ట్రంప్ తడబడ్డారా? పొరబడ్డారా? మాట మార్చారా?

ఫొటో సోర్స్, Getty Images
డొనాల్డ్ ట్రంప్ 'యూ టర్న్' తీసుకున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదు అని చెప్పిన ట్రంప్.. ఒక్కరోజులోనే మాట మార్చారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని చెబుతోన్న అమెరికా నిఘా వర్గాలతో ఏకీభవిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ విషయమై మాట్లాడుతున్నపుడు తన ప్రసంగంలో పొరపాటు దొర్లిందని, 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉండకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవన్నారు. తనకు అమెరికా నిఘా వర్గాలపై ''సంపూర్ణ విశ్వాసం ఉంది'' అని అన్నారు.
అప్పుడేమన్నారంటే..
సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం గురించి శ్వేతసౌధం విడుదల చేసిన ప్రెస్ నోట్ మేరకు..
రిపోర్టర్: 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆరోపణలను పుతిన్ తోసిపుచ్చారు. మీకు నా ప్రశ్న ఏమిటంటే సర్.. ఈ రెండు వాదనల్లో మీరు ఎటువైపున్నారు?
ట్రంప్: నిఘా వర్గాలు నా దగ్గకు వచ్చి, రష్యా జోక్యం గురించి చెప్పారు. కానీ పుతిన్ వాటిని ఖండిస్తున్నారు. నేనేమంటున్నానంటే.. ఎన్నికల్లో రష్యా జోక్యం ఎందుకు ఉంటుంది అని.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడేమన్నారంటే..
శ్వేతసౌధం పోస్ట్ చేసిన మీడియా సమావేశం ప్రతిని తాను చూశానని, దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు.
''మీడియాతో మాట్లాడుతున్నపుడు.. ఎన్నికల్లో రష్యా జోక్యం ఎందుకు ఉండకూడదు? అనబోయి, ఎందుకుంటుంది? అన్నాను. దీంతో.. అర్థం పూర్తిగా మారిపోయింది'' అన్నారు.
''ఎన్నికల్లో రష్యా జోక్యం గురించి నిఘా వర్గాల సమాచారంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇందులో రష్యాతోపాటు ఇతరుల ప్రమేయం కూడా ఉండొచ్చు. కానీ వారి ప్రభావం ఎన్నికలపై పడలేదు'' అన్నారు.
అమెరికా, రష్యా దేశాల మధ్య చిరకాల వైరం కొనసాగుతోంది. చాలా అంశాల్లో ఇరు దేశాలు ప్రత్యర్థి పాత్రలు పోషిస్తున్నాయి. రష్యాను, పుతిన్‌ను విమర్శించే ఏ అవకాశాన్ని ట్రంప్ సద్వినియోగం చేసుకోవడం లేదని రాజకీయ వర్గాల ఆరోపణ. పైగా.. 'సత్సంబంధాలు లేకపోవడంలో ఇరు దేశాలకూ బాధ్యత ఉంది' అని ట్రంప్ అన్నారు.
రష్యా జోక్యం గురించిన ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు స్పందిస్తూ.. ''తన పాలనలో ఇది ఒక ఘోరమైన పొరపాటు'' అన్నారు.
''ట్రంప్ ఓ పిరికిపంద..'' అంటూ డెమొక్రటిక్ నేత చక్ షూమర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నష్టం జరిగిపోయింది!
బీబీసీ వాషింగ్టన్ ప్రతినిధి ఆంథొనీ జర్చర్ మాటల్లో..
డొనాల్డ్ ట్రంప్ ఏదైనా కీడు శంకించారా? అమెరికా నిఘా వర్గాలను సమర్థిస్తూ ట్రంప్ మాట్లాడినపుడు శ్వేతసౌధంలోని కాన్ఫరెన్స్ రూమ్‌లో అందరి కళ్లు బైర్లు కమ్మాయి.
ట్రంప్ యూ టర్న్ తీసుకోవడం ఆయన్ను విమర్శించేవారికి మింగుడుపడటం లేదు. ఒకవేళ 'ఎన్నికల్లో రష్యా జోక్యం ఎందుకు ఉండకూడదు?' అన్నదే ట్రంప్ ఉద్దేశం అనుకున్నా, ఆ మాటలు చాలా బలహీనంగా ఉన్నాయి.
శ్వేతసౌధంలో కూర్చుని ఎన్నిసార్లు తనను సమర్థించుకున్నా ఫలితం లేదు. ఆయన తడబడ్డాడు. ఆయన మాటలు వాస్తవాన్ని మార్చలేవు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








