YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’

ఫొటో సోర్స్, Girlformula
- రచయిత, రిపోర్టింగ్: బళ్ల సతీశ్, ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యూట్యూబ్‌లో చాలా చానళ్లున్నాయి. చాలా ఫేమస్ ఫేసులున్నాయి. అమ్మాయిలు లీడ్‌గా ఉన్న చానల్స్ కూడా ఉన్నాయి. కానీ అమ్మాయిల చేత, అమ్మాయిల కొరకు, అమ్మాయిల యొక్క అని చూస్తే టాప్ పొజిషన్‌లో ఉంటుంది.. గాళ్ ఫార్ములా!
టాప్ పొజిషనే కాదు.. తెలుగులో ఈ తరహా చానల్ ఇదే మొట్టమొదటిది!
‘గాళ్ ఫార్ములా’ వస్తూనే ఆలోచనాత్మక అంశాలతో వీడియోలు చేసి పాపులర్ అయింది. మొదటి వీడియోలను పీరియడ్స్ మీద ఫన్నీగా చేశారు. తెలుగులో ఇలాంటి యూట్యూబ్ వీడియోలు మొదటిసారి చేసింది వీరే. అందుకే.. ఈ వారం టాప్ యూట్యూబర్లుగా ఒకరు కాదు.. ఒక టీమ్‌ని ప్రెజంట్ చేయబోతున్నాం!
"ఆన్‌లైన్ స్పేస్‌లో ఇప్పటి వరకూ మనవాళ్లు చూడనిది ప్రజెంట్ చేద్దాం అనుకునేవాళ్లం. అప్పటికి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు అంటూ ఒక ప్లాట్‌ఫామ్ అంటూ లేదు. అప్పటి వరకూ ఉన్న కంటెంట్ మొత్తం.. అంటే మీమ్స్, జోక్స్, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మగవారి కోణం నుంచే ఉన్నాయి. ఒక అమ్మాయి ఇలా ఆలోచించదు. ఒక అమ్మాయికి ఇది రిలేట్ అవ్వదు. అందుకే ఆఫ్, ఫర్, బై గాళ్స్ లాగా ఉండే చానల్ ఎందుకు ప్రారంభించకూడదు అనుకున్నాం" అంటూ ‘గాళ్ ఫార్ములా’ ఆవిర్భావం గురించి వివరించారు శ్రీవిద్య.
శ్రీ విద్య చాయ్ బిస్కెట్ వెబ్‌సైట్ ప్రారంభం నుంచి అందులో ఉన్నారు. గాళ్ ఫార్మాలా వీడియోలతో చాలా ఫేమస్ అయ్యారు.
"మేం ప్రతీ మీటింగులోనూ అనుకునే వాళ్లం. అమ్మాయిలకంటూ స్పేస్, వాయిస్ లేదు అని. వెబ్‌సైట్‌లో కొంత అమ్మాయిలకు స్పేస్ కేటాయించా. వీడియో ట్రెండ్ మొదలవగానే ‘గాళ్ ఫార్ములా’ ప్రారంభించాం. ఇలాంటివి ఉత్తరాదిలో చాలా ఉన్నాయి. కానీ, మనకి కొత్త అంతే. ఇది తెలుగు ప్రేక్షకులు, వాళ్ల అభిరుచుల కోసం అని గుర్తుంచుకోవాలి. అమ్మాయిలకు ఒక అంశం గురించి చెప్పడం, మాట్లాడడం, అవసరం అనుకుని చానల్ మొదలు పెట్టాం" అన్నారు విద్య.

ఫొటో సోర్స్, Girl Formula/YouTube
వ్యక్తిగత అనుభవాలే...
గాళ్ ఫార్ములా కంటెంట్ మొత్తం అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంది. మొదటి వీడియోలే పీరియడ్స్ గురించి, అది కూడా చాలా గోప్యం అనుకునే అంశాన్ని చాలా సరదాగా చెప్పారు ఈ చానల్లో. అలాగని అమ్మాయిల చానల్ అంటే హక్కులు గురించి సీరియస్ డిబేట్ కాదు. "అమ్మాయిల అంశాలు చెబుతూనే కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ మిస్ అవకుండా చూసుకుంటున్నాం" అని చెప్పారు విద్య.
"రచన, నటన మొత్తం అమ్మాయిలే. కానీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రస్తుతం మగవారే చేస్తున్నారు. నిజానికి వంద శాతం అమ్మాయిలు కాకుండా ఒకరిద్దరు అబ్బాయిలు కూడా ఉండాలని మేం అనుకుంటున్నాం. కో-రైటరో, డైరెక్టరో ఎవరో ఒకరు అబ్బాయి ఉండేలా చూస్తున్నాం. అందరూ అబ్బాయిలే అయితే, అమ్మాయిల పర్స్పెక్టివ్ రాదు. అలాగని అందరూ అమ్మాయిలే అయినా ఓ రాడికల్ ఎడ్జ్‌లోకి వెళ్లిపోతాం. అదే ఒకరిద్దరు అబ్బాయిలు ఉంటే ఏదైనా అంశం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ ప్రాబ్లమే అంటూ చెప్పగలుగుతారు" అని తమ చానల్ కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో వివరించారు విద్య.
"ఇందులో వీడియోలన్నీ చాలా వరకూ మేం వ్యక్తిగతంగా ఫేస్ చేసినవే. బయటి టాపిక్స్ గురించి పెద్ద ఆలోచించం. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులు.. ఉదాహరణకు అందరూ అన్నం తినగా కంచాలు తీయమని అమ్మాయికి చెప్తారు. అబ్బాయికి చెప్పరు. ఇలాంటివి చెప్పడంలో సంతృప్తి ఉంది. ఆ విషయాల్లో అబ్బాయిలతో కూడా మాట్లాడతాం. మేం మగవారిని తక్కువ చేయడం, వ్యతిరేకించడం (మేల్ బ్యాషింగ్) కాదు. సమానత్వంపై ఇంటర్నెట్‌లో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. హక్కుల గురించి అమ్మాయిలు అడిగితే.. ‘మీరు అబ్బాయిల్లా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు?’ అంటారు. ఆ గ్యాప్‌ని మేం పూరించాలనుకుంటున్నాం" అని దివ్య చెప్పారు.

ఫొటో సోర్స్, Girl Formula/YouTube
ఆడ- మగ సమానంగా...
"ఎంత బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నా.. అంతే సెన్సిటివ్‌గా ప్రెజంట్ చేయాలి. ఆడియన్స్‌కి అసౌకర్యంగా, ఎబ్బెట్టుగా ఉండకూడదు. ఆ కంఫర్ట్ జోన్ మైండ్‌లో పెట్టుకుని పాయింట్ తీసుకెళ్లాలని పనిచేశాం. అలాంటివి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. బయట మాట్లాడలేని, ధైర్యం లేని టాపిక్స్ ఉన్నాయి. క్రమంగా ప్రేక్షకులకు అలవాటయ్యేలా కొద్దిగా కొద్దిగా చేయాలని ప్లాన్ ఉంది..’’ అని విద్య తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు.
"మా కుటుంబంలోనే సగం మంది ఆడవాళ్లు, సగం మంది మగవాళ్లు ఉంటాం. అమ్మ, చెల్లి, కూతురు.. అందరికీ పీరియడ్స్ ఉంటాయి. అంతమందికి ఇది కామన్ విషయం అయినా దాని గురించి సిగ్గుపడతాం. ఇటువంటి విషయాలపై ఎవరైనా మనల్ని ప్రశ్నించినా, కామెంట్ చేసినా వెంటనే అందులో తప్పేముంది అని సమాధానం చెప్పి డిఫెండ్ చేస్తే ఇకా అవతలి వైపు నుంచి రిప్లై రాదు" అంటూ దివ్య తమ అనుభవాలు వివరించారు.
గాళ్ ఫార్ములా ప్రేక్షకుల్లో మాత్రం ఆడ - మగ సమానంగా ఉన్నారు. "మా చానల్ అమ్మాయిలకు సేఫ్ ప్లేస్. సాధారణంగా యూట్యూబ్ వీడియోల కింద అమ్మాయిలు కామెంట్స్ చేయడం చాలా తక్కువ. ఒకమ్మాయి కామెంట్ చేస్తే వెంటనే చాలా మంది అబ్బాయిలు వచ్చి హాయ్ చెప్తుంటారు. కానీ మా చానళ్లో అలాకాదు.. అమ్మాయిలే ఎక్కువ కామెంట్స్ చేస్తారు. ఎవరైనా అబ్బాయి అడ్డదిడ్డంగా కామెంట్స్ చేస్తే వెంటనే ఓ పది మంది అమ్మాయిలు వచ్చి డిఫెండ్ చేసేస్తారు. ఆ రకంగా మేం అమ్మాయిలకు యూట్యూబ్‌లో సేఫ్ ప్లేస్ క్రియేట్ చేశాం. ఒక బ్యాడ్ కామెంట్‌కి పది పాజిటివ్ కామెంట్స్ వస్తాయి" అన్నారు విద్య.
"కామెంట్లు చాలా రకాలుంటాయి. అమ్మాయిలే కదా వీళ్లేం చేసినా చూస్తారులే అంటారు. అన్నిటికీ అమ్మాయి అనేదాన్ని లింక్ చేస్తారు. అలాంటి కామెంట్లు వచ్చినప్పుడు ప్రేక్షకులే మమ్మల్ని డిఫెండ్ చేస్తారు కూడా. అది చాలా సంతృప్తినిస్తుంది" అని చెప్పారు దివ్య.
గాళ్ ఫార్ములా చాయ్ బిస్కెట్ చానల్ నుంచి వచ్చింది. అనురాగ్, శరత్‌లు ఈ చానల్స్‌కి ప్రమోటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం (07-07-2018) ఈ చానల్ కి 2.98 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా.. 3.977 కోట్ల వ్యూస్ ఉన్నాయి.

ఎవరెలా వచ్చారంటే..?
దివ్య: ఐబీయంలో ఉద్యోగం మానేసిన దివ్య.. గాళ్ ఫార్ములా ప్రారంభమైన కొత్తల్లో అందులో చేరారు. ప్రస్తుతం దాదాపు అన్ని వీడియోల్లో ఆమె కనిపిస్తారు. రచనలో కూడా ఆమె కీలక భాగస్వామి.
"నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మంచి సినిమాలు విపరీతంగా చూస్తా. యూట్యూబ్‌లో తెలుగులో మంచి కంటెంట్, ప్రత్యేకంగా ఎవరు చేస్తున్నారా అని చూసేదాన్ని. అలా గాళ్ ఫార్ములా గురించి తెలుసుకున్నా. ఇక్కడ మా అందరికీ కామన్ ఇంట్రెస్ట్ సినిమా. నేను గాళ్ ఫార్ములా కంటెంట్‌కి కనెక్ట్ అయి చానల్ స్టార్ట్ అయిన రెండు నెలల తరువాత ఇక్కడ చేరాను. పీరియడ్స్ మీద రెండో వీడియోలో నేను ఉన్నాను."
"నటన అనగానే ఇంట్లో చాలా ఆలోచించారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇలాంటివి ఎలా ఉంటాయో అన్న టెన్షన్ ఉండేది. గాళ్ ఫార్ములా చాలా మద్దతిచ్చింది. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఇలానే చేయాలి అని ఉద్యోగంలో చెప్తారు. ఇలానే ఎందుకు చేయడం కొత్తగా ఆలోచించండి అని గాళ్ ఫార్ములాలో ప్రోత్సహిస్తారు. మనం స్వేచ్ఛగా కొత్త ప్రయోగాలు చేయవచ్చు" అన్నారు దివ్య.

విద్య: విద్య జర్నలిజం చదివారు. చాయ్ బిస్కట్ ప్రారంభం నుంచీ అందులో ఉన్నారు. తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తూనే గాళ్ ఫార్ములా వీడియోలు కూడా చేస్తున్నారు. ఎప్పుడూ ఖాళీగా ఉండడం విద్యకు అసలు ఇష్టం ఉండదు.
"ముందు నుంచీ నాకు ఒకటే పని చేయడం ఇష్టం లేదు. పీజీ చదువుతున్నప్పుడూ ఉద్యోగం చేసేదాన్ని. టైమ్స్‌లో ఉన్నప్పుడు పీహెచ్‌డీకి ప్రిపేర్ అయ్యాను. తరువాత చాయ్ బిస్కెట్ టీమ్‌తో కలిసి పనిచేశా. ఇప్పుడు పత్రికలో ఉద్యోగం చేస్తూ కూడా, మిగిలిన సమయంలో ఇక్కడ వీడియోలు చేస్తున్నాను. ఒక రోజులో నాలుగు పనులు అయ్యాయంటే ప్రశాతంగా నిద్రపోతాను."
హర్షిత: హర్షిత ఎకడమిక్స్‌లో టాపర్. చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ వరకూ ఎప్పుడూ క్లాస్ ఫస్టే.. 97% మార్కులు ఆమెకు మామూలు విషయం. బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తిచేసిన హర్షిత, గాళ్ ఫార్ములాకి ఆడిషన్స్ వీడియో పంపి ఎంపికయ్యారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









