కత్తి మహేశ్: పోలీసులు ఎందుకు బహిష్కరించారు?

కత్తి మహేశ్

ఫొటో సోర్స్, facebook.com/mahesh.kathi

రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు కారణమవుతున్నారన్న ఆరోపణతో కత్తి మహేశ్‌ను తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించారు.

ఇంతకీ వివాదమేంటి? పోలీసులు ఆయన్ను ఎందుకు బహిష్కరించారు? అసలా చట్టం ఏంటి?

ఇటీవల కత్తి మహేశ్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ రాముడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అవి హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పరిపూర్ణానందస్వామి డిమాండ్ చేశారు.

కత్తి మహేశ్‌పై చర్యలకు పట్టుబడుతూ.. సోమవారం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన పరిపూర్ణానంద స్వామిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook.com/dgptelangana

ఫొటో క్యాప్షన్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

ఈ పరిణామాల నేపథ్యంలో కత్తి మహేశ్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం తెలిపారు.

మీడియాతో డీజీపీ మాట్లాడుతూ.. "ప్రసార మాధ్యమాలను వేదికగా చేసుకుని.. సమాజంలో అశాంతి.. వివిధ వర్గాల మధ్య తగాదాలు.. ద్వేషభావం పెంచడానికి.. పదేపదే అభిప్రాయాలను వ్యక్తీకరించడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రలు క్షీణించే ప్రమాదం ఉంది. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతల సమస్యకు దారితీసేలా ఉన్నాయి.’’ అని అన్నారు.

భావవ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. మనకున్న అభిప్రాయాలను వ్యక్తపరిచే క్రమంలో సమాజంలోని ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాల్సిన అవసరం ఉందని డీజీపీ అన్నారు.

కత్తి మహేశ్‌ని 'తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 సెక్షన్ 3 కింద ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరించామని వివరించారు.

‘అతని స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచిపెడతాం. ఒకవేళ అతను మళ్లీ హైదరాబాద్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే.. అది నేరం అవుతుంది. అలా చేస్తే అతను మూడేళ్ల జైలు శిక్షకు అర్హుడు అవుతాడు. అవసరమైతే అతన్ని రాష్ట్రం నుంచే బహిష్కరిస్తాం. సామాజిక మధ్యమాల ద్వారా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా చర్యలు తీసుకుంటాం. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం.. గ్రూపు తగాదాలు సృష్టించడం.. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం క్షమించరాని నేరం.’ అని డీజీపీ వ్యాఖ్యానించారు.

‘మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రసారం చేసే మాధ్యమాలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఓ ఛానల్‌కు కేబుల్ టీవీ రెగ్యులేషన్ చట్టం కింద షోకాజు నోటీసు ఇచ్చాం. ఆ ఛానెల్ వాళ్లు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం అని మహేందర్ రెడ్డి చెప్పారు.

కత్తి మహేశ్

ఫొటో సోర్స్, facebook.com/mahesh.kathi

"నెగెటివ్ పేరు తెచ్చుకోవడమూ ఓ వ్యూహమే"

‘‘వివాదాలతో నెగెటివ్ పేరు తెచ్చుకోవడం కూడా కత్తి మహేశ్‌కి ఓ వ్యూహంగా మారింది. ఇందుకు ఆయన మీడియానూ ఉపయోగించుకుంటున్నారు ’’ అని న్యాయవాది సాయిపద్మ అన్నారు.

‘అనేక ప్రజా సమస్యలను పక్కన పెట్టి రేటింగుల కోసం గంటల తరబడి ఇలాంటి వ్యాఖ్యలను ప్రసారం చేయడం ద్వారా.. సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1 ఏ), 19(2) ప్రకారం.. వ్యక్తులకు, సంస్థలకు సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. అయితే.. ఒక వ్యక్తిని బహిష్కరించడం మాత్రం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి వివాదాల వల్ల నిజమైన సమస్యలు మరుగునపడుతున్నాయి. ’ అని సాయి పద్మ వ్యాఖ్యానించారు.

కత్తి మహేశ్

ఫొటో సోర్స్, facebook.com/mahesh.kathi

"వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే"

అయితే.. ఒక వ్యక్తిని నగరం నుంచి బహిష్కరించడం అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ రెడ్డి అన్నారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 'ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980' అమలులోకి వచ్చింది. విభజన తర్వాత తెలంగాణలో ఆ చట్టాన్ని పేరు మార్చి కొనసాగిస్తున్నారు. ఇలా పేరు మార్చిన తర్వాత ఈ చట్టం కింద ఇంతకు ముందు ఎవరినీ ఇలా బహిష్కరించిన దాఖలాలు లేవు. ’’ అని వివరించారు.

ఇలా ఒకవ్యక్తిని ఏకపక్షంగా బహిష్కరించడం సరికాదని గతంలో 'మహేశ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.

ఈ చట్టం కింద నిర్బంధించవచ్చు కానీ, ఇలా నగర బహిష్కరణ చేసే అధికారం పోలీసులకు లేదు.‘‘ అని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.

కత్తి మహేశ్

ఫొటో సోర్స్, facebook.com/mahesh.kathi

దళితుడనే కత్తి మహేశ్ బహిష్కరణ

‘దళితుల మీద ప్రభుత్వం కక్షకట్టి వ్యవహరిస్తోంది ..’ అని దళిత్ యాక్టివిస్ట్ సుజాత సూరేపల్లి బీబీసీతో అన్నారు.

పోలీసు కమిషనర్ కానీ.. జిల్లా కలెక్టర్ కానీ ఒక వ్యక్తిని గుండాగా ప్రకటించి నగర బహిష్కరణ చేసే అవకాశం ఉంటుంది.. కానీ వెంటనే నగరం నుంచి బయటకు తీసుకెళ్లే హక్కు ఎవరికీ లేదని.. చివరకు ఉరి శిక్ష వేసేటపుడు కూడా నిందితునికి ఓ అవకాశం ఇస్తారని సుజాత అన్నారు.

కత్తి మహేశ్ ఎందుకు గుండా అవుతారని ప్రశ్నించారు. ఆయన తనకు తానుగా ప్రెస్‌మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఓ టీవీ చానెల్ వారు ఓ చర్చలో భాగంగా ప్రశ్నించినపుడు ఆయన అలా అన్నారని.. చెప్పారు.

కేవలం దళితుడైనందువల్లే కత్తి మహేశ్‌ని బహిష్కరించారని గతంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, రచయిత రంగనాయకమ్మ, న్యాయనిపుణులు రామ్ జెఠ్మలానీ తదితరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అక్కడ లేని బహిష్కరణ ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు.

గతంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీద కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమమ్యాయి.

తాజాగా ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాముడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కత్తి మహేశ్‌పై ఐపీసీ సెక్షన్‌ 295(ఎ), 505(2)కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ వివాదంపై అటు కత్తి మహేశ్.. ఇటు పరిపూర్ణానంద స్వామి వివరణను తీసుకునేందుకు బీబీసీ తెలుగు ప్రయత్నించింది. కాని వారి నుంచి స్పందన లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)