నిదా ఖాన్‌ను ఇస్లాం నుంచి ఎందుకు బహిష్కరించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భూమికా రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావా సరే సరి. లేదంటే మొత్తం ముస్లింలంతా నిన్ను బహిష్కరించాలని ఆదేశిస్తున్నాను. నీతో కలిసి తినడం, తాగడం కూడా నిషేధం. నువ్వు జబ్బుపడినా నిన్ను చూసే వారు ఉండరు. నువ్వు చనిపోయినా ప్రార్థనలు చేసేవారుండరు. నిన్ను శ్మశానంలో పూడ్చేందుకు కూడా ఎవరూ రారు.''
ఈ శిక్ష మన భారతీయ చట్టాలలోనో లేదా ఏదైనా అనాగరిక, ఆటవిక సమాజాలలోనో ఉన్నది కాదు. బరేలీలోని జామా మసీదుకు చెందిన ఇమామ్ అల్-ముస్తఫీ మొహమ్మద్ ఖుర్షీద్ ఆలం రజ్వీ జారీ చేసిన ఫత్వా ఇది.
నిదా ఖాన్ అనే మహిళకు వ్యతిరేకంగా దీనిని జారీ చేశారు. నిదా ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారన్న విషయం తెలిసిందే.
అయితే ఆమె ఖురాన్, షరియా చట్టాలను చిన్నచూపు చూస్తున్నారనేది మతపెద్దల ఆరోపణ.
నిదా స్వయంగా ట్రిపుల్ తలాఖ్ బాధితురాలు. అయితే ఆమె అక్కడే ఆగిపోకుండా తనలా కష్టాల్లో ఉన్న తోటి మహిళల సంక్షేమం కోసం పని చేస్తున్నారు.
పైన పేర్కొన్న ఫత్వాను జులై 16న జారీ చేశారు. అయితే తనను మానసికంగా బలహీనురాలిని చేయడానికే ఈ ఫత్వాను జారీ చేశారని నిదా అంటున్నారు.

ఫొటో సోర్స్, MUFTI kHURSHEED ALAM
ఇస్లాం నుంచి బహిష్కరించే హక్కు ఎవరిచ్చారు?
షరియా చట్టం ప్రకారమే ఈ ఫత్వాను జారీ చేసినట్లు మొహమ్మద్ ఖుర్షీద్ ఆలం సమర్థించుకున్నారు.
ఖురాన్‌ను అనుసరించని వారికి, షరియత్ చట్టాలను మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ ఫత్వాను జారీ చేశానని ఆయన తెలిపారు.
నిదా ఖాన్ గురించి మాట్లాడుతూ, ''తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయనంత వరకు ఆమెను ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నాం. ప్రాయశ్చిత్తం చేసుకుంటే, ఎప్పటిలాగే ఆమెను మా సోదరిలా భావిస్తాం'' అని తెలిపారు.
ఖురాన్-ఎ-హదీస్‌ను వ్యతిరేకించే వారెవరైనా సరే ఇస్లాం నుంచి బహిష్కరిస్తామని అన్నారు.
''షరియాను అనుసరించని వారిని, దానిని తప్పుగా వ్యాఖ్యానించే వారిని ఇస్లాం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. మౌల్వీ-ఇమామ్ కేవలం దానిని అమలు చేసే బాధ్యతను తీసుకుంటారు. ఇదెవరో మనుషులు చేసిన చట్టం కాదు. ఇది ఖురాన్‌లో ఉంది. దీనిని ఎవరూ మార్చలేరు'' అన్నారు.

ఫొటో సోర్స్, SHIV
నిదా ఖాన్ చేసిన తప్పేంటి?
ఫత్వా మొన్నటి సోమవారం జారీ చేసినా, ఈ గొడవ చాలా కాలంగా నడుస్తోంది.
ఫత్వా జారీ చేసిన పరిస్థితులు నిదా మాటల్లోనే: ''2015, ఫిబ్రవరి 18న నా వివాహం జరిగింది. ఐదు నెలల తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. నా భర్త నన్ను కొట్టడం, తిట్టడం ప్రారంభించాడు. 2016, మేలో బారాదరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నా భర్త తరపు కుటుంబంపై కేసు పెట్టడానికి ప్రయత్నించాను. కానీ పోలీసులు నా ఫిర్యాదును స్వీకరించలేదు'' అని తెలిపారు.
తన భర్త తరపు బంధువుల ఒత్తిడి కారణంగానే పోలీసులు తన ఫిర్యాదు నమోదు చేయలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
''బారాదరీలో కేసు నమోదు చేసుకోకపోవడంతో నేను పై అధికారుల వద్దకు వెళ్ళాను. అక్కడా నన్ను పట్టించుకోలేదు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కానీ పోలీసులు 13 రోజుల్లోనే ఫైనల్ రిపోర్ట్ సమర్పించేశారు.''
''దీనిపై నేను అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు కూడా ఆ రిపోర్టు నకిలీ అని అంగీకరించింది. దానిలో ఎక్కడా నా వాంగ్మూలం లేదు. కోర్టులో కేసు నడుస్తుండగానే నా భర్త నాకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేసి నకిలీ తలాక్‌నామాను కోర్టుకు సమర్పించారు. అయితే కోర్టు దానినీ అంగీకరించలేదు.'' అని ఆమె వివరించారు.
దీంతో కోర్టు తిరిగి ఈ కేసు విషయంలో విచారణకు ఆదేశించింది.
కోర్టు ప్రాంగణంలోనే తనపై యాసిడ్ దాడి బెదిరింపు జరిగిందని నిదా తెలిపారు. తన తండ్రిని, సోదరుణ్ని హత్య చేస్తామని కూడా బెదిరించారని ఆమె అన్నారు.
2018, జూన్ 25న కోర్టు నిదా కేసులో తీర్పు వెలువడింది. నిదాకు అనుకూలంగా చార్జిషీటు దాఖలు చేశారు.
నిదా భర్తపై బలవంతపు అబార్షన్ కేసు, ఆమె మామపై కట్నం కోసం వేధింపుల కేసు నమోదు చేశారు.
పై కారణాల వల్లే తనపై ఫత్వా జారీ చేశారని నిదా ఆరోపిస్తున్నారు.
అయితే నిదా ఆరోపణలను ఆమె మామ అంజుమ్ మియా తోసిపుచ్చారు. కేసు కోర్టులో ఉన్నందువల్ల దానిపై తామేమీ వ్యాఖ్యానించబోమని ఆయన బీబీసీతో అన్నారు. ఫత్వాకు, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలకు సంబంధం లేదన్నారు.
''నా భర్తపై కేసు పెట్టినందుకే నన్ను వేధిస్తున్నారు. షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం వారికి ఇది మొదటిసారి కాదు. 2016లో నేను కోర్టును ఆశ్రయించినపుడు నాకు ట్రిపుల్ తలాక్ ఇచ్చి, నన్ను తన భార్య కాదన్నారు.''
ఈ ఫత్వాను జారీ చేసింది కూడా భర్త తరపు బంధువులే అనీ, మతాన్ని అడ్డంగా పెట్టుకొని తనను వేధిస్తున్నారని నిదా ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
మా చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించడం అణచివేత కాదా?
అయితే ఇమామ్ ఖుర్షీద్ నిదా ఆరోపణలను ఖండించారు.
''నిదా కేసు చాలా రోజులుగా నడుస్తోంది. ఆమె కోర్టుకు వెళ్లినా దానిపై మేం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగత వ్యవహారం. కానీ ఆమె షరియత్ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వల్లనే మేం మా బాధ్యతను నిర్వర్తించాల్సి వచ్చింది. మేం అల్లాకు జవాబుదారీగా ఉండాలిగా మరి?''
తలాఖ్, హలాలాలను జనాలు సరిగా అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. ఇది షరియత్ చట్టమని, దాన్ని పాటించక తప్పదని అన్నారు.
"ఇస్లాం, షరియత్‌లపై ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు మాట్లాడుతున్నారని, తమ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించడం ఒక రకమైన అణచివేత కాదా?" అని ఆయన ప్రశ్నించారు.
''మీరు ముస్లింలై, షరియత్ చట్టాన్ని అనుసరించకుంటే అది తప్పు కాదా? ముస్లిం అయి కూడా ఖురాన్ నియమాలను పాటించకపోతే, మీరెలాంటి ముస్లిం అవుతారు?'' అని ఆయన ప్రశ్నించారు .
ఖురాన్ చట్టాన్ని ఎవరూ రాయలేదని, దానిని అల్లాయే రాశారని ఆయన తెలిపారు. దానిని ఎవరూ మార్చడానికి వీల్లేదన్నారు.
''మన దేశంలో వందలాది చట్టాలు ఉన్నాయి. వాటితో మాకు ఎలాంటి పేచీ లేదు. చట్టాలు రూపొందుతూనే ఉంటాయి. కానీ మేం షరియత్ చట్టాన్ని మాత్రం విడిచి పెట్టేది లేదు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించినంత వరకు చట్టం తయారైతే అప్పుడు చూస్తాం.''
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








