“సంజు సినిమా తమకు కావాల్సినట్టు తీసుకున్నారు”

ఫొటో సోర్స్, FB/ RajkumarHiraniFilms
- రచయిత, అపర్ణ అల్లూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సంజయ్ దత్.. వివాదాస్పద వ్యక్తుల్లో ఒకరు. మద్యం, డ్రగ్స్ వ్యసనం, ఇతర స్త్రీలతో సంబంధాలు, ముంబై పేలుళ్ల ఆరోపణలు.. ఇలా పలు వివాదాలు సంజయ్ దత్‌ను చుట్టుముట్టాయి.
అయితే.. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీసిన 'సంజు' సినిమా పూర్తి వాస్తవాలను చెప్పలేదని కొందరు ఆరోపిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం విడుదలైన సంజు సినిమా రికార్డు కలెక్షన్లతో బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
కానీ ఈ సినిమాలో నిజాయితీ లోపించిందని, వాస్తవాలను పక్కదారి పట్టించేదిగా ఉందని కొందరు సినీ విశ్లేషకులు అన్నారు.
సంజయ్ దత్ పాత్రలో నటించిన హీరో రణ్‌బీర్ కపూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తండ్రీ కొడుకుల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా తీశారంటూ కొందరు సినిమాని పొగుడుతున్నారు.
''సంజు సినిమా చాలా నిజాయితీగా తీశారు'' అని ఒక సినీ విశ్లేషకుడి అభిప్రాయం.
''ఈ సినిమా.. తమకు కావలసినట్లు తీసుకున్నారు. ఓ దర్శకుడు తన మిత్రుడికిచ్చిన విలువైన బహుమానమే సంజు సినిమా..'' అని మరో విశ్లేషకుడు అన్నారు.
''సంజయ్ దత్ జీవితాన్ని మరింత లోతుగా తవ్వి చూపించే అవకాశాన్ని చేజేతులా పాడుచేసుకున్నారు. సినిమా పూర్తయ్యాక కూడా సంజయ్ వ్యక్తిత్వం గురించి అనేక ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి'' అని ఇంకొక విశ్లేషకుడు అన్నారు.

ఫొటో సోర్స్, FB / RajkumarHiraniFilms
ఎవరీ సంజయ్ దత్?
చాలా మంది బాలీవుడ్ సినీ ప్రేమికులు ఆరాధించే నటి నర్గీస్, హీరో సునీల్ దత్‌ల పెద్ద కొడుకే సంజయ్ దత్.
1981లో వెండితెరకు పరిచయమైన సంజయ్ 100కుపైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన వయసు 58.
ఈ సినిమా సంజయ్ దత్ దృష్టి కోణమే అన్నది బహిరంగ రహస్యం.
తన జీవితాన్ని మీడియా వక్రీకరించిందని, తన జీవిత కథకు న్యాయం చేసే రచయిత కోసం సంజయ్ దత్ వెతకడం ఇందుకు బలాన్నిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సినిమాలో ఏముంది?
తనపై తండ్రి పెట్టుకున్న అంచనాల బరువుతో కృంగిపోయిన యువకుడిగా సంజు సినిమా ప్రారంభమవుతుంది.
అదే సమయంలో తల్లికి పాంక్రియాటిక్ కేన్సర్ ఉందన్న విషయాన్ని జీర్ణించుకోడానికి సంజు ప్రయత్నిస్తుంటాడు.
మరోవైపు మొదటి సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంటుంది.
తన తల్లి చనిపోయేటప్పటికే డ్రగ్స్ తీసుకోవడం సంజుకు ఓ వ్యసనమై ఉంటుంది. ''నేను తీసుకోని డ్రగ్ అన్నది ప్రపంచంలోనే లేదు'' అని 2017లో బహిరంగంగానే సంజయ్ అన్నారు.
ఎప్పుడూ మత్తులో ఉన్న వ్యక్తిగా, తండ్రి ఆశలను నెరవేర్చడంలో విఫలమై, ప్రేయసి హృదయాన్ని గాయపరిచే వ్యక్తిగా మొదటి గంట సేపు సినిమా నడుస్తుంది.
తన తల్లి కోమా నుంచి బయటకు వచ్చినపుడు ఆమె హాస్పిటల్ గదిలో హెరాయిన్ తీసుకుంటూ సంజయ్ కనిపిస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికే ఆమె మరణిస్తుంది.
ఇక తక్కిన సినిమా అంతా.. 1993 ముంబై అల్లర్లతో సంబంధాలున్న ఆరోపణల కేసు, అక్రమ ఆయుధాలు కలిగివున్న కేసు, ఆ గొడవ చుట్టే నడుస్తుంది.
మూడు ఏకె 56 తుపాకులను, వాటి బుల్లెట్లను, ఒక 9ఎంఎం తుపాకీ, ఒక హ్యాండ్ గ్రెనేడ్ కలిగి ఉన్నాడని సంజయ్ దత్‌పై కేసు నమోదు చేసి, 2006లో అరెస్టు చేశారు.
1993 అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికే తాను తుపాకులను కొన్నట్లు సంజయ్ చెప్పారు. ఈ తుపాకులనే ముంబై పేలుళ్లలో వాడారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కానీ పేలుళ్ల కుట్ర కేసు నుంచి సంజయ్ నిర్దోషిగా బయటపడ్డారు. మొత్తం మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి 2016లో విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
అండర్ వరల్డ్‌తో సంబంధాలను దాచేశారా?
అండర్ వరల్డ్‌తో సంజయ్ దత్, బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలను ఈ సినిమా కప్పి పెట్టే ప్రయత్నం చేసినట్లుగా ఉంది.
2001లో సంజయ్ దత్, ఛోటా షకీల్ సంభాషణ ఆడియో వెలుగు చూసింది.
బాలీవుడ్ నిర్మాతలు, స్టార్లకు మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఇప్పటివి కావు.
మాఫియాతో పరిచయాలను అడ్డుపెట్టుకుని, కొందరు నటులు సినిమా అవకాశాలను సంపాదిస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కానీ సినిమాలో ఈ విషయాల ప్రస్తావనే లేదు. 1993 ముంబై పేలుళ్లకు సంబంధించిన సన్నివేశాలను చాలా త్వరత్వరగా, పైపైనే చిత్రించారు అని ఒక విశ్లేషకుడి అభిప్రాయం.
సంజయ్ మూడు పెళ్లిళ్లు, పిల్లలు, తన చెల్లెళ్లతో సంజయ్ అనుబంధం, హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు.. వీటి గురించి సినిమాలో అస్సలు ప్రస్తావించలేదు.
''ఒక వ్యక్తి జీవితాన్ని రెండున్నర గంటల వ్యవధిలో చెబుతున్నపుడు అన్నీ ప్రస్తావించలేం. అవసరమైన సంఘటనలనే ఎంపిక చేసుకోవాలి'' అని రాజ్ కుమార్ హిరాణీ బీబీసీ ఆసియా నెట్‌వర్క్ హరూన్ రషీద్‌తో అన్నారు.
సినిమాకు ముందు కొన్ని నెలలు అధ్యయనం చేశానని, కొందరు వ్యక్తులను ఇంటర్వ్యూ చేశానని హిరాణీ అన్నారు.
''సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీస్ అధికారిని కలిశాను. తర్వాత సంజయ్ తరఫున వాదించిన లాయర్లందర్నీ కలిశాను. చాలామంది జర్నలిస్టులను కలిశాను. దాదాపు మొత్తం 40-50మంది వ్యక్తులను ఈ సినిమా కోసం కలిశాను. వారు చెప్పింది విన్నాకే సినిమా తెరకెక్కించాను'' అని హీరాణీ చెప్పారు.
చాలా మంది సినిమాను ఆదరించారు. సినిమా ఏకపక్షంగా ఉండటాన్నీ ఆమోదించారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది.
'బాలీవుడ్.. తనకు చెందిన ఓ వ్యక్తి బయోపిక్ (జీవిత కథ)ను నిస్పాక్షికంగా తెరకెక్కించగలదా?' అన్నదే ఆ ప్రశ్న.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








