‘నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకున్నాం..’: గుహ నుంచి బయటపడ్డ థాయ్‌లాండ్ బాలలు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకుని, గత వారం బయటపడ్డ 12 మంది బాలలు తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. గజఈతగాళ్లు తమను కనుగొనటం ‘అద్భుతం’ అని వారు వర్ణించారు.
బ్రిటిష్ గజఈతగాళ్లు ఈదుకుంటూ గుహలోకి వచ్చినప్పుడు వారితో తాను ‘‘హలో’’ అని మాత్రమే అనగలిగానని 12 ఏళ్ల అదుల్ శామ్ చెప్పాడు. ఈ బృందంలో ఇంగ్లిష్ మాట్లాడగల ఏకైక వ్యక్తి అతడే.
థామ్ లాంగ్ గుహలో రెండు వారాలకు పైగా ఈ బాలలు చిక్కుకుపోయారు.
బుధవారం వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతున్నారు.
వైల్డ్ బోర్స్ జూనియర్ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ఈ 12 మంది బాలురు చియాంగ్ రాయ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశానికి వారంతా తమ ఫుట్‌బాల్ జట్టు టీ షర్టులు వేసుకొచ్చారు.
ఫుట్‌బాల్ మైదానంలా తీర్చిదిద్దిన వేదికపై ‘‘వైల్డ్ బోర్స్‌ను తిరిగి ఇంటికి తీసుకురావటం’’ అని రాసి ఉన్న బ్యానర్ వారికి స్వాగతం పలికింది.
తమను రక్షించిన థాయ్ నేవీ సీల్స్ సభ్యులతో కలసి ఈ బాలలు మీడియాతో మాట్లాడారు.
గుహలో ఉన్నప్పుడు రాళ్ల నుంచి కిందికి కారే ‘నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండేవి. అయితే నీళ్లు మాత్రమే ఉండేవి. ఆహారం లేదు’ అంటూ ఒక బాలుడు వివరించాడు. వాటిని తాగే తాము బతికామని చెప్పాడు.
11 ఏళ్ల చైనిన్ ‘టైటాన్’ మాట్లాడుతూ.. ‘‘నేనస్సలు ఆహారం గురించి ఆలోచించేవాడినే కాదు. ఎందుకంటే ఆహారం గురించి ఆలోచిస్తే నా ఆకలి పెరుగుతుంది’’ అంటూ గుహలో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఏమాత్రం చెక్కు చెదరని స్ఫూర్తి
హోవార్డ్ జాన్సన్, బీబీసీ న్యూస్, చియాంగ్ రాయ్
ఇదొక సంతోషకరమైన విలేకరుల సమావేశం. బాలలు ఆసాంతం నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు. ‘‘నా పేరు బైటోయ్, గుహలో ఉన్నప్పుడే నేను అందంగా ఉన్నాను’’ అంటూ థాయ్ నేవీ సీల్ గతఈతగాడు ఒకరు మొదటి జోక్ పేల్చారు. దీంతో హాలంతా నవ్వులు చిందాయి.
బ్రిటిష్ గజఈతగాళ్లతో మాట్లాడిన బాలుడు అదుల్... వాళ్లు ఏం చెబుతున్నారో తమకు అనువదించి చెప్పాలని కోచ్ అడిగారని, అయితే.. ‘‘ఆగాగు.. వాళ్లంత వేగంగా మాట్లాడుతుంటే అర్థం చేసుకోవటం నావల్ల కాదు’’ అని తాను కోచ్‌తో అన్నానని అదుల్ తెలిపాడు. దీంతో మరోసారి ముసిముసి నవ్వులు మొదలయ్యాయి.
ఈ బాలల స్నేహితులు, కుటుంబ సభ్యులు, చియాంగ్ రాయ్ ఆస్పత్రి నర్సులు.. అంతా నవ్వుతూ కనిపించారు. బాలలు మాట్లాడేది అందరికీ వినిపించేలా కార్యక్రమ నిర్వాహకులు శ్రద్ధ తీసుకున్నారు.
అయితే, తాము ఎలా గుహలో చిక్కుకున్నామో వివరిస్తున్నప్పుడు మాత్రం హాలంతా నిశ్శబ్దం అలముకుంది. బాలల్ని సురక్షితంగా ఉంచేందుకు ఎత్తైన ప్రదేశాన్ని ఎలా వెతికిందీ కోచ్ వివరిస్తున్నప్పుడు వాళ్లంతా ఆసక్తిగా విన్నారు.
ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడైన టైటాన్ మాట్లాడుతూ.. ‘ఆకలేస్తుందేమోనని ఆహారం గురించి ఆలోచించడమే మానేశా’ అని చెప్పినప్పుడు హాలు దద్దరిల్లేలా అందరూ నవ్వారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని బృంద స్ఫూర్తి ఈ బాలలకు ఉందని ఆ నవ్వులు రుజువు చేశాయి.


ఫొటో సోర్స్, Getty Images
ఈ బాలలంతా జూన్ 23వ తేదీన కనిపించకుండాపోయారు. థామ్ లాంగ్ గుహలో ఉన్న వీరిని జులై 2వ తేదీన గజఈతగాళ్లు గుర్తించారు. తర్వాత నేవీ సీల్స్ వారికి అవసరమైన ఆహారం తీసుకెళ్లి అందించారు.
గజఈతగాళ్లు తమను గుర్తించిన తర్వాత వారం రోజుల పాటు గుహలో ఎలా గడిపారో కూడా ఆ బాలలు వివరించారు.
తాము డ్రాటర్స్ (పులి-మేక లాగా గడుల్లో పావులు కదుపుతూ ఆడే ఆట) ఆడేవాళ్లమని, అందులో ఎప్పుడూ నేవీ సీల్ మైటోయ్ గెలిచేవారని, ఆయనే గుహకు రాజు అని బాలలు సరదాగా చెప్పుకొచ్చారు.
ఈ బాలల్ని కాపాడిన ఫుట్‌బాల్ జట్టు కోచ్ ఎకపోల్ ఛాంటవాంగ్.. బాలల్ని రక్షించే ఆపరేషన్‌లో మృతి చెందిన నేవీ సీల్ మాజీ సభ్యుడు, గజఈతగాడు సమన్ కునన్‌కు నివాళులర్పించారు.
‘‘మమ్మల్ని రక్షించేందుకు, మేం ప్రాణాలతో బయటపడి జీవించి ఉండేందుకు సమన్ తన ప్రాణాలను త్యాగం చేశారు. ఈ వార్త విని మేం షాక్‌కు గురయ్యాం. చాలా బాధపడ్డాం. ఒక కుటుంబం బాధ పడటానికి మేం కారణమయ్యామని అనుకున్నాం’’ అని చెప్పారు.
కొంత కాలం పాటు ఈ బాలల్ని బౌద్ధ సన్యాసులుగా చూస్తారు. అశుభాన్ని చవిచూసిన మగవారిని ఇలా పరిగణించటం థాయ్‌లాండ్‌లో ఆచారం.
ఇవి కూడా చదవండి:
- థాయ్‌లాండ్‌లో ఇప్పుడు హీరోలు వీరే
- మిస్టర్ మోసగాడికి 6,637 ఏళ్ల జైలు శిక్ష
- థాయ్‌లాండ్‌లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స
- థాయ్ బామ్మ వంట.. ఓహో అదిరెనంట
- స్కూలుకెళ్లే చిన్నారులను కాపాడుకోవడం ఇలా..
- మేఘాలయ: ‘దేవతల గుహ’లో దాగిన రహస్యాలు
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- మోదీ అయినా, మన్మోహన్ అయినా ఈ 120 మందికి మాత్రం అన్నీ ‘అచ్ఛే దిన్’లే
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









