద్ ఏ పోలీసు ఉద్యోగినీ లక్ష్యంగా చేసుకోలేదు.
అలహాబాద్ మ్యూజియం డైరెక్టర్ రాజేష్ పురోహిత్ కూడా ఆజాద్ చివరి తూటాను తనపైనే పేల్చుకొని చనిపోయాడనే అభిప్రాయంతో ఏకీభవిస్తారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు లేవని ఆయన కూడా అంగీకరిస్తారు.
ఈ మ్యూజియంలో ఉన్న 'అమర్ షహీద్ చంద్రశేఖర్ ఆజాద్' అనే పుస్తక రచయిత విశ్వనాథ్ వైశంపాయన్, చంద్రశేఖర్ ఆజాద్‌కు సహచరుడిగా ఉండేవారు.
"నేను అరెస్ట్ అయ్యాక 15 రోజులకు ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్‌లో అమరుడయ్యాడు. ఆ సమయంలో నేను బయట లేను. కాబట్టి ఆ సమయంలో పత్రికల్లో అచ్చయిన వార్తల ఆధారంగానే నేను రాశాను" అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SUNIL RAI/BBC
గాయపడ్డ ఆజాద్...
సుఖ్‌దేవ్ రాజ్‌ను ఉటంకిస్తూ వైశంపాయన్ ఇలా రాశారు, "ఈ ఘటన జరిగిన రోజు ఆజాద్ భారత్ నుంచి బర్మాకు వెళ్లిపోవడం గురించి చర్చించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న వీరభద్ర్ వారికి కనిపించాడు."
"ఇద్దరూ (సుఖ్‌దేవ్, ఆజాద్) వీరభద్ర్ గురించి మాట్లాడుకుంటుండగానే ఓ మోటర్ కారు అక్కడికి వచ్చి ఆగింది. అందులోంచి ఓ ఇంగ్లిష్ అధికారి దిగొచ్చి మీ పేర్లేంటని అడిగాడు."
"అతడు పేరు అడగడంతోనే వాళ్లిద్దరూ తుపాకులు తీసి కాల్పులు జరిపారు. బ్రిటిష్ అధికారి కూడా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడ్డ ఆజాద్ సుఖ్‌దేవ్‌ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని అన్నాడు. సుఖ్‌దేవ్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పుకోగలిగాడు."
నాట్ బావర్ ప్రెస్ కోసం విడుదల చేసిన ప్రకటనను కూడా వైశంపాయన్ తన పుస్తకంలో ప్రచురించాడు.
"ఆల్ఫ్రెడ్ పార్క్‌లో తానొక వ్యక్తిని చూశాననీ, అతడి రూపురేఖలు విప్లవనేత ఆజాద్ లాగా ఉన్నాయని ఠాకుర్ విశ్వేశ్వర్ సింగ్ (డిప్యూటీ ఎస్‌పీ) నుంచి తనకు సందేశం అందిందని నాట్ బావర్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు."
"నేను నా వెంట జమాన్, గోవింద్ అనే కానిస్టేబుల్స్‌ను తీసుకెళ్లాను. దాదాపు పది గజాల దూరంలో నిలబడి మీరెవరని అడిగాను. దానికి జవాబుగా వాళ్లు పిస్తోళ్లు తీసి కాల్పులు ప్రారంభించారు."

ఫొటో సోర్స్, www.pmindia.gov.in
"నా పిస్తోల్ సిద్ధంగా ఉంది. లావుగా ఉన్న వ్యక్తి పిస్తోల్ తీయడాన్ని గమనించగానే, అతడు తూటా పేల్చడానికి క్షణం ముందుగానే నేను నా పిస్తోల్ పేల్చాను" అని నాట్ బావర్ ఆ ప్రకటనలో తెలిపాడు.
"నాతో పాటు ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా ఆ లావాటి వ్యక్తిపైనా, మరి కొందరిపైనా కాల్పులు జరిపారు."
"నేను మ్యాగజైన్ తీసేసి మరొకటి నింపుకుంటుండగా ఆ లావాటి వ్యక్తి నాపై తూటా పేల్చాడు. దాంతో నా మ్యాగజైన్ కింద పడిపోయింది. అతడు మరో తూటా పేల్చగా విశ్వేశ్వర్ సింగ్ నోట్లోంచి వెళ్లింది."
ఆయనింకా ఇలా రాశారు, "నేను పిస్తోల్‌ను మళ్లీ నింపుకోలేకపోయాను. నేను కనిపిస్తే చాలు ఆ లావాటి వ్యక్తి నాపై బుల్లెట్లు కాలుస్తున్నాడు."
"అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా లేదా అప్పటికే తగిలిన గాయాలతో అతను చనిపోయాడా అన్న విషయం నేను చెప్పలేను. ఈలోగా అందరూ అక్కడ గుమిగూడారు. ఇంతలో ఒక వ్యక్తి లోడెడ్ గన్‌తో నా దగ్గరికొచ్చాడు."
"ఆ లావాటి వ్యక్తి నిజంగానే చనిపోయాడా లేదా చనిపోయినట్టు నటిస్తున్నాడా నాకు తెలియదు. అందుకే అతని కాళ్లపైన కాల్చండని నేనన్నాను. ఆ వ్యక్తి తుపాకీ పేల్చాడు."
"ఆ తర్వాత ఆ లావాటి వ్యక్తి దగ్గరికి వెళ్లి చూడగా ఆయన అప్పటికే మరణించి ఉన్నాడు. అతని సహచరుడు పారిపోయాడు."
(ఈ స్టోరీ 2016 జులై 23న మొదటిసారి బీబీసీ హిందీ వెబ్‌సైట్‌లో అచ్చయ్యింది.)
ఇవి కూడా చదవండి:
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- నిదా ఖాన్‌ను ఇస్లాం నుంచి ఎందుకు బహిష్కరించారు?
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- ‘నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకున్నాం.. ’: మీడియాతో థాయ్ బాలలు
- పాకిస్తాన్ ఎన్నికలు: 'డాన్' పత్రికాధిపతి బీబీసీ ఇంటర్వ్యూపై వివాదం
- బ్రిటన్: సెక్స్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న యువత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








