థాయ్‌లాండ్: ‘గుహలో పిల్లల కథ’తో హాలీవుడ్ సినిమా

ఫొటో సోర్స్, Facebook/ekatol
12 మంది పిల్లలు, వారి కోచ్ రెండు వారాలకు పైగా చిక్కుకుపోయిన ఉత్తర థాయ్‌లాండ్‌లోని గుహను మ్యూజియంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఈ గుహ థాయ్‌లాండ్‌కు ప్రధాన ఆకర్షణగా మారవచ్చని భావిస్తున్న అధికారులు పిల్లల్ని కాపాడిన ఆపరేషన్ ఎలా జరిగిందనేది ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తామని తెలిపారు.
పిల్లలను కాపాడిన సహాయ కార్యక్రమాల కథతో రెండు సంస్థలు సినిమా నిర్మిచే ఆలోచనలో కూడా ఉన్నాయి.
గుహ నుంచి బయటికొచ్చిన పిల్లలు, వారి కోచ్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
అధికారులు విడుదల చేసిన ఒక వీడియోలో పిల్లలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయినా వారిని వారం పాటు వేరుగా ఉంచనున్నారు.

ఫొటో సోర్స్, THAI GOVERNMENT PU
థాయ్ నావీ సీల్స్ కూడా ఆపరేషన్ జరిగినప్పుడు తీసిన ఫుటేజిని పోస్ట్ చేసింది. వైల్డ్ బోర్ ఫుట్‌బాల్ జట్టు దగ్గరకు నిపుణులైన డైవర్లు ఎలా వెళ్లారో, వారిని పైకి ఎలా తీసుకొచ్చారో చూపిస్తోంది.
గురువారం రాజధాని బ్యాంకాక్ మిలిటరీ ఎయిర్ పోర్ట్ చేరుకున్న నావీ సీల్స్‌కు పూలదండలతో స్వాగతం లభించింది.
గుహను ఏం చేస్తారు?
థాయ్‌లాండ్‌లో ఉన్న గుహల్లో థామ్ లుయాంగ్ గుహ చాలా పెద్దది. అది మయన్మార్ సరిహద్దుల్లోని చాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో మే సాయ్ పట్టణం చుట్టూ ఉన్న పర్వతాలకు దిగువన ఉంది.
ఈ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి జరగలేదు. పర్యాటకులకు ఇక్కడ తగినన్ని సౌకర్యాలు కూడా లేవు
"సహాయ కార్యక్రమాలు ఎలా జరిగాయో చూపించడానికి ఈ ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చాలి" అని మాజీ గవర్నర్, సహాయ కార్యక్రమాలకు నేతృత్వం వహించిన నారాంగ్సక్ ఓసోట్టనకోర్న్ అన్నారు.
పర్యాటకులకు ప్రమాదం లేకుండా గుహ బయట, లోపల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఒచా ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
వర్షాకాలంలో థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. దాంతో ఈ మ్యూజియంను ఏడాదంతా తెరిచి ఉంచుతారా,లేదా అనేది ఇంకా తెలీలేదు. ఇక్కడ వర్షాలు జూన్ నుంచి అక్టోబర్ వరకూ కురుస్తాయి.
వర్షాకాలంలో గుహ చూద్దామని వెళ్లిన పిల్లలు హఠాత్తుగా వరద ముంచెత్తడంతో దానిలోపలే చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, Thai Navy SEALs/Getty Images
హాలీవుడ్ సినిమా?
ప్రపంచమంతా ఉత్కంఠ కలిగించిన ఈ సహాయ కార్యక్రమాలను సినిమాలా తీసేందుకు రెండు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి
గుహలో చిక్కుకున్న 13 మందిని ఇంకా బయటకు తీయకముందే, అమెరికాకు చెందిన ప్యూర్ ఫిక్స్ స్టూడియో, ఘటనా స్థలం దగ్గరున్న తమ నిర్మాతలు సహాయ దళాలను ఇంటర్వ్యూ చేస్తున్నారని ప్రకటించింది.
స్టూడియో సహ స్థాపకుడు, థాయ్‌లాండ్ వాసి మైకేల్ స్కాట్ తన భార్య సమన్ గునన్‌తోపాటూ పెరిగిందని చెప్పారు. నావీ సీల్స్ మాజీ సభ్యుడైన సమన్ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మృతి చెందాడు.
"గుహ దగ్గర సాహసికుల ధైర్యం, డైవర్లు అందరినీ బయటకు తీయడం చూసిన తర్వాత, అది నాకు వ్యక్తిగతంగా చాలా హత్తుకునేలా అనిపించింది". అని ఆయన తన ట్విటర్ వీడియోలో చెప్పాడు. దీనిని సహాయ కార్యక్రమాలు జరిగిన ప్రాంతంలో చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, FACEBOOK.COM/BEN.REYMENANTS
లాస్ ఏంజెలిస్ ఉన్న ఇవాన్హో పిక్చర్స్ మాత్రం ఈ ఘటనపై సినిమా తీయడానికి థాయ్ ప్రభుత్వం, ఆ దేశ నావీ తమను అధికారికంగా ఎంచుకున్నాయని చెబుతోంది.
కంపెనీ వార్తల ప్రకారం జాన్ ఎం చూ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని అమెరికా మీడియా చెప్పింది. అతడు ఇంతకు ముందు 'క్రేజీ రిచ్ ఆసియన్స్' అనే రొమాంటిక్ కామెడీ సినిమా తీశాడు.
ఈ సినిమాల్లో థాయ్ సహాయ బృందాల కంటే అంతర్జాతీయ పాత్రలనే ఎక్కువ చేసి చూపిస్తారని సోషల్ మీడియాలో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తన సినిమాలో అందరికీ తగిన ప్రాధాన్యం ఉంటుందని డైరెక్టర్ చూ తన ట్విటర్‌లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
12 మంది పిల్లలు, వారి కోచ్ జూన్ 23న గుహ దగ్గరకు వెళ్లారు. కానీ భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో లోపలే చిక్కుకుపోయారు.
వారిని తొమ్మిది రోజుల తర్వాత బ్రిటిష్ డైవర్లు గుర్తించారు. చివరికి 90 మంది డైవర్లు, వందలాది సహాయ బృందాలు వారిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








